• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పంటల బీమా కోసం ఏయే పథకాలు ఉన్నాయి? రైతులకు అవి ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయి?

By BBC News తెలుగు
|

ఇటీవల భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో కైకరం వద్ద పీకల్లోతు నీళ్లలో రైతులు

ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా వరదలు, తుపాన్లు రైతులను నష్టాల పాలుజేస్తున్నాయి. అంతకుముందు కొన్నేళ్ల పాటు అనావృష్టిని చూస్తూ వచ్చిన రైతులు ఈ రెండేళ్లలో అతివృష్టిని ఎదుర్కొన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ వరకూ ఉన్న సమాచారం గమనిస్తే, రాష్ట్రంలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే లోటు వర్షపాతం నమోదయ్యింది. విజయనగరం, విశాఖ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురవగా, మిగిలిన 10 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో సగటు వర్షపాతం 832.5 మి.మీ.లు కాగా, ఈసారి అంతకన్నా ఏకంగా 27.2 శాతం అధికంగా, 1,059 మి.మీ.ల వర్షపాతం రికార్డయ్యింది. ఫలితంగా దాదాపుగా అన్ని ప్రధాన పంటలు పండించే రైతులకు నష్టం వాటిల్లింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రైతులు ఎక్కువ పంట నష్టపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లో 215.5 కోట్ల సర్వే నెంబర్లలో పంటల సాగు జరుగుతోంది. వరి, పత్తి, మిరప, అరటి, పసుపు, అపరాలు సహా వివిధ పంటల సాగు విస్తృతంగా సాగుతోంది.

తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో, ఏటా వివిధ విపత్తులు రైతులను ఇక్కట్ల పాలుజేస్తున్నాయి. పంట చేతికందే వేళ వర్షాలు, వరదలు వచ్చి, రైతులు అప్పుల పాలవుతున్నారు.

పంటల బీమా

పంట బీమా పథకాలు...

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతుల కోసం రెండు రకాల బీమా పథకాలు అమలులో ఉన్నాయి. అందులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమైంది. ఈ పథకంలో భాగంగా 7 రకాల పంటలకు బీమా అమలులో ఉంది. ఇందులో గ్రామాన్ని యూనిట్‌గా పరిగణిస్తున్నారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను 2016-17 ఖరీఫ్ నుంచి అమలు చేస్తున్నారు. ఈ పథకంంలో రైతు వాటాతో పాటుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా ఇన్సూరెన్స్ ప్రీమియం వాటా చెల్లిస్తాయి.

తొలి ఏడాది 17.79 లక్షల మంది రైతులకు ఈ పథకం అమలు కాగా, 2019-20లో 58.77 లక్షల మందికి చెందిన 56.82 లక్షల హెక్టార్లలో పథకం అమలు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 37,727 కోట్ల రూపాయలు విలువ చేసే ఇన్సూరెన్స్ కోసం తమ వాటాగా 1030.74 కోట్లు వెచ్చించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

ఇక క్లయిమ్స్ సంగతికి వస్తే రూ. 94.03 కోట్లకు గానూ ఇంకా రూ. 24.83 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ వ్యవసాయ శాఖ వెబ్‌సైట్ చెబుతోంది.

అమలు ఇలా...

1. పంట సాగు చేసే వారు తమ వివరాలు ఆ పంట కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో రైతు భరోసా కేంద్రాలు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ కేంద్రాల్లో ఉండే వ్యవసాయ అసిస్టెంట్లను సంప్రదించాలి. ఈ పంట కింద నమోదయిన వారి వివరాలను బీమా అమలు కోసం కూడా వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

2. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పేరుతో ప్రాంతాల వారీగా పంటలకు బీమా వర్తింపజేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక ప్రధాన పంటకు గ్రామాన్ని ఒక యూనిట్‌గా నిర్ధారిస్తారు.

3. వెబ్ ల్యాండ్‌లో నమోదు కాని వారు కూడా ఈ పంటలో ఈకర్షక్ యాప్‌లో కూడా ఇన్సూరెన్స్ కోసం పంటల వివరాలు నమోదు చేస్తారు. పంట, రైతు ఫోటోలను సేకరించిన వ్యవసాయ అసిస్టెంట్ ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. పంట వివరాలు, సర్వే నెంబర్ నమోదు సక్రమంగా జరగాలి.

4. ఏపీలో రైతులకు పొలం వద్దనే ఈ ప్రక్రియ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పంట నమోదు, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పన ఏకకాలంలో చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక్క రూపాయితో ఈ బీమా వర్తిస్తుంది. గతంలో పంట వ్యయంలో ఖరీఫ్ సాగుకు 2 శాతం, రబీ పంటకు 1.5 శాతం చొప్పున చెల్లించాల్సి ఉండేది. కానీ, ఏపీ ప్రభుత్వం దానిని ఉచితంగా అమలు చేస్తోంది. వాణిజ్య, ఉద్యాన పంటలకు రైతులు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

5. పంటల వారీగా బీమా ప్రీమియం చెల్లింపు సమయం ఉంటుంది. ఇవి సీజన్ల వారీగా ఉంటాయి.

6. ఈ పథకంలో చేరాలనుకునే వారు విత్తనం వేసిన 10 రోజుల్లో సంబంధిత వ్యవసాయ అసిస్టెంట్‌ని కలిసి ఫసల్ బీమా యోజన దరఖాస్తు కోరాలి. దానికి సంబంధించిన భూమి పత్రాలు, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు అందించాలి.

7. పీఎంఎఫ్ బివై వెబ్‌సైట్‌లో కూడా రైతులు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గుర్తింపు కార్డు, చిరునామా సంబంధిత పత్రం, పట్టాదారు పాసు పుస్తకం అప్‌లోడ్ చేసి ప్రీమియం చెల్లించి పంటల బీమా సదుపాయం పొందవచ్చు.

8. బ్యాంకు ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి ప్రీమియం అందులో భాగంగానే తీసుకుంటున్నారు.

నష్టపరిహారం పొందే ప్రక్రియ

1. వర్షాలు, వరదలు, వడగళ్ళు లేదా వర్షాభావం కారణంగా పంట నష్టపోయిన నేపథ్యంలో 72 గంటల్లో క్లయిమ్ చేయాలి. పంట నష్టానికి పరిహారం, బీమా కూడా రైతుకు చేరుతుంది. విత్తనం నుంచి కోత దశ వరకూ ఏ సందర్భంలో నష్టం వాటిల్లినా ఇది వర్తిస్తుంది.

2. పంట నష్టం జరిగినట్టు నిర్ధారణ అయిన తర్వాత బీమా మొత్తంలో 25 శాతం రైతుల ఖాతాలో జమ చేస్తారు. 14 రోజుల్లోగా మిగిలిన బీమా మొత్తం చెల్లిస్తారు.

3. పంట నష్టపరిహారం దక్కుతుందనే విషయం తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది క్లయిమ్ చేసుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తమ ప్రాంతం ఏ సాధారణ బీమా కిందకు వస్తుందనేది తెలుసుకోవాలి. తమ పంట బీమా పరిధిలోకి వస్తుందా లేదా అన్నది గుర్తించాలి. అందుకోసం బ్యాంకు సిబ్బందిని సంప్రదించాలి. బ్యాంకులో రుణం తీసుకోని వారు బీమా కంపెనీ నిర్దేశించిన సంస్థను లేదా గ్రామంలో ఆర్బీకే వ్యవసాయ అసిస్టెంట్‌ను సంప్రదించాలి.

4. పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్, వ్యవసాయ శాఖ విత్తన పత్రం వంటి వాటి ఆధారంగా క్లయిమ్ జరుగుతుంది. వాటిని సమర్పించి ఆర్బీకే వ్యవసాయ అసిస్టెంట్ సహాయంతో బీమా పొందే అవకాశం ఉంటుంది.

వర్షాధార పంటల కోసం మరో బీమా పథకం

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కూడా అందుబాటులో ఉంది. మిర్చి, పత్తి, టమోటా, బత్తాయి పంటలకు ఇది వర్తిస్తుంది.

ఫసల్ బీమా యోజన పథకం కింద లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీలో రైతు వాటా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే సకాలంలో చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే కేంద్రం కూడా తమ వాటా చెల్లించే అవకాశం ఉండదు. సకాలంలో చెల్లించనప్పుడు పంట నష్టం జరిగితే పరిహారం రైతులకు అందదు.

పంటల బీమా

ప్రీమియం చెల్లింపుపై అసెంబ్లీలో రచ్చ..

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఇటీవల అధికార, ప్రతిపక్షాల మధ్య ఇన్సూరెన్స్ వాటా చెల్లింపు విషయంపై దుమారం రేగింది. ఖరీఫ్‌లో పంటలకు ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన ప్రీమియం కింద రూ. 590 కోట్లను ఏపీ ప్రభుత్వం ఈనెల 2న విడుదల చేసింది. అంతకుముందు రోజు ప్రభుత్వాన్ని టీడీపీ సభ్యులు నిలదీశారు.

ఆ సందర్భంగా విపక్షం వాదనను ప్రభుత్వం తరుపున వ్యవసాయ మంత్రి కె కన్నబాబు తదితరులు తిప్పికొట్టారు.

''గతంలో రైతుల వాటా కింద ఏటా వందల కోట్లు రైతులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ క్రాప్ లో నమోదయితే చాలు ఇన్సూరెన్స్ అమలు జరిగేలా మార్పులు చేశాం. ప్రస్తుతం ప్రీమియం కన్నా క్లయిమ్స్ తక్కువగా ఉంటున్నాయని మా దృష్టికి వచ్చింది. అందుకే ఏపీ ప్రభుత్వమే ఓ ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేస్తుంది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. అంగీకరించగానే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

తాజాగా ఏపీలో వరదలు, తుఫాన్ల మూలంగా నష్టపోయిన రైతులకు ఈ నెల 15న ఇన్సూరెన్సు క్లయిమ్స్ చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ప్రతిపక్షంగా తాము ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం పంట బీమా ప్రీమియం చెల్లింపు విషయమై స్పందించిందని విపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

''నివర్ తుఫాన్ రైతుని ముంచింది. అయినా ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. మేము శాసనసభలో నిలదీశాకే కళ్లు తెరిచారు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Crop insurance schemes useful for farmers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X