అమిత్ షా..చాణక్యం: తృణమూల్‌లో కుంపటి: మమత రైట్ హ్యాండ్ రాజీనామా: బీజేపీలోకి
కోల్‌కత: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరువాత భారతీయ జనతా పార్టీలో ఆ స్థాయిలో బలమైన నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కన్ను.. ఇక పశ్చిమ బెంగాల్ మీద పడింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న బెంగాల్లో పాగా వేయడానికి కసరత్తు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందటే బెంగాల్లో పర్యటించిన ఆయన అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో కుంపటి రగిలించి వచ్చారు. ఇప్పుడది భగ్గున మండింది. దాని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తగిలింది. మమతా బెనర్జీకి కుడిభుజంగా గుర్తింపు పొందిన రవాణాశాఖ మంత్రి సువేందు అధికారి.. పదవికి రాజీనామా చేశారు.

మంత్రి పదవిని కాదని మరీ..
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో సువేందు ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచీ ఉంటున్నారు. మమతా బెనర్జీకి అత్యంత విశ్వాసనీయ నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లో తన కంటూ ప్రత్యేకంగా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారాయన. మమతా బెనర్జీ కేబినెట్లో రవాణా మంత్రిగా కొనసాగుతున్న ఆయన రాజీనామా చేయడం ప్రకంపనలను పుట్టించినట్టయింది. హుగ్లీ రివర్ బ్రిడ్జి కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ జగ్దీప్ ఢంకర్కు పంపించారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు.
బీజేపీలో చేరిక లాంఛనమే?
బీజేపీలో చేరడానికే ఆయన తన పదవికి రాజీనామా చేశారనేది బహిరంగ రహస్యంగా మారింది. కమలం తీర్థాన్ని పుచ్చుకోవడానికి మంచి ముహూర్తం చూసుకోవడమే మిగిలి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమంటూ జరిగితే.. ఉప ముఖ్యమంత్రిగా నియమితులు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అత్యంత వివాదాస్పద నియోజకవర్గంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నందిగ్రామ్ స్థానం నుంచి తొలిసారిగా సువేందు.. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రి పదవిలో చోటు దక్కించుకోగలిగారు.

జేడీయూను బలహీనపరిచినట్టుగానే..
బిహార్‌లో మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్)నే బలహీనపరిచింది బీజేపీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ కంటే అత్యధిక స్థానాలను దక్కించుకోగలిగింది. జేడీయూను రెండోస్థానంలోకి నెట్టేసింది. 74 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించింది బీజేపీ. అదే ఫార్ములాను అమిత్ షా పశ్చిమ బెంగాల్లో కూడా ప్రయోగించినట్టు స్పష్టమౌతోంది. మంత్రి పదవిని కాదని సువేందు అధికారి.. బీజేపీలోకి చేరడానికి సన్నాహాలు చేస్తుండటం వెనుక అమిత్ షా చాణక్యం ఉందని అంటున్నారు.

40 స్థానాలపై ప్రభావం..
సువేందు అధికారి ప్రస్తుతానికి తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదు. మంత్రి పదవి నుంచి మాత్రమే తప్పుకొన్నారు. బీజేపీలో చేరడానికి ముహూర్తాన్ని నిర్ణయించుకున్న వెంటనే పార్టీకీ గుడ్‌బై చెబుతారని సమాచారం. కాషాయ కండువాను కప్పుకొంటే. .వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి మమతా బెనర్జీ కఠోరంగా శ్రమించక తప్పదని అంటున్నారు. సువేందు ప్రభావం కనీసం 30 నుంచి 40 శాసనసభ స్థానాలపై పడుతుందని, వాటిని నిలబెట్టుకోవడం మమతా బెనర్జీ రాజకీయ వ్యూహానికి అగ్నిపరీక్షలా మారవచ్చని చెబుతున్నారు.