బీజేపీ పెద్ద తలకాయలపై శివసేన గురి: కాశ్మీర్ లో ఈయూ పార్లమెంటేరియన్ల టూర్ పై ఘాటుగా..!
ముంబై: మహరాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాను భారతీయ జనతాపార్టీ తోసిపుచ్చిన నేపథ్యంలో.. ఇక విమర్శలకు పదును పెట్టింది శివసేన. ఏకంగా బీజేపీ పెద్ద తలకాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను టార్గెట్ గా చేసింది. ఘాటు విమర్శలకు తెర తీసింది. నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ సభ్యుల బృందం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడాన్ని శివసేన తప్పు పట్టింది. దీనిపై తమ మౌత్ పీస్ సామ్నాలో ప్రత్యేక ఎడిటోరియల్ ను ప్రచురించింది.
రణమా..శరణమా: ఇక బంతి శివసేన కోర్టులో: నో 50-50 ఫార్ములా..ఇక మీ ఇష్టం: బాంబు పేల్చిన దేవేంద్ర..!

కాశ్మీర్ అంతర్గత వ్యవహారం కాదా?
జమ్మూ కాశ్మీర్ అంశం మన దేశ అంతర్గత వ్యవహారమని, దీన్ని నరేంద్ర మోడీ రచ్చ కీడ్చుతున్నారని శివసేన ఘాటు విమర్శలు చేసింది. యూరోపియన్ పార్లమెంటేరియన్ బృందాన్ని జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ఎలా? ఎవరినడిగి అనుమతి ఇచ్చారని నిలదీసింది. ఇదివరకు బీజేపీయేతర రాజకీయ పార్టీల నాయకులు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తే, వారిని నిర్బంధించి, శ్రీనగర్ విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించేసిన విషయాన్ని శివసేన ఈ ఎడిటోరియల్ లో ప్రస్తావించింది. దేశ రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. విదేశీయులకు ఒక న్యాయమా? అంటూ నిప్పులు చెరిగింది.

కాశ్మీర్ లో మువ్వన్నెల జెండా ఎగరట్లేదా?
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత ఆ రాష్ట్రంలో త్రివర్ణ పతాకం ఎగురుతోందని, దీనికి ప్రధాన కారకులు నరేంద్ర మోడీ-అమిత్ షా లేనని, ఇది హర్షించదగ్గ పరిణామమని పేర్కొంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ప్రతి భారతీయుడూ స్వాగతిస్తున్నాడని ప్రశంసించింది. అలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమౌతుందే తప్ప దాన్ని అంతర్జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరించకూడదని సామ్నాలో ప్రచురించిన ఎడిటోరియల్ లో పేర్కొంది శివసేన.

మన ఎంపీలకు లేని గౌరవం వారికా..
మువ్వన్నెల పతాకం ఎగురుతున్న కాశ్మీర్ కు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా అది భారత్ లో అంతర్భాగమేనని అవుతుందని స్పష్టం చేసింది. ఇలాంటి సమస్యాత్మక, సున్నితమైన అంశాలను ఎదుర్కొంటున్న జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి యూరోపియన్ పార్లమెంటేరియన్లకు అనుమతి ఇవ్వడం ద్వారా బీజేపీ దేశ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందని విమర్శించింది. ఇదివరకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల బృందం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి అనుమతి ఇవ్వాలని కోరగా.. అది దేశ అంతర్గత విషయమంటూ సమాధానం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? అటూ ప్రశ్నించింది. ప్రతిపక్షాలతో కూడిన భారత పార్లమెంటేరియన్లకు సైతం జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ఇవ్వలేదని పేర్కొంది.