• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’

By BBC News తెలుగు
|
లైంగిక వేధింపులు

ఎనిమిదేళ్ల క్రితం కైనాత్ (పేరు మార్చాం) గుర్గావ్‌లోని ఒక ఇంట్లో పనిచేసేవారు. ఆ ఇంట్లో వాళ్లతోపాటే ఆమె ఉండేవారు.

అయితే, ఆ ఇంట్లోని ఓ వృద్ధుడు ఎవరూ లేని సమయంలో కైనాత్‌ను లైంగికంగా వేధించేవాడు. అప్పుడామె వయసు 17 ఏళ్లు.

"నా వీపు మీద నెమ్మదిగా తట్టడం, అతని చేతులతో నా వీపును తడమడం లాంటి పనులు చేసేవాడు. మొదట్లో నేను పట్టించుకోలేదు. కానీ, తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి. ఒక సారి అతడి నుంచి తప్పించుకునేందుకు నేను వాష్ రూమ్‌లో దాక్కున్నా. ఇంట్లో వాళ్లు వచ్చేవరకూ బయటకు రాలేదు" అని కైనాత్ చెప్పారు.

"ఈ విషయం చెబితే ఆ ఇంట్లో వాళ్లు ఎవరూ నమ్మరని తెలుసు. నువ్వు పొట్టి బట్టలు వేసుకో, ఇంకా బాగుంటావు అని అతను అంటూ ఉండేవారు" అని ఆమె చెప్పారు.

"నేను అలానే చేయాల్సి వచ్చేది. ఎందుకంటే, నా కుటుంబాన్ని పోషించడానికి నా సహాయం అవసరం. కానీ, చివరకు వీటితో విసిగిపోయాను. ఇళ్లల్లోనూ ఉంటూ పని చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని కైనాత్ హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధులకు చెప్పారు.

కైనాత్‌కు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె కుటుంబం పశ్చిమ బెంగాల్ నుంచి గుర్గావ్‌కి పనుల కోసం వలస వచ్చింది.

లైంగిక వేధింపులు

'మీ టూ’ ఉద్యమ నేపథ్యంలో పని స్థలాల్లో చోటు చేసుకునే లైంగిక వేధింపులపై అనేక మంది మహిళలు తమ గళం విప్పినప్పటికీ అసంఘటిత రంగంలో పని చేస్తున్న మహిళలు మాత్రం నోరు విప్పి తమకు జరిగిన అన్యాయం చెప్పటానికి ఇంకా భయపడుతూనే ఉన్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక పేర్కొంది.

పని స్థలాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల ముప్పు గురించి హ్యూమన్ రైట్స్ వాచ్ అక్టోబర్ 14వ తేదీన 56 పేజీల నివేదికను విడుదల చేసింది. .

ఈ నివేదిక కోసం హ్యూమన్ రైట్స్ వాచ్ తమిళనాడు, హరియాణా, దిల్లీ రాష్ట్రాలలో క్షేత్ర స్థాయి అధ్యయనం నిర్వహించి సంఘటిత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న 85 మంది మహిళలతో, కార్మిక రంగ అధికారులతో, మహిళల హక్కుల కార్యకర్తలతో, న్యాయవాదులతో, విద్యావేత్తలతో మాట్లాడింది.

పని స్థలాల్లో మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులను వెలుగులోకి తీసుకుని రావడానికి 'మీటూ' ఉద్యమం సహకరించిందని హ్యూమన్ రైట్స్ వాచ్ సౌత్ ఆసియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ పత్రికా ప్రకటనలో తెలిపారు.

''భారతదేశంలో మహిళలను తమ పైఅధికారులు గానీ, తోటి ఉద్యోగులు గానీ లైంగిక వేధింపులకు గురి చేస్తే రక్షించడానికి అభ్యుదయకరమైన చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయడంలో యంత్రాంగం విఫలయమయింది’’ అని ఆమె అభిప్రాయ పడ్డారు.

'చట్టాలు కొంతమందికే చుట్టాలు'

'మీ టూ’ ఉద్యమం తర్వాత వ్యవస్థాగతంగా గణనీయమైన మార్పులేమీ చోటు చేసుకోలేదని సినీ నటి మాధవీ లత బీబీసీ తెలుగుతో అన్నారు. ఆమె గతంలో తనకు సినీ రంగంలో ఎదురైన అనుభవాల గురించి మీ టూ ఉద్యమ సమయంలో బీబీసీతో మాట్లాడారు.

'మీ టూ' ఉద్యమానికి ప్రభావితమై తమ పైఅధికారులపై ఫిర్యాదులు ఇచ్చిన చాలా మంది మహిళలు బెదిరింపులు, ప్రతీకార చర్యలు, ఎదురు దాడులకు గురవ్వాల్సి వచ్చిందని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక తెలిపింది. కొన్ని సార్లు ఫిర్యాదు వెనక్కి తీసుకునేందుకు వారికి లంచాలు ఇవ్వజూపారని, న్యాయం విషయంలో వాళ్లు పక్షపాతం ఎదుర్కొన్నారని పేర్కొంది.

గొంతు విప్పిన మహిళల పై బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ పరువు నష్టం చట్టాన్ని నిందితులు ప్రయోగిస్తుండటంతో ఎవరైనా నోరు విప్పి తమకు జరిగిన అన్యాయం చెప్పాలంటే వణికే పరిస్థితి ఏర్పడిందని నివేదిక తెలిపింది.

ఇది కొంత వరకు నిజమేనంటున్నారు మాధవీ లత.

లైంగిక వేధింపులు

"చాలా సంస్థలలో, ముఖ్యంగా అసంఘటిత రంగాలలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనే వ్యవస్థ లేకపోవడం వల్ల బాధితురాలు నేరుగా పోలీసు స్టేషన్‌కి గానీ, మీడియా ముందుకు గానీ వెళ్లాల్సి వస్తోంది" అని ఆమె అన్నారు.

మహిళల పని నైపుణ్యాన్ని తక్కువ చేసి మాట్లాడినా అవి వేధింపుల కిందకే వస్తాయని, కానీ వాటి గురించి చాలా మంది తమలో తామే బాధపడతారు కానీ, వాటి గురించి ఫిర్యాదు చేయాలని అనుకోరని ఆమె అన్నారు.

"నేను సినీ పరిశ్రమ నుంచి గళం విప్పాను కానీ ఆ తర్వాత ఎంత వరకు సమస్య పరిష్కారం కోసం కృషి జరిగిందో నాకైతే తెలియదు" అని అన్నారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారు 'మీ టూ' అనే పదాన్నే విని ఉండరని ఆమె అన్నారు.

"చట్టాలు కూడా కొంత మందికి మాత్రమే చుట్టాలుగా వ్యవహరిస్తాయి" అని మాధవి అన్నారు.

అమలులో విఫలం

''లైంగిక వేధింపులను అరికట్టే చట్టాలను అమలు చేయడంలో భారత ప్రభుత్వం విఫలమైంది" అని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. లైంగిక వేధింపుల నిరోధక చట్టంలో (పోష్) ఉన్న నిబంధనలు అమలయ్యేటట్లు చూడాలని కోరింది.

భారతదేశంలో ఉన్న 19 కోట్ల 50 లక్షల మంది మహిళా కార్మికులలో 95 శాతం మంది అసంఘటిత రంగంలోనే పని చేస్తున్నారు.

అందులో చాలా మంది రోడ్డు మీద నడిపే షాపుల్లో, ఇళ్ల పనుల్లో, వ్యవసాయ కూలీలుగా, చిన్న చిన్న కుట్లు, అల్లికలు చేసే పనులలో ఉన్నారు.

లైంగిక వేధింపులు

శాంత (పేరు మార్చాం) ఒక హెల్త్ వర్కర్ గా పని చేస్తున్నారు. 2014లో ఓ అంబులెన్సు డ్రైవరు తనను లైంగికంగా వేధించాడని ఆమె చెప్పారు.

అయితే తాను ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడినట్లు ఆమె తెలిపారు.

"కానీ, నేను మెడికల్ సూపరింటెండెంట్‌కి కాల్ చేసి ఏమి జరిగిందో చెప్పాను. అప్పుడు సిబ్బంది సహాయంతో ఆ అంబులెన్సు డ్రైవర్‌ను మూడు రోజుల తర్వాత వెతికి పట్టుకున్నాం. కానీ, పోలీసులు, ఆశా వర్కర్లు నన్ను సర్దుకుపొమ్మని చెప్పారు. ఆ డ్రైవరు కొన్ని డజన్ల మంది ఆశ వర్కర్ల ముందు నాకు క్షమాపణ చెప్పారు. దాంతో నన్ను అధికారికంగా ఫిర్యాదు చేయవద్దని నా తోటి ఆశా వర్కర్లే బతిమాలారు. కానీ, ఒక చట్టం ఉందని, నేను స్థానిక ఫిర్యాదుల కమిటీలో ఫిర్యాదు చేయవచ్చని ఎవరూ చెప్పలేదు" అని శాంత చెప్పారు.

లైంగిక వేధింపులు

"భారతదేశంలో చట్టాలున్నాయి. కానీ, వాటి అమలులోనే సమస్యలున్నాయి" అని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి బొల్లినేని అన్నారు.

అసంఘటిత రంగంలో ఉన్న మహిళలు కూడా జిల్లా కలెక్టర్ నేతృత్వం వహించే స్థానిక ఫిర్యాదుల కమిటీలో ఫిర్యాదు చేయవచ్చు అని ఆమె చెప్పారు.

ఆ కమిటీలలో సాధారణంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కన్వీనర్‌గా... న్యాయ నిపుణులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళ సభ్యులుగా ఉంటారు.

''చట్టప్రకారం ప్రతి జిల్లాలోనూ ఈ కమిటీలు ఏర్పాటు చేశారా? చేసినా, అవి పని చేస్తున్నాయా? అసలు ప్రజలకు వాటి గురించి తెలుసా?’’ అన్నది అనుమానమేనని ఆమె అన్నారు.

కృష్ణ జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీలో కీర్తి సభ్యురాలిగా ఉండేవారు. అయితే ఆ కమిటీ కేవలం ఒక్క సారి మాత్రమే సమావేశమయిందని ఆమె అన్నారు.

"ఒక రెండు ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఒక ఫిర్యాదు కమిటీలో సభ్యుల మీదే కావడంతో అవి అక్కడే సమాధి అయిపోయాయి. వివిధ స్థాయిలలో స్తబ్దత ఉంది" అని ఆమె అన్నారు.

అయితే, ఈ ప్రాంతీయ కమిటీలు చాలా చోట్ల అసలు లేవని కొన్ని చోట్ల అవి ఉన్నప్పటికీ వాటిని సంప్రదించవలసిన విధానాల గురించి ఎక్కడా సమాచారం అందుబాటులో లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ అధ్యయనం పేర్కొంది.

ముఖ్యంగా హెల్త్ వర్కర్లను రాత్రి పూట విధులకు రమ్మని పిలిచినప్పుడు ముప్పు ఎక్కువగా ఉంటుందని గంగూలీ అన్నారు. ఒక వేళ ఫిర్యాదు చేస్తే, నిందితుల కుటుంబాల నుంచి, వారి సొంత కుటుంబాల నుంచి కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకొమ్మని విపరీతమైన ఒత్తిడి వస్తుందని చెప్పారు.

సంఘటిత రంగంలోనే ఫిర్యాదు చేయడానికి భయపడుతున్న పరిస్థితులున్న నేపథ్యంలో అసంఘటిత రంగంలో వారికి ఇంకెక్కడ నుంచి ధైర్యం వస్తుందని కీర్తి ప్రశ్నించారు.

లైంగిక వేధింపులు

సాధారణంగా మహిళలు ఫిర్యాదు చేయగానే 'నువ్వే ఏదో చేసి ఉంటావ’ని అంటారనే భయంతో మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమలోనే దాచుకుంటారని కీర్తి అన్నారు.

ఇలాంటి వారికి తోడుగా తానున్నానని చెప్పి, వెన్నంటి నిలిచే వారు ఎవరూ ఉండరని ఆమె అన్నారు. పితృస్వామ్య విధానాలు మారాలంటే మహిళల వైఖరిలో కూడా మార్పు రావాలని వ్యాఖ్యానించారు.

చాలా పని స్థలాలలో చోటు చేసుకుంటున్న హింసలో కనీసం ఒక శాతం కూడా ఫిర్యాదుల స్థాయికి చేరడం లేదని కీర్తి అభిప్రాయపడ్డారు.

చాలా ప్రైవేటు సంస్థల్లో ఇంటర్నల్ కమిటీలు ఉన్నప్పటికీ అవి కేవలం కాగితాల మీద రాతల వరకే పరిమితం అవుతున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ చెబుతోంది.

ఈ అభిప్రాయంతో కీర్తి ఏకీభవించారు.

ఇంటర్నల్ కమిటీలు చాలా వరకూ అలంకార ప్రాయంగానే ఉంటాయని ఆమె అన్నారు. ఇవన్నీ మారాలంటే ఒక విప్లవమే రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

అసంఘటిత రంగంలో పని చేసే మహిళలకున్న హక్కుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రజల వైఖరి, ప్రవర్తన మార్చే విధానాలపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కీర్తి అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటెగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌లో 10 లక్షలకుపైగా గుర్తింపు పొందిన ఆశా వర్కర్లుగా పని చేస్తున్నారు. సుమారు 20.5 లక్షల మంది హెల్త్ వర్కర్లుగా, మరో 20 లక్షల మంది మధ్యాహ్న భోజన పథకంలో వంట వారిగా పని చేస్తున్నారు.

లైంగిక వేధింపులు

'తప్పు నాదే అంటారు'

షాలిని గూర్గావ్‌లోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్నారు. అక్కడ పని చేసే భద్రతా సిబ్బందిలో ఒకరు ఆమెను కొన్ని నెలలపాటు లైంగికంగా వేధించారు.

ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో లిఫ్ట్ వద్ద తాను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఆ వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవాడని ఆమె చెప్పారు.

"నన్ను ప్రేమిస్తున్నానని అతడు చెప్పేవాడు. ఓ రోజు నా చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టడానికి ప్రయత్నించి, తనతో పాటు రమ్మన్నాడు. ఆ రోజు ఇంటికి వెళ్లి విపరీతంగా ఏడ్చాను. సొంత ఊరు వెళ్లిపోదామని నా భర్తతో చెప్పాను. నా భర్త, నా బావగారు సెక్యూరిటీ అధికారికి ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో అతడిని మరో చోటుకి బదిలీ చేశారు" అని షాలిని వివరించారు.

"నేను పని చేస్తున్న యజమానులకు ఈ విషయం తెలిస్తే నన్ను ఉద్యోగం నుంచి మాన్పించేసి ఉండేవారు. అందుకే నేను మౌనంగానే ఉండిపోయాను" అని ఆమె చెప్పారు.

''చాలా వరకు మహిళలు ఇలాంటివాటిని మౌనంగానే భరిస్తుంటారు. కొందరు మరో ఉద్యోగంలోకి మారిపోతుంటారు. చాలా మంది తమను మాన్పించేస్తారేమోననే భయంతో కుటుంబాలతో కూడా ఈ విషయాలను పంచుకోరు" అని కార్మిక రంగంలోని సీనియర్ అధికారి సోనియా జార్జ్ అన్నారు.

ఇలాంటి వారికి పోలీసుల దగ్గరకు వెళ్లేందుకు స్థానిక కమిటీలు సహాయ పడాలని పోష్ చట్టం చెబుతోంది.

ఇళ్లల్లో పని చేసే కార్మికులు కూడా ఈ స్థానిక కమిటీల ద్వారా సత్వర న్యాయం అందేలా చూడాలని హ్యూమన్ రైట్స్ వాచ్ కోరుతోంది.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్) 2013 ఏం చెబుతోంది?

పని స్థలాలలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించడం కోసం లైంగిక వేధింపుల నిరోధక చట్టం ( పోష్ - 2013)లోని నిబంధనలను సంస్థలన్నీ కచ్చితంగా పాటించాల్సిందే. గృహాల్లో పని చేసే కార్మికులకు కూడా ఈ చట్టాన్ని ప్రభుత్వం విస్తరించింది.

1997 లో సుప్రీం కోర్టు జారీ చేసిన విశాఖ నియమావళిని అనుసరించి ఈ చట్టాన్ని రూపొందించారు. 1992లో భన్వారీ దేవి అనే ప్రభుత్వ సోషల్ వర్కర్ గ్యాంగ్ రేప్‌కి గురయిన తరువాత మహిళలను పని స్థలాలలో లైంగిక వేధింపులకు లోను కాకుండా రక్షించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.

పోష్ చట్టాన్ని అనుసరించి 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థ యాజమాన్యం ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని నియమించాలి.

10 కంటే తక్కువ సిబ్బంది ఉన్న సంస్థల్లోని వారు జిల్లా అధికారులు లేదా జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేసిన స్థానిక కమిటీని ఆశ్రయించవచ్చు. స్థానికంగా వచ్చిన ఫిర్యాదులను తీసుకుని దానిపై తగిన చర్యలను ఈ కమిటీలు సూచిస్తాయి. విచారణ చేసిన తర్వాత నిందితుని నుంచి క్షమాపణ చెప్పమని ఆదేశించేందుకు, విచారణలో నేరం రుజువైతే నిందితుని ఉద్యోగం నుంచి తొలగించేందుకు కూడా కమిటీకి అధికారాలు ఉంటాయి. పోలీసు స్టేషన్‌కి వెళ్లి క్రిమినల్ ఫిర్యాదు చేయించడానికి కూడా బాధితులకు కమిటీలు సహాయపడవచ్చు.

అయితే, పోష్ చట్టం కింద ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉంది. చట్టం సరిగ్గా అమలవుతోందా లేదా, లైంగిక వేధింపుల కేసుల సమాచారాన్ని పర్యవేక్షించడం, లాంటి పనులను కూడా ప్రభుత్వం చేయాలి.

“నా లాంటి వాళ్లకి మీ టూ ఎక్కడుంది? మా పేదరికం మమ్మల్ని మాట్లాడనివ్వదు. మా లాంటి మహిళలకు సురక్షిత స్థలం అంటూ లేదు. మా పని స్థలాలు, మా ఇళ్ళు, మేము నడిచే రోడ్లు కూడా మాకు సురక్షితం కాదు" అని షాలిని అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Women not safe anywhere in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X