India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ముస్లిం మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన నూపుర్ శర్మకు మద్దతుగా పోస్టులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాద్ అన్సారీ అనే యువకుడిని మహారాష్ట్రలోని థాణె పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు.

అయితే, సాద్ అన్సారీ ఎక్కడా నూపుర్ శర్మకు మద్ధతుగా వ్యాఖ్యలు చేయలేదని అతని తరఫు న్యాయవాది అంటుండగా, కుటుంబ సభ్యులు ఈ అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

''ఆదివారం నాడు సాద్ అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు రోజుల పోలీస్ కస్టడీకి పంపించారు'' అని భివాండీ ప్రాంత డీసీపీ యోగేశ్ చవాన్ బీబీసీతో అన్నారు.

నూపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ రాశారంటూ కొందరు వ్యక్తులు సాద్ అన్సారీ ఇంట్లోకి ప్రవేశించి ఆయన్ను బెదిరించారు. కొట్టారు.

ఈ కేసులో 100 మందికి పైగా వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సాద్ అన్సారీని అరెస్టు చేయడం పై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే, దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు వారు ఇష్టపడటం లేదు.

''చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. జరిగింది తప్పే'' అని అన్సారీ బంధువు జైన్ అన్సారీ అన్నారు.

ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయని ఆ వర్గం వాదిస్తోంది

ఆ రాత్రి ఏం జరిగింది?

ఇంజినీరింగ్ చదివిన 19 ఏళ్ల సాద్ అన్సారీ ఇది గత శనివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ రాశారు. నూపుర్ శర్మకు మద్దతిచ్చేలా ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న ఈ పోస్ట్, వైరల్ అయింది. ముస్లిం వర్గానికి చెందిన కొందరు ఈ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం సాయంత్రం సాద్ ఇంటి ముందుకు నిరసనకారులు చేరుకున్నారు. పలువురు వ్యక్తులు సాద్ అన్సారీ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాద్ క్షమాపణలు చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోపోద్రిక్తులైన కొందరు క్షమాపణ చెప్పాలంటూ సాద్ ను బెదిరిస్తున్నట్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.

కొందరు వ్యక్తులు సాద్ ను దుర్భాషలాడగా, కల్మా (అల్లా, అతని ప్రవక్త హజ్రత్ మొహమ్మద్‌పై తనకు విశ్వాసం ఉందంటూ ముస్లింలు చేసే ప్రమాణం)ను చదవాలని కొందరు డిమాండ్ చేశారు. ఓ వ్యక్తి సాద్‌ ను చెంపదెబ్బ కొట్టారు.

ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులను పిలిపించారు. వారు సాద్ ను అదుపులోకి తీసుకున్నారు.

సాద్ అరెస్ట్ పై పోలీసులు ఏం చెబుతున్నారు?

సాద్ అరెస్టును బీబీసీ కి ధృవీకరించిన భివాండీ డీసీపీ యోగేష్ చవాన్, అతని సోషల్ మీడియా పోస్ట్ కారణంగా భివాండిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, అతన్ని అరెస్టు చేయాల్సిందిగా ముస్లిం వర్గాలు డిమాండ్ చేశాయని చెప్పారు.

అయితే సాద్‌పై వచ్చిన ఆరోపణలను అతని న్యాయవాది నారాయణ్ అయ్యర్ తీవ్రంగా ఖండించారు.

"సాద్ అన్సారీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. అతను రెచ్చగొట్టే ప్రకటనలు ఏమీ చేయలేదు" అని అయ్యర్ బీబీసీతో అన్నారు.

''నేను ఏ ప్రత్యేక మతానికి మద్దతు ఇవ్వను. ఈ ద్వేషాన్ని ఆపాలి" అని మాత్రమే సాద్ తన పోస్ట్ లో పేర్కొన్నట్లు నారాయణ్ అయ్యర్ అన్నారు.

అయ్యర్ అభిప్రాయం ప్రకారం నూపుర్ శర్మ ఏ ప్రకటనను సాద్ సమర్థించలేదు.

మరోవైపు సాద్ అన్సారీ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన కొందరు వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికి 100 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, వీరిలో 18 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరికి నోటీసులు పంపామని భివాండి డీసీపీ యోగేశ్ చవాన్ అన్నారు.

సాద్ అన్సారీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

ఈ ఘటన తర్వాత సాద్ అన్సారీ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కావడంతో సాద్ అరెస్టు పై కుటుంబం తరపున ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు.

తమ కమ్యూనిటీలోని వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడితే మరోసారి తమపై దాడులు జరుగుతాయని, బెదిరించడమో లేక కొట్టి చంపేయడమో చేస్తారని ఆ కుటుంబం భయపడుతోంది.

సాద్ అన్సారీ బంధువు జైన్ అన్సారీతో బీబీసీ మాట్లాడింది. ఆయన కూడా ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. సాద్ పై దాడి చేయడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని జైన్ అభిప్రాయపడ్డారు.

''శనివారం రాత్రి మూడు గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. వారికి నచ్చజెప్పేందుకు మేం ప్రయత్నించాం. వారు కాస్త శాంతించాక సాద్ ను బయటకు తీసుకొచ్చాం. ఆగ్రహంతో ఉన్న కొందరు వ్యక్తులు అతన్ని కొట్టారు'' అని సాద్ అన్సారీ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

రాత్రిపూట బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి కొట్టే హక్కు ఆ మూక కు ఎవరు ఇచ్చారనేది కుటుంబ సభ్యుల ప్రశ్న. అదే సమయంలో పోలీసుల చర్యల పై కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"సాద్‌ను అరెస్టు చేయడానికి ముందు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సి ఉంది. కానీ అలా చేయలేదు" అని ఓ కుటుంబ సభ్యుడు అన్నారు.

సాద్ గత కొన్నేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నారని, చికిత్స పొందుతున్నారని, ఇటీవల మానసిక వైద్యుల వద్దకు కూడా తీసుకెళ్లామని పేరు చెప్పడానికి ఇష్టపడని సాద్ బంధువు ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Who is Saad Ansari? Why was this Muslim youth arrested in the controversy over Nupur Sharma's remarks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X