అవమానం భరించలేక... పీపీఈ కిట్ ధరించి మరీ దోపిడీ.. రూ.13కోట్ల విలువైన బంగారం చోరీ...
ఢిల్లీలో సంచలనం రేకెత్తించిన ఓ జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును పోలీసులు 24గంటల్లోనే చేధించారు. కోవిడ్ 19 నుంచి ప్రొటెక్షన్ కోసం ధరించే పీపీఈ కిట్‌ను ధరించి మరీ ఆ దొంగ దోపిడీకి పాల్పడటం గమనార్హం. జ్యువెలరీ షాపులో పనిచేసే ఎలక్ట్రిషియనే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చీటికి మాటికీ సహచర ఉద్యోగులు తనను వేధించడం,అవమానాలకు గురిచేయడంతో... అందుకు ప్రతీకారంగా ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అతని నుంచి దాదాపు రూ.13కోట్ల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


డిగ్రీ డ్రాపౌట్... ఎలక్ట్రిషియన్‌గా...
పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీకి చెందిన షేక్ నూర్ రెహమాన్(25) గ్రాడ్యుయేషన్ డ్రాపౌట్. చదువు మధ్యలోనే వదిలేసిన టెక్నాలజీపై అతనికి మంచి పట్టు ఉంది. ఫేస్‌బుక్,ట్విట్టర్,ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. అంతేకాదు,ప్రెజర్ కట్టర్స్,గ్యాస్ కట్టర్స్,అలెన్ కీ వంటి టూల్స్‌ను ఉపయోగించడంలో అతను నిష్ణాతుడు. గతంలో కోల్‌కతాలోని అంజలి జ్యువెలర్స్‌లో ఎలక్ట్రిషియన్‌గా రెండేళ్లు పనిచేశాడు. గత ఏడాది కాలంగా ఢిల్లీలోని కల్‌కంజ్ షాపులో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు.

ఆ విభేదాలే కారణం....
కల్‌కంజ్ షాపులోని సహచర ఉద్యోగులతో షేక్ నూర్ రెహమాన్‌కు విభేదాలున్నాయి.షేక్ నూర్‌ను వారు తరుచూ అవమానించడం,వేధింపులకు గురిచేయడం అతను తట్టుకోలేకపోయాడు. ఇందుకోసం ప్రతీకారం తీర్చుకోవాలని భావించి... ఏకంగా జ్యువెలరీ షాపునే కొల్లగొట్టాలని భావించాడు. జనవరి 10న ఉద్యోగానికి లీవ్ పెట్టి సెలవుపై వెళ్లాడు. అతను లీవ్ పెట్టిన కొద్దిరోజులకే షాపులో దొంగతనం జరిగింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు షేక్ నూర్ కరోల్ బాగ్‌లో ఉన్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఇలా దోపిడీ...
పోలీసుల విచారణలో షేక్ నూర్ నేరం అంగీకరించాడు. సహచర ఉద్యోగుల అవమానాలు,వేధింపులు భరించలేకనే ఈ దోపిడీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు. దోపిడీ కోసం ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు చెప్పాడు. జ్యువెలరీ షాపు పక్కనే ఖాళీగా ఉన్న ఓ బిల్డింగ్ ద్వారా అందులోకి చొరబడినట్లు తెలిపాడు. పీపీఈ కిట్ ధరించి దోపిడీకి పాల్పడినట్లు చెప్పాడు. మొదట జ్యువెలరీ షాపు మూడో అంతస్తులోని ఇనుప గేటు తాళం పగలగొట్టి... అక్కడి నుంచి స్టోర్ రూమ్‌లోకి... ఆ తర్వాత ఫైబర్ రూఫ్ షీట్ ద్వారా కింది అంతస్తులోని షాపులోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అతని నుంచి రూ.13కోట్లు విలువైన బంగారు ఆభరణాలు,రూ.23వేలు విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.