• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేపాల్ ముస్లింలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మెజారిటీ హిందువులతో కలిసి ఎలా జీవిస్తున్నారు?

By BBC News తెలుగు
|

నేపాల్ ముస్లింలు
Click here to see the BBC interactive

1992 డిసెంబర్ 6న భారత్‌లో బాబ్రీ మసీదు కూల్చినపుడు మొహానా అన్సారీ ఐదో తరగతి చదువుతున్నారు. ఆమె నేపాల్‌లోని బాంకే జిల్లా నేపాల్‌గంజ్‌లో ఉంటున్నారు.

"అప్పుడు మా కుటుంబం అంతా ఒక పెళ్లికి ఉత్తర్‌ప్రదేశ్ నానాపారాకు వెళ్లింది. అప్పుడే అక్కడ అల్లర్లు జరుగుతున్నట్లు మాకు తెలిసింది. మా నాన్నకు నేపాల్‌గంజ్‌లో పోలీస్ ఆఫీసర్‌తో మంచి పరిచయం ఉండడంతో, వాళ్ల ద్వారా యూపీ పోలీసులతో మాట్లాడి, మేం నానాపారా నుంచి సురక్షితంగా నేపాల్ చేరుకోగలిగాం. అక్కడ జరిగిన అల్లర్ల ప్రభావం నేపాల్లోని ముస్లింలపై, ముఖ్యంగా యూపీ-బీహార్‌కు దగ్గరగా ఉండే నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని ముస్లింలపై పడింది" అని అన్సారీ వివరించారు.

భారత్‌లో ఏ తీవ్రవాద దాడి జరిగినా ఆ ప్రభావం ఇక్కడ తమ జీవితాలపై పడుతుందని, అన్నింటికీ మేమే కారణం అన్నట్టుగా ఇక్కడివారు చూస్తారని ఆమె చెప్పారు.

గత ఏడాది భారత్‌లో కోవిడ్-19 తీవ్రంగా వ్యాపించిన సమయంలో తబ్లీగీ జమాత్‌ దానికి కారణం అనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో మొహనా అన్సారీకి కూడా సమస్యలు ఎదురయ్యాయి.

"మార్చిలో మా బంధువుల పెళ్లికి నేను యూపీలోని కాన్పూర్ వెళ్లాను. అనుకోకుండా అప్పుడే భారత్‌లో తబ్లీగీ జమాత్ కార్యక్రమం జరిగింది. మా కుటుంబం ఇప్పటివరకూ అలాంటి మతపరమైన కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. పెళ్లి నుంచి మేము తిరిగొచ్చాక భారత్‌లో లాక్‌డౌన్ విధించారు. నా దగ్గర ట్రావెల్ పర్మిట్ ఉంది. మా కారు కూడా ఉండడంతో యూపీ పోలీసులు నన్ను తిరిగి నేపాల్ వెళ్లనిచ్చారు".

"కాఠ్‌మాండూ చేరుకోగానే, అందరూ జమాత్‌లో పాల్గొనడానికి నేను భారత్ వెళ్లానంటూ సోషల్ మీడియాలో రాశారు. మా ఆఫీసులో కూడా జమాత్‌కు వెళ్లిన మీరు కరోనా టెస్ట్ చేయించుకోకుండా ఎందుకొచ్చారు అన్నారు. దాంతో నేను చాలా బాధపడ్డాను" అన్నారు మొహనా.

నేపాల్ ముస్లింలు

నేపాల్‌లో ముస్లింలు ఏ స్థితిలో ఉన్నారు?

నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలోని సుంధారా ప్రాంతంలో అక్టోబర్ 24 ఉదయం కొంతమంది జేసీబీతో ఒక మసీదు గోడ కూలగొట్టారు. ఆ మసీదు భూమి యాజమాన్య హక్కు విషయంలో వివాదం నడుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ గోడ కూల్చిన వ్యక్తిని పట్టించారు. తర్వాత ప్రభుత్వం దాన్ని మళ్లీ కట్టడానికి అనుమతి కూడా ఇచ్చింది.

అది హిందూ, ముస్లింల మధ్య గొడవలా మారలేదు. అలాంటివి జరిగేలా దానిని ఎవరూ పెద్దది చేయలేదు. మసీదు గోడ కూలినందుకు అక్కడ జనం గుంపులుగా కూడా గుమిగూడలేదు.

ఆ భూమి ఎన్నో దశాబ్దాలుగా ముస్లింల దగ్గరే ఉండేదని. అక్కడి ముస్లింలు ఆ ప్రాంతంలో నమాజు చదివేవారని, తర్వాత అక్కడే మసీదు కట్టుకున్నారని స్థానికులు తెలిపారు.

నేపాల్ ముస్లింలు

నేపాల్‌లో 2018లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం ముస్లిం మిషన్ ఏర్పాటు చేసింది. దానికి షమీమ్ మియా అన్సారీ మొదటి చైర్మన్‌గా ఉన్నారు.

అక్కడ భూ వివాదంలో మతం కోణం ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు కొత్త మసీదు కూడా కట్టారని ఆయన చెప్పారు.

"నేపాల్లో ముస్లింల పట్ల ఎప్పుడూ వివక్ష లేదు. కాఠ్‌మాండూలోని రెండు లక్షల మందికి పైగా ముస్లింలు అద్దె ఇళ్లలో ఉంటున్నారు" అని చెప్పారు.

మొహమ్మద్ అయూబ్ తరాయీ దిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో పీజీ చేశారు.

2013లో దిల్లీ నుంచి వెళ్లిన ఆయన కాఠ్‌మాండూలో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. అయూబ్‌కు నేపాలీ భాష రాదు. హిందీ, ఉర్దూ, అవధి మాట్లాడగలరు. లుంబినిలో అవధిలోనే మాట్లాడతారని ఆయన చెప్పారు.

కాఠ్‌మాండూలో ముస్లిం కంటే మాధేసీ గుర్తింపు ఉండడమే పెద్ద సమస్య అని ఆయన తెలిపారు.

"మధేసీ అయితే చాలు వివక్ష ఎదురవుతుంది. అంటే కాఠ్‌మాండూలోని ఎవరైనా పహాడీ ఇల్లు అద్దెకు అడగడానికి వెళ్తే, వాళ్లు ముఖం చూసే మీరు తరాయీ నుంచొచ్చారా, అంటే మధేసీనా అంటారు. నేపాలీ మాట్లాడకపోతే, యూపీ, బిహార్ వాళ్లేమో అనే సందేహం వస్తుంది. అసలు వివక్ష అక్కడనుంచే మొదలవుతుంది. ఆ తర్వాత పేరు అడుగుతారు. ముస్లిం అనేది తెలిస్తే, మరో రకమైన వివక్ష మొదలవుతుంది" అన్నారు.

చాలాసార్లు నేపాల్లో ఉన్నవారే మీరు భారత్‌ నుంచి వచ్చారా అని అడిగారని అయూబ్ చెప్పారు. నేపాల్లో మతపరమైన పార్టీలు ఏవీ లేవని, లేదంటే అవి సుంధారాలో మసీదు గోడ పడగొట్టిన ఘటనకు మతం రంగు పులిమేసేవారని అన్నారు.

నేపాల్ ఎన్నికల రాజకీయాల్లో మతపరంగా జనాలను పోగుచేయడం ఉండదు. దానికి ఇక్కడ ముస్లింల జనాభా తక్కువగా ఉండడమే దానికి కారణం. మధేశీలపైనే కాదు, మధేశీ హిందువులపై కూడా వివక్ష ఉంది. కమల్ థాపా పార్టీ నేపాల్‌ను హిందూ దేశంగా మార్చాలని డిమాండ్ చేస్తోంది. కానీ, ఆయన ఎప్పుడూ ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేయలేదు. హిందూ దేశంగా మార్చాలనే ఆయన పార్టీ డిమాండ్‌కు తరాయీలో ముస్లింలే మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది.

భారత్‌లో జరుగుతున్నట్లు నేపాల్ రాజకీయాలు మతం ఆధారంగా విభజన ఉండదని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నేత రామచంద్ర ఝా చెప్పారు.

నేపాల్ ముస్లింలు

"భారత్‌లో ఎన్నికల కోసం విభజన రాజకీయాలు జరుగుతాయి. నేపాల్ ప్రస్తుతానికి అలాంటివాటికి దూరంగా ఉంది. నేపాల్‌లో వివక్ష అనేది ప్రస్తుతానికి తరాయీ వర్సెస్ పహాడీ అనేదే. అందుకే ముస్లింలు, హిందువులు అనే పరిస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ బీజేపీ లాంటి పార్టీ కూడా లేదు. అందుకే నేపాల్ మత విద్వేషాలకు దూరంగా ఉంది" అన్నారు.

హిందీ మీడియా నేపాల్‌లో అలాంటి విభజనే తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రభావం కూడా కనిపిస్తోంది. ఆ విషయంలో నేపాల్ రాజకీయాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా రామచంద్ర ఝా చెప్పారు.

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినపుడు భారత్‌లో ముస్లింలపై పడిన ప్రభావం నేపాల్‌లో ఉన్న ముస్లింలపై కూడా కనిపించిందని అయూబ్ అన్నారు.

"2014 తర్వాత భారత మీడియా మారిపోయింది. తరాయీతో పాటూ పహాడ్ ప్రజలు కూడా హిందీ న్యూస్ చానళ్లు చూస్తున్నారు. హిందీ న్యూస్ చానళ్లలో ముస్లింలను ఎలా చూపిస్తున్నారో, ఆ ప్రభావం నేపాల్ సమాజం మీద కూడా పడింది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువవుతోంది" అన్నారు.

"పాకిస్తాన్‌లో ఒక ఆలయాన్ని కూల్చారు. ఆ ప్రభావం లుంబినీలో కూడా కనిపించంది. 'నేపాల్లో కూడా ముస్లింలు ఎక్కువైపోయారు, అక్కడిలాగే మన ఆలయాలు కూడా కూలగొడతారు' అని జనం మాట్లాడుకోవడం నేను విన్నాను" అని అయూబ్ మరో ఉదాహరణ కూడా ఇచ్చారు.

"అలా ఇంతకు ముందు లేదు. నేపాల్లో కూడా అధికారం కోసం ప్రజలను కూడగట్టడానికి మతాన్ని ఉపయోగిస్తారేమోనని ఇప్పుడు భయమేస్తోంది. అలా జరిగితే నేపాల్ ముస్లింల పరిస్థితి కూడా భారత్‌లో ఉన్నట్టే అవుతుంది. భారత్‌తో పోలిస్తే, నేపాల్ సమాజం ప్రస్తుతానికి సహనంగానే ఉందని నాకు అనిపిస్తోంది" అని చెప్పారు.

దినేష్ పంత్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని నేపాల్‌ కంచన్‌పూర్ జిల్లాలో ఉంటున్నారు. ఆయన గత ఏడాదే దిల్లీ సౌత్ ఏషియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు.

"భారత్‌లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినపుడు నేపాల్‌లో కూడా హిందువుల ఒక గ్రూప్ ఉత్సాహం పెరిగింది. దాని ప్రభావం నేరుగా ముస్లింలపై పడింది. కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమంటూ ఇక్కడ కూడా వార్తలు ప్రసారం అయ్యాయి. నోట్ల మీద ముస్లింలు ఉమ్మి వేసి ఇస్తున్నారనే ఫేక్ న్యూస్‌ కూడా వ్యాపించింది. భారత్ లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి నేపాల్లో రాచరికానికి వ్యతిరేక ఉద్యమానికి ప్రేరణ లభించేది. కానీ, భారత్‌లో లౌకికవాదం బలహీనపడితే దాని ప్రభావం నేపాల్ మీద కూడా పడుతుంది" అన్నారు.

నేపాల్ ముస్లింలు

ఉత్తరాఖండ్‌లో గోవధ నిషేధించడంతో ఆ ప్రభావం కూడా నేరుగా నేపాల్ మీద పడిందని దినేష్ చెప్పారు.

"నేపాల్లో హిందువులు ఆవు ముసలిదైనప్పుడు అమ్మేసేవారని, కానీ ఇప్పుడు అమ్మలేకపోతున్నారు. ముస్లింలు కూడా గొడ్డుమాంసం తినడానికి భయపడుతున్నారు. ఇక్కడ ముస్లింలే కాదు, హిందువులు కూడా గొడ్డు మాంసం తింటారు" అని పంత్ చెప్పారు.

"భారత్‌తో పోలిస్తే నేపాల్లో ముస్లింలు చాలా తక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ ముస్లింలు ఏదైనా చేయడానికి, అనడానికి ముందు దానిపై మెజారిటీ జనాభా ఏమంటోంది అన్నది తెలుసుకుంటారు. అంటే, నేపాల్‌ లౌకిక దేశంగా మారినపుడు ముస్లింలు సంబరాలు చేసుకోలేదు, అలాగే ఇప్పుడు మళ్లీ హిందూ దేశంగా చేయాలనే డిమాండ్ వస్తున్నప్పుడు వ్యతిరేకించడం కూడా లేదు" అంటారు దినేష్

నేపాల్ ముస్లింలు

నేపాల్‌లో హిందూ ముస్లింల మధ్య సఖ్యత

నేపాల్లో ముస్లింల సంఖ్య తక్కువే అయినా, చాలా ప్రశాంతంగా ఉన్నామని కాఠ్‌మాండూ ఇస్లామీ స్కాలర్ కాజీ ముఫ్తీ అబూబకర్ సిద్దిఖీ కాస్మీ చెప్పారు. మా దేశంలో హిందువులు కూడా మంచివారని చెప్పారు.

"మా మధ్య మతం గురించి ఎలాంటి గొడవా రాదు. మేం భారత్‌లోని ముస్లింల కంటే సంతోషంగా ఉన్నామని నేను చెప్పగలను" అన్నారు.

అయినా, నేపాల్లో హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు జరిగాయి. కానీ, వాటిలో ఎక్కువగా భారత్‌లో ఘటనలకు సంబంధించి, అంటే బాబ్రీ మసీదు విధ్వంసం లాంటి సందర్బాల్లో కనిపించాయి.

నేపాల్లో అప్పుడప్పుడూ భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లేదా ఇంకేదైనా చిన్న చిన్న విషయాల గురించి హిందూ, ముస్లిం గొడవలు వస్తుంటాయి.

1997లో ఇక్కడ శివసేన తన ఆఫీసు తెరిచింది. నేపాల్‌గంజ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. ఆ సమయంలో ఒక ముస్లింను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా శివసేన కార్యకర్తలు అడ్డుకోవడంతో, కాల్పులు జరిగాయని, ఒక శివసేన కార్యకర్త గాయపడ్డాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో మొత్తం నగరమంతా అల్లర్లు జరిగాయి. ఇళ్లు, షాపులకు నిప్పు పెట్టారు. వీటిలో ఒక ముస్లిం చనిపోగా, మరో 27 మంది గాయపడ్డారు.

నేపాల్ ముస్లింలు

ఇరాక్‌లో 12 మంది నేపాలీల హత్య ప్రభావం

2004 డిసెంబర్ 1న ఇరాక్‌లో 12 మంది నేపాలీలను ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అన్సార్ అల్-సున్నా హత్య చేసింది. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడులను సమర్థించారని వారిని కాల్చిచంపారు.

మృతులు ఇరాక్‌లో చిన్న చిన్న పనులు చేసుకునేవారు. నేపాల్లో ప్రజలు దానిని హిందువులపై ముస్లింల దాడిగా చూశారు. కాఠ్‌మాండూలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు.

ఆ అల్లర్లలో మదరసాలు, మసీదులపై దాడులు జరిగాయి. చాలారోజుల వరకూ ముస్లింలు అంటే ద్వేషించే పరిస్థితి ఉన్నాయి.

ఆ సమయంలో కాఠ్‌మాండూలోని జమా మసీదు మీద దాడి జరగడంతోపాటూ, ముస్లింల ఆస్తులకు కూడా నష్టం కలిగించారని రిపబ్లికా పత్రిక రాసింది.

ఆ ఘటన తర్వాత నేపాల్లో ముస్లింలను మైనారిటీలుగానే కాకుండా, తమకు ఒక ముప్పుగా కూడా చూశారు. నేపాల్లో ఆ నాటి ఘటనను బ్లాక్ వెడ్నస్‌డేగా భావిస్తారు.

ఆ తర్వాత ముస్లింలు ఏకం కావాలని ప్రయత్నించారని, కొన్ని సంఘాలు కూడా ఏర్పాటు చేసుకున్నారని డేవిడ్ సెడన్ అనే రచయిత తన కాఠ్‌మాండూ అనే పుస్తకంలో రాశారు.

2005లో నేషనల్ ముస్లిం పోరమ్ కూడా ఏర్పాటు చేశారు. అప్పటి ముస్లింలు మధేశీకి భిన్నంగా ఒక గుర్తింపును కోరుకున్నారు అని ఆయన అందులో చెప్పారు.

నేపాల్ ముస్లింలు

నేపాల్ ముస్లిం జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం నేపాల్‌లో ముస్లింల జనాభా 11 లక్షల 62 వేలకు పైనే ఉంది. ఈ సంఖ్య నేపాల్ మొత్తం జనాభాలో నాలుగు నుంచి ఐదు శాతం మధ్య ఉంది.

ఇప్పుడు నేపాల్ మొత్తం జనాబా రెండు కోట్ల 86 లక్షలు. నేపాల్లోని 97 శాతం ముస్లింలు తరాయీలోనే ఉంటారు. అయితే నేపాల్లో మొత్తం ముస్లిం జనాభా 10 శాతానికి దగ్గరగా ఉన్నారని కొందరు చెబుతారు.

నేపాల్ హిందూ దేశం అయినప్పటికీ 1990లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 11, 12 ప్రకారం దేశంలోని పౌరులందరితో సమానంగా వ్యవహరిస్తుందని చెప్పారు. మతం ఆధారంగా ఎవరిమీదా ఎలాంటి వివక్షా చూపదని పేర్కొన్నారు.

నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో అన్ని మతాలవారూ తమ మతాలను అనుసరించే హక్కు ఉంటుందని, అందులో ఎలాంటి జోక్యం ఉండదని చెప్పారు. కానీ, మతమార్పిడిని ఈ రాజ్యాంగంలో కూడా అనుమతించలేదు.

1990వ దశకంలో నేపాల్‌లో బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రోత్సాహం లభించింది. ముస్లింలు కూడా రాజకీయ పార్టీల్లో చేరడం ప్రారంభించారు.

నేపాల్ ముస్లింలు

హిందూ దేశం నుంచి సెక్యులర్

మావోయిస్టు ఉద్యమం విజయవంతం అయిన తర్వాత నేపాల్లో రాజకీయాలు ప్రారంభయ్యాయి.

240 ఏళ్ల రాచరికానికి తెరపడింది. హిందూ దేశం అనే ముసుగు తీసివేయడానికి నేపాల్ సిద్ధమైంది.

నేపాల్లో ముస్లింల అక్షరాస్యత

నేపాల్ ముస్లింల అక్షరాస్యత దారుణంగా ఉంది. ఇటీవల దశాబ్దాల్లో నేపాల్ విద్యావ్యవస్థలో చాలా పురోగతి వచ్చినా, ముస్లింలు వాటిని అందుకోవడంలో వెనకబడ్డారు.

2001 జనాభా లెక్కల ప్రకారం 1991లో నేపాల్‌ అక్షరాస్యత 39.6 శాతం. అది 2011లో 53.7 శాతానికి పెరిగింది. కానీ 2001లో 22.4 శఆతం ఉన్న ముస్లింల అక్షరాస్యత 2011లో 34.7 శాతానికి మాత్రమే చేరగలిగింది.

నేపాల్లో పహాడీ బ్రాహ్మణులు ఎక్కువగా విద్యావంతులుగా ఉన్నారు. నేపాల్ మొత్తం జనాభాలో వీరిది 12.91 శాతం. వారి అక్షరాస్యత శాతం 74.90.

నేపాల్ ముస్లింలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడతారు.

యూఎన్‌డీపీ 2009 లెక్కల ప్రకారం నేపాల్‌లో తలసరి నెల ఆదాయం 15 వేల నేపాలీ రూపాయలు. కానీ దేశంలో ముస్లింల నెలసరి ఆదాయం 10 వేల నేపాలీ రూపాయలు. అందుకే నేపాల్ ముస్లింలు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుంటారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What are the conditions of Nepalese Muslims at present and how do they live with the majority Hindus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X