• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖపట్నం: 'కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన నా పిల్లలే మళ్లీ నాకు కవలలుగా పుట్టారు'

By BBC News తెలుగు
|

విశాఖపట్నంలోని ఆరిలోవలో భాగ్యలక్ష్మి ఇంటి చుట్టూ వచ్చి పోయే బంధువులు, ఇరుగు పొరుగు, మీడియా వారితో సందడిగా మారిపోయింది.

రెండేళ్ల కిందట విచారంలో మునిగిన ఆ కుటుంబంలో ఇప్పుడు నవ్వులు వెల్లివిరుస్తున్నాయి.

ఎవరీ భాగ్యలక్ష్మి? ఎందుకంత సందడి ఆమె ఇంట్లో?

"వాళ్ళు కచ్చితంగా నా పిల్లలే. లేదంటే, వాళ్ళు చనిపోయిన రోజే తిరిగి ఎందుకు పుడతారు?" అని అంటున్నారు భాగ్యలక్ష్మి.

విశాఖపట్నానికి చెందిన భాగ్యలక్ష్మి, అప్పలరాజు దంపతులకు సెప్టెంబరు 15న కవల పిల్లలు జన్మించారు. కవలలిద్దరూ అమ్మాయిలే.

కవలలు పుట్టడంలో వింత ఏమీ లేకపోవచ్చు, కానీ, సరిగ్గా రెండేళ్ల క్రితం గోదావరి నదిలో కచ్చలూరు దగ్గర జరిగిన పడవ ప్రమాదంలో వారి ఇద్దరు కూతుళ్లు చనిపోయారు.

సెప్టెంబరు 15వ తేదీ మధ్యాహ్నం పర్యాటకులతో బయలుదేరిన వశిష్ఠ పున్నమి రాయల్ బోటు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం దగ్గర మునిగిపోయింది.

అప్పుడు బోటులో 8 మంది సిబ్బందితో కలిపి మొత్తం 73 మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు.

ఆ ప్రమాదంలో మరణించే సమయానికి భాగ్యలక్ష్మి పెద్ద కూతురు (గీతా వైష్ణవి) వయసు 3 ఏళ్లు, చిన్నమ్మాయి ధాత్రి అనన్యకు ఏడాదిన్నర.

ఆ పడవ ప్రమాదం భాగ్యలక్ష్మి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆ నాడు కలిగిన వేదన నుంచి నేడు కవల పిల్లలను చూసి ఆనందపడే క్షణాల వరకు గడిపిన జీవితాన్ని భాగ్యలక్ష్మి బీబీసీతో పంచుకున్నారు:

ఆ రోజు సెప్టెంబరు 15, 2019. ఆదివారం కావడంతో మా కుటుంబ సభ్యులంతా కలిసి భద్రాచలం రాముల వారి దర్శనానికి విశాఖపట్నం నుంచి బయలుదేరారు.

నా భర్తకు ఆరోగ్యం అంతగా బాగుండకపోవడంతో నేను, నా భర్త, మరిది మాత్రం ఇంట్లోనే ఉండిపోయాం.

మా పెద్దమ్మాయికి కూడా మొక్కు ఉండటంతో, మా అత్తగారు, మామగారు, ఇతర కుటుంబ సభ్యులతో కలిపి మా పిల్లలను ఊరికి పంపించాను.

రాజమండ్రి నుంచి భద్రాచలం వెళుతున్న వశిష్ఠ పున్నమి రాయల్ లాంచీ కచ్చలూరు దగ్గర ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. నా పిల్లలు, కుటుంబ సభ్యులు, బోటులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు క్షేమంగా బయటపడాలని చాలా ప్రార్ధించాను.

కానీ, సరిగ్గా రాత్రి 8 గంటలకు నా పిల్లలిద్దరూ ఆ ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసింది.

నాకు భూమి తలకిందులు అయినట్లుగా అనిపించింది.

నా పిల్లలు మాత్రమే కాదు, వారితో పాటు మొత్తం 9 మంది మా కుటుంబ సభ్యులు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాకు ఆ కష్టాన్ని ఎలా తట్టుకోవాలో కూడా అర్ధం కాలేదు.

'మా వేదన మాటల్లో చెప్పలేనిది'

ఆనాటి విషాదాన్ని గుర్తు చేసుకున్న భాగ్యలక్ష్మి, "మీరే చెప్పండి, ఒకే సారి తొమ్మిది మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న మా వేదన ఎలా ఉంటుందో? అని ప్రశ్నించారు భాగ్యలక్ష్మి.

ఆ క్షణంలో ఆమెకెటువంటి సమాధానం ఇవ్వాలో అర్ధం కాలేదు.

"అర్ధం చేసుకోగలను" అని మాత్రం అన్నాను.

గోదావరిలో పడవ ప్రమాదం

భగవంతుని దర్శనానికి వెళుతున్నారనుకున్నాను కానీ, పిల్లలను సజీవంగా చూడడం అదే చివరిసారి అవుతుందని ఊహించలేదని భాగ్యలక్ష్మి అన్నారు.

"సరదాగా ఆడుతూ పాడుతూ పడవ ప్రయాణానికి వెళ్లిన నా పిల్లలు నిర్జీవంగా మారారు. కళ్ళు మూసినా తెరిచినా నా పిల్లల ముఖాలు, మా అత్తగారు, మామగారి ముఖాలే కనిపిస్తూ ఉండేవి. నా దుఃఖానికి అంతు లేదు. ఇంట్లో నేను, నా భర్త, నా మరిది మాత్రమే మిగిలాం. అంతకు ముందు వరకు దేముడున్నాడని నమ్మే మాకు ఈ సంఘటనతో దేముని పై నమ్మకం పోయింది" అని అన్నారు.

ట్యూబెక్టమీ తర్వాత పిల్లలా?

భాగ్యలక్ష్మికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ గర్భం రాకుండా ట్యూబెక్టమీ చేయించుకున్నారు. ఆమె భర్త గ్లాస్ డిజైనింగ్ పని చేస్తారు. 2013లో వారి వివాహం జరిగింది.

కుటుంబ సభ్యులను, చిన్నారులను కోల్పోవడంతో జీవితం శూన్యంగా అనిపించిందని చెప్పిన భాగ్యలక్ష్మి, "నాకు ప్రపంచమంతా చీకటిగా అనిపించింది. తిండి సహించేది కాదు. నిద్ర పట్టేది కాదు. నా పిల్లల వయసులో ఉన్న ఎవరిని చూసినా ఏడుపు ఆగేది కాదు. నా పిల్లలు బ్రతికి ఉండి ఉంటే ఈ పాటికి నాతో ఆడుకుంటూ ఉండేవారు. స్కూలుకు వెళుతూ ఉండేవారనే ఆలోచనలు వస్తూ ఉండేవి. పండగలు జరుపుకోవడం మానేసాం. ఎవరినీ కలవాలని, మాట్లాడాలని అనిపించేది కాదు. మా జీవితం స్థంభించినట్లుగా అనిపించేది" అని చెప్పారు.

మళ్ళీ పిల్లలను కంటే ఇంట్లో కాస్త నవ్వులు విరుస్తాయేమో అని ఆమె మరిది సలహా ఇచ్చారు. ఆ ఆలోచనను ఆమె అమ్మగారు కూడా సమర్ధించారు. కానీ, చాలా మంది డాక్టర్లు వీలు కాదని చెప్పారు.

ఐవిఎఫ్ నిపుణులు డాక్టర్ పద్మశ్రీని సంప్రదించగా, ఐవిఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందనే ఆశను కల్పించారని భాగ్యలక్ష్మి చెప్పారు.

"ఇక ఎలా అయినా పిల్లలను కనాలని నిర్ణయించుకున్నాం. మా జీవితంలో నిండిన విషాదాన్ని ఎలా అయినా పూడ్చుకోవాలని ప్రయత్నించాం. ఒక్కరైనా పుట్టాలని అనుకున్నాం. కవలలు పుడతారని ఊహించలేదు" అని ఆమె అన్నారు.

పద్మ శ్రీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ శుభ పద్మశ్రీ బీబీసీతో మాట్లాడుతూ, "భాగ్యలక్ష్మికి 24 సంవత్సరాలే కావడంతో, ఆమె ఐవిఎఫ్ ద్వారా పిల్లలకు జన్మనివ్వగలరనే నమ్మకం కలిగింది. దాంతో, నేనామెకు ధైర్యం చెప్పి చికిత్స మొదలుపెట్టాను" అని అన్నారు.

చికిత్స మొదలుపెట్టిన నెల రోజులకే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె గర్భం ధరించారని చెప్పారు.

ఐవిఎఫ్ ద్వారా కవలలను పుట్టించవచ్చా?

"అది మన చేతుల్లో ఉండదు. మేము మూడు కంటే ఎక్కువ ఎంబ్రియో షాట్స్ ఇవ్వలేం. కొందరికి ఒక్కటే విజయవంతం అవుతుంది. కొందరికి కవలలు పుడతారు. మరి కొందరికి అసలు గర్భమే రాదు" అని పద్మశ్రీ చెప్పారు.

"భాగ్యలక్ష్మి విషయంలో మేము రెండు షాట్స్ ఇచ్చాం. ఆమెకు రెండూ విజయవంతమై కవలలు పుట్టేందుకు అవకాశం కలిగింది" అని భాగ్యలక్ష్మిని పర్యవేక్షించిన గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి బీబీసీకి చెప్పారు.

గీతా వైష్ణవి, ధాత్రి అనన్య

"కవలలు అబ్బాయిలా.. అమ్మాయిలా?

"నేను నా ఇద్దరు కూతుళ్లను కోల్పోయాను. తిరిగి పిల్లలు కావాలనుకున్నాను. కానీ, అమ్మాయిలే పుడతారో, అబ్బాయిలు పుడతారో నా చేతుల్లో లేదు కదా" అని భాగ్యలక్ష్మి అన్నారు.

"నేను ఫిబ్రవరిలో గర్భం దాల్చినట్లు తెలిసింది. అప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండటంతో, నేను ఒకే గదికి పరిమితమై ఉండిపోయాను. అక్టోబర్ 20న డెలివరీ అవ్వవలసి ఉండగా, సెప్టెంబరు15, బుధవారం సాయంత్రం ఉమ్మ నీరు పోవడం మొదలయింది. దాంతో, వెంటనే ఆసుపత్రికి బయలుదేరి వెళ్లాం. నిజానికి డాక్టర్ మమ్మల్ని అక్టోబరు రెండవ వారంలోనే ఆసుపత్రిలో చేరమని సూచించారు. ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేదు." అని అన్నారు.

డెలివరీకి ఇంకా నెల రోజుల ముందుగానే ఇలా జరగడంతో డాక్టర్ కూడా నెలలు నిండకుండా పిల్లలు పుడతారని భయపడ్డారు.

"కానీ, సరిగ్గా రాత్రి 8 గంటలకు నాకు సిజేరియన్ చేసి కవల పిల్లలను బయటకు తీశారు. ఆ క్షణంలో నా ఆనందానికి అవధులు లేవు" అని భాగ్యలక్ష్మి చాలా సంతోషంగా చెప్పారు.

"సెప్టెంబరు 15, రాత్రి 8 గంటలకే నా పిల్లలిద్దరూ మరణించిన వార్త కూడా రావడం , అదే సమయానికి వీళ్ళిద్దరూ నెలలు నిండకుండా పుట్టడంతో, నా పిల్లలే తిరిగి నాకు పుట్టారని అనిపించింది" అని భాగ్యలక్ష్మి అన్నారు.

"దేముడు నా వేదన విని నా పిల్లలను తిరిగి ఇచ్చాడని అనిపించింది. మా ఆనందానికి అవధులు లేవు. ఆయనైతే, గత పది రోజుల నుంచి పనికి కూడా వెళ్లకుండా పిల్లలనే తదేకంగా చూసుకుంటూ ఉండిపోతున్నారు" అని చెప్పారు.

"ఇక, మా బంధువులు, పొరుగు వారు అయితే, ఈ విషయం గురించి విని మా కంటే ఎక్కువ ఆనందిస్తున్నారు" అని భాగ్యలక్ష్మి చెప్పారు.

"ఇప్పుడు పుట్టిన కవలలు చనిపోయిన పిల్లలు పుట్టినప్పటి పోలికలతోనే ఉన్నారు" అని అన్నారు.

"కానీ, ఈ ఆనంద క్షణాలను చూసేందుకు మా అత్తగారు ఉండి ఉంటే ఎంతో బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ, పెద్దవాళ్ళు లేరనే బాధ ఇంతానందంలోనూ మమ్మల్ని కుంగదీస్తోంది" అని అన్నారు.

"ఇవి మాకు సంతోషం, ఉద్వేగం కలగలిసిన క్షణాలు" అని ఆమె అన్నారు.

మరణించిన పిల్లల పేర్లతోనే పిలుచుకుంటాం

పుట్టిన పిల్లలకు చనిపోయిన పిల్లల పేర్లే పెడతారా అని ప్రశ్నించినప్పుడు, వారి జాతకాలకు అనుగుణంగా పేర్లు పెడతాం, కానీ, వారిని ఇంట్లో మాత్రం గీత, అనన్య అనే పిలుచుకుంటాం అని చెప్పారు.

"మా పిల్లలు వాడిన బట్టలు, నగలు, గాజులు అన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఆ బట్టలను తిరిగి పుట్టిన నా బిడ్డలకు వేసి మురిసిపోతాను" అని అన్నారు.

ఇలా జరుగుతుందా? సైన్స్ ఏమంటోంది?

"కొన్ని వందల కాన్పులు చేసిన నేను ఇలా జరగడం చూడటం మాత్రం మొదటి సారి" అని డాక్టర్ పద్మశ్రీ అన్నారు.

"డాక్టర్‌గా నాకు ఇది వింతగానే అనిపించింది. సైన్స్ కు అందని ఈ సంఘటన గురించి ఎలా చెప్పాలో కూడా అర్ధం కావడం లేదు. ఇలా జరగాలని మేము ప్రణాళిక కూడా చేయలేదు" అని పద్మ శ్రీ అన్నారు.

"ఇంకా విచిత్రం ఏమిటంటే, పిల్లలు మరణించిన లగ్నంలోనే ఈ కవల పిల్లలు పుట్టినట్లు పండితుడొకరు చూసి చెప్పారు. ఇవన్నీ ఎలా చూడాలో అర్ధం కాని విషయం. నాకింకా నమ్మశక్యంగా లేదు. కానీ, నమ్మాల్సి వస్తోంది" అని అన్నారు.

"ఆ తల్లితండ్రుల ఆనందాన్ని చూసి నాకు, మా ఆసుపత్రి సిబ్బందికి కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళుతూ ఉన్నప్పుడు మేము పింక్ బెలూన్లను ఎగురవేసి, సంతోషంగా ఇంటికి పంపాం. ఆ దంపతుల కళ్ళల్లో వెలిగిన వెలుగు చూసి మేము కూడా సంతోషించాం. ఒక డాక్టర్‌గా నాకిది అత్యంత ఆనందాన్నిచ్చిన క్షణం" అని పద్మశ్రీ అన్నారు.

పునర్జన్మ ఉంటుందా?

పునర్జన్మ ఉంటుందా లేదా అనేది కేవలం నమ్మకం మీద ఆధారపడిన విషయం అని ఆంధ్ర యూనివర్సిటీలో రిలీజియస్ స్టడీస్, ఫిలాసఫీ విభాగాధిపతిగా పదవీ విరమణ చేసిన డాక్టర్ రవికుమార్ అంటారు.

"మన జీవితం కొన్ని నమ్మకాల పై ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకాలు చాలా దృఢమైనవి. మనం ఏదైతే నమ్మాలని ప్రయత్నిస్తామో, అది నమ్మశక్యం కాదని తెలిసినా దానిని పక్కన పెట్టి, నమ్మకూడని సత్యాన్ని నమ్ముతాం" అని శామ్యూల్ టేలర్ కోల్ రిడ్జ్ అనే కవి చెప్పిన మాటలను గుర్తు చేశారు.

"ఏది ఏమైనప్పటికీ కొన్ని నమ్మకాలు జీవితంలో మానసికంగా చాలా శక్తిని ఇస్తాయి. నమ్మడంలో ఎటువంటి హాని లేదు. అలా అని వాటిని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు" అని అన్నారు.

"నా పిల్లలు ఎదగడం చూడాలి. చదుకోవడం చూడాలి. నవ్వుతూ ఆడుకోవడం చూడాలి. నా పిల్లలతో నేను మిస్ అయిన క్షణాలన్నీ తిరిగి పొందాలి. ఇప్పటికి ఇదే నా ఆశ" అని భాగ్యలక్ష్మి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
VISAKHAPATNAM: 'My children who died in the Kachchalur boat accident were born to me again as twins'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X