• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత సైన్యంలో నేపాలీ మహిళల నియామకంపై వివాదం ఏమిటి

By BBC News తెలుగు
|
నేపాల్

భారత సైన్యంలో నేపాలీ మహిళల నియామకంపై వివాదం రాజుకుంది. దీనిపై నేపాల్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారత సైన్యం ప్రకటనతో ఈ వివాదం మొదలైంది. కఠ్‌మాండూలోని భారత దౌత్య కార్యాలయం కూడా ఈ ప్రకటనను షేర్ చేసింది. ఆన్‌లైన్‌లో ఇది వైరల్ అయింది.

ఈ ప్రకటనపై ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. నేపాల్ విదేశాంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.

దీనిపై భారత సైన్యం స్పందించింది. ఈ ఉద్యోగాలు నేపాలీ మహిళల కోసం కాదని వివరణ ఇచ్చింది.

నేపాల్

ఆ ప్రకటనలో ఏముంది?

మే 28న వంద మంది మహిళా సైనికుల నియామకంపై భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. జూన్ 4న ఈ ప్రకటన భారత సైన్యం వెబ్‌సైట్‌లోనూ కనిపించింది. అర్హత అనే చోట.. ''పదో తరగతి ఉత్తీర్ణులైన గూర్ఖా మహిళలకు (నేపాల్, భారత్) ఈ అవకాశం’’అని పేర్కొన్నారు.

పదో తరగతి ఉత్తీర్ణులైన నేపాలీ మహిళలు ఈ ఉద్యోగాల్లో చేరొచ్చని ప్రకటన వివరణల్లో పేర్కొన్నారు.

నేపాలీ భాషలోకి ఈ ప్రకటనను అనువదించారు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. దీన్ని ఫేస్‌బుక్‌లోని ''భూపు పరివార్’’ బృందం షేర్ చేసింది. దీనిలోని సభ్యులంతా గూర్ఖాలే.

నోటిఫికేషన్‌లో నేరుగా నేపాలీ మహిళలకే ఈ అవకాశం అని ప్రస్తావించలేదు. అయితే, అర్హత అనే చోట మాత్రం నేపాలీ గూర్ఖా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుతం భూపు ఫేస్‌బుక్ పేజీలో ఈ ప్రటకన కనిపించడం లేదు. దాన్ని తొలగించారు. కానీ గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో ఇది కనిపిస్తోంది.

అయితే, నేపాల్ అనుమతి లేకుండానే నేపాలీ మహిళల్ని భారత సైన్యం నియమించుకుంటోందని ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి.

కొందరు మాత్రం ఇది నేపాలీ మహిళలకు దక్కిన అవకాశంగా చూడాలని అంటున్నారు.

నేపాల్

చాలా మంది షేర్ చేశారు..

గూర్ఖా రెజిమెంట్‌ నియామకాలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలు కూడా ఆన్‌లైన్‌లో ఈ ప్రకటనను షేర్ చేశాయి

అయితే, పత్రికలతోపాటు అధికారిక ఫేస్‌బుక్ పేజీల్లో రావడంతోనే తాము ఈ ప్రకటనను అందరికీ తెలిసేలా చేశామని ఆ కోచింగ్ సెంటర్లు చెబుతున్నాయి.

''నేను నేరుగా భారత సైన్యం వెబ్‌సైట్‌లో ఆ ప్రకటనను చూశాను. నేపాలీ మహిళలు కూడా చేరొచ్చని దానిలో రాశారు’’అని పశ్చిమ నేపాల్‌లోని క్రష్ ఫైర్ గూర్ఖా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పవన్ షా ఠాకూరి తెలిపారు.

చాలా కోచింగ్ సెంటర్లు ఈ ప్రకటనను తమ ఫేస్‌బుక్ పేజీల్లో పోస్ట్ చేసినట్లు బీబీసీ న్యూస్ నేపాలీ ధ్రువీకరించింది.

నేపాల్

సోషల్ మీడియాలో విమర్శలు

నేపాల్‌లో ఈ ప్రకటనపై నిరసన వ్యక్తమైంది. అయితే, దీని గురించి తమకు ఏమీ తెలియదని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) నాయకుడు, మాజీ ఉప ప్రధాని భీమ్ రావల్ దీనిపై స్పందించారు. భారత్ ప్రభుత్వం రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు.

''సార్వభౌమ దేశాలు విదేశీయుల్ని తమ సైన్యంలో చేర్చుకోవు. ఇది నేపాలీ మహిళల్ని మోసగించేందుకు జరుగుతున్న కుట్ర. మీకెందుకు అర్థం కావడం లేదు’’అని ఆయన ట్వీట్ చేశారు.

నేపాల్

యూఎంఎల్‌కు చెందిన మరో సీనియర్ నాయకుడు విజయ్ పౌడెల్ కూడా స్పందించారు. విదేశీ సైన్యంలో నేపాలీ మహిళలు, పురుషుల నియామకాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అయితే, నేపాల్‌లో ఇప్పుడు ఉద్యోగాలు కరవయ్యాయని, ఇదొక మంచి అవకాశమని కొందరు అంటున్నారు.

నేపాల్

సవరణతో కొత్త ప్రకటన

ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తడంతో భారత సైన్యం మే 28నాటి ప్రకటనలో మార్పులు చేసింది. జూన్ 15న కొత్త ప్రకటన విడుదల చేసింది. కేవలం భారత మహిళా గూర్ఖాలను మాత్రమే తీసుకుంటామని స్పష్టంచేసింది.

''ప్రకటనలో తప్పు దొర్లింది. అదే సమయంలో భిన్న అధికారులు భిన్నంగా స్పందించడం దురదృష్టకరం’’అని భారత సైన్యంలో పనిచేసిన విశ్రాంత కల్నల్ ధన్ బహదూర్ వ్యాఖ్యానించారు. విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘంలో బహదూర్ సభ్యులు కూడా.

''ఇలాంటి తప్పుల వల్ల భారత్-నేపాల్ మధ్య విభేదాలు తలెత్తే ముప్పుంది’’అని సంఘం వ్యాఖ్యానించింది.

నేపాల్

భారత అధికారులు ఏమంటున్నారు?

ఈ విషయంపై స్పందించాలని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి ఏఎస్ భరత్ భూషణ్ బాబును బీబీసీ నేపాల్ కోరింది. అయితే, ప్రశ్నలను ఈమెయిల్ ద్వారా పంపాలని ఆయన కోరారు. కానీ, ఆయన నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు.

భరత్‌కు శుక్రవారం బీబీసీ కాల్ చేసింది. ''ఈ విషయంపై నేను మాట్లాడలేదు. ఇప్పటికే సైన్యం వివరణ ఇచ్చింది’’అని ఆయన అన్నారు.

మరోవైపు భారత విదేశాంగ అధికార ప్రతినిధి, నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయాలను కూడా బీబీసీ సంప్రదించింది. అయితే, ఎలాంటి ప్రత్యుత్తరాలూ రాలేదు.

విదేశీ సైన్యాల్లో నేపాలీ మహిళలు

ఇప్పటివరకు నేపాల్ మహిళలు ఏ విదేశీ సైన్యంలోనూ చేరలేదు. అయితే, భారత్‌, బ్రిటన్‌లలో నేపాలీ మాట్లాడే మహిళలు ఆయా దేశాల్లోని సైన్యాల్లో పనిచేస్తున్నారు.

నేపాల్ మహిళల్ని 2020 నుంచి గూర్ఖా రెజిమెంట్‌లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్ అధికారికంగా వెల్లడించింది. దీనిపై నేపాల్‌లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిర్ణయాన్ని అమలు చేయకుండా చూడాలని ఓ పార్లమెంటు కమిటీ నేపాల్ ప్రభుత్వానికి సూచించింది.

మరోవైపు 1947 తర్వాత నేపాల్, భారత్, బ్రిటన్‌ల మధ్య గూర్ఖా రెజిమెంట్‌లలో నేపాలీల నియామకంపై కుదిరిన ఒప్పందాన్ని సమీక్షించాలని గత నెలలో నేపాల్ విదేశాంగ శాఖ లేఖలు రాసింది. దీనికి ఏమైనా ప్రత్యుత్తరాలు వచ్చాయో లేదో నేపాల్ వెల్లడించలేదు.

सेना

నేపాలీ మహిళల్ని భారత్, బ్రిటన్ నియమించుకోవచ్చా?

గూర్ఖాలపై కుదిరిన తృతీయ పక్ష ఒప్పందాన్ని సమీక్షించకుండా భారత్ లేదా బ్రిటన్.. నేపాలీ మహిళల్ని సైన్యంలోకి తీసుకోకూడదు.

అయితే, ఈ ఒప్పందంలో ఇప్పటికే మార్పులు చేశారని కొందరు అంటున్నారు.

''ఆ ఒప్పందంలో నేపాలీ పౌరులని ప్రస్తావించారు. అంటే పురుషులతోపాటు మహిళలు కూడా వస్తారు. వీరి మధ్య ఎలాంటి బేధమూ లేదు. అయితే అప్పట్లో మహిళల్ని సైన్యంలోకి తీసుకునేవారు కాదు’’అని నేపాలీ రచయిత, అడ్వొకేట్ చంద్రకాంత్ గ్వావాలి అన్నారు.

''గూర్ఖాల నియామకాలపై చర్చ జరగాల్సిన అవసరముంది. ఆ ఒప్పందంలో నేపాలీ మహిళలు.. భారత్, బ్రిటన్ సైన్యాల్లో చేరకూడదని ఎక్కడా లేదు’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the controversy over the recruitment of Nepali women in the Indian Army
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X