వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేంద్ర సింగ్ టికైత్ 1988లో ఉవ్వెత్తున ఎగసిన రైతు ఉద్యమాన్ని ఎందుకు అకస్మాత్తుగా ఆపేశారు... తెర వెనక ఏం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

సోఫా మీద బాసింపట్టు వేసుకుని, గోరఖ్ పూరి యాసలో తన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ కనిపించే నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్, ఈ ప్రాంతంలో తనను దెబ్బకొట్టగలవారు ఎవరైనా ఉంటారని కలలో కూడా ఊహించి ఉండరు.

1987నాటి వరకు ఆయన అలానే అనుకునే వారు. కారా ముఖేరి విద్యుత్ కేంద్రం దగ్గర రైతులు ఆందోళనకు దిగినప్పుడు వీర్ బహదూర్ సింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అప్పటి భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు మహేంద్ర సింగ్ టికైత్ ను సంప్రదించి, ఆయన గ్రామం సిసౌలీకి వస్తానని హామీ ఇచ్చారు. అక్కడ రైతులకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలను ప్రకటించాలని ఆయన భావించారు.

టికైత్ దీనికి అంగీకరించారు. అయితే వీర్ బహదూర్ సింగ్‌తోపాటు కాంగ్రెస్ నేతలుగానీ, కార్యకర్తలుగానీ, పోలీసులుగానీ రావద్దని షరతు పెట్టారు. అందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అంగీకరించారు.

1987 ఆగస్టు 11న వీర్ బహదూర్ సింగ్ హెలికాప్టర్ సిసౌలిలో దిగారు. కానీ ఆయన్ను స్వాగతించడానికి ఎవరూ లేరు. అక్కడి నుంచి ఆయన సమావేశ స్థలానికి వెళ్ళడానికి అర కిలోమీటర్ నడవాలి.

వేదికపై వెళ్లిన ఆయన తనకు కాసిని మంచి నీళ్లు కావాలని అడిగారు. వెంటనే టికైత్ అనుచరులు ఆయనకు దోసిళ్లతో నీళ్లు తీసుకువచ్చారు.

తనకు ఇలా మంచినీళ్లు ఇవ్వడాన్ని అవమానంగా భావించారు వీర్ బహదూర్ సింగ్. కానీ, మహేంద్ర సింగ్ టికైత్ దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చెప్పే మాటలను శ్రద్ధగా విన్నారు. వీర్ బహదూర్ సింగ్ మాత్రం కోపంతో రగిలిపోతున్నారు. రైతులకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే లక్నో వెళ్లిపోయారాయన.

రాజకీయ నాయకులకు దూరంగా...

1935 అక్టోబర్ 6న ఉత్తర్ ప్రదేశ్ లోని సిసౌలీ గ్రామంలో జన్మించారు మహేంద్ర సింగ్ టికైత్. ఆరడుగుల ఎత్తు ఉండే టికైత్ మందపాటి కుర్తా, గాంధీ టోపీ ధరించి కనిపించేవారు. నొప్పి కారణంగా నడుముకు ఒక పట్టీని కూడా ధరించేవారాయన.

తండ్రి చనిపోయాక, బలియన్ ఖాప్ పంచాయితీకి పెద్దగా బాధ్యతలు తీసుకున్నారు టికైత్. అప్పటికి ఆయన వయసు ఎనిమిదేళ్లు.

''మహేంద్ర సింగ్ టికైత్ అనుకోకుండా రైతు నాయకుడయ్యారు. చౌదరి చరణ్ సింగ్ మరణం తరువాత పశ్చిమ, ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ శూన్యం ఏర్పడింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ ధరను పెంచింది. దీనికి వ్యతిరేకంగా రైతులు నిరసనలు ప్రారంభించారు.

టికైత్ బలియన్ ఖాప్ కు పెద్ద కాబట్టి ఆయన్ను ముందు పెట్టుకుని రైతులు ఆందోళనలు చేశారు. ఆ నిరసనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ ఘటన మహేంద్ర సింగ్ టికైత్ ను రైతు నేతగా మార్చింది’’ అని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ అగ్నిహోత్రి అన్నారు.

''కాల్పుల ఘటన జరిగిన రెండు మూడు రోజుల తర్వాత నేను ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి సిసౌలీ గ్రామానికి వెళ్లాను. ఆయన చుట్టూ వందలమంది కూర్చుని ఉన్నారు. దేశి నెయ్యి ఉపయోగించి వారి ఇంట్లో దీపం వెలిగించి ఉంది. అప్పటికి ఆయనకు రాజకీయాలలో ఏబీసీడీలు కూడా తెలియవు’’ అని బీబీసీలోని పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఖుర్బాన్ అలీ వెల్లడించారు.

టికైత్ ఎప్పుడూ రాజకీయ నాయకులను తన ఉద్యమంలోకి రానివ్వలేదు. చరణ్ సింగ్ భార్య గాయత్రీ దేవి, కుమారుడు అజిత్ సింగ్ ఆయన ఆశీస్సుల కోసం వచ్చినప్పుడు, ఆయన వారికి చేతులు జోడించి నమస్కరించారు. తన ఉద్యమంలో రాజకీయ నాయకులకు స్థానంలేదని చెప్పారు.

దిల్లీ జర్నలిస్టులకు అర్ధం కాని టికైత్ భాష

మహేంద్ర సింగ్ టికైత్ నిరాడంబరత గురించి చాలామందికి తెలుసు. '' ఆయన తనకు పేరు ప్రతిష్ఠలు వచ్చిన తర్వాత కూడా వ్యవసాయం చేసేవారు. స్వయంగా చెరుకు నరకడం నేను చూశాను. ఆయన తన ఊరి ప్రజలకు అర్ధమయ్యే భాషలోనే మాట్లాడేవారు. పట్టణాలలో మాట్లాడే భాష ఆయనకు తెలియదు’’ అని వినోద్ అగ్నిహోత్రి చెప్పారు.

''నేను నవభారత్ టైమ్స్ పత్రిక కరస్పాండెంట్ గా ఉన్నప్పుడు మేరఠ్ నుంచి, దిల్లీ నుంచి వచ్చిన ప్రతి జర్నలిస్టు నన్ను టికైత్ ఇంటికి తీసుకెళ్లేవారు. ఆయన మాండలికం వారికి అర్ధమయ్యేది కాదు. నేను వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడిని’’ అని వినోద్ వెల్లడించారు.

టికైత్ సూటిగా వ్యవహరించేవారని, ఎవరి మాటలైనా నచ్చకపోతే అక్కడికక్కడే మందలించేవారని వినోద్ గుర్తు చేసుకున్నారు.

మేరఠ్ అల్లర్లను ఆపడంలో టికైత్ పాత్ర

మహేంద్ర సింగ్ టికైత్ వ్యవహార శైలి చిత్రంగా ఉండేది. ఆయన ప్రేమ వివాహాలను గట్టిగా వ్యతిరేకించేవారు. టీవీ చూసేవారు కాదు. కానీ షోలే సినిమా చూడటానికి మాత్రం ఎప్పుడూ నిరాకరించ లేదు. చరణ్ సింగ్ ఆయనను రైతుల పాలిట రెండో మెస్సయ్య అని పొగిడేవారు.

మహేంద్ర సింగ్ వంశస్థులకు టికైత్ అనే పేరును ఏడో శతాబ్దానికి చెందిన రాజు హర్షవర్ధనుడు పెట్టారని చెబుతారు. విశేషం ఏంటంటే 1980లకు వచ్చేసరికి మహేంద్ర సింగ్ టికైత్ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయ్యారు. 12 లోక్ సభ, 35 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉన్న జాట్ ఓటర్లను ఆయన ప్రభావితం చేయగలరు.

1987లో మేరఠ్ లో మత ఘర్షణలు జరిగాయి. ఇవి మూడు నెలలపాటు కొనసాగాయి. అయితే వీటిని మేరఠ్ దాటి రానివ్వకుండా టికైత్ అడ్డుకున్నారని చెబుతారు.

తన గ్రామం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లి హిందూ ముస్లిం ఐక్యంగా ఉండేలా టికైత్ ప్రయత్నించారని జర్నలిస్ట్ ఖుర్బాన్ అలీ పేర్కొన్నారు.

సభలు సమావేశాలు ఏర్పాటు చేసినప్పడు ఆయన ఎప్పుడూ వేదిక ఎక్కి కూర్చునేవారు కాదు. అలాగే ఆ వేదిక పై ఒక ముస్లిం నాయకుడు ఉండేలా చూసేవారు. సభలో రైతులతో కలిసి కూర్చుని, ప్రసంగించడానికి మాత్రమే వేదిక మీదకు వెళ్లి, మళ్లీ వచ్చి రైతులతో కూర్చునేవారట టికైత్.

మహేంద్ర సింగ్ టికైత్

సిసౌలి నుంచి దిల్లీకి – బండెనక బండి కట్టి..

1988 అక్టోబర్ 25న మహేంద్ర సింగ్ టికైత్ దిల్లీలోని బోట్ క్లబ్ వద్ద ఉన్న పచ్చిక మైదానంలో ఐదు లక్షలమంది రైతులతో నిరసన ప్రదర్శన చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టించారు.

చెరుకుకు ధర పెంచాలని, నీరు, కరెంటు రేట్లు తగ్గించాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలన్నవి ఆనాటి రైతుల ఆందోళనలోని ప్రధాన డిమాండ్లు

దిల్లీకి రాక ముందు ఆయన షామ్లీ, ముజఫర్ నగర్, మేరఠ్ లలో భారీ ధర్నాలు నిర్వహించారు. మేరఠ్ లో 27 రోజులపాటు కమిషనరేట్ ను ముట్టడించారు.

అంతకు ముందు సిసౌలీలో ఒక పంచాయతీ నిర్వహించారు. ఆ సందర్భంగా సిసౌలి నుంచి దిల్లీకి ఎద్దుల బండ్లతో తాము భారీ యాత్ర చేస్తామని ఆయన ప్రకటించారు.

ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వానికి, దిల్లీ పోలీసులకు కాళ్లూ చేతులు ఆడలేదు.

''ఆయనను దిల్లీ రాక ముందే అడ్డుకోవాలని ప్రయత్నించారు. హోంమంత్రి బూటాసింగ్, రాజేశ్ పైలట్, బలరాం జాఖడ్, నట్వర్ సింగ్ తదితరులు ప్రయత్నించినా టికైత్ ను ఒప్పించలేకపోయారు. తర్వాత ఆయన్ను దిల్లీలోకి రావడానికి అనుమతించారు.

రెండు రోజుల తర్వాత దిల్లీ వెళ్లిపోతారని అంతా భావించారు. కానీ రైతులంతా ఇండియా గేట్, విజయ్ చౌక్ మధ్య పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేశారు’’ అని వినోద్ అగ్నిహోత్రి ఆనాటి పరిణామాలను గుర్తు చేసుకున్నారు.

రాజ్‌పథ్‌లో కట్టెల పొయ్యిలు

పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి భారీ ఎత్తున ట్రాక్టర్లు, ట్రాలీలు, ఎద్దుల బండ్ల కాన్వాయ్ తో మహేంద్ర సింగ్ టికైత్ దిల్లీలో ప్రవేశించారు. వారానికి సరిపడా సరకులతో వచ్చి బోట్ క్లబ్ ను తమ నివాసంగా మార్చుకున్నారు రైతులు.

మొదట్లో ప్రభుత్వం వీరిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రాజ్ పథ్ లో డేరాలు వేయడం, పొయ్యిలు వెలిగించడం, పశువులను పక్కనున్న పార్కులు, మైదానాలలో మేపడం మొదలుపెట్టారు. దీంతో అధికారులు హడలిపోయారు.

పగలంతా రైతులు టికైత్ తోపాటు రైతు నాయకుల ప్రసంగాలు వినేవారు. సాయంత్రం పాటలు పాడేవారు. రాత్రి పూట పడుకోవడానికి విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు గడ్డిని పరిచారు.

కనాట్ ప్లేస్ లోని ఫౌంటెన్ల వద్ద రైతులు స్నానాలు మొదలు పెట్టడం అధికారులు షాక్ కు గురయ్యారు. చాలామంది రైతులు కనాట్ ప్లేస్ లో దుప్పట్లు పరుచుకుని అక్కడే పడుకోవడం మొదలు పెట్టారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని టికైత్ స్పష్టం చేశారు. హుక్కా పీలుస్తూ, మైకులో ప్రసంగాలు చేస్తూ ఆయన రైతులను ఉత్సాహపరిచే వారు.

శిబిరాలు తొలగించడానికి పోలీసుల ఉపాయాలు

రాజ్ పథ్ లో మకాం వేసిన రైతులను అక్కడ నుంచి పంపించి వేయడానికి పోలీసులు అనేక ఉపాయాలు ఆలోచించారు. ఆ ప్రాంతానికి నీరు, ఆహారం అందకుండా చేశారు. అక్కడ కట్టేసిన రైతుల పశువులను బెదరగొట్టడానికి అర్ధరాత్రి పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టేవారు. అయినా రైతులు కదల్లేదు.

మరోవైపు దిల్లీలో అన్ని కాలేజీలు, స్కూళ్లను నిలిపేశారు. దిల్లీ న్యాయవాదులు రైతులకు మద్దతు ప్రకటిస్తూ సమ్మెకు దిగారు.

హిమాచల్ ప్రదేశ్ నుంచి కొందరు ధనిక రైతులు ట్రాక్టర్ నిండా యాపిల్ పండ్లు, క్యారట్ లాంటి తినే వస్తువులను పంపారు.

అది రాజకీయ ఉద్యమం కాదు. అధికారం కోసం పోరాటం కాదు. పైగా అప్పట్లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, టెలీవిజన్ ఛానళ్లు లేవు. అయినా తన ఉద్యమంతో ప్రభుత్వ దృష్టిలో పడటంలో టికైత్ సక్సెస్ అయ్యారని చెబుతారు.

మహేంద్ర సింగ్ టికైత్, రాహుల్ గాంధీ

అకస్మాత్తుగా ఆగిన ఉద్యమం

అప్పటికే బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ గాంధీకి టికైత్ జోలికి వెళ్లొద్దని ఆయన సలహాదారులు సూచించారు. రామ్ నివాస్ మీర్ధా, శ్యామ్ లాల్ యాదవ్ ప్రభుత్వం తరఫున టికైత్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఒకవైపు ఇందిరాగాంధీ వర్ధంతిని అదే స్థలంలో జరుపుకోవాల్సి ఉన్నందున, అక్టోబర్ 31నాటికి ఈ సమస్య పరిష్కారించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.

అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇందిరాగాంధీ వర్ధంతి వేదిక శక్తిస్థల్ కు మారింది. ''మేం ఇక్కడ ఎంతకాలం ఉంటామో తెలియదు. రైతులను అద్దెకు తీసుకురాలేదు’’ అని పదే పదే చెప్పారు.

కానీ, అకస్మాత్తుగా ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు అక్టోబర్ 30 సాయంత్రం నాలుగు గంటలకు టికైత్ ప్రకటించారు. ''మనకు టైమ్ అయ్యింది. ఇళ్లకు వెళ్లి పనులు చూసుకోవాలి’’ అని ఆయన రైతులకు చెప్పారు.

టికైత్ నిర్ణయం రాజకీయ పండితులకు కూడా అర్ధం కాలేదు. అప్పటి వరకు టికైత్ చేసిన 35 డిమాండ్లలో ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే, వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మాత్రం చెప్పింది.

టికైత్ ఎందుకు ఈ ఉద్యమాన్ని హఠాత్తుగా ముగించారన్నది ఇప్పటికీ ఎవరికీ అర్ధంకాని నిర్ణయంగానే మిగిలింది. తమ నేత టికైత్ ప్రకటనతో రైతులు తమ వస్తువులను, పశువులను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు.

ఈ నిరసన తర్వాత బోట్ క్లబ్ దగ్గర ఆందోళనలు, ప్రదర్శనలను ప్రభుత్వం నిషేధించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ ‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mahendra Singh Tikait abruptly stop the peasant movement that erupted in 1988
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X