పన్నీర్.. ఇప్పుడేం చేస్తారు? ‘రెబల్’గానే కొనసాగుతారా? మళ్లీ అన్నాడీఎంకేలో కలిసిపోతారా?

Posted By:
Subscribe to Oneindia Telugu
చెన్నై: శశికళ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన పళనిసామికి గవర్నర్ బలనిరూపణకు అవకాశం ఇవ్వడంతో ఇక ఇప్పుడు పన్నీర్ సెల్వం ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ వెంటే ఉండడంతో పన్నీర్ సెల్వం ఆశలకు గండిపడింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందు వరకు.. శశికళ, సెల్వం వర్గాలకు అవకాశాలు సమానంగా ఉన్నట్లు కనబడ్డాయి.

Pannerselvam

శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను తనవైపు తిప్పుకోవడంలో పన్నీర్ సెల్వం విఫలం కావడంతో రేసులో ఆయన వెనకబడిపోయారు. అంతలోనే అక్రమ ఆస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు జైలు శిక్ష ఖరారు చేయడంతో పరిస్థితి తనకు అనుకూలంగా మారుతుందని పన్నీర్ సంతోషించారు.

కానీ ఆయన అంచనాలు తప్పాయి. ఊహించని విధంగా పళనిసామిని తెరమీదికి తీసుకొచ్చి 'చిన్నమ్మ' గట్టి దెబ్బే కొట్టారు. అంతేకాకుండా గవర్నర్ పళనిసామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో పన్నీర్ వర్గం పూర్తిగా డీలా పడిపోయింది.

అయితే బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల సమయం ఇవ్వడంతో మళ్లీ పన్నీర్ సెల్వం శిబిరంలో ఆశలు చిగురించాయి. ఇక ఇప్పుడు పన్నీర్ వర్గం ముందున్న మార్గాలు ఇవే...

ఒకటి - పళనిసామి వెనక ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించి తమ వైపు తిప్పుకోవడం,
రెండు- ఎమ్మెల్యేల మద్దతు పొంది బల నిరూపణలో పళనిసామి ప్రభుత్వాన్ని ఓడించడం
మూడు - శశికళ వర్గంతో రాజీకి వచ్చి తిరిగి అన్నాడీఎంకేలో చేరడం
నాలుగు - అన్నాడీఎంకే చీలిక వర్గంగానే కొనసాగుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పోరాడటం

'వేద నిలయంలో ఉండనివ్వం..'

అమ్మ జయలలిత మరణానికి శశికళ కుటుంబమే కారణమని, ఆ కుటుంబాన్ని వేదనిలయంలో ఉండనివ్వమని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఆయన తన మద్దతుదారులతో కలిసి మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని సందర్శించి నివాళి అర్పించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అమ్మ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం శశికళ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు.

ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, దీనిని తిప్పికొట్టాలని పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో అమ్మ అనుచరులు ఎవరూ లేరన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల మద్దతు కోరనున్నట్లు చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని పన్నీర్ ఉద్ఘాటించారు.

అధికార లాంఛనాలన్నీ ఒక్కొక్కటిగా...

తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన పన్నీర్ సెల్వంకు అధికార లాంఛనాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పళనిసామి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెల్వం కారుకు ఉన్న ఎర్రబుగ్గను అధికారులు తొలగించారు.

అంతేకాదు, పన్నీర్ సెల్వం నివాసం వద్ద భద్రతను కూడా పోలీసులు తగ్గించారు. సోమవారం ఆయన ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ నివాస గృహాన్ని కూడా ఖాళీ చేయనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
His mission to lose the qualifier of "acting" from his rank as Chief Minister was bumped today with rival E Palaniswami taking over from him, but Mr Panneerselvam -"OPS" - whose car was stripped of the lal batti or red light that gives it right of way, belligerently declared, "Our battle will continue." Belligerence, till recently, was not stock-in-trade for the 67-year-old. His USP, within his party, was his heart-on-his-sleeve devotion to its matriarch, J Jayalalithaa. He was well compensated for it: when she twice appointed him stand-in as she faced corruption charges, he refused to use her office or her chair, and placed her photograph at the head of the table for all cabinet meetings.
Please Wait while comments are loading...