తుఫాను ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ వైపు తీవ్రమైన ఎండలు.. మరోవైపు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయంత్రం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
కాగా, దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మే 6న(శుక్రవారం) అల్పపీడనం, తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు ఈదురుగాలులు
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలతోపాటు భారీగా ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్రలోనూ రానున్న మూడు రోజులపాటు కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

రాయలసీమలో భారీ వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా
ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాబోయే మూడు రోజులపాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు వీడచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షాలు, వడగాలులు
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అల్పపీడనం, తుఫాను ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇది ఇలావుంటే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో వడగాలులు కూడా వీచ అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావం ఒడిశా, అండమాన్ నికోబార్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురిసన వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. మళ్లీ వర్షాలు కురుస్తాయనే వార్తలతో మరింత ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు తెలుగు రాష్ట్రాల అన్నదాతలు.