వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీలకు పవర్ ఎప్పుడొస్తుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పంచాయతీ కార్యాలయం
Click here to see the BBC interactive

'భరత్ అనే నేను’ సినిమాలో హీరో పాత్రలోని మహేశ్ బాబు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తారు. ఇకపై ప్రభుత్వ నిధుల్లో సగం నేరుగా గ్రామ పంచాయతీలకే ఇచ్చేస్తాం అనేది ఆ ప్రకటన సారాంశం. దీనికి సభలోని ఎమ్మెల్యేలంతా అడ్డు చెబుతారు. అలా చేస్తే తమ గతేం కావాలని బాధపడతారు.

పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తే ఎమ్మెల్యేలకు వచ్చే నష్టం ఏంటి? అసలు పంచాయతీలకు నిధులు ఎవరు ఇవ్వాలి? నిధుల్లేకపోతే పంచాయతీలేమవుతాయి?

ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను మూడు సమస్యలు వేధిస్తున్నాయి. ఒకటి నిధుల లేమి, రెండోది ఎన్నికలు నిర్వహించకపోవడం, ఎన్నికల ప్రక్రియ సక్రమంగా లేకపోవడం. ఈ సమస్యలపై తెలుసుకునే ముందు, అసలు భారత్‌లో పంచాయితీ వ్యవస్థ ఎలా మొదలైందో చూద్దాం.

స్థానిక సంస్థలు

ఎలా మొదలైంది?

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడో దిల్లీ, హైదరాబాద్, అమరావతుల్లో ఉంటాయి. కానీ స్థానిక సమస్యలు ఎన్నో ఉంటాయి. వీటిని చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలదే. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌లు, నగర పంచాయతీ, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్లు - వీటన్నిటీ స్థానిక సంస్థలు అంటారు.

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మన దగ్గర స్థానిక ప్రభుత్వాల విధానం లేదు. 1952లో సామాజిక అభివృద్ధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వాటికి ఎన్నికలుండేవి కాదు. అధికారులే నడిపించేవారు. తరువాత బల్వంతరాయ్ మెహతా కమిటీ నివేదిక ఆధారంగా మూడంచెల పంచాయతీ వ్యవస్థ ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా 1959లో రాజస్థాన్లో ఈ వ్యవస్థ మొదలైంది.

ఇలా మూడు స్థాయిల్లో పెట్టడానికి కారణం విస్తీర్ణమే.. జిల్లా మరీ పెద్ద యూనిట్ అవుతుంది. గ్రామం మరీ చిన్న యూనిట్ అవుతోంది. అందుకనే, గ్రామ స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో ఒకటి.. ఈ రెండిటికీ మధ్యలో ఒకటి .. ఇలా మూడు స్థాయిల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను తెచ్చారు. అవే గ్రామ పంచాయతీ, సమితి, జిల్లా పరిషత్. ఈ వ్యవస్థ మొత్తం అప్పట్లో వేర్వేరు చట్టాల ఆధారంగా నడిచేదే తప్ప, దీనికి రాజ్యాంగ బద్ధత లేదు. వీటికి పరోక్ష ఎన్నికలు జరిగేవి. అంటే ప్రజలు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులను మాత్రమే ఎన్నుకునే వారు. ఒక గ్రామాన్ని వార్డులుగా విభజించేవారు. ఆ వార్డు మెంబర్ల నుంచి ఒకరు సర్పంచి అయ్యేవారు. ఆ సర్పంచులంతా కలసి తమలో ఒకడిని సమితి ప్రెసిడెంటుగా ఎన్నుకునేవారు. ఆ సమితి ప్రెసిడెంట్లంతా కలసి జిల్లా ఛైర్మన్‌ను ఎన్నుకునేవారు. 1964లో పంచాయతీలకు ఒక సమగ్ర చట్టం వచ్చింది. 1987లో ఎన్టీఆర్ హయాంలో మధ్య స్థాయిలో ఉన్న సమితులను మండలాలుగా మార్చారు. పెద్ద సమితులు చిన్న చిన్న మండలాలుగా ఏర్పడ్డాయి.

పంచాయతీ రాజ్ వ్యవస్థలో అతి పెద్ద మార్పు 1992లో జరిగింది. స్థానిక సంస్థలకు ఆ ఏడాది రాజ్యాంగంలో చోటు లభించింది. ఈ మార్పుతో స్థానిక సంస్థల హోదా, స్థాయి పెరిగింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటైంది. మొట్టమొదటిసారిగా పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల రాక మొదలైంది. ఫైనాన్స్ కమిషన్ ఈ బాధ్యత చూస్తుంది. అంతేకాదు దేశమంతా స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అందుకే ఇది అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

నెహ్రూ

''నిజానికి మనిషి రాజకీయం చేయడం మొదలు పెట్టింది ఎక్కువగా ఈ స్థానిక సంస్థల నుంచే. ప్రాచీన భారతమైనా, గ్రీకు సామ్రాజ్యాలైనా స్థానిక సంస్థలు బలంగా ఉండేవి. స్థానిక రాజ్యాలే పెద్దవై సామ్రాజ్యాలుగా ఏర్పడ్డాయి.

ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ కాలం నుంచి భారత్‌లో మునిసిపల్ వ్యవస్థ బలపడింది. నెహ్రూ అలహాబాద్ మేయర్ గా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి అక్కడి నుంచే వచ్చారు. వల్లబాయ్ పటేల్ అహ్మదాబాద్ మునిసిపాలిటీకి ఎన్నికయ్యారు. చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్‌లు కలకత్తా మేయర్లుగా పనిచేశారు.

ఇక పీవీ నరసింహారావు పంచాయితీ వార్డు మెంబరుగా ఎన్నికయ్యారు. జళగం వెంగళరావు, టంగుటూరి ప్రకాశం పంతులు కూడా స్థానిక సంస్థల నుంచి వచ్చినవారే’’ అంటూ పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రాధాన్యం వివరించారు బండారు రామ్మోహన రావు. ఈయన సుదీర్ఘ కాలంలో పంచాయితీరాజ్ వ్యవస్థ మెరుగుదల, నిధుల కోసం పోరాడుతున్నారు.

రిపబ్లిక్ డే పరేడ్‌లో పంచాయతీ రాజ్ శాఖ శకటం

ప్రస్తుత పరిస్థితి:

నిధులు: పంచాయతీరాజ్ సంస్థలకు రెండు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి నేరుగా వాళ్లు వసూలు చేసుకునే పన్నులు. అంటే ఇంటి పన్ను, నీటి పన్ను లాంటివి. ఇక రెండోది కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే నిధులు.. తాజాగా 14వ ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చే నిధులు కొనసాగిస్తోంది కానీ, మండల, జిల్లా పరిషత్ లకు ఇవ్వాల్సిన నిధులను ఆపేసింది. దీంతో ఆ వ్యవస్థలు నిర్వహణ కష్టంగా మారింది. ప్రజలు నేరుగా గ్రామాల్లోనే ఉంటారు కాబట్టి మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఆర్థిక సంఘం వాదన. ఇక గ్రామాలకు ఇచ్చే డబ్బు కూడా జనాభా ఆధారంగా లెక్కవేసి ఊరికి ఇంత అని కేంద్రం ఇస్తుంది. కానీ ఈ డబ్బులు సరిపోవు. పంచాయితీలు, మునిసిపాలిటీల మీద బాధ్యతలు ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంటుంది. దీంతో వీరు ప్రతీసారీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడాలి.

ఎన్నికల ప్రక్రియలో లోపాలు:

స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు జరపడంతో ఇక్కడ డబ్బు ప్రవాహం పెరిగిపోయింది. వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా ఎన్నికైన వారిని ఎంతకైనా కొనేసి పార్టీ మార్చేసి ప్రజా తీర్పును మార్చేస్తున్నాయి అధికారంలో ఉన్న పార్టీలు. మునిసిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మునిసిపల్ చైర్మన్ లేదా మేయర్లను ఎన్నుకునే పద్ధతి కూడా ఇలానే ఉంది. మామూలుగా ఎమ్మెల్యే స్థాయిలో జరిగే క్యాంపు రాజకీయాలు గ్రామ స్థాయిలో కూడా జరుగుతున్నాయి. దీనికి విరుగుడు ప్రత్యక్షంగా ప్రజలే అధ్యక్షులను, మునిసిపల్ చైర్మన్లను ఎన్నుకోవడం. లేకపతే ఈ ఎన్నికలపై డబ్బు, అధికార పార్టీల ప్రభావాన్ని ఆపడం కష్టం.

ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్నప్పుడు ఒకసారి సమితులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత 1987లో ఎన్టీర్ హయాంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిపారు. అంటే పంచాయతీ మెంబరు, సర్పంచి, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులను జనం నేరుగా ఎన్నుకున్నారు. కానీ 1992 చట్టంతో మళ్లీ పరోక్ష ఎన్నికలు తెరపైకి వచ్చాయి. గతంలో ప్రత్యక్ష ఎన్నికలున్నప్పుడు గ్రామాలు, మండలాలు, జిల్లాలకు పరస్పర సంబంధాలుండేవి. ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థతో ఆ లింకు తెగిపోయింది.

పరోక్ష ఎన్నికల వల్ల మరో పెద్ద సమస్య అధిష్టానం పెత్తనం. ఒకవేళ జెడ్పీ ఛైర్మన్ లేదా మేయర్ నేరుగా జనం నుంచి ఎన్నికైతే కొంత నైతిక స్థైర్యం ఉంటుంది. అలా కాకుండా పరోక్ష ఎన్నికతే ప్రతీ వార్డు మెంబరుకూ, కౌన్సిలరుకూ భయపడాల్సిన పరిస్థితి. అధిష్టానానికి నచ్చకపోతే పదవి నుంచి దించేయవచ్చు. అదే ప్రత్యక్ష ఎన్నికైతే ఆ సమస్య ఉండదు.

ఎన్నికలు ఆలస్యం

1992 రాజ్యాంగ సవరణలో లోపాలను ఉపయోగించుకుని ప్రభుత్వాలు ఈ ఎన్నికలను ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. తాము గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టి, కష్టంగా ఉన్నప్పుడు ఎన్నికలు ఆపేస్తున్నాయి. ఆలస్యానికి రిజర్వేషన్లను కారణంగా చూపిస్తున్నాయి. ప్రతీ ఎన్నికకూ ముందు ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే ఆ రిజర్వేషన్ ఖరారును ఆలస్యం చేస్తాయి. దీంతో ఎన్నికలు ఆలస్యం అవుతాయి. ఇక కొత్తగా మండలాలు, పంచాయితీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆలస్యం అవుతోంది. ఈ విషయంలో తమిళనాడు స్థానిక సంస్థల్లో పదేళ్ల రిజర్వేషన్ విధానం అమలు చేస్తోంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గడువు తీరేలోపు ఎన్నికల జరపాలన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలపై కచ్చితమైన నిబంధనలు లేకపోవడంతో ఈ ఆలస్యం పెరిగిపోతోంది. దాని వల్ల స్థానిక సంస్థల్లో ఎన్నో పనులు జరగకుండా ఆగిపోతున్నాయి. దీంతో పంచాయతీల పాలన సక్రమంగా ఉండడం లేదు. పంచాయతీ ఎన్నికలూ ఎప్పుడూ ఆలస్యం అవుతూంటే, మునిసిపల్ ఎన్నికలు ఇంకా దారుణం. హైదరాబాద్ నగరానికి పదేళ్ల పాటూ ఎన్నికల్లేని సందర్భాలున్నాయి.

1969లో జరగాల్సిన ఎన్నికలు 70లో జరిగాయి. తరువాత 75లో జరగాల్సిన ఎన్నికలు 81లో జరిగాయి. తరువాత 86 బదులు 88లో, 93 బదులు 95లో ఎన్నికలు జరిగాయి. 1995 తర్వాత 2000 జరగాల్సిన ఎన్నికలు 2001లో జరిగాయి. 2006 తరువాత 2014 మొదట్లో మళ్లీ ఎన్నికలు జరిగాయి.

మరి ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వవనే ప్రశ్న వస్తుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ఎమ్మెల్యేలే. ప్రస్తుతం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి అనధికారిక ప్రభుత్వంలా ఉంటున్నారు. కానీ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగి, వారికి నేరుగా నిధులు వస్తే, ఆ స్థానిక నాయకులు ఎమ్మెల్యేతో సమానం లేదా అంతకంటే ఎక్కువ పలుకుబడి సాధిస్తారు. అది ఎమ్మెల్యే స్థాయి నాయకులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇవ్వడానికి ఏ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వమూ ఆసక్తి చూపదు. స్థానిక నాయకత్వం తన కిందే ఉండాలనుకుంటారు తప్ప, తమతో సమానంగా ఉండాలని ఎవరకూ కోరుకోరు. అందుకే ఈ సంస్థల్లో తమ పెత్తనం కొనసాగించడానికే పరోక్ష ఎన్నికలు ఒక అస్త్రంగా ఉంటాయి వీరికి.

ఎఫ్3 కావాలి

ప్రస్తుతం పంచాయితీలకు మూడు కావాలి.. ఫంక్షన్స్, ఫంక్షనరీస్, ఫండ్స్ - నిధులు, విధులు, అధికారాలు. క్రమంగా స్థానిక సంస్థలకు వీటిని దూరం చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం మండలాలు, జిల్లాలకు నిధులు ఇవ్వకుండా నేరుగా పంచాయితీలకే ఇస్తోంది. అది తప్పు. అలాగే పంచాయితీ రాజ్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు రావాలి. నిజానికి పంచాయితీ రాజ్ కింద 29 పరిపాలనా అంశాలున్నాయి. ఆ జాబితా సరిచేయాలి. ఉదాహరణకు భూ సంస్కరణల్లాంటివి స్థానిక సంస్థలు చేయలేవు. అలాంటివి మారాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అదనపు భారంగా ఉన్నాయి. వాటి స్థానంలో ఎంపీపీ, జెడ్పీ, మునిసిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలి. నిధులు పెంచాలి. రాష్ట్రానికి వచ్చే వాటాలో సగం నిధులు స్థానిక సంస్థలకే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు బండారు రామ్మోహన రావు.

ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంటే

ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కానిస్టిట్యుయెన్సీ మెంబర్. జడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కానిస్టిట్యుయెన్సీ మెంబర్.

ఒకప్పటిలా పంచాయితీ సర్పంచులే తమలో ఒకరిని సమితి ప్రెసిడెంటుగా, వారిలో ఒకరిని జిల్లా ప్రెసిడెంటుగా ఎన్నుకునే పద్ధతి పోయింది. అలాగే ఆ రెండు పదవులకూ ప్రత్యక్ష ఎన్నికలు జరపడం లేదు. దీంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు అధ్యక్షులను ఎన్నుకోవడానికి ఆ పరిషత్ సభల్లో చర్చలు జరపడానికి ప్రతినిధులను ఎన్నిక చేసే పద్ధతి మొదలుపెట్టారు. ఆ ప్రతినిధులే వీరు. సగటున మూడు వేల జనాభాకు ఒక ఎంపీటీసీ ఉంటారు. గ్రామాలను, మండలాలను ప్రాదేశిక నియోజకవర్గాలుగా (టెరిటోరియల్ కానిస్టిట్యుయెన్సీ)లుగా విభజించి వాటికి ఎన్నుకున్న సభ్యుల్లో ఒకరిని చైర్మన్ గా ఎంపిక చేస్తారు. ఇది అచ్చం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులను ఎన్నుకునే విధానంలా ఉంటుంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
When will the power come to panchayats
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X