వీడియో: తిరుపతి గగనతలంలో అద్భుతం: అరుదైన మేఘ మాల: కిలోమీటర్ల కొద్దీ వ్యాప్తి
తిరుపతి: ఆకాశం.. ఎన్నో అద్భుతాలకు నిలయం. వర్ష సమయంలో ఆ అద్భుతాలు మరింత రెట్టింపు అవుతుంటాయి. ఇంద్రధనస్సు వెలుస్తుంటుంది. చేతికి అందేంత ఎత్తులో మేఘాలు తిరుగాడుతుంటాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఓ అద్భుత దృశ్యం ఇప్పుడూ కనిపించింది. అత్యంత అరుదుగా సంభవించే మేఘ మాల ఏర్పడింది.. అది కూడా మన టెంపుల్ టౌన్ తిరుపతి గగనతలంపై. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు విస్తరించింది. ఫ్లైట్ నుంచి దీన్ని షూట్ చేశాడో పైలెట్. ఈ వీడియో కాస్త వైరల్గా మారింది.
క్వాల్ లైన్. సాధారణంగా వేసవి కాలంలో భారీ వర్షాలు, తుఫాన్ తరహా వాతావరణం ఏర్పడిన సమయంలో ఇది ఆవరిస్తుంటుంది. తెలుగులో మేఘ మాలగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నడి వేసవిలో ఉన్నాం మనం. ఎండ తీవ్రతకు భిన్నంగా తుఫాన్ తరహా వాతావరణాన్ని, చలి గాలులను చవి చూస్తున్నాం. ఈ తరహా వాతావరణ పరిస్థితుల్లోనే ఈ క్వాల్ లైన్ ఏర్పడుతుంటుంది. ఉష్ణమండల తుఫాన్ నుంచి వెలువడే చల్లని, వెచ్చని గాలుల మధ్య ఈ క్వాల్ లైన్ ఆవిర్భిస్తుంటుంది.

చల్లని గాలుల ఒత్తిడితో ఈ మేఘమాల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు విస్తరిస్తుంటుంది. అలాంటి మేఘమాల ఇప్పుడు- తిరుపతి గగనతలంపై ఆవరించింది. కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించింది. తిరుపతి మొదలుకుని చెన్నై వరకు ఓ వరుస ప్రకారం.. మేఘాలు దట్టంగా లైన్ కట్టాయి. నల్లని మేఘాల గుంపు కనిపించింది. సహజంగా ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో క్యుములో నింబస్ మేఘాలు సైతం ఏర్పడుతుంటుంది.
Squall line as visible from flight.
— Namma Weather (@namma_vjy) May 17, 2022
The squall line is from Tirupathi to West of Chennai pic.twitter.com/u0GZuxVsYF
క్యుములో నింబస్ మేఘాలు నిలువుగా, పుట్టగొడుగు ఆకారంలో- అగ్నిపర్వతం పేలినప్పుడు గాలిలోకి వెదజల్లే దుమ్ము, ధూళి ఏ తరహాలో ఆకారాన్ని కలిగివుంటుందో క్యుములో నింబస్ అలాగే ఉంటాయి. దీనికి భిన్నంగా క్వాల్లైన్ కనిపిస్తుంటుంది. ఇది అడ్డంగా వ్యాప్తిస్తుంటుంది. చుట్టూ ఎండ కాస్తున్నప్పటికీ- ఈ క్వాల్ లైన్ మాత్రం కారుమబ్బులతో నిండి ఉండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో వైరల్గా మారింది.