వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైజాగ్ స్టీల్ ప్లాంట్: ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగుల సంగతేంటి? ఇదివరకు జింక్ పరిశ్రమ విషయంలో ఏం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

విశాఖ ఉక్కు పరిశ్రమ
Click here to see the BBC interactive

రాష్ట్రంలోనే అత్యంత ధనిక నియోకజవర్గం గాజువాక అని అంటుంటారు. ఇక్కడ తలసరి ఆదాయం సుమారు రూ. 4 లక్షలని ఏయూ ఎకనామిక్స్ విభాగం చేసిన సర్వేలో తేలింది.

దీనికి కారణం ఈ నియోజకవర్గంలో ఉన్న 1200 చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు... వాటి ద్వారా వచ్చిన ఉద్యోగాలు, జరుగుతున్న వ్యాపారాలు.

వీటిలో 70 శాతం స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా పని చేసేవే. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో... ఇక్కడి పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి ఏమవుతాయోననే అందోళనలు మొదలయ్యాయి.

అయితే స్టీల్ ప్లాంట్ లాంటి ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడం అంత సులభమేనా? ప్రైవేటీకరణ చేయడానికి ఏమైనా కాలపరిమితి ఉందా? స్టీల్ ప్లాంట్ ‌కేంద్ర ప్రభుత్వ వాటాలు అమ్మితే... దానిని ప్రైవేటీకరణ అంటారా? లేదా అమ్మకం అంటారా? జింక్ కర్మాగారం ప్రైవేటీకరణ జరిగనప్పటీ అనుభవాలు ఏం చెబుతున్నాయి?

హిందుస్థాన్ జింక్ లానే... వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా....

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో కానివ్వమంటూ ప్లాంట్ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఆందోళనలు రోజురోజుకి తీవ్రతరం అవుతున్నాయి కూడా.

అయితే స్టీల్ ప్లాంట్‌లోని ప్రభుత్వ వాటాని అమ్మేందుకు గత ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. కార్మికుల ఉద్యమాలతో కేంద్రం వెనక్కి తగ్గింది.

కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేవని...కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటికరణ చేసేందుకే మొగ్గుచూపుతుందని, దానికి సంబంధించి అంతర్గతంగా చాలా రోజుల కిందటే కార్యకలాపాలు మొదలయ్యాయని పేరు చెప్పడానికి ఇష్టపడని స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారి బీబీసీతో అన్నారు.

అయితే ప్రైవేటీకరణ పూర్తైతే స్టీల్ ప్లాంట్‌లోని ఉద్యోగులు, కార్మికులకు భరోసా ఉండకపోవచ్చు. దానికి స్టీల్ ప్లాంట్‌కి సమీపంలోనే ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రైవేటైజేషనే పెద్ద ఉదాహరణ.

హిందుస్థాన్ జింక్

హిందుస్థాన్ జింక్ ఇప్పుడేమైంది?

విశాఖలో 1974లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఈ కర్మాగారం కోసం పాతగాజుకవాక, మింది, నక్కవానిపాలెం, ములగాడ పరిసర ప్రాంతాల రైతుల నుంచి అప్పట్లో 350 ఎకరాలను సేకరించారు.

"అప్పట్లో ఎకరం వెయ్యి రూపాయలలోపే ఉండేదని మా తండ్రి చెప్పారు. మేం కూడా కొంత భూమిని జింక్ కర్మాగారం కోసం ఇచ్చాం. నిర్వాసితుల్లో దాదాపు అందరికి జింక్ లో ఉద్యోగాలు దక్కాయి. నాకు అలాగే ఉద్యోగం వచ్చింది. అయితే 2002లో జింక్ ప్రైవేటీకరణ అనే వార్త బయటకొచ్చింది. అప్పట్లో ప్రైవేటీకరణ, దాని తదనంతర పరిణామాలపై నాకు పెద్దగా అవగాహన లేదు. మా ఉద్యోగాలకు ఏమవుతుందిలే అని నేను తేలిగ్గానే తీసుకున్నాను. పైగా జీతాలు పెరుగుతాయని అనడంతో... ప్రైవేటీకరణే మంచిదని అనుకున్నాను’’ అని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి చివరి వరకు అందోళనలు చేసిన స్మైల్టింగ్ యూనిట్ ఆపరేటర్ సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

''కానీ, 2004లో అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవి విరమణ కార్యక్రమం తీసుకొచ్చారు. అప్పటికి మొత్తం 2,100 మంది ఉద్యోగులు, మూడు వేల వరకు రోజు కూలీలు ఉండేవారు. ఉద్యోగులకు వీఆర్ఎస్, కూలీలకు పని తగ్గించడం మొదలుపెట్టారు. ఏడాది కాలంలోనే మొత్తం 1800 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోగా...కూలీలు ప్యాక్టరీలో కనిపించడం మానేశారు. ఆ తరువాత జింక్ కంపెనీలోని ప్రభుత్వ వాటాని 70 శాతం వేదాంత గ్రూపుకి అమ్మేశారు. దాంతో వేదాంత గ్రూపు మాటకి తిరుగు లేకుండా పోయింది. దాంతో బలవంతపు వీఆర్ఎస్‌లు పెరిగిపోయాయి. నాకు కూడా అదే జరిగింది" అని ఆయన చెప్పారు.

'జీతం 28 వేలు...ఎకరం 8 కోట్లు

"వీఆర్ఎస్ తీసుకోగా...ఇంకా మేం దాదాపు 300 మంది మిగిలాం. అంతా ఐక్యంగా ఉండి వీఆర్ఎస్ ఇవ్వమని పోరాటాలు చేసేవాళ్లం. కానీ యూనియన్లు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆఫీసర్లు అంతా కలిసి ఏవేవో చెప్పేవారు. వేదాంత గ్రూపులోని కొందరు, యూనియన్ నాయకులు కలిసి ఇళ్ళకు వచ్చి... 'వీఆర్ఎస్ తీసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. తీసుకోకపోతే పెన్షన్ కూడా రాదు. అయినా మీ ఉద్యోగాలు త్వరలోనే తీసేస్తున్నారు. ఇప్పుడు మీరే ఇష్టపడి మానేస్తే కనీసం సొమ్ములైనా మిగులుతాయి’ అంటూ ఇలా అనేకం చెప్పేవారు’’ అని సత్యనారాయణ చెప్పారు.

''మా అవసరాలు, అప్పటి పరిస్థితులు, బెదిరింపులతో మేం కూడా లొంగిపోయాం. 2013 నాటికి మేమంతా వీఆర్ఎస్ తీసుకున్నాం. దాంతో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ పూర్తిగా మూతపడింది. కంపెనీ మూతపడి... నేను వీఆర్ఎస్ తీసుకునేటప్పటికి నా జీతం 28 వేలు. కంపెనీ మూతపడకపోతే నేను గతేడాది రిటైర్ అయ్యేవాడిని. ఇప్పుడు నిర్వాసితులు ఇచ్చిన భూమలన్నీ వేదాంత చేతిలోనే ఉన్నాయి. వాటితో ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఇప్పుడక్కడ ఎకరం రూ.8 కోట్లు పలుకుతోంది. మొత్తం 350 ఎకరాలను ఆ సంస్థ పొందింది. నిర్వాసితులు ఇచ్చిన భూములతో వేదాంత గ్రూపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ గారు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశారు. వాటిపై మేం కూడా సంతకాలు చేశాం. అయినా ప్రయోజనం లేదు" అని ఆయన అన్నారు.

"నా అనుభవంతో చెబుతున్నాను. రేపు స్టీల్ ప్లాంట్‌కి కూడా ఇదే జరగబోతుంది. ప్రైవేటీకరణను అపేస్తాం అనే పేరుతో కొందరు నాయకులైతే అవొచ్చు... జింక్ లో జరిగినట్లు. కానీ, ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లాక ఉద్యోగులకు హక్కులు ఉండవు. అధికారం ఉండదు" అని గట్టి స్వరంతో చెప్పారు సత్యనారాయణ.

విశాఖ ఉక్కు పరిశ్రమ

మొదలైతే... రెండేళ్ల లోపే....

అయితే స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడం అంత సులభం కాదని... అలాగని అసాధ్యం కూడా కాదని ఆంధ్ర విశ్వవిద్యాయలం ఏయూ ఎనకామిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. ప్రసాదరావు బీబీసీతో చెప్పారు.

"రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న అందోళనలు, నిరసనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వస్తే సరే సరి. అలా కానీ పక్షంలో రెండేళ్లలోపే ప్లాంట్ ప్రైవేటైజేషన్ పూర్తి చేసేస్తారు. ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక న్యాయ నిపుణులను నియమిస్తుంది. వారు చర్చించిన తరువాత ఉద్యోగుల విలువ, ప్లాంట్ ఆస్తులు, ఇతర భూములు, యంత్రాలు, పనిముట్లు... ఇలా చిన్న మేకు నుంచి భారీ ఫర్నేసుల వరకు అన్నింటి విలువ కడతారు. ఆ తర్వాత కొనేందుకు ఆసక్తి చూపించే వారి నుంచి బిడ్డింగులను తీసుకుంటారు. ఎక్కువ కోట్ చేసిన వారికి ప్లాంట్‌ని అప్పగిస్తారు" అని ప్రసాదరావు చెప్పారు.

ప్రైవేటీకరణ, అమ్మకం, విలీనం...

"స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ. వంద శాతం కేంద్ర ప్రభుత్వానికే వాటాలున్నాయి. మరే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు వాటాలు లేవు. ప్రభుత్వం కొంత శాతం వాటాని ప్రైవేటు సంస్థకి అమ్మి... మిగతాది ప్రభుత్వ చేతుల్లోనే ఉంచుకుంటే దానిని పెట్టుబడుల ఉపసంహరణ అని... అదే ప్రభుత్వ సంస్థకే కొంత వాటాని అమ్మితే దానిని మెర్జ్ (విలీనం) అని అంటారు’’ అని ప్రొఫెసర్ ప్రసాదరావు వివరించారు.

''అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ విషయంలో 100 శాతం కేంద్రం వాటాలని అమ్మాలని అనుకుంటుంది కాబట్టి...దీనిని ప్రైవేటీకరణ లేదా సేల్ అని కూడా అనొచ్చు. నష్టాల్లో ఉన్న కంపెనీని వదిలించుకోవాలని ఒకరు చూస్తుంటే... దానిని తక్కువ రేటుకే కొనాలని మరొకరు ముందుకొస్తారు. ఇది వ్యాపారమే" అని ఆయన చెప్పారు.

"2016లో మేం చేసిన సర్వేలో గాజువాక ప్రజల తలసరి ఆదాయం రూ.2 లక్షల 64 వేలు. అది ఇప్పుడు నాలుగు లక్షలకు చేరుకుని ఉంటుందని నా అంచనా. దీనికి స్టీల్ ప్లాంట్ గాజువాకలో ఉండటమే కారణం. 2011 జనాభా లెక్కల ప్రకారం గాజువాక జనాభా 2.5 లక్షలు, ప్రస్తుతం దీని జనాభా 5 లక్షలు. స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా పని చేసే సంస్థల మొత్తం టర్నోవర్ రూ.300 కోట్ల వరకు ఉంటుంది. దీనిని బట్టే గాజువాక ఎంత అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమల పాత్ర ఎటువంటిదో అర్థమవుతుంది’’ అని ప్రసాదరావు అన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ

షేర్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు అడ్డంకి ఏంటంటే...

స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడం కంటే దానికున్న అప్పులపై వడ్డీ తగ్గించి... అప్పు తీర్చే సమయాన్ని రీషెడ్యూల్ చేయడం లేదా అప్పును మూలధన పెట్టుబడిగా మార్చడం ద్వారా స్టీల్ ప్లాంట్‌ను అప్పుల నుంచి గట్టెక్కించవచ్చు. ఇదే విషయమై రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రధానికి లేఖ రాశారు.

స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తున్నప్పుడే ఐపీఓ ద్వారా దీన్ని గట్టెక్కించే ప్రయత్నం చేశారని పేరు చెప్పడానికి ఇష్టపడని స్టీల్ ప్లాంట్ ఉన్నతోద్యోగి ఒకరు బీబీసీతో చెప్పారు.

''2020 నాటికి స్టీల్ ప్లాంట్‌కు దాదాపు 11 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ అప్పు మీద వడ్డీయే ప్లాంట్‌కు పెద్ద భారంగా మారింది. దీనిని అధిగమించేందుకు షేర్‌మార్కెట్లో లిస్టింగ్‌ చేసి 10% వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించాలని ముందుగా ప్రభుత్వం భావించింది. కొంత పని కూడా జరిగింది. కానీ అప్పటీకే ప్లాంట్‌కు నష్టాలు ఎక్కువవ్వడం మొదలవ్వడంతో అది కుదరలేదు. నష్టాల్లో ఉన్న సంస్థల షేర్లను ఏ ఇన్వెస్టర్, ట్రేడర్ కొనరు. అందుకే ప్రభుత్వం ప్రైవేటీకరణకు ఓటేసినట్టుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న బ్రాండ్ వాల్యూ వలన ప్రైవేట్ సంస్థలు దీనిని కొనేందుకు వస్తారనే నమ్మకం ఉంది" అని చెప్పారు.

"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టీల్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుంటే...భవిష్యత్తులో ప్లాంట్ లాభాలు గడించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉన్నా... 2020 డిసెంబరు నెలలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటు 2,100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను, 170 కోట్ల రూపాయల లాభాన్ని కూడా పొందింది. ఇవన్నీ సానుకూల విషయాలే. అయితే ఈ సమయంలోనే ప్రైవేటీకరణ నిర్ణయం రావడం ఆశ్చర్యం కలిగించింది" అని తెలిపారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Vizag Steel Plant: What about employees if privatized?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X