బాలు గొప్ప మనసుకు ఏసుదాస్ కన్నీళ్లు పట్టుకున్న వేళ... ఈ ఇద్దరు లెజెండ్స్ బంధం ఎప్పటికీ ప్రత్యేకం...
గానగంధర్వుడు,సినీ సంగీత దిగ్గజం బాలసుబ్రహ్మణ్యం మరణం ఆబాలగోపాలాన్ని విషాదంలో ముంచెత్తింది. తనదైన గాత్రంతో సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన బాలు ఇక లేరన్న వార్త చాలామందిని చలింపజేస్తోంది. ఐదు దశాబ్దాల పాటు నిర్విరామంగా సాగిన ఆయన గాత్రం ఇక ఆగిపోయిందంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. బాలు పాటలను,ఆయన జీవిత విశేషాలను మరోసారి గుర్తుచేసుకుంటూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.
లెజెండరీ బాలు తన సంగీత ప్రయాణంలో ఎన్నో పాటలు పాడి ఉండవచ్చు... కానీ మరో లెజండరీ గాయకుడు ఏసుదాసుతో కలిసి ఆయన పాడిన పాటలు.. ఇద్దరూ ఒకే వేదికపై అభిమానులను ఉర్రూతలూగించిన తీరు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఏసుదాసుతో బాలు అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఒక పెద్దన్నలా,గురువుగా ఏసుదాసు పట్ల ఎంతో విధేయతతో ఉండే బాలు ఆయనకు పాదపూజ కూడా చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఒకానొక ఇంటర్వ్యూలో ఏసుదాసుతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..
వేల పాటలు పాడి.. కోట్లాది అభిమానుల మనసు దోచిన ఎస్పీ బాలు తొలి పాట ఇదే

ఏసుదాసుతో పాడాలంటే భయమేసేది.. : బాలు
'మేమిద్దరం సినీ పరిశ్రమలో చాలాకాలంగా ఉన్నా... దగ్గరగా మెలిగే సమయం చాలా రోజుల తర్వాతే వచ్చింది... ఆయన్ను చూసి నేను భయపడేవాడిని... మేదావి... పెద్దవారు... ఒక రాష్ట్రంలో దేవుడిలా కీర్తించబడుతున్న వ్యక్తి... ఆయనతో కలిసి పాడేటప్పుడు ఎలా పాడుతామో ఏమోనని దూరం దూరంగానే ఉండేవాడిని. ఆయన కూడా కాస్త రిజర్వ్ గానే ఉండేవారు. ఒక 20 ఏళ్ల నుంచి ఇద్దరం బాగా దగ్గరయ్యే అవకాశం వచ్చింది. కలిసి ఈవెంట్స్ చేయడంతో అనుబంధం మరింత పెరిగింది..' అని బాల సుబ్రహ్మణ్యంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఒకే వేదికపై ఇద్దరు...
'నిజానికి లబ్ద ప్రతిష్టులైన ఇద్దరు వ్యక్తులు ఒకే వేదిక పైకి రావడానికి ఇష్టపడరు... కానీ మా మధ్య ఎలాంటి భేషజాలు,అభ్యంతరాలు లేవు కాబట్టి సంతోషంగా కలిసి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం.
పాటల విషయంలో ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. అయితే ఆయనకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే... సంప్రదాయ సంగీతం మీద మంచి పట్టు ఉంది... వేదికపై అద్భుతంగా కచేరీలు చేయగలరు... ఆ పని నేను చేయలేను... మాకు పాటలిచ్చేవారు కూడా ఇది బాలు పాడితే బాగుంటుంది... ఇది ఏసుదాసు పాడితే బాగుంటుందని ఇచ్చేవారు... మేమూ సంతోషంగా పాడేవాళ్లం..' అని బాలు తెలిపారు.

ఏసుదాస్-బాలు... ఓ ఈవెంట్...
'ప్యారిస్‌లో ఒక కార్యక్రమం చేసేందుకు వెళ్లాం.ఎప్పుడూ ఏసుదాసు వెంట ఉండే ఆయన సతీమణి ఆ ఈవెంట్‌కు రాలేదు. ఆరోజు రాత్రి ఈవెంట్ అయిపోయాక నేను,నా భార్య హోటల్ గదికి వచ్చి కుక్కర్లో కాస్త రైస్ పెట్టుకుని.. కొన్ని పొడులు,పెరుగు వేసుకుని తిన్నాం. అదే సమయంలో ఏసుదాస్ గారు తిన్నారో లేదోనన్న సందేహం వచ్చింది. వెంటనే ఈవెంట్ నిర్వాహకుడికి ఫోన్ చేస్తే నీళ్లు నమిలాడు. దీంతో నేనే ఓ నాలుగు ముద్దలు అన్నం కలుపుకుని వెళ్లి ఆయన గది తలుపు తట్టాను. ఈ టైమ్‌లో ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయారు. భోజనం గురించి ఆరా తీస్తే... నిర్వాహకులు నేను చెప్పిన ఆర్డర్ మరిచిపోయినట్టున్నారు... మంచినీళ్లు తాగి పడుకున్నాను అని చెప్పారు.' అని బాలు చెప్పుకొచ్చారు.

ఏసుదాసు కన్నీళ్లు పెట్టుకున్న వేళ...
'నేను తీసుకెళ్లిన భోజనం ఆయనకు ఇచ్చాను... అప్పుడు ఆయన కళ్లల్లో నుంచి జలజలా కన్నీళ్లు... జీవితంలో ఆకలంటే ఏంటో బాగా తెలిసినవాడిని... ఎంతో కష్టపడి పైకొచ్చాను... ఎన్నో దేవాలయాలు తిరిగి పాటలు పాడాను... ఇంత చక్కటి ప్రసాదం నా జీవితంలో ఎక్కడా దొరకలేదయ్యా అన్నారు. ఆరోజు నుంచి మా అనుబంధం ఇంకా పెరిగింది... బాలు నా తమ్ముడు అని ప్రతీ సభలో ఆయన సంతోషంగా చెప్పేవారు.' అంటూ ఆ ఇంటర్వ్యూలో ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఏసుదాసుకు గురుదక్షిణగా పాద పూజ చేసిన బాలు
చెన్నైలో ఎక్కడైతే తన పాటల ప్రస్థానం మొదలైందో అదే విజయా గార్డెన్స్‌లో 2017లో బాల సుబ్రహ్మణ్యం ఏసుదాసుకు గురు దక్షిణగా పాద పూజ చేశారు. మరో ఇద్దరు లెజండరీ సింగర్స్ జానకి,సుశీలకు కూడా అదే వేదికపై పాద పూజ చేయాలని ఆయన భావించినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఆ ఇద్దరు ఆరోజు రాలేకపోయారు. దక్షిణాదికి చెందిన ఈ నలుగురు లెజెండరీ సింగర్స్‌లో ఇప్పుడో తార రాలిపోవడం సంగీత అభిమానులను విషాదంలో ముంచెత్తింది.