• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్-19: గర్భం ధరించిన మహిళలు వ్యాక్సీన్ తీసుకోవడంలో సమస్యలేంటి?

By BBC News తెలుగు
|

దిల్లీలో రైల్వే స్టేషన్‌లో గర్భవతి

జాగృతి ఈదెల వయసు 29 ఏళ్లు. గర్భవతి అయినట్లు తెలియగానే ఆమె తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. త్వరలో బిడ్డ పుట్టబోతున్నందుకు ఆనందంగా గడిపారు. దేశంలో కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పడుతున్న సమయం అది.

కానీ, ఒక్క నెల రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. కోవిడ్ కేసులు ఉధృతం అవ్వడం మొదలయింది.

దాంతో, జాగృతి తన గదికే పరిమితం కావల్సి వచ్చింది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా బయటకు వెళుతూ ఉండేవారు. దాంతో, ఆమె మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండేందుకు ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.

అప్పటికే భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. కానీ, గర్భవతులకు వ్యాక్సీన్ తీసుకోవడానికి ఆమోదం లభించకపోవడంతో జాగృతికి వ్యాక్సీన్ తీసుకునే అవకాశం లేదు.

ఇటీవల ప్రభుత్వం పాలిచ్చే తల్లులు వ్యాక్సీన్ తీసుకోవచ్చని ఆమోదం తెలిపినప్పటికీ, గర్భవతులు విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇది గర్భం దాల్చిన మహిళలను ఆందోళనలోకి నెట్టేసింది.

"నాకు నవంబరులో కోవిడ్ సోకి, యాంటీ బాడీలు తయారయ్యాయి. కానీ, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. నాకు చాలా కంగారుగా అనిపించింది. నాకు తెలిసిన ఒకామెకు 9 నెలల గర్భంతో ఉండగా కరోనా సోకింది. ఆ బిడ్డ సిజేరియన్ ద్వారా పుట్టింది. తల్లి మాత్రం వెంటిలేటర్ పైకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె బ్రతికారు. కానీ, అలాంటి సంఘటనలు వింటున్నప్పుడు చాలా భయపెడుతూ ఉంటాయి" అని జాగృతి చెప్పారు.

ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చాలా హృదయ విదారకమైన కథలు కూడా ఉన్నాయి. దిల్లీలో ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చిన రెండు వారాల తర్వాత చనిపోయారు. ఆమె 35 సంవత్సరాల భర్త మాట్లాడుతూ ఈ విషయం తనకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు.

భార్య లేకుండా ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలో ఆయనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఆయనకు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.

"కరోనాను తేలికగా తీసుకోవద్దు" అని ఒక కోవిడ్ సోకిన డాక్టర్ చనిపోయే ముందు వీడియోలో చెప్పారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టం మీద మాట్లాడారు. ఆమె మరణించే సమయానికి 7 నెలల గర్భవతి. అంతకు ముందు రోజే ఆమె కడుపులోని బిడ్డ కూడా చనిపోయింది.

సాధారణ మహిళల కంటే, గర్భం దాల్చిన వారికి కోవిడ్ సోకితే ముప్పు ఎక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అలాంటి వారు ఐసీయూలో చేరే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపాయి. అంతే కాకుండా, అలాంటి వారికి ఇన్వేసివ్ వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.

కోవిడ్-19కి బలైపోయిన కుటుంబ సభ్యుని కోసం విలపిస్తున్న మహిళ

వ్యాక్సీన్ వారిని రక్షించగలిగి ఉండేదా?

ప్రెగ్నెన్సీలో ప్రమాదకరమైన సమస్యలు తలెత్తి, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశం ఉంటోందని కూడా చెబుతున్నారు.

కోవిడ్ సోకి భారతదేశంలో కొన్ని వందల మంది గర్భిణులు మరణించారు కానీ, దీనిని ధ్రువీకరించడానికి అధికారిక సమాచారం లేదు. పర్యవేక్షణ లోపం, పరీక్షలు చేయడంలో ఆలస్యం, అత్యవసర వైద్య సదుపాయాల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

"నా దృష్టిలో వ్యాక్సీన్లను చాలా త్వరగా అభివృద్ధి చేశారు. కానీ, వాటిని గర్భిణులకు ఇవ్వడం సురక్షితమే అని నిర్ధరించడానికి సాధారణంగా 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం తప్పు జరగకుండా చూసేందుకు జాప్యం చేస్తోంది. కొన్ని లక్షల మంది గర్భిణుల గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ప్రభుత్వం నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం" అని దిల్లీలోని ఫోర్టిస్ లా ఫెమ్ హాస్పిటల్‌లో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షి అహూజా అన్నారు.

గర్భం దాల్చిన మహిళలు వారి డాక్టర్లను సంప్రదించి వ్యాక్సీన్ల గురించి నిర్ణయం తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజిస్ట్స్ సూచించింది.

"సాధారణంగా గర్భం దాల్చిన సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది" అని డాక్టర్ అహూజా చెప్పారు. ముఖ్యంగా మూడవ దశలో గర్భం ఉన్నవారికి ఈ వైరస్ వల్ల మరింత ముప్పు ఉందని అన్నారు.

"పెరుగుతున్న గర్భ సంచి డయాఫ్రమ్‌కు వ్యతిరేకంగా ఒత్తిడి పెంచి, ఊపిరితిత్తులను కుంచించేలా చేస్తుంది. దాంతో, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది" అని ఆమె చెప్పారు.

"అందుకే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి నెలలు నిండకపోయినా సరే, ముందు డెలివెరీ చేసి బిడ్డను తీసేందుకు చూస్తాం" అని చెప్పారు. అందువల్లే పసిపిల్లల మరణాల్లో కూడా పెరుగుదల కనిపించిందని అన్నారు.

వ్యాక్సీన్ వేయించుకునేందుకు ఎదురు చూస్తున్న వ్యక్తులు

ప్రసవం చేయడం కూడా సమస్యే...

"సాధారణ ప్రసవంలో మహిళ నిలువుగా వెన్ను మీద పడుకోవాలి. ఆలా చేయడం వల్ల డయాఫ్రమ్ , ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో, ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయే ప్రమాదం ఉంది" అని దిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్‌లో ఆబ్స్‌‌టేట్రీషియన్ రూమా సాత్విక్ చెప్పారు.

"తొలి వేవ్ లో ఒక్క మరణం కూడా చూడలేదు. కానీ, ఈ సారి పరిస్థితి దారుణంగా ఉంది" అని అన్నారు.

వ్యాక్సీన్ గురించి సరైన సమాచారం అధ్యయనాలు లేకుండా తన దగ్గరకు వచ్చే గర్భిణీలకు వ్యాక్సిన్లను సూచించడం పట్ల పూర్తిగా స్పష్టత లేదని డాక్టర్ సాత్విక్ అన్నారు.

భారతదేశంలో ఇస్తున్న కోవిషీల్డ్, కోవ్యాక్సీన్‌లను గర్భవతులపై పరీక్షలు జరపలేదు.

గత నెలలో బ్రెజిల్‌లో కోవిషీల్డ్ తీసుకున్న ఒక గర్భిణీ మరణించడంతో గర్భిణులకు ఆ వ్యాక్సీన్ ఇవ్వడాన్ని సస్పెండ్ చేసింది.

ఈ వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయని నివేదికలు రావడంతో చాలా దేశాలు ఈ వ్యాక్సీన్ ఇవ్వడాన్ని నిలిపేశాయి

"గర్భిణులకు రక్తంలో గడ్డలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాక్సీన్ తీసుకోమని చెప్పడానికి గైనకాలజిస్టులు భయపడుతున్నారు" అని డాక్టర్ అహూజా అన్నారు.

అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాలలో గర్భిణులకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సీన్లను ఇస్తున్నారు. ఈ రెండూ సురక్షితమని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

ఇజ్రాయెల్‌లో వ్యాక్సీన్ తీసుకుంటున్న గర్భిణీ

కానీ, భారతదేశంలో గర్భిణుల కోసం ప్రత్యేకమైన వ్యాక్సినేషన్ వ్యూహం ఏమి లేదని విమర్శకులు అంటున్నారు.

పెద్ద పెద్ద నగరాల్లో కొన్ని ఆసుపత్రుల్లో మాత్రం గర్భిణులకు కోవిడ్ పాజిటివ్ సోకితే చేర్చుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల సంఖ్యలో పెరుగుతున్న గర్భిణులకు వ్యాక్సినేషన్ ఇచ్చే విషయంలో ప్రాధాన్యం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయింది. వారిని అధిక ముప్పు ఉన్న వర్గాల్లో చేర్చలేదు.

ప్రస్తుతం వ్యాక్సినేషన్ విషయంలో జరుగుతున్న జాప్యం చూస్తుంటే, వీరింకా ముప్పులోనే ఉన్నారని అనిపిస్తోందని డాక్టర్లు అంటున్నారు.

వ్యాక్సీన్ కొనుక్కుని వేయించుకోగలిగే వారు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. దిల్లీలో ఒక కుటుంబం వ్యాక్సీన్ వేయించుకోవడం కోసం అమెరికా వెళ్లి వచ్చారు. వారితో బీబీసీ మాట్లాడింది.

"నిజం చెప్పాలంటే, గర్భిణులకు, బాలింతలకు రక్షణ లేదు" అని 29 సంవత్సరాల అవని రెడ్డి అన్నారు. 4

ఆమెతో పాటు, ఆమె నాలుగు నెలల బిడ్డకు కూడా ఏప్రిల్ లో కోవిడ్ సోకింది. వారికి తేలికపాటి లక్షణాలు సోకిన తర్వాత రోగం నుంచి బయటపడ్డారు. కానీ, ఆమెకు కేవలం పెయిన్ కిల్లర్స్ మాత్రమే చికిత్సలో భాగంగా ఇచ్చినట్లు చెప్పారు.

"ఇన్ఫెక్షన్ తేలికపాటిదే కావడం నా అదృష్టం. నాకు ఇన్ఫెక్షన్ తీవ్రంగా వస్తే పరిస్థితి ఏమిటి" అని ఆమె ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What are the problems involved for a pregnant woman to take vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X