• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాట్సాప్: కొత్త ప్రైవసీ నిబంధనలతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా? అసలు ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

By BBC News తెలుగు
|

వాట్సాప్

''మీరు వాడే ప్రోడక్ట్స్‌కు డబ్బులు చెల్లించకపోతే.. మీరే ప్రోడక్ట్ అవుతారు’’. అంటే ఏదైనా ఉచితంగా ఉపయోగించాలని చూస్తే మనమే ప్రోడక్ట్స్‌గా మారాల్సి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ''సోషల్ డైలమా’’లో ఈ వాక్యాన్ని ప్రేక్షకులు అంత తేలిగ్గా మరచిపోలేరు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నేటి స్థితిగతుల ఆధారంగా సోషల్ డైలమా తెరకెక్కింది.

ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్‌లను మనం దాదాపు ఉచితంగానే ఉపయోగిస్తున్నాం. మరి ఇవి నిజంగానే ఉచితంగానే సేవలు అందిస్తున్నాయా?

దీనికి కాదనే సమాధానం చెప్పాలి. మన వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటూ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు డబ్బులు సంపాదిస్తుంటాయి.

విధానాల్లో మార్పులు

భారత్‌తోపాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో ఇటీవల వాట్సాప్ మార్పులు చేసింది,

మీరు వాట్సాప్ ఉపయోగించాలి అనుకుంటే.. కచ్చితంగా కొత్త విధానానికి అనుమతి తెలపాల్సిందే.

ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు నోటిఫికేషన్ రూపంలో వాట్సాప్ ఈ విషయాన్ని తెలియజేసింది.

ఈ విధానానికి మీరు అనుమతి తెలపకపోతే.. ఫిబ్రవరి 8, 2021 తర్వాత మీ అకౌంట్ డిలీట్ అవుతుందని దీనిలో స్పష్టంగా తెలియజేశారు.

అంటే ఈ కొత్త విధానాలకు సరేనని అనుమతి ఇవ్వకపోతే ఫిబ్రవరి 8 తర్వాత మీరు వాట్సాప్ ఉపయోగించలేరు.

బలవంతంగా వాట్సాప్ అనుమతి తీసుకుంటోందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ''అంగీకరించం’’ అనే ఆప్షన్ కూడా లేదని అంటున్నారు.

సాధారణంగా వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సైట్లు ఇలాంటి కఠినమైన విధానాలు తీసుకురావని సైబర్ నిపుణులు అంటున్నారు. ''యాక్సెప్ట్’’ లేదా ''డినై’’ అప్‌డేట్ లాంటి రెండు ఆప్షన్‌లూ అందుబాటులో ఉంటాయని వివరిస్తున్నారు.

వాట్సాప్ తాజా విధానాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాలామంది సైబర్ నిపుణులు ఈ విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

''గోప్యత’’ ఏమైంది?

20 జులై 2020న వాట్సాప్ విడుదల చేసిన పాత విధానాల్లో ఈ కింద వాక్యాలు కనిపిస్తాయి.

''మీ గోప్యతను గౌరవించడమనేది మా రక్తంలో ఉంది. వ్యక్తిగత గోప్యతా నిబంధనలను పరిగణలోకి తీసుకుంటూనే మీకు వీలైనంత మెరుగైన సేవలు అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం’’.

జనవరి 4, 2021న విడుదల చేసిన కొత్త విధానాల్లో ''వ్యక్తిగత గోప్యతను గౌరవించడం’’లాంటి పదాలు కనిపించడం లేదు.

''మేం అనుసరిస్తున్న విధానాలను మీకు వివరించేందుకు మా ప్రైవసీ పాలసీ సహకరిస్తుంది. మేం ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తాం. దానితో ఏం చేస్తాం.. లాంటి అంశాలను ఇది తెలియజేస్తుంది’’అని కొత్త పాలసీలో పేర్కొన్నారు.

వాట్సాప్

ఏం మార్పులు చేశారు?

2014లో 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. అప్పటినుంచీ తమ వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు వాట్సాప్ షేర్ చేస్తోంది.

తాజా ప్రైవసీ పాలసీలో ఈ విషయాన్ని వాట్సాప్ స్పష్టంచేసింది. దీనిలో ఇంకా ఏం ఉన్నాయంటే...

  • ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతోపాటు ఇతర థర్డ్‌పార్టీ సంస్థలతో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ (ఐపీ అడ్రస్) డేటాను వాట్సాప్ షేర్ చేస్తుంది.
  • బ్యాటరీ లెవల్, సిగ్నల్, యాప్ వెర్షన్, లాంగ్వేజీ, మొబైల్ టైమ్‌జోన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ) తదితర సచారాన్ని వాట్సాప్ ఇకపై సేకరిస్తుంది. పాత ప్రైవసీ పాలసీలో ఈ వివరాలు లేవు.
  • వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేయాలని అనుకుంటే ''అకౌంట్’’ విభాగంలోని ''డిలీట్ మై అకౌంట్’’ ఆప్షన్‌ను మొదట క్లిక్ చేయాలి. అలా కాకుండా కేవలం ఫోన్‌లో అన్‌ఇన్‌స్టాల్ చేస్తే.. మీ డేటా వాట్సాప్‌ దగ్గరే ఉంటుంది.
  • తమ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉండటంతో అవసరమైతే.. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అక్కడికి పంపొచ్చని కొత్త విధానాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అమెరికాకు మాత్రమే కాదు.. తమ కార్యాలయాలు ఎక్కడ ఉంటే.. అక్కడికి డేటాను పంపొచ్చని స్పష్టం చేశారు.
  • వాట్సాప్‌కు ''లొకేషన్’’ షేర్ చేసే అనుమతిని మీరు ఇవ్వకపోయినప్పటికీ.. ఐపీ అడ్రస్, ఫోన్ నంబరు, దేశం, నగరం తదితర సమాచారం వాట్సాప్ దగ్గర ఉంటుంది.
  • మీరు బిజినెస్ అకౌంట్‌ను ఉపయోగిస్తే.. అవసరమైనప్పుడు ఫేస్‌బుక్ సహా ఇతర వ్యాపార సంస్థలకు మీ సమాచారం షేర్ చేయొచ్చు.
  • మీరు ''వాట్సాప్ పేమెంట్ సర్వీస్’’ను ఉపయోగిస్తే.. మరింత సమాచారాన్ని వాట్సాప్ సేకరిస్తుంది. పేమెంట్ లావాదేవీల సమాచారం దీని కిందకు వస్తుంది.

ఈ మార్పులు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. మెసేజ్‌లు, వీడియోలు, ఆడియోల విషయంలోనూ మనం అప్రమత్తంగా ఉండాలా?

వాట్సాప్

సుడిగుండంలోకి లాగడమే..

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ.. వినియోగదారులను సమస్యల సుడిగుండంలోకి లాగుతోందని సైబర్ చట్టాల నిపుణుడు, ''వాట్సాప్ లా’’ పుస్తక రచయిత పవన్ దుగ్గల్ వ్యాఖ్యానించారు.

భారతీయుల వ్యక్తిగత గోప్యతా హక్కులతోపాటు భారతీయ చట్టాలనూ ఈ కొత్త పాలసీ ఉల్లంఘిస్తోందని ఆయన వివరించారు.

అయితే, ప్రస్తుతం వాట్సాప్ పాలసీకి కళ్లెం వేసే చట్టాలు భారత్‌లో లేవని ఆయన చెప్పారు.

''భారత్‌ ఎంత పెద్ద దేశమో వాట్సాప్‌కు తెలుసు. అదే సమయంలో ఇక్కడ పటిష్ఠమైన చట్టాలు లేవనే సంగతి కూడా తెలుసు’’

''వాట్సాప్ బాగా హోంవర్క్ చేసి ఈ నిబంధనలు తీసొచ్చింది. ఇక్కడ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ.. థర్డ్ పార్టీకి చేరవేసేలా మార్పులు చేసింది’’అని పవన్ అన్నారు.

భారత్‌లో వాట్సాప్‌కు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జర్మనీ డేటా సంస్థ స్టాటిస్టా చెబుతోంది.

వాట్సాప్

చట్టాలను ఉల్లంఘించడమే

భారత్‌లో సైబర్ సెక్యూరిటీ, వ్యక్తిగత సమాచార భద్రతలకు సంబంధించి పటిష్ఠమైన చట్టం ఏదీ అందుబాటులో లేదని పవన్ తెలిపారు.

''వ్యక్తిగత డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీలకు ఒక చట్టం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2020. అయితే దీనిలోని సెక్షన్ 79 లాంటి వెసులుబాటులను వాట్సాప్ లాంటి సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించుకుని.. చర్యల నుంచి తప్పించుకుంటున్నాయి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఐటీ యాక్ట్‌లోని రెండు నిబంధనలను వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ఉల్లంఘిస్తోందని పవన్ చెప్పారు. వాటిలో మొదటిది ఐటీ ఇంటర్మీడియెట్ గైడ్‌లైన్స్ 2011, రెండోది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీజనబుల్ సెక్యూరిటీ ప్రాక్సీసెస్ అండ్ సెన్సిటివ్ పర్సనల్ డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ రల్స్ 2011.

వాట్సాప్ ఒక అమెరికా సంస్థ. వాట్సాప్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. అంటే అక్కడి నిబంధనలు మాత్రమే సంస్థకు వర్తిస్తాయి.

వాట్సాప్

అయితే ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 75 (1) ప్రకారం.. సర్వీస్ ప్రొవైడర్ ప్రధాన కార్యాలయం దేశానికి వెలుపల ఉన్నప్పటికీ వారు భారత్‌లో సేవలు అందిస్తే.. ఐటీ చట్టం వారికి వర్తిస్తుంది.

అంటే వాట్సాప్ భారత్‌లోని ఐటీ చట్టం పరిధిలోకి వస్తుంది. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. రెండోది ఐటీ చట్టంలోని ''ఇంటర్మీడియరీ’’ల కిందకు వాట్సాప్ వస్తుంది.

వ్యక్తిగత డేటా అందుబాటులో ఉండే సర్వీస్ ప్రొవెడర్లను ఇంటర్మీడియరీలుగా సెక్షన్ 2 చెబుతోంది.

ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 79 ప్రకారం.. వినియోగదారుల డేటాను ఉపయోగించేటప్పుడు ఇంటర్మీడియరీ సంస్థలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలి. డేటా సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత వారిదే.

''మీరు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని గమనిస్తే.. ఐటీ యాక్ట్‌లోని నిబంధనలతో మాకు సంబంధం లేదు అన్నట్లు కనిపిస్తుంది’’అని పవన్ వ్యాఖ్యానించారు.

వాట్సాప్

''చట్టాలు లేవు..’’

వాట్సాప్ ప్రస్తుతం తీసుకొచ్చిన మార్పులు భారత్‌కు కొత్తేమీ కాదని సైబర్ నిపుణుడు పునీత్ భాసిన్ వ్యాఖ్యానించారు.

''వాట్సాప్ ప్రైవేట్ పాలసీ గురించి మనకు అనుమతి అడుగుతోంది కాబట్టే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని యాప్‌లు అయితే అనుమతి అడగకుండానే డేటా సేకరిస్తుంటాయి’’అని పునీత్ వ్యాఖ్యానించారు.

వ్యక్తిగత గోప్యతకు సంబంధించి భారత్‌లో పటిష్ఠమైన చట్టాలు అందుబాటులో లేవని, అందుకే వాట్సాప్ లాంటి సంస్థలు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆయన వివరించారు.

వాట్సాప్

పటిష్ఠమైన చట్టాలు ఉండే దేశాల్లో పక్కాగా గోప్యతా నిబంధనలను వాట్సాప్ అనుసరిస్తోంది. ఉదాహరణకు వాట్సాప్ ప్రైవసీ పాలసీలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. ఐరోపాలో ఒకలా, బ్రెజిల్, అమెరికాల్లో మరోలా ఈ పాలసీలు ఉంటాయి.

''వ్యక్తిగత గోప్యత విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు పక్కాగా ఉంటాయి. తమ నిబంధనలు, చట్టాలను అనుసరించని సంస్థలకు అక్కడ ప్లే స్టోర్‌లలో చోటు కూడా దక్కదు’’అని ఆయన వివరించారు.

వాట్సాప్

''ప్రజలపై రద్దుతున్నారు’’

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని వినియోగదారులపై బలవంతంగా రద్దుతోందని సుప్రీం కోర్టు న్యాయవాది, సైబర్ చట్టాల నిపుణురాలు కర్ణికా సేత్ వ్యాఖ్యానించారు.

''ప్రస్తుతం మన దేశంలో వ్యక్తిగత డేటా భద్రత బిల్లు పెండింగ్‌లో ఉంది. అందుకే ఎలాంటి సమస్యలూ ఉండకుండా చూసేందుకు ముందుగానే వాట్సాప్ ఇలాంటి ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది’’అని ఆమె చెప్పారు.

వ్యక్తిగత డేటా భద్రతకు ఈ బిల్లులో కఠినమైన నిబంధనలను ప్రతిపాదించారు. ఐరోపాలోని జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) తరహాలో దీన్ని సిద్ధంచేశారు.

''ఆ బిల్లు ఆమోదం పొందకముందే వాట్సాప్ ఈ మార్పులు తీసుకొచ్చింది. దీంతో బిల్లు ఆమోదం పొందినా వారిపై ఎక్కువ ప్రభావం పడదు. ఎందుకంటే అప్పటికే వారు డేటాను సేకరించి, ప్రోసెస్ చేసి.. థర్డ్ పార్టీలకు షేర్ చేసేస్తారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఏం చేయాలి?

పవన్ దుగ్గల్, పునీత్ భాసిన్, కర్ణికా సేత్.. ఈ ముగ్గురు సైబర్ నిపుణులూ భారత్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భావిస్తున్నారు.

''భారత్‌లో చాలా చట్టాలు వందేళ్ల క్రితం బ్రిటిష్ వారు తీసుకొచ్చినవే ఉన్నాయి. చాలా చట్టాల్లో కొన్ని మార్పులు చేసి వాటినే కొనసాగిస్తున్నారు’’అని పునీత్ వివరించారు.

''హత్య, దోపిడీ లాంటి నేరాలు పెద్దగా మారవు.. వాటికి సంబంధించిన నిబంధనలు కొనసాగించినా ఫర్వేలేదు. కానీ కొన్ని నేరాలు సాంకేతికత అభివృద్ధి అయ్యేకొద్దీ కొత్తకొత్తగా పుట్టుకొస్తాయి. అప్పుడు చట్టాల్లోని మార్పులు అవసరం’’అని ఆయన అన్నారు.

''ప్రపంచం నేడు చాలా వేగంగా మారుతోంది. దానికి అనుగుణంగా సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ చట్టాల్లోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు.

వాట్సాప్

అందరికీ ముప్పే...

ఇలాంటి పాలసీలతో ప్రజలతోపాటు ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికీ ముప్పుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

2017లో పుట్టస్వామి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో.. వ్యక్తిగత గోప్యత అనేది ప్రజల ప్రాథమిక హక్కని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కిందకు ఇది వస్తుందని పేర్కొంది.

''ఆర్టికల్ 21 ప్రకారం.. హాయిగా జీవించే హక్కును రాజ్యాంగం ప్రసాదిస్తుంది. అంటే హుందాగా జీవించే హక్కును అందిస్తోంది. ఈ హక్కును కాపాడేందుకు ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని తీసుకొస్తుందా? మరి.. ఈ ప్రశ్న మనం ప్రభుత్వాన్నే అడగాలి. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’’అని పవన్ వ్యాఖ్యానించారు.

''ఇలాంటి విధానాలతో ప్రజల గోప్యతా హక్కులకు భంగం కలగడంతోపాటు ప్రభుత్వం, ప్రజాస్వామ్యాలకు ముప్పు కలుగుతుంది’’అని కర్ణిక వ్యాఖ్యానించారు.

2019లో ఇజ్రాయెల్ సంస్థ పెగాసెస్.. వాట్సాప్ సాయంతో వేల మంది భారతీయులపై నిఘా పెట్టింది. మరోవైపు 2016లో కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంలో ఫేస్‌బుక్ పాత్రపై చాలా వార్తలు వచ్చాయి.

ఇటీవల కాలంలో భారత్‌లో ఫేస్‌బుక్ అనుసరిస్తున్న విధానాలపైనా చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్ తీసుకొచ్చిన తాజా ప్రైవసీ పాలసీని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will personal privacy be violated with the new whats app privacy rules
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X