సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఫ్యామిలీలో కరోనా కలకలం: మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్
ఒమిక్రాన్ అంటేనే జనం గజ గజ వణుకుతున్నారు. సౌతాఫ్రికా నుంచి వచ్చినవారిని వెతికి మరీ పరీక్షలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి చండీగఢ్ వచ్చిన ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఆ కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. జినోమ్ సీక్వెన్సింగ్ కోసం అధికారులు ఢిల్లీ ఎన్సిడీసీకి నమూనాలు పంపించారు.
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కోవిడ్ సోకిన వ్యక్తి నవంబర్ 21న దేశానికి వచ్చాడు. భారత్‌కు రాగానే జరిపిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయితే నిన్న జరిపిన పరీక్షలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం కోవిడ్ సోకిన వ్యక్తులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటీన్ లో ఉన్నారు. లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 13 దేశాలకు వ్యాపించింది. అది గనుక ఇండియాలో వ్యాపిస్తే ఇబ్బందులు తప్పవనే భయాల నడుమ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.
సౌతాఫ్రికా సహా ఒమిక్రాన్ ఉధృతి ఉన్న దేశాల నుంచి వచ్చిన, వస్తోన్న ప్రయాణికులను వెతికిమరీ టెస్టులు చేస్తున్నారు. ఒమిక్రాన్ భయాందోళన నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కట్టడి చేయాలని సూచించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొంది. ఆఫ్రికా దేశాల్లో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ వారం వ్యవధిలోనే 13 దేశాలకు వ్యాపించింది. డజనుకు పైగా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

అంతర్జాతీయ విమానాల రాకపోకలను వచ్చే నెల 15 నుంచి రాకపోకలను పునరుద్ధరించాలన్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచన చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన తర్వాతే విమాన సర్వీసులను తిరిగి ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు, వారిపై నిఘాకు సంబంధించిన ఎస్వోపీ మార్గదర్శకాలపై కూడా నిర్ణయిస్తామన్నారు.
విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరపాలని కేంద్రం తెలిపింది. 'ఎట్ రిస్క్' జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్‌పోర్టులోనే ఉండాలని నిబంధన పెట్టింది. పాజిటివ్‌గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్, జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్కు పంపించాలని తెలిపింది. ప్యాసింజర్ల ట్రావెల్ హిస్టరీ సేకరించాలని సూచించింది.