చివరి విడత పోలింగ్ షురూ: ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠత: అయిదు రాష్ట్రాల్లో
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు చివరిదశకు చేరుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో ఏడవ, తుది విడత పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. గురువారం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో భారతీయ జనతా పార్టీ, పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వాల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు ఇవి.
చివరి దశలో ఆజంగఢ్, మవు, జౌన్పూర్, ఘాజీపూర్, చందౌలి, వారణాశి, బదోహి, మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. దీనితో ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తి అవుతుంది. చివరి విడత కావడం వల్ల అందరి దృష్టీ ఈ తొమ్మిది జిల్లాలపైనే నిలిచింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఆరు దశల్లో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో ఒకే విడతలో, మణిపూర్‌లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇదివరకే పూర్తయింది. పంజాబ్ మినహాయిస్తే- మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ప్రత్యేకించి- ఉత్తర ప్రదేశ్‌లో 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీవినీ ఎరుగని మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకుంది. 403 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి 312 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.
అదే గెలుపును పునరావృతం చేస్తామనే ధీమా బీజేపీ నేతల్లో వ్యక్తమౌతోంది. 350కి పైగా స్థానాలను సాధిస్తామంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్.. అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డాయి. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాయి. కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలను ప్రియాంకా గాంధీ వాద్రా తన భుజాల మీద వేసుకున్నారు.