India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరు... బీసీసీఐ పరిశీలనలో ఎవరెవరు ఉన్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత, ఇప్పుడు అందరి మదిలో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరు?

దక్షిణాఫ్రికా టూర్‌కు వైట్‌బాల్‌ కెప్టెన్‌గా, టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను నియమిస్తూ బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం బోర్డు భవిష్యత్తు ప్రణాళికల్లో భాగమేనని తెలుస్తోంది.

రోహిత్ శర్మను టెస్ట్ వైస్-కెప్టెన్‌గా చేస్తున్నప్పుడు, విరాట్ ఇంత త్వరగా టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడని ఎవరికీ తెలియదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో రోహిత్ శర్మతో పాటు కె.ఎల్.రాహుల్, రిషభ్ పంత్ కూడా కెప్టెన్సీ బరిలో నిలిచారు.

మరి ఇప్పుడు బీసీసీఐ తెలుపు, ఎరుపు బంతులకు వేర్వేరు కెప్టెన్‌లను నియమించాలని అనుకుంటోందా లేక ఇంతకు ముందులాగా మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ను కొనసాగించాలని భావిస్తోందా అన్నది చాలా కీలకంగా మారింది.

అలాగే, బీసీసీఐ ఈ సమస్యకు తక్షణ పరిష్కారాన్ని కనుక్కోవాలనుకుంటోందా లేక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలనుకుంటోందా అన్నది కూడా ముఖ్యమే.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ ఫస్ట్ ఆప్షనా?

రోహిత్ శర్మ అనుభవం ఉన్న కెప్టెన్. ఐపీఎల్‌లో ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టారు. దీంతోపాటు విరాట్ లేనప్పుడు టీ20, వన్డే మ్యాచ్‌లకు కూడా విజయవంతమైన కెప్టెన్‌గా వ్యవహరించారు.

రోహిత్ 10 వన్డేలకు టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా పని చేయగా, అందులో ఎనిమిది విజయాలు సాధించారు. అలాగే 22 టీ20 మ్యాచ్‌ల్లో 18 మ్యాచుల్లో టీమ్‌ను గెలిపించారు.

2019లో టెస్టు జట్టులో ఓపెనర్‌గా ఆడినప్పటి నుంచి బ్యాటింగ్‌లో రాణించడం రోహిత్‌కు అనుకూలమైన అంశం. ఈ సమయంలో ఆయన 58.48 సగటుతో పరుగులు చేశాడు.

రోహిత్‌ కు ప్రతికూలంగా మారేది ఏదైనా ఉందంటే అది అతని గాయాల సమస్యే. ఒకవేళ మూడు ఫార్మాట్‌లకు ఆయనే కెప్టెన్ అయితే, పనిభారం కూడా సమస్య కావచ్చు.

గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లలేకపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చాయి.

ఇవన్నీ కాకుండా బీసీసీఐ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, టెస్ట్ కెప్టెన్సీ ప్లాన్‌లో రోహిత్ భాగం కాకపోవచ్చు. అందుకు కారణం రోహిత్ వయసు.

ప్రస్తుతం 35 ఏళ్లున్న రోహిత్ మరో రెండు మూడేళ్లకు మించి కెరీర్‌లో కొనసాగే అవకాశాలు తక్కువ. అందువల్ల బీసీసీఐ యువకుడైన కెప్టెన్ కోసం ప్రయత్నం చేయవచ్చు.

కేఎల్ రాహుల్

పోటీలో రాహుల్

2019లో టెస్టు జట్టు నుంచి తొలగించిన తర్వాత, గత ఏడాది ఆగస్టులో కె.ఎల్. రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా టెస్ట్ జట్టు కెప్టెన్సీకి బలమైన పోటీదారుగా ఎదిగారు.

ఇంగ్లండ్‌ లార్డ్స్‌ టెస్టులో, దక్షిణాఫ్రికా సెంచూరియన్‌ టెస్టులో సెంచరీ సాధించి తన ఇమేజ్‌ని పదిలం చేసుకున్నారు. విరాట్‌ ఫిట్‌నెస్‌తో లేనప్పుడు జోహన్నెస్‌బర్గ్‌ టెస్టుకు కెప్టెన్‌గా అవకాశం అందుకోవడానికి ఇదే కారణం.

కె.ఎల్. రాహుల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం పెద్దగా లేకపోవచ్చు. కానీ, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను బాగా నడిపించారన్న పేరుంది.

రోహిత్ అందుబాటులో లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు.

రిషభ్ పంత్

పంత్‌ కు గవాస్కర్ సపోర్ట్

రిషబ్ పంత్‌ను టెస్టు కెప్టెన్‌గా చేసేందుకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సానుకూలంగా ఉన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం పంత్‌ను మంచి క్రికెటర్‌గా మార్చగలదని ఆయన భావిస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టులో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంత్ సెంచరీ చేయడం ఆయనలోని పోరాట పటిమను బైటపెట్టింది. అతని ఈ సామర్థ్యం కెప్టెన్సీకి ఉపయోగపడవచ్చు.

గత ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా పంత్ వ్యవహరించారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోచ్ రికీ పాంటింగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు.

రిషబ్ పంత్‌కు 24 ఏళ్లు. మరి ఇంత చిన్న వయసులో భారత్‌కి టెస్టు కెప్టెన్‌ కాగలడా అన్నది సందేహం.

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 21 సంవత్సరాల వయస్సులో కెప్టెన్‌ అయ్యారు. దేశంలోని సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.

కోహ్లీ, రహానే

ఒకప్పుడు విరాట్‌కు ప్రత్యామ్నాయం రహానే

టీమ్ ఇండియా చివరి ఆస్ట్రేలియా పర్యటనలో, కెప్టెన్‌గా బ్రిస్బేన్ టెస్టులో అజింక్యా రహానె విజయం సాధించి సిరీస్‌ను గెలుచుకున్న విధానం అబ్బురపరిచింది.

ఈ సిరీస్ విజయం భారత జట్టుకు ఎంతో కీలకమైంది. ఎందుకంటే అడిలైడ్‌లో ఆడిన మొదటి టెస్ట్‌లో, భారతదేశం ఓడిపోవడమే కాకుండా దాని ఇన్నింగ్స్‌ను కనిష్ట స్కోరు(36 పరుగులు)కు సాధించింది.

ఈ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత రహానే జట్టు స్ఫూర్తిని మార్చేశారు.

దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత రహానే పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన ఆయన స్థానాన్ని బలహీనపరిచింది. దీని తర్వాత, ఆడిన 13 టెస్టుల్లో అతను దాదాపు 20 సగటుతో పరుగులు సాధించగలిగారు. ఫలితంగా, దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టెస్ట్ కెప్టెన్సీ కోసం బీసీసీఐ ప్రణాళికలలో ఆయన ఒక భాగం కాదు. ఆయన స్థానంలో వైస్-కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించారు.

ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో రహానే బ్యాట్‌తో మెరిసి ఉంటే, విరాట్ తర్వాత టెస్టు కెప్టెన్‌గా ఉండేవారనడంలో సందేహం లేదు.

రహానే మాదిరిగానే రవిచంద్రన్ అశ్విన్ కూడా చాలా అనుభవజ్ఞుడు. 400కు పైగా టెస్టు వికెట్లు తీసిన ఘనత కూడా ఆయనకుంది. కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది.

కానీ, బౌలింగ్‌కు న్యాయం చేయలేరనే కారణంతో బౌలర్లను కెప్టెన్‌లుగా మార్చరన్న అభిప్రాయం ఉంది. అందుకే ప్రస్తుతం ఆయన పేరు ఎక్కడా వినిపించే పరిస్థితి లేదు.

మరో ఫార్ములా

కెప్టెన్ ఎవరన్న నిర్ణయంలో ఆచితూచి అడుగు వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే శ్రీలంకతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కంటే ముందే కెప్టెన్‌ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

మరో రెండేళ్లలో రెండు ప్రపంచ కప్‌లు జరగబోతున్నాయి.ఇది కాకుండా అనేక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితిలో రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా కేఎల్ రాహుల్‌ని డిప్యూటీని చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం క్రీడాకారుల పనిభారాన్ని తగ్గించుకోవడానికి పెద్దపీట వేస్తున్నారు. కొన్ని సిరీస్‌లలో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా రాహుల్‌కు కెప్టెన్సీ ఇవ్వవచ్చు. దీంతో రోహిత్ కూడా అవిశ్రాంతంగా క్రికెట్‌ ఆడాల్సిన పని ఉండదు.

అదే సమయంలో రాహుల్ కెప్టెన్‌గా అనుభవం సాధిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Who is the next Test captain of Team India after Virat Kohli? Who is under BCCI scrutiny
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X