వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలను కేంద్రం ఏం చేయబోతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నెట్ ఫ్లిక్స్

ఆన్‌లైన్‌ ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్‌ న్యూస్‌ వెబ్‌సైట్లను తన ఆధీనంలోని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

'ఆన్‌లైన్‌లో సినిమాలు అందించే కంటెంట్ ప్రొవైడర్లు’, 'న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్‌ కంటెంట్ అందించే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు' అనే పదాలను చేర్చడానికి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా(బిజినెస్‌ ఎలొకేషన్‌)రూల్స్‌-1961 నిబంధనలను సవరిస్తూ నవంబర్ 9న కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.

ఈ గెజిట్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతోపాటు డిజిటల్‌ న్యూస్ మీడియాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఇది ఆన్‌లైన్‌ ఓటీటీ ప్లాట్‌మ్‌లు, డిజిటల్‌ వార్తల ప్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వ నియంత్రణకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతోపాటు అనేక డిజిటల్ వార్తల వెబ్‌సైట్లపై దీని ప్రభావం ప్రత్యక్షంగా ఉండబోతుందన్నది వారి అంచనా.

అయితే సెన్సర్‌షిప్‌పై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ప్రింట్‌ మీడియాను ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, వార్తా ఛానెళ్లను న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) పర్యవేక్షిస్తున్నాయి.

ప్రకటనలను అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సినిమాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సి) నియంత్రిస్తుంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించే సంస్థ ఇప్పటి వరకు లేదు.

ప్రభుత్వం అదుపు చేస్తుందా?

అయితే డిజిటల్‌ సైట్‌లపై నియంత్రణ సమస్య కాదుగానీ, ఈ నియంత్రణ ఎలా ఉండబోతుందనే దానిపై ఈ రంగంలో ఉన్నవారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

“ సూత్రప్రాయంగా, డిజిటల్‌ న్యూస్ సైట్‌లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకురావడంలో సమస్య లేదు. కానీ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, ఈ నిర్ణయానికి దారి తీసిన సంఘటనల క్రమం” అని 'ది న్యూస్ మినిట్’ ఎడిటర్-ఇన్-చీఫ్‌ ధన్యా రాజేంద్రన్‌ బీబీసీతో అన్నారు.

“ ప్రభుత్వ విధానాల రూపకల్పనను విడిగా చూడకూడదు. డిజిటల్‌ మాధ్యమాన్ని నియంత్రించే ఆలోచన ఉందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలుపుతూనే ఇటీవల డిజిటల్‌లో ఎఫ్‌డీఐ నియంత్రణ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు విధానాల రూపకల్పనలో ముందు భాగస్వాములతో చర్చిస్తారని ఆశిస్తున్నాను. భారతదేశంలో నమోదు చేసుకున్న సంస్థలతోపాటు ఇతర దేశాల నుంచి ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థలపై కూడా ఆంక్షలు ఉండవచ్చు. కొత్త చట్టాల రూపకల్పన నియంత్రణ,ఆంక్షల దిశలో కాకుండా డిజిటల్ పరిశ్రమ వృద్ధి దిశగా ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు ధన్యా రాజేంద్రన్‌.

ఈ అంశంపై ఇండియన్‌ డిజిటల్‌ లిబర్టీస్‌ సంస్థ ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్ ఒక ప్రకటన జారీ చేసింది.

“రాబోయే నియంత్రణ ఎలా ఉంటుందో స్పష్టత లేదు. ప్రస్తుతం మన ముందున్న సవాలు ప్రభుత్వం తీసుకోబోయే చట్టపరమైన చర్యలు నియంత్రణకు దారి తీస్తుందా లేక ఫేక్‌ న్యుస్ సమస్య పరిష్కారం పేరుతో మరింత ప్రభుత్వ నియంత్రణకు దారితీయవచ్చా? ’’ అని ఆ ప్రకటనలో సందేహాలు వ్యక్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నిర్వహిస్తున్న సంస్థల అభిప్రాయం తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నం చేసింది.

“కేంద్రప్రభుత్వ ఆలోచనేంటో తెలియదు. కానీ సెన్సర్‌ బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే మాత్రం అది ప్రమాదకర సూచనే.

అలా చేస్తారని నేను అనుకోను. ఓటీటీలు ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చాయి. అడల్ట్‌ కంటెంట్ విషయంలో కొన్ని పరిమితులను తీసుకురావచ్చని అనుకుంటున్నాను.

ఈ విషయంలో కేంద్రం పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి నియమ నిబంధనలను రూపొందించే ముందు మాలాంటి ఓటీటీ యాజమాన్యాలతో కూడా చర్చిస్తారని అనుకుంటున్నాను” అని 'ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కంటెంట్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ అల్లు అరవింద్ బీబీసీతో అన్నారు.

“నియంత్రణ అనేది ఒక సవాల్. కేబుల్‌ టీవీ చట్టానికి జతగా 2000 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాన్ని చూస్తే నియంత్రణ అన్నది సాధ్యమే. కానీ ఇంటర్నెట్‌లో కంటెంట్‌ను ఎలా నియంత్రిస్తారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఈ చట్టాన్ని ఎలా రూపొందిస్తారో వేచి చూడాలి” అని మీడియా లాస్ ప్రొఫెసర్ మాఢభూషి శ్రీధరాచార్యులు బీబీసీతో అన్నారు.

గెజిట్‌ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది?

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించడానికి ఒక సంస్థను నియమించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. ఈ పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది శశాంక్ శేఖర్ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఎవరి నియంత్రణా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతకు ముందు సుదర్శన్‌ న్యూస్‌ ప్రోగ్రాం 'యూపీఎస్సీ జిహాద్’కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీనికి సంబంధించి సెప్టెంబర్‌లో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

“తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న డిజిటల్‌ వార్తలను కూడా నిబంధనల పరిధిలోకి తీసుకు రావాలి. ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియాకు సంబంధించి ఇప్పటికే చట్టపరమైన ఒక వ్యవస్థ ఉంది. డిజిటల్‌ మీడియా విషయంలో అలాంటిది ఏదీ లేదు. కనుక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి నియంత్రణ విషయంలో తగిన కార్యాచరణ రూపొందించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి” అని కోరుతూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది .

దీనితోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను కూడా మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో చేర్చాలని కేంద్రం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది.

అయితే ఆన్‌లైన్‌ కంటెంట్‌పై నియంత్రణను ఏ మంత్రిత్వ శాఖ చేపట్టాలి అనే విషయంపై రెండేళ్లుగా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి.

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం ఆన్‌లైన్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే అంశమని కేంద్రం స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌-2000ను అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది.

అంతే కాదు, ఆన్‌లైన్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఇంటర్‌ మీడియరీస్ గైడ్ లైన్స్)-2011 నిబంధనలలో సూచించిన విధానాలకు కట్టుబడి ఉండాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (2) కు విరుద్ధంగా భావిస్తూ కంటెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు వాటిని వెంటనే తొలగించాలని ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆ సమాధానంలో తెలిపింది.

2018 ఏప్రిల్‌లో ఫేక్‌న్యూస్‌ను వ్యాప్తి చేసినట్టు గుర్తిస్తే, ఆ జర్నలిస్టుల అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ 24 గంటల్లోనే ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది.

2018 ఏప్రిల్ 4న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ కంటెంట్‌ రెగ్యులేషన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే 2018 డిసెంబర్‌లో కమిటీని రద్దు చేసినట్టు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం వెల్లడించింది.

ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారమయ్యే కంటెంట్‌ను నియంత్రించడంలో మార్గదర్శకాలను కోరుతూ 2018 అక్టోబర్‌లో దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి కోర్టు స్పందన కోరింది.

“ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లకు సమాచార మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి లైసెన్స్ పొందవలసిన అవసరం లేదు” అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్‌లో కోర్టుకు తెలిపింది.

ఇంటర్నెట్‌లో వచ్చే కంటెంట్‌ను తాము నియంత్రించలేమని, ఇంటర్నెట్‌లో కంటెంట్‌ను ఉంచే విషయంలోనూ, అలాగే ఓటీటీలను ఏర్పాటు చేసేందుకు లైసెన్సులు జారీ చేసే విషయంలో తమకు కూడా ఎలాంటి నియంత్రణలు లేవని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది.

స్వీయ నియంత్రణ నిబంధనలు

2019 జనవరిలో ఇంటర్నెట్ అండ్‌ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) స్వీయ నియంత్రణ పేరిట “కోడ్ ఫర్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్ ఫర్‌ ఆన్‌లైన్‌ క్యూరేటెడ్‌ కంటెంట్‌ ప్రొవైడర్స్‌” పేరిట నిబంధనలు రూపొందించుకున్నాయి. దీనిపై నెట్‌ఫ్లిక్స్‌, జీ5, ఆల్ట్‌ బాలాజీ సహా 9 ఓటీటీ సంస్థలు సంతకాలు చేశాయి.

2019 ఫిబ్రవరిలో ఈ మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది.

2019 ఆగస్టులో ప్రెస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఒక పత్రికా ప్రకటన చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సినిమాటోగ్రాఫ్ చట్టం పరిధిలో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లకు సర్టిఫికేషన్‌పై సలహాలను, సూచనలను ఆహ్వానించింది.

2019 అక్టోబర్‌లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించింది.

2020 ఫిబ్రవరి 5న ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (IAMAI) ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రొవైడర్లకు కోడ్‌ ఫర్‌ సెల్ఫ్‌ రెగ్యులేషన్‌ను ప్రకటించింది. ఈ కోడ్‌పై నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు-హాట్‌స్టార్, వూట్, జియో, సోనీలివ్‌లు సంతకాలు చేశాయి. ఈ కోడ్ కింద, ప్రభుత్వం లేదా వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు డిజిటల్‌ కంటెంట్‌ కంప్లైంట్‌ కౌన్సిల్‌ (డీసీసీసీ) స్థాపించడానికి ప్రతిపాదించారు.

ఇది ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ స్వీయ సెన్సార్‌షిప్‌కు దారి తీస్తుందని ఇంటర్నెట్‌ ఫ్రీడమ్ ఫౌండేషన్ అభిప్రాయపడింది.

అయితే, 2020 మార్చిలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రవర్తనా నియమావళి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 100 రోజుల గడువు ఖరారు చేశారు.

సెప్టెంబర్ 2020లో, 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు స్వీయ నియంత్రణ కోడ్, యూనివర్సల్ సెల్ఫ్-రెగ్యులేషన్ కోడ్‌పై సంతకం చేశాయి. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్, డిస్నీ+ హాట్‌స్టార్, జియో, ఈరోస్‌ నౌ, ఆల్ట్‌ బాలాజీ, హోయిచోయ్, హంగామా, షెమరూ, డిస్కవరీ ప్లస్, ఫ్లిక్‌స్ట్రీ, వయాకామ్‌ 18, జీ5 సంస్థలున్నాయి.

ఈ పరిణామాలు కొనసాగుతుండగానే ఓటీటీ, డిజిటల్‌ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లను తన పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించడం చర్చకు దారితీసింది.

ఈ నిబంధనలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? అసలు కేంద్రం వీటిని నియంత్రించగలుగుతుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
OTT platforms to come under I&B ministry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X