• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖలో కుక్కల పార్కుపై వివాదమేంటి? వద్దంటున్నదెవరు, కావాలనేదెవరు

By BBC News తెలుగు
|
కుక్కల కోసం థీమ్ పార్క్ ఏర్పాటు నిర్ణయం విశాఖలో వివాదాస్పదమైంది

విశాఖ స్మార్ట్ సిటీ. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు ఉండవు. మొన్నటి వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. వాటిని పట్టించుకునే నాథుడు కనిపించడు. కనీసం దోమల నివారణకు కూడా చర్యలు చేపట్టరని గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులపై విమర్శలున్నాయి.

ఇన్ని సమస్యలుండగా, కోట్ల రూపాయలు వెచ్చించి కుక్కల కోసం జీవీఎంసీ అధికారులు ఒక పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదొక థీమ్ పార్క్‌ అని, విమర్శలు చేసే వాళ్లు అపోహలు తొలగించుకోవాలని అధికారులు అంటున్నారు.

కుక్కలకు పార్కు ఎందుకు, ఎక్కడ ?

ఈ నెల 18న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధి, సౌకర్యాలు, పార్కుల నిర్మాణం తదితర 24 అంశాలు చర్చకు వచ్చాయి. అందులో థీమ్ పార్కుల నిర్మాణం కూడా ఉంది.

జీవీఎంసీ నిర్మించ తలపెట్టిన 10 థీమ్ పార్కుల్లో కుక్కల పార్కు కూడా ఉంది. ఇప్పుడు ఆ కుక్కల పార్కు వివాదంగా మారింది.

స్మార్ట్ సిటీ, స్టీల్ సిటీ, సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే పర్యాటక నగరం విశాఖకు థీమ్ పార్కులు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఈ పార్కులతో విశాఖ లుక్కే మారిపోతుందని చెప్తున్నారు.

అందుకే నగరంలో చాల పార్కులను నిర్మిస్తున్నామని...ఒక్కొ పార్కు ఒక్కో థీమ్ తో నిర్మిస్తున్నామని తెలిపారు.

ఇవి ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా విజ్ఞానదాయకంగా కూడా ఉంటాయని చెప్పారు. బటర్ ప్లై పార్కు, ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్, పంచతత్వ పార్కు, ఆయుర్వేదిక్ పార్కు, హెర్బల్ పార్కు, యోగా అండ్ మెడిటేషన్ పార్క్ వంటి పార్కులతో పాటు డాగ్ పార్క్ కూడా నిర్మిస్తున్నారు.

మిగతా పార్కుల మాటేలా ఉన్నా...విశాఖ నగరానికి శివారు ప్రాంతమైన సుజాత నగర్ లో నిర్మించ తలపెట్టిన కుక్కల పార్కు మాత్రం వివాదస్పదమైంది.

ఈ పార్కు విద్యుద్దీకరణ, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. కోటి 94 లక్షలు మంజూరుకు జీవీఎంసీ కౌన్సిల్‌లో ప్రతిపాదించారు.

జీవీఎంసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి పక్షాలు ఆందోళన నిర్వహించాయి.

కుక్కలతో కౌన్సిల్ కు వచ్చిన కార్పోరేటర్

విశాఖ నగరంలో ఎన్నో సమస్యలుండగా, రూ. 2 కోట్లతో కుక్కల పార్కు నిర్మిస్తారా అంటూ సీసీఎం, టీడీపీ కౌన్సిల్ లో నిరసన తెలిపాయి.

అంతకు ముందు 78వ వార్డు సీపీఎం కార్పొరేటర్‌ బి.గంగారావు కుక్కల మెడలో ప్లకార్డులు వేసి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయత్నించారు.

కుక్కల పార్కు వద్దు... స్కూళ్లు, ఆసుపత్రులు కట్టండి, దోమల నుంచి విశాఖను కాపాడడండి, ప్రజలపై ఇంటి, మురుగు, చెత్త పన్ను సిగ్గు సిగ్గు వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు.

"నగరంలో మౌలిక సదుపాయల గురించి పట్టించుకోకుండా కోట్ల రూపాయలతో కుక్కల పార్కు నిర్మాణాన్ని కౌన్సిల్ అజెండాలో ప్రతిపాదించడం దారుణం. నగరంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టాలి. కుక్కల కోసం తలపెట్టిన పార్కుని మనుషుల పార్కుగా మార్చాలి" అని బి. గంగారావు బీబీసీతో అన్నారు.

విశాఖ నగరంలో పలు థీమ్ పార్కులకు జీవీఎంసీ నిర్ణయించింది.

పార్కుల సిటీగా విశాఖ

విశాఖ నగర విస్తీర్ణం 626 చ.కిమీ., జనాభా 22.5 లక్షలు. స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా నగరంలో పచ్చదనం పెంచడం, థీమ్ పార్కుల నిర్మాణాలకు జీవీఎంసీ ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.

''నగరానికి అందాన్ని పెంచడంతో పాటు ఎడ్యుకేటివ్ గా ఉండే థీమ్ పార్క్ లు నిర్మించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకోసం నగరంలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలు సేకరించాం’’ అని జీవీఎంసీ కమిషనర్ జి. సృజన బీబీసీకి చెప్పారు.

"జీవీఎంసీకి చెందిన 1200 ఖాళీ స్థలాలను గుర్తించాం. 1000 చ.గజాల్లో ఉన్న స్థలాలను బ్యూటీఫీకేషన్ చేసి వాకింగ్ పార్కులుగా మారుస్తాం. అంతకంటే ఎక్కువ స్థలం ఉన్న వాటిలో 25 థీమ్ పార్కులు, కమ్యూనిటీ పార్కులు నిర్మిస్తాం. 2022 మార్చి నాటికి 10 థీమ్ పార్కులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని కమిషనర్ సృజన అన్నారు.

స్పెయిన్ లో జరిగిన 'స్మార్ట్ సిటీ ఎక్స్ పో వరల్డ్ కాంగ్రెస్-2020'కు భారత దేశం నుంచి విశాఖ మాత్రమే అర్హత పొందింది. ఇందులో సిటీ లివింగ్ అండ్ ఇన్ క్లూజివ్ అవార్డు కేటగిరిలో విశాఖ మూడో స్థానం దక్కించుకుంది.

విశాఖ నగరం ప్రపంచ దృఫ్టిని ఆకర్షిస్తున్న నేపధ్యంలో నగర సుందరీకరణపై మరింత ఫోకస్ పెంచినట్లు కమిషనర్ సృజన తెలిపారు.

జీవీఎంసీ కమిషనర్ సృజన

డాగ్స్ పార్కు కాదు...ఫ్యామిలీ పార్కు

అసలు డాగ్ పార్క్ అంటే రాజకీయ పార్టీల్లో, ప్రజల్లో కూడా అపోహలున్నాయని, దానిని సరిగా అర్థం చేసుకోవడం లేదని జీవీఎంసీ అధికారులు అంటున్నారు.

కుక్కల పార్కంటే నగరంలో ఉన్న కుక్కలను తీసుకుని వచ్చి అక్కడ వదిలేసే పార్కు అని అనుకుంటున్నారు. అసలు డాగ్ పార్క్ కాన్సెప్ట్ వేరు అని అధికారులు అంటున్నారు.

"ముంబై, హైద్రాబాద్ వంటి నగరాల్లో డాగ్ పార్కులున్నాయి. వాటిని థీమ్ పార్కులనే అంటాం. అక్కడ కుక్కలకు కూడా ప్రవేశం ఉంటుంది కాబట్టి...వాటిని కుక్కల పార్కులని అంటామంతే’’ అన్నారు సృజన.

ఈ పార్కుల్లో ఆటలాడే వస్తువులు, పార్కు నిర్మాణం కుక్కలు కూడా ఆడుకునే విధంగా ఉంటుంది. నిజానికి ఇది ఫ్యామిలీ పార్కు అని చెబుతున్నారు అధికారు.

''ఇంట్లోని పేరెంట్స్, పిల్లలతో పాటు వారికి ఇష్టమైన కుక్కలను కూడా తీసుకుని వచ్చేందుకు అనుకూలంగా పార్కు నిర్మాణం జరుగుతుంది. అంతే తప్ప అదేమి కుక్కలకు ఆశ్రయం కల్పించే పార్కు కాదు’' అన్నారామె.

నగరంలో అనేక మౌలిక సదుపాయలు సరిగా లేవని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

గతంలో కుక్కలకు లైసెన్స్... ఇప్పుడు పార్కు

రాష్ట్రంలో కుక్కలకు, పందులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ గతంలో పంచాయితీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జీఓ నంబరు 693ని జారీ చేసింది. లైసెన్స్ లేని కుక్కలను,పందులను అధికారులు పట్టుకుంటే వాటిని పెంచుకుంటున్న వారికి రూ.500 జరిమానా వేస్తారు.

లైసెన్స్ గడువు ముగిసిన 10 రోజుల్లోగా వాటిని రెన్యువల్ చేసుకోవాలి. లేకపోతే రోజుకు రూ. 250 అపరాధ రుసుం అదనంగా చెల్లించాలని ఆ జీవోలో ఉంది.

"19వ పశు గణన లెక్కల ప్రకారం ఏపీలో కుక్కల సంఖ్య 1,22,106. కానీ పశుగణన లెక్కలు వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగానే కుక్కలుంటాయి. వీటన్నింటికి స్టైరిలైజేషన్, టీకాలు వేసే కార్యక్రమమే పూర్తిగా జరగడం లేదు. కుక్కల పార్కులు తప్పు కాదు. కానీ నగరంలో మౌలిక వసతుల కల్పన కంటే కుక్కల పార్కు అంత ప్రాధన్యత అంశమేమి కాదు'' అని పశుసంవర్థక శాఖలోని పిగ్గరీ డెవలప్‌మెంట్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌ గా పని చేసిన ఒక అధికారి చెప్పారు.

కుక్కల లైసెన్సుల జీవో రాకముందు ఎన్ని లైసెన్సులు ఉన్నాయో...ఇప్పుడు అన్ని లైసెన్సులున్న కుక్కలే ఉన్నాయి. అది కేవలం రాష్ట్రంలో ఉన్న పెంపుడు కుక్కల సంఖ్యలో పది శాతం మాత్రమే. జీవోకు ముందు, జీవోకు తర్వాత కుక్కల లైసెన్సుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదని ఆ అధికారి చెప్పారు.

కుక్కల పార్క్‌కు వ్యతిరేకంగా కుక్కతోనే నిరసన ప్రదర్శన

'పన్నుల బాదుడే లక్ష్యం’

డాగ్స్ పార్క్ ప్రతిపాదన కౌన్సిల్ లో పెట్టగానే విపక్షాలు అందోళన చేపట్టాయి. నగరంలో అనేక ప్రజా సమస్యలు, సౌకర్యాల కల్పన అవసరాలు ఉంటే...రెండు కోట్లు ఖర్చు పెట్టి కుక్కలకు పార్కు కడతారా అంటూ కౌన్సిల్ లోనే అందోళన చేశాయి.

"డాగ్ పార్కు అంటే రోడ్డుపై తిరిగే కుక్కలు కోసం కాదు. పెంపుడు కుక్కలు తీసుకుని ఎవరైనా ఈ పార్కులకి వస్తే...అక్కడ కుక్కలు సేద తీరే విధంగా కాన్పెస్ట్ డిజైన్ చేసి నిర్మిస్తున్న పార్కులవి. అంతా కుక్కల పార్కుపైనే మాట్లాడి వివాదం సృష్టిస్తున్నారు'' కౌన్సిల్ లోని వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు కౌన్సిల్ లో అన్నారు.

"ఇంటి పనులు పెంచుతున్నారు. చెత్త పై పన్ను వేస్తున్నారు. గతంలోనే కుక్కలు, పందుల లైసెన్స్ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చివరికి కుక్కలకు పార్క్ కట్టి...దానిపై ఫీజులు, పన్నులంటూ డబ్బులు వసూలు చేస్తారు. చివరకు కుక్కల పెంపకానికి కూడా పన్ను వేస్తారు. కౌన్సిల్ లో సంఖ్యబలం ఉందని... నగర అభివృద్ధి పేరుతో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు'' అని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
What is the controversy over the dog park in Visakhapatnam? Who speaks, who wants?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X