సంపదలో క్షీణత: టాప్-10 భారతీయ సంపన్నులకేమైంది?
న్యూఢిల్లీ: భారత కుబేరుల సంపద కరిగిపోతోందా? అంటే అవుననే అంటోంది తాజా నివేదిక. హురున్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 ప్రకారం.. అత్యంత సంపన్నులైన భారతీయుల సంపద గత ఏడాది 11శాతం క్షీణించింది.

క్షీణించిన సంపద
ఒక వేళ ప్రస్తుత సంవత్సరం సంపదను మినహాయించినట్లైతే.. రూ. 3,72,800 కోట్ల సంపద క్షీణించిందని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా లిస్ట్ 2019 వెల్లడించింది. రిచ్ లిస్ట్ ప్రకారం.. 344 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ ఏడాది తమ సంపదలో క్షీణతను ఎదుర్కొన్నారు. ఇక మరో 112 మంది రూ. 1000 కోట్ల మార్కును అందుకోలేకపోయారు. ఇది గత ఏడాది సంపదలో సగమే కావడం గమనార్హం.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ఎవరు చేరారు?
ఈ ఏడాది 41 ఇండస్ట్రీస్‌కు సంబంధించిన 953 మంది సంపన్నుల డేటాను హురున్ ఇండియా రిచ్ లిస్ట్ సేకరించింది. రూ. 1000 కోట్లను కనీస కట్ ఆఫ్‌గా పెట్టుకుంది. ఈ సంవత్సరం 15శాతం లిస్ట్ పెరిగింది. గత సంవత్సరంతో పోల్చితే ఆ కట్ ఆఫ్ మార్కుకు దిగువన మరో 122 మంది చేరారు. ఇక 2016 జాబితాతో పోల్చుకుంటే ఆ సంఖ్య 181శాతం పెరిగింది.

ప్రస్తుతం సంపన్న భారతీయుడు ఎవరు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 62ఏళ్ల ముకేష్ అంబానీ రూ. 3,80,700 కోట్ల సంపదతో భారతీయ కుబేరుడిగా మొదటి స్థానంలో ఉన్నారు. ఇది ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన చారిత్రాత్మక డివిడెండ్‌కు 2.2సార్లు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కార్పొరేట్ టాక్స్ కు 2.6రేట్లకు సమంగా ఉంది. గత సంవత్సరం అంబానీ సంపద కేవలం 3శాతం మాత్రమే పెరిగింది. ఇక గౌతమ్ అదానీ, అతని కుటుంబం సంపద మాత్రం రికార్డు స్థాయిలో 33శాతం పెరిగిపోయింది.

టాప్-10 సంపన్నులు..
విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, కోటక్ మహీంద్ర అధినేత ఉదయ్ కోటక్, సిరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిరస్ పూనవాలాలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టాప్-10 సంపన్నుల జాబితాలో సన్ ఫార్మసూటికల్స్ దిలీప్ షంఘ్వీ సంపద 20శాతం క్షీణించింది. అర్సెలర్ మిట్టల్ అధినేత ఎల్ఎన్ మిట్టల్ సంపద కూడా క్షీణించడంతో టాప్ 10 సంపద క్షీణత జాబితాలో నిలిచారు.