• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘లవ్‌ జిహాద్‌’ మీద జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ చేసిన వ్యాఖ్యలేమిటి? ఆమెను తొలగించాలనే డిమాండ్లు ఎందుకు?

By BBC News తెలుగు
|

'లవ్ జిహాద్‌’ వ్యవహారంపై మహారాష్ట్ర గవర్నర్‌తో చర్చించానని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

rekha

ఆమె గతంలో చేసిన కొన్ని ట్వీట్లు కూడా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేఖాశర్మను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

మంగళవారం నాడు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీని కలిసిన రేఖాశర్మ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు. కోవిడ్ కేంద్రాల్లో మహిళా రోగులపై అత్యాచారాలు, వేధింపులు పెరుగుతున్నాయని ఆమె అన్నారు.

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వన్‌ స్టాప్‌ సెంటర్లు పని చేయక పోవడంతోపాటు పెరుగుతున్న 'లవ్‌ జిహాద్‌’ కేసుల గురించి కూడా తాను గవర్నర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని నేషనల్ విమెన్స్‌ కమిషన్‌ ట్విటర్‌లో పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది.

వీరిద్దరి మధ్య చర్చల్లో 'లవ్‌ జిహాద్‌’ మాట కూడా ప్రస్తావనకొచ్చింది. ''పరస్పర అంగీకారంతో వేర్వేరు మతాల యువతీ యువకుల మధ్య వివాహాలకు, 'లవ్‌ జిహాద్‌’ వివాహాలకు మధ్య తేడా ఉంది. దీన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది’’ అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

https://twitter.com/NCWIndia/status/1318490524555169792

'లవ్‌ జిహాద్‌’ అనే పదాన్ని రేఖాశర్మ వాడటంపై వివాదం మొదలైంది.

'లవ్‌ జిహాద్’ అనే పదానికి చట్టాలలో ఎలాంటి నిర్వచనం లేదని, దీనికి సంబంధించిన కేసులేవీ విచారణ సంస్థల దృష్టికి రాలేదని మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రకటించింది.

'లవ్‌ జిహాద్‌’ వ్యవహారంలో కేరళ హైకోర్టు చెప్పిన తీర్పు విషయం ప్రభుత్వానికి తెలుసా? అంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 4న పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి సమాధానమిచ్చారు.

“లవ్ జిహాద్ అనే పదాన్ని ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఏవీ నిర్వచించలేదు. 'లవ్ జిహాద్' కేసును ఏ కేంద్ర ఏజెన్సీ మాకు నివేదించలేదు" అని చెప్పారు. తమకు నచ్చిన మతాన్ని పాటించే హక్కును రాజ్యాంగం కల్పించిందని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఏమిటీ లవ్ జిహాద్?

హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకోవడాన్ని 'లవ్‌ జిహాద్‌’ అని ఇటీవల కాలంలో రైట్‌ వింగ్‌ గ్రూపులు అభివర్ణిస్తున్నాయి. హిందూ యువతులను మభ్యపెట్టి ప్రేమలోకి దింపి ముస్లిం యువకులు వారిని వివాహం చేసుకుంటున్నారని, తర్వాత మతం మార్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

అయితే ఇంత వరకు తమ దృష్టికి ఒక్క 'లవ్‌ జిహాద్‌’ కేసు కూడా రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, ఏ గణాంకాల ఆధారంగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ 'లవ్‌ జిహాద్’ కేసులు పెరుగుతున్నాయని చెప్పారని ప్రశ్నిస్తున్నారు.

గవర్నర్‌ను కలిసి మాట్లాడినట్లు రేఖాశర్మ ట్విట్టర్ ‌లో ఫోటోలు పెట్టగానే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. చాలామంది సోషల్ మీడియా యూజర్లు రేఖాశర్మ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

“లవ్‌ జిహాద్‌ అంటే ఏంటో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ చెప్పగలరా? కొంతమంది ఉగ్రవాదులు ఉపయోగించినట్లుగానే మీరు కూడా అదే మాటను ఉపయోగిస్తున్నారా? మీరు వారికి మద్దతిస్తున్నారా?’’ అని దేబీ ప్రసాద్‌ మిశ్రా అనే యూజర్‌ ప్రశ్నించారు.

https://twitter.com/DebiprasaMishra/status/1318512151691108352

“ఇతర మతస్తులను వివాహం చేసుకున్నందుకు మహిళలపై జరిగిన దాడులు, హత్యలకు సంబంధించిన కేసులను కూడా జాతీయ మహిళా కమిషన్‌ స్వీకరిస్తుందని భావించవచ్చా?” అని పల్లవి అనే యూజర్‌ ప్రశ్నించారు.

"మహిళలు, మైనారిటీలపై నేరాలపట్ల ప్రభుత్వాలు ఉదాసీనతతో వ్యవహరిస్తున్నాయి. దీంతో ఉగ్రవాదం, అసహనం పెరుగుతున్నాయి. ఏదైనా మతాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి 'లవ్ జిహాద్' అనే పదాన్ని వాడటం మంచిదేనా?" అని పల్లవి ప్రశ్నించారు.

https://twitter.com/UrmilaMatondkar/status/1318812290762776577

“మహిళా కమిషన్‌కు ఇప్పటి వరకు ఎన్ని 'లవ్‌ జిహాద్‌’ కేసులు వచ్చాయి? ఒక ఐదు కేసులను రేఖాశర్మ చూపించగలరా?’’ అని షహనా యాస్మిన్‌ అనే యూజర్‌ ప్రశ్నించారు.

“ఇలాంటి ఆలోచనలున్న వ్యక్తులు మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉంటే ఇక మహిళలు ఎలా సురక్షితంగా ఉండగలరు’’ అంటూ సినీ నటి ఉర్మిళా మటోండ్కర్‌ ట్వీట్‌ చేశారు.

https://twitter.com/pallavitura/status/1318513692477026307

పాత ట్విటర్‌ పోస్టులతో మరిన్ని ఆరోపణలు

రేఖాశర్మ గతంలో చేసిన ట్వీట్లను కూడా కొందరు బైటికి తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమెపై విమర్శల దాడి మరింత పెరిగింది.

2012, 2014 సంవత్సరాలలో పలువురు మహిళలు, మహిళా నేతలపై ఆమె చేసిన అభ్యంతరకరమైన కామెంట్లను కొందరు నెటిజన్లు ప్రస్తావించారు. వాటిని షేర్‌ చేస్తూ ఇది ఆమె మనస్తత్వానికి నిదర్శనమని సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు పెట్టారు.

రేఖాశర్మ 2015లో జాతీయ మహిళా కమిషన్‌లోకి వచ్చారు. కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రకారం 2018 ఆగస్టు 7 నుంచి ఆమె మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మహిళా కమిషన్‌లోకి రాకముందు ఆమె బీజేపీలోయాక్టివ్‌ మెంబర్‌గా ఉండేవారు. హర్యానాలో బీజేపీ జిల్లా కార్యదర్శిగా, మీడియా ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు.

రేఖాశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాక #SackRekhaSharma పేరుతో ఆమెను తొలగించాలంటూ ట్విటర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభమైంది. ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది.

https://twitter.com/SupriyaShrinate/status/1318751936389107713

“ఇలాంటి తక్కువ స్థాయి ఉన్న సెక్సిస్ట్‌ మహిళను ఆ పదవిలో ఎలా కూర్చోబెట్టారని చర్చ జరుగుతోంది. అయితే కేంద్రంలో నరేంద్రమోదీ, బీజేపీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషంకక్కే మహిళలు త్వరగా ఎదుగుతారు. ఇది సిగ్గు చేటు’’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి సుప్రియా శ్రీనేట్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఈ వివాదం మొదలయ్యాక రేఖాశర్మ తన ట్విటర్‌ ఖాతాను లాక్‌ చేశారు. ఆమె అనుమతించిన వారు మాత్రమే ఆ ఖాతాను చూడగలరు.

ఈ వివాదంపై రేఖాశర్మతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆమె అందుబాటులోకి రాలేదు.

తన ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేశారని, తాను ప్రధానమంత్రి మోదీపై చేసినట్లుగా తప్పుడు వ్యాఖ్యలను పోస్ట్‌ చేస్తున్నారని గతంలో రేఖాశర్మ ఆరోపణలు చేశారు.

"ఈ ట్వీట్లు పెట్టినప్పుడు నేను విమానంలో ఉన్నాను. మహారాష్ట్ర నుండి వస్తున్నాను. ఇది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మీరు అర్ధం చేసుకోవచ్చు’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు

గవర్నర్‌తో జరిగిన సమావేశంలో మహారాష్ట్రలో మహిళల భద్రతలో లోపాలపై రేఖ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు కాలేదని, అందువల్ల మహిళల ఫిర్యాదులకు సంబంధించిన 4వేల కేసుల విచారణ నిలిచి పోయిందని రేఖాశర్మ అన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు అయ్యే వరకు జాతీయ మహిళా కమిషన్‌ నుంచి ఒక సభ్యుడు ప్రతి నెలా ముంబయి వచ్చి కేసుల విచారణను పర్యవేక్షిస్తారని తాను గవర్నర్‌కు తెలిపినట్లు ఆమె వెల్లడించారు.

ముంబై వచ్చి గవర్నర్‌ను కలిసిన జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి యశోమతి ఠాకూర్‌ను కలవకుండానే వెళ్లిపోయారు. దీనిపై ఆ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల భద్రత పేరు చెప్పి ఆమె రాజకీయ ఎజెండాతో వచ్చినట్లు కనిపిస్తోందని యశోమతి ఠాకూర్‌ విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rekha sharma NCW chairperson comments on Love Jihad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X