• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయట్లేదు? - తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు : ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

హైకోర్టు

అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించిందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

విద్య, ఉపాధి అంశాల్లో ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసినా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అన్ని కోర్సులకూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేసేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.

ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం కోటా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తే, కేవలం వైద్య విద్యలో తప్ప ఎక్కడా దీనిని అమలు చేయడం లేదంటూ బీజేపీ తెలంగాణ ఓబీసీ యువమోర్చా అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజ్‌, మరొకరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు జారీచేస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అన్నారు. వైద్య విద్యలో మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తోందని, మిగిలిన కోర్సులకు దీనిని వర్తింప చేయడం లేదన్నారు.

పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం విధాన నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వ వివరణ తీసుకుని చెబుతానని, నాలుగు వారాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని ఈ కథనంలో తెలిపారు.

ఊరికి దూరంగా ఇళ్ల పట్టాలు మాకొద్దు అంటున్న మహిళలు

తమ ఊరికి దూరంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలు వద్దంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ మహిళలతో హోంమంత్రి మేకతోటి సుచరిత వాదనకు దిగిన సంఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదలలో మంగళవారం చోటుచేసుకుందని ఈనాడు ఒక కథనంలో తెలిపింది. యనమదల గ్రామ మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. గ్రామానికి దూరంగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ఆమె పట్టాలు అందిస్తుండగా ఎస్సీ కాలనీకి చెందిన కొందరు మహిళలు 2 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్న ఇళ్ల పట్టాలు తమకు వద్దని, దగ్గరలో ఉన్న ఈదులపాలెం గ్రామ మహిళలకు ఇచ్చిన లేఅవుట్లో ఇవ్వాలని కోరారు.

దీనిపై మంత్రి మాట్లాడుతూ.. పట్టాలు అవసరం లేకపోతే వెనక్కు ఇచ్చేయండని చెప్పి భోజనానికి వెళ్లారు. ఈ సమాధానంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు తిరిగి మంత్రి గెలుపునకు పనిచేశామని, ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్నందుకు ద్రోహం చేశారంటూ ఆరోపించారు. 300 గడపల్లో 23 మందికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇళ్లు మంజూరు చేశారని, రేషన్‌ దుకాణాలు, పిల్లల పాఠశాలలు, పనులకు తిరిగేందుకు రవాణా ఛార్జీలు చెల్లించలేమని వాపోయారు.

అనంతరం వారు మంత్రి వద్దకు చేరుకొని నిలదీశారు. ఈదులపాలెం లేఅవుట్‌లో స్థలం లేదని మంత్రి చెప్పగా కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు. మిమ్మలను నమ్ముకున్నందుకు మీరు చేసే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కాసింత ఆగ్రహంతో మంత్రి 'న్యాయం చేయడం మాకు రాదు. మీకు వచ్చు కదా' అంటూ వాదనకు దిగారు. 'మీరు మాట్లాడే దానికి అర్థం ఉందా' అనగా, 'ఎందుకండి..' అని ఓ మహిళ అనడంతో 'ఏంటి చెప్పు' అంటూ మంత్రి సుచరిత కాస్త దూకుడుగా ముందుకు వెళ్లారు. అక్కడే ఉన్న కొందరు మహిళలను నియంత్రించడంతో వారు నెమ్మదించారు. తమ 23 మందికీ దగ్గరలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇక్కడ వద్దని చెప్పడంతో సరేనంటూ మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఈ కథనంలో పేర్కొన్నారు.

కరోనావైరస్ వ్యాక్సీన్

తెలంగాణలో కరోనా పంపిణీకి 1,500 కేంద్రాల ఏర్పాటు

కరోనా వ్యాక్సిన్‌ పంపి‌ణీకి ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్న‌ది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తు‌న్నట్టు ప్రజా‌రో‌గ్య‌శాఖ సంచా‌ల‌కుడు గడల శ్రీని‌వా‌స‌రావు తెలి‌పారని నమస్తే తెలంగాణ తన కథనంలో తెలిపింది.

వైద్యా‌రో‌గ్య‌శాఖ సిబ్బం‌దికి తొలి‌వి‌డు‌తలో ఇచ్చేం‌దుకు ఏర్పాట్లు చేసి‌నట్టు చెప్పారు. సాంకే‌తిక సమ‌స్యలు, వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీ, వ్యాక్సి‌నే‌టర్ల తయారీ తది‌తర అంశా‌లపై సన్న‌ద్ధ‌మ‌య్యేం‌దుకు గురు, శుక్ర వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైరన్‌ నిర్వ‌హి‌స్తు‌న్నట్టు చెప్పారు.

హైద‌రా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ జిల్లా‌ల్లోని ఏడు కేంద్రాల్లో నిర్వ‌హిం‌చిన డ్రైరన్‌ విజ‌య‌వం‌త‌మైం‌దని తెలి‌పారు. ఈ క్రమంలో ఏర్పడ్డ సమ‌స్య‌లకు పరి‌ష్కారం చూపేం‌దుకు జిల్లా, మండల స్థాయిలో ఏర్పడ్డ టాస్క్‌‌ఫోర్స్‌ కమి‌టీలు కృషి చేస్తు‌న్నా‌యని పేర్కొ‌న్నారు. కొవిన్‌ సాఫ్ట్‌‌వే‌ర్‌లో ఇప్ప‌టి‌వ‌రకు సుమారు 2.90ల‌క్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు దవా‌ఖా‌నల సిబ్బంది నమోదు పూర్త‌యిం‌దని తెలి‌పారు. ప్రపం‌చంలో ఎక్కడా ఎవరు కూడా వ్యాక్సిన్‌ వల్ల ప్రాణాలు కోల్పో‌యిన పరి‌స్థి‌తులు లేవని చెప్పారని ఈ కథనంలో తెలిపారు.

జగన్

ఆలయాల ధ్వంసానికి పాల్పడుతున్న వారెవ్వరైనా వదిలిపెట్టొద్దు...జగన్

కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతూ, విగ్రహాలను ధ్వంసం చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని సాక్షి ఒక కథనంలో తెలిపింది.

ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయొద్దని, ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవైనా ఘటనలు జరిగితే ఖండించాలని, మత సామరస్యం కోసం పాటుపడే వారికి సహకరించాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆదేశించారు. విగ్రహాలను ధ్వంసం చేసే పనులను చేపడితే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలని పునరుద్ఘాటించారని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telangana high court questions govt on EWS reservations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X