• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ANI

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే రెండవ వేవ్‌తో పోలిస్తే ఆసుపత్రుల్లో చేరికల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది.

కానీ కేసుల సంఖ్య పెరిగితే, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువ కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కోవిడ్ పరిస్థితిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సోమవారం వేర్వేరుగా సమీక్షలు జరిపారు. కోవిడ్ వ్యాప్తి కట్టడికి కొన్ని చర్యలు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి 16వ తేదీన 22వేల 882 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 4 వేల 108 మందికి పాజిటివ్ వచ్చింది.

ఇందులో చిత్తూరు, విశాఖ కేసులే సగం ఉన్నాయి. చిత్తూరు జిల్లా నుంచి ఆ ఒక్క రోజే 1,004 కేసులు పాజిటివ్ రాగా, విశాఖ నుంచి 1,018 కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో 30వేల 182 పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు.

అయితే కోవిడ్ కేసులు పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం ఏపీలో కోవిడ్ కోసం 53,184 పడకలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటికి అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లలో 28 వేల పడకలు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.

సోమవారం నాటికి మొత్తం 27 వేల యాక్టివ్ కేసులు ఉండగా వాటిలో 1100 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, వారిలో 600 మందికి ఆక్సిజన్ అవసరం పడిందని ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే ఆసుపత్రిలో చికిత్స సమయం కూడా రెండు వారాల నుంచి వారానికి తగ్గినట్టు ఏపీ అధికారులు చెబుతున్నారు.

ఈనెల 18 నుంచి ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ముందుగా జనవరి 31 వరకూ కర్ఫ్యూ ప్రకటించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది.

మాస్కులు ధరించని వారికి వంద రూపాయల జరిమానా వేయనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200, ఇండోర్లో 100 మందితోనే పండుగలు, కార్యక్రమాలు జరుపుకోవలసి ఉంటుంది.

కరోనా

థియేటర్లలో 50 శాతం నిబంధన అమల్లోకి వచ్చింది. వాణిజ్య ప్రదేశాల్లో మాస్కు లేకపోతే యాజమాన్యానికి జరిమానా వేస్తారు.

వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలని ఏపీ నిర్ణయించింది. వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చే ప్రికాషన్ డోస్ వ్యవధి ప్రస్తుతం 6-9 నెలలుండగా, దాన్ని 3-4 నెలలకు తగ్గించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాయనుంది.

ఐదు జిల్లాల్లో రెండో దశ వ్యాక్సినేషన్ తక్కువగా ఉందని, అక్కడ ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే 15-18 ఏళ్ల మధ్య వారికి వాక్సినేషన్ వేగవంతం చేయనున్నట్టు ప్రకటించింది.

104 ద్వారా ఇచ్చే టెలీ మెడిసిన్ కూడా వేగవంతం చేయాలని జగన్ ఆదేశించారు.

తెలంగాణ

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో సోమవారం ఒక్కరోజు సాయంత్రం 5.30 వరకూ 80,138 శాంపిళ్లను పరీక్షించగా 2,447 కేసులు పాజిటివ్ వచ్చాయి. 3 మరణాలు నమోదయ్యాయి.

ఇంకా 10 వేల 732 రిపోర్టులు రావాల్సి ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,132 కేసులు నమోదయ్యాయి.

ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1346 ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందిస్తుండగా, వాటిలో మొత్తం 56,326 పడకలు ఉన్నాయి.

ఇందులో ప్రస్తుతం 2,366 పడకలు బాధితులతో నిండి ఉండగా, 53,960 పడకలు అందుబాటులో ఉన్నట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణలోని మొత్తం 27,996 ప్రభుత్వ పడకల్లో 25,390 పడకలను ఆక్సీజన్ బెడ్లుగా మార్చారు. కేంద్రం నిధుల నుంచి 50, కార్పొరేట్ నిధులతో 26 ఆక్సీజన్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

ఇక ప్రైవేటు రంగంలో 39 ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో కరోనా పరిస్థితిపై హైకోర్టు విచారణ చేసింది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలిచ్చింది. రోజుకు లక్ష పరీక్షలు చేయాలని చెప్పింది.

ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ ఫలితాలు వేర్వేరుగా ఇవ్వాలని కూడా ఆదేశించింది. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించింది.

అయితే ప్రస్తుతం కోవిడ్‌ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్ ప్రకటించింది. కోవిడ్‌ పాజిటివ్‌ తేలినవారి కాంటాక్ట్స్‌లో కేవలం హైరిస్క్‌ ఉన్నవారికే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ సూచించింది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే కేసులు పెరిగి ఎటువంటి పరిస్థితి ఎదుర్కునేందుకు అయినా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. వైద్య శాఖతో పాటూ వివిధ శాఖలను సమన్వయం చేసి వేగంగా టీకాలు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

అయితే తెలంగాణ కోవిడ్ ఆంక్షలపై ఇంకా ఏ అధికారిక సమాచారమూ లేదు.

కోవిడ్

రెండు రాష్ట్రాల్లోనూ వివిధ విద్యా సంస్థలు, ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేస్తున్నప్పుడు పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. సోమవారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బందీ కలపి 120 మందికి కరోనా సోకింది.

ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో 35 మంది గర్భిణులు సహా, 139 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఎర్రగడ్డ హాస్పిటల్‌లో 57 మంది ఇన్‌పేషెంట్లకు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.

ఇక కడప రిమ్స్‌లో 50 మందికి కరోనా సోకింది.

కరోనా

ఆంక్షలు – సెలవులు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలు విధించారు. గుళ్లల్లో దర్శన సమయాలు, పూజలకు వచ్చే వారి సంఖ్యలపై పరిమితి విధించారు.

తెలంగాణ పాఠశాలలకు జనవరి 30వరకూ సెలవులు పొడగించారు. అయితే ఆంధ్రలో మాత్రం పొడిగించలేదు. తెలుగుదేశం, జనసేన పార్టీలు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

అయితే వ్యాక్సినేషన్ పూర్తయినందున సెలవులు ఇవ్వబోవడం లేదని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

దేశమంతా ఇదే పరిస్థితి

దేశవ్యాప్తంగా ఆదివారం 2 లక్షల 58 వేల 89 కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 19.65 శాతం ఉంది. వాటిలో జీనోమ్ సీక్వెన్స్ పరిశీలనలో 8 వేల 209 కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కింద నమోదయ్యాయి.

ఇండియాలో జనవరి 23 పీక్ దశగా ఉండి రోజుకు 4 లక్షల కేసులు వస్తాయని కాన్పూర్ ఐఐటి ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ప్రకటించారు. ఆయన కరోనా లెక్కలపై పరిశోధన చేస్తున్నారు.

https://twitter.com/agrawalmanindra/status/1482787349407088641

ఇక ఏపీలో పీక్ జనవరి 30కి వస్తుందని ఆయన అంచానా వేశారు.

https://twitter.com/agrawalmanindra/status/1482787336899674112

అయితే రెండవ వేవ్ సమయంలో ఆసుపత్రుల్లో చేరే వారి శాతం 20-30 వరకూ ఉండగా, అదిప్పుడు 5-10 శాతం వరకే ఉంటోంది.

ప్రస్తుతం పాజిటివిటీ రేట్ దిల్లీ, ముంబై, బెంగళూరులతో పోలిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చాలా తక్కువగా ఉంది.

కానీ శాస్త్రవేత్తలు అంచనా వేసినట్టు మూడవ లేదా చివరి వారంలో పీక్ వచ్చినప్పుడు ఎంత పాజిటివిటీ శాతం ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టమైన అంచనా లేదు.

అదే సందర్భంలో ఆసుపత్రుల్లో చేరే వారి శాతం తక్కువ ఉన్నప్పటికీ రెండవ వేవ్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ సంఖ్యలో కేసులు వస్తాయి కాబట్టి, శాతం తగ్గినా సంఖ్య పెరుగుతుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలాకులు డా. శ్రీనివాస రావు గతంలో విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో వనరుల కొరత ఉండే అవకాశం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What are the steps being taken to control the rising number of Covid cases in AP and Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X