హిమాలయాల్లో అణ్వాయుధ గూఢచర్య పరికరాల వల్లే ఉత్తరాఖండ్‌లో వరదలు సంభవించాయా?

భారత్‌లోని హిమాలయాల్లో గల ఒక గ్రామంలో ప్రజలు.. తమ పైభాగంలో నిటారుగా ఉన్న పర్వత శిఖరాల రాళ్లు, మంచు కింద అణ్వస్త్ర పరికరాలు దాగి ఉన్నాయని తరతరాలుగా నమ్మేవారు.
రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లోని రెయినీ ప్రాంతాన్ని భారీ వరద ముంచెత్తినపుడు.. గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో.. మంచు పర్వతాల్లో దాగివున్న అణ్వస్త్ర పరికరాలు పేలిపోవటం వల్లే ఈ వరద ముంచెత్తిందనే వదంతులు వ్యాపించాయి.
నిజానికి.. హిమాలయల్లోని రాష్ట్రం ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తి, 50 మందికి పైగా మరణానికి కారణమైన వరదలకు మూలం ఒక హిమనీనదం (గ్లేసియర్) నుంచి వేరుపడిన మంచు ఫలకమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కానీ, 250 ఇళ్లు రెయినీ గ్రామ ప్రజలకు ఈ మాట చెప్తే.. వారు పెద్దగా నమ్మరు. ''ఆ అణ్వస్త్ర పరికరాల పాత్ర ఎంతోకొంత ఉండే ఉంటుందని మేం అనుకుంటున్నాం. చలికాలంలో హిమనీనదం ఎలా ముక్కలవుతుంది? ప్రభుత్వం దర్యాప్తు చేసి, ఈ పరికరాలను కనిపెట్టాలి’’ అని రెయినీ గ్రామ పెద్ద సంగ్రామ్ సింగ్ రావత్ అన్నారు.
వారి భయాలకు మూలం.. పర్వత శిఖరాల మీద గూఢచర్యానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ. ఈ కథలో.. ప్రపంచంలో అత్యుత్తమ పర్వతారోహకుల్లో కొందరి పేర్లు, ఎలక్ట్రానిక్ గూఢచర్య వ్యవస్థలు పనిచేయటానికి ఉపయోగించే అణుధార్మిక పదార్థాలు ఉంటాయి.
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- అపోలో-11 కన్నా పదేళ్ళ ముందే చంద్రుని మీదకు ఉపగ్రహాన్ని పంపిన రష్యా...

చైనా అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాల మీద నిఘా పెట్టేందుకు 1960ల్లో అమెరికా భారతదేశంతో కలిసి ఎలా పనిచేసిందీ.. ఆ క్రమంలో హిమాలయాల మీద అణుధార్మిక శక్తితో నడిచే పర్యవేక్షణ పరికరాలను ఎలా మోహరించిందీ.. ఈ కథలో చెప్తారు. చైనా తన తొలి అణ్వాయుధాన్ని 1964లో పేల్చింది.
''ప్రచ్ఛన్న యుద్ధం భయం అత్యధికస్థాయిలో ఉన్న రోజులవి. ఎటువంటి ప్రణాళికా విపరీతంగా అనిపించదు. ఎంత పెట్టుబడి అయినా మరీ అతిగా కనిపించదు. ఏ పద్ధతీ అన్యాయంగా తోచదు’’ అంటారు అమెరికాకు చెందిన రాక్ అండ్ ఐస్ మేగజీన్ సంపాదకుడు పెటా టకేడా. ఈ గూఢచర్యం అంశంపై ఆయన విస్తృతంగా కథనాలు రాశారు.
1965 అక్టోబరులో భారత్, అమెరికాకు చెందిన పర్వతారోహకుల బృందం ఒకటి.. ఏడు ప్లుటోనియం కాప్స్యూళ్లతో పాటు, నిఘా పరికరాలను తీసుకుని హిమాలయాల మీదకు బయలుదేరింది. మొత్తం 57 కిలోల బరువున్న ఈ పరికరాలను.. భారతదేశానికి ఈశాన్యంగా చైనా సరిహద్దులో, భారతదేశంలో రెండో అతిపెద్ద పర్వతమైన 7,816 మీటర్ల ఎత్తున్న నందాదేవి పర్వత శిఖరం మీద మోహరించటం వారి లక్ష్యం.
కానీ.. ఆ బృందం శిఖరానికి ఇంకొంచెం దూరంలో ఉండగానే ముంచుకొచ్చిన మంచు తుఫాను కారణంగా వారు పర్వతారోహణను విరమించి వెనుదిరిగాల్సి వచ్చింది. అలా తిరిగివచ్చే క్రమంలో నిఘా పరికరాలను అక్కడే ఒక ''చదరపు బల్ల’’ మీద వదిలిపెట్టారు. అందులో.. ఆరడుగల పొడవున్న ఒక యాంటెనా, రెండు రేడియో కమ్యూనికేషన్ సెట్లు, ఒక విద్యుత్ ప్యాక్, ప్లుటోనియం కాప్స్యూళ్లు ఉన్నాయి.

పర్వత శిఖరం పక్క భాగంలో గాలి నుంచి రక్షణ కల్పిస్తున్న ఒక 'గుహ’ వంటి ప్రాంతంలో వాటిని దాచినట్లు ఒక మేగజీన్ కథనం ప్రచురించింది. ''మేం దిగిరావాల్సి వచ్చింది. లేదంటే చాలామంది పర్వతారోహకులు చనిపోయి ఉండేవారు’’ అని మన్మోహన్సింగ్ కోహ్లీ అనే ప్రముఖ పర్వతారోహకుడు చెప్పారు. బోర్డర్ పెట్రోల్ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన ఆయన నాటి పర్వతారోహకుల బృందానికి సారథ్యం వహించారు.
ఆ తర్వాత వసంత కాలంలో ఈ పర్వతారోహకుల బృందం మళ్లీ నందాదేవి పర్వతాన్ని అధిరోహిస్తూ.. తాము తమ పరికరాలను వదిలి పెట్టిన ప్రదేశానికి చేరుకున్నారు. కానీ ఆ పరికరాలు అదృశ్యమైపోయాయి.
అది జరిగి అర్థ శతాబ్దానికి పైగా గడిచిపోయింది. నందాదేవి పర్వతం మీదకు ఎంతో మంది సాహసయాత్రలు చేపట్టారు. ఇప్పటికీ.. ఆ ప్లుటోనియం కాప్స్యూల్స్ ఏమయ్యాయనేది ఎవరికీ తెలియదు.
''ఆ ప్లుటోనియం కాప్స్యూల్స్ ఇప్పటికీ ఒక హిమనీనదం అడుగున ఉండొచ్చు. ధూళిగా మారిపోతూ ఉండొచ్చు. గంగా నది ముఖద్వారం దిశగా పయనిస్తుండొచ్చు’’ అని టకేడా ఒక కథనంలో రాశారు.
ఇది అతి ఊహాగానం కావచ్చునని శాస్త్రవేత్తలు అంటారు. ఒక అణు బాంబులో ప్రధాన పదార్థం ప్లుటోనియం. కానీ ప్లుటోనియం బ్యాటరీలలో వేరే రకం ఐసోటోపును – ప్లుటోనియం-238 అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. దీనికి సగం జీవిత కాలం (అణుధార్మిక ఐసోటోపులో సగభాగం ధూళిలో కలిసిపోవటానికి పట్టే కాలం) – అంటే 88 సంవత్సరాల జీవిత కాలం ఉంటుంది.
అయితే.. ఆ సాహసయాత్ర గురించిన కథలు మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.
- అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు

అమెరికా పర్వతారోహకుల మీద స్థానికుల్లో సందేహం తలెత్తకుండా ఉండటానికి.. వారి శరీరం రంగు మారేలా భారతీయ సన్ టాన్ లోషన్‌ను ఉపయోగించాలని చెప్పటం గురించి 'నందా దేవి: ఎ జర్నీ టు ద లాస్ట్ సాంక్చురీ’ అనే పుస్తకంలో బ్రిటిష్ యాత్రా రచయిత హగ్ థాంప్సన్ రాశారు. అలాగే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉన్నపుడు అది శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేయటానికి తాము ఎత్తైన పర్వతాలను అధిరోహించే కార్యక్రమం చేపట్టామని స్థానికులకు చెప్పాలని కూడా ఆ పర్వతారోహకులకు నిర్దేశించినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అణుధార్మిక సామగ్రిని మోసుకెళ్లే కూలీలకు.. అది ఒక రకమైన సంపద అని, బంగారం కావచ్చునని చెప్పినట్లు రాశారు.
దానికిముందు.. ఆ పర్వతారోహకులను నార్త్ కరోలినాలోని సీఐఏ స్థావరం హార్వీ పాయింట్‌కు తీసుకెళ్లి, అణు గూఢచర్యం మీద శిక్షణనిచ్చారరని 'ఔట్‌సైడ్’ అనే ఒక అమెరికా మేగజీన్ ఓ కథనంలో చెప్పింది.
విఫలమైన ఈ పర్వతారోహణ పథకం విషయాన్ని భారతదేశంలో 1978 వరకూ రహస్యంగానే ఉంచారు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక.. ఔట్‌సైడ్ కథనాన్ని అందుకుని మరో పరిశోధనాత్మక కథనాన్ని రాసింది. చైనా మీద గూఢచర్యం కోసం హిమాలయాల్లోని రెండు పర్వత శిఖరాల మీద అణుశక్తితో నడిచే పరికరాలను అమర్చటం కోసం.. అప్పుడే ఎవరెస్ట్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అమెరికా పర్వతారోహకుల్లో కొందరితో పాటు ఒక పర్వతారోహకుల బృందాన్ని అమెరికా నియమించిందని ఆ కథనంలో పేర్కొంది.
1965లో మొదటి పర్వతారోహణ ప్రయత్నంలో ఆ పరికరం పోయిందని ఆ పత్రిక నిర్ధారించింది. ఆ తర్వాత రెండేళ్లకు చేసిన రెండో ప్రయత్నంలో.. ఒక మాజీ సీఐఏ అధికారి అభివర్ణించినట్లు 'పాక్షిక విజయం’ సాధించారని చెప్పింది.
1967లో.. నందా దేవికన్నా తక్కువ ఎత్తైన పర్వతం.. 6,861 మీటర్లు ఎత్తున్న నందాదేవి కోట్ మీద కొత్త పరికరాలను అమర్చటం కోసం మూడోసారి చేసిన ప్రయత్నం విజయవంతమైంది. హిమాలయాల మీద మూడేళ్ల కాలంలో ఈ గూఢచర్య పరికరాలను మోహరించటానికి.. మొత్తంగా 14 మంది అమెరికా పర్వతారోహకులకు నెలకు 1,000 డాలర్లు చొప్పున వేతనం చెల్లించారు.
- నాసా స్పేస్ మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ రాజాచారి
- విశ్వానికి కొత్త 'అట్లాస్’... 30 లక్షల కొత్త గెలాక్సీలను గుర్తించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

ఈ అణుశక్తి పరికరాలను నందాదేవి మీద మోహరించటానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయిలో కలిసి పనిచేశాయని నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ 1978 ఏప్రిల్‌లో పార్లమెంటులో వెల్లడించనపుడు ఆ విషయం ఒక బాంబులా పేలింది. అయితే.. ఆ మిషన్ ఎంతవరకూ విజయవంతమైందో మొరార్జీ చెప్పలేదని ఒక నివేదిక పేర్కొంది.
అదే నెలకు సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ బహిర్గతం చేసిన రహస్య సమాచారం ప్రకారం.. ''భారతదేశంలో ఆరోపిత సీఐఏ కార్యక్రమాలకు వ్యతిరేకంగా’’ దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద సుమారు 60 మంది బృందం నిరసన చేపట్టారు. ఆ నిరసనకారులు.. ''సీఐఏ క్విట్ ఇండియా’’, ''సీఐఏ మా జలాలను విషపూరితం చేస్తోంది’’ అని నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇక హిమాలయాల్లో అదృశ్యమైన అణు పరికరాల విషయానికి వస్తే.. అవి ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ''ఆ పరికరాలు మంచు చరియలు విరిగిపడినపుడు కొట్టుకుపోయి గ్లేసియర్‌లో చిక్కుకుపోయాయి. దాని ప్రభావం ఎలా ఉంటుందో దేవుడికే తెలియాలి’’ అని నాటి అమెరికా పర్వతారోహకుల్లో ఒకరైన జిమ్ మెక్‌కార్తీ.. టకెడాతో పేర్కొన్నారు.
రెయినీలోని ఒక చిన్న కేంద్రంలో.. ఆ నదిలోని నీటిని, ఇసుకలో ఏదైనా అణుధార్మికత ఉందేమోనని నిరంతరం పరీక్షించిందని, అయితే అణుధార్మికతతో అవి కలుషితమయ్యాయనేందుకు ఏవైనా ఆధారాలను ఆ కేంద్రం గుర్తించిందా లేదా అన్నది తెలీదని పర్వతారోహకులు చెప్తున్నారు.
''పవర్ ప్యాక్‌లోని ప్లుటోనియం క్షీణించిపోయి ధూళిలో కలిసిపోయేవరకూ – అందుకు శతాబ్దాలు పట్టొచ్చు – ఆ పరికరం అణుధార్మిక ముప్పుగా కొనసాగుతుంది.. అది హిమాలయాల మంచులోకి లీకై, గంగానది ముఖజలాల ద్వారా భారత నదీ వ్యవస్థలోకి చొరబడవచ్చు’’ అని ఔట్‌సైడ్ మేగజీన్ తన కథనంలో వ్యాఖ్యానించింది.
''హిమాలయాల్లో అణు పరికరాలను వదిలివచ్చిన పర్వతారోహకుల బృందంలో భాగంగా ఉన్నందుకు చింతిస్తున్నారా?’’ అని ఇప్పుడు 89 ఏళ్ల వయసున్న కెప్టెన్ కోహ్లీని నేను అడిగాను.
''అందులో విచారమూ లేదు, సంతోషమూ లేదు. నేను ఆదేశాలను పటించానంతే’’ అని ఆయన బదులిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- '18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)