వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అత్యాచారం

రేపిస్టులను ఇంటర్వ్యూ చేయడం చిన్న విషయం కాదు. వాళ్ల మాటలు ఎంతో మానసిక ఆందోళనకు గురి చేయవచ్చు.

తారా కౌశల్ 2017నుంచీ రేపిస్టుల మానసిక పరిస్థితి మీద పరిశోధన చేస్తున్నారు. అప్పటినుంచీ ఆమెకు డిప్రెషన్, స్పృహ తప్పిపోవడంలాంటివన్నీ తరచూ జరుగుతున్నాయి.

ఒక్కోసారి ఊరికే కూర్చుని ఏడుస్తూ ఉండడం లేదా గదిలోకెళ్లి తలుపు గడియ పెట్టేసుకుని కూర్చోవడం...తీరని దుఃఖం, బాధకు లోనవుతున్నారని ఆమె గ్రహించారు.

"ఒకరోజు నేను గదిలోకి వెళిపోయి తలుపు గడియ పెట్టేసుకున్నాను. నా సహచరుడు సాహిల్ బయట ఉన్నారు. తలుపు తియ్యమని, బయటకు రమ్మని ఎంతో బతిమాలారు. నేను లోపల కూర్చుని పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాను. అప్పుడే..నాకు థెరపీ అవసరమని అర్థమైంది" అని తార తన మానసిక పరిస్థితి గురించి వివరించారు.

తారకు తన పరిశోధన ప్రారంభించక ముందునుంచీ కూడా లైంగిక దాడి వలన కలిగే గాయాల బాధ తెలుసు. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడు తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఆమె మొట్టమొదటిసారి పెదవి విప్పారు.

"నాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు మన ఇంటి తోటమాలి నన్ను రేప్ చేశారు" అని తార తన తల్లిదండ్రులకు చెప్పారు.

ఈ విషయం వినగానే ఆమె తల్లిదండ్రులు నివ్వెరపోయారు. కానీ అలా చెప్పడం తారకు గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ఇన్నాళ్లూ ఆ బాధను అమె మనసులో దాచుకుని మథనపడ్డారు.

అప్పటినుంచీ తార ఈ విషయం గురించి బహిరంగంగా అందరితో మాట్లాడడం మొదలుపెట్టారు. తన స్నేహితులతోనూ, అనేక చర్చల్లోనూ కూడా మాట్లాడుతూ.. చివరకు ఒక పుస్తకం రాశారు.

"ఆ సంఘటన గురించి కొన్ని విషయాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నాకు ఆయన పేరు తెలుసు. ఆయనెలా ఉంటారో కూడా గుర్తుంది. ఆయనకున్న ఉంగరాల జుట్టు...నా నీలం గౌనుకు అంటిన రక్తపు మరకలు...అన్నీ గుర్తున్నాయి" అని తార చెప్పారు.

ఆమె పెద్దయ్యాక..నిత్యం చుట్టూ జరుగుతున్న అనేక రకాల లైంగిక హింసల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇవి ఎందుకు జరుగుతున్నాయో, కారణాలేంటో తెలుసుకోవాలనుకున్నారు.

"నా పుస్తకం 'వై మెన్ రేప్’ (మగవాళ్లు ఎందుకు రేప్ చేస్తారు)...ఒక సుదీర్ఘమైన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాల సారం. నా పరిశోధనలో నేను తెలుసుకున్న అనేక విషయాల సారాంశం.

అయితే, ఇది రాయడం అంత సులభం కాలేదు. ఈ పరిశోధనలో భాగంగా ఎంతో వేదన అనుభవించాను" అని తార బీబిసీకి తెలిపారు.

అత్యాచారం

బయటకు కనబడని రేపిస్టులు

దిల్లీలో 2012లో ఒక వైద్య విద్యార్థినిపై కదిలే బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన తరువాత భారతదేశంలో రేప్, లైంగిక హింసమీద చాలా వార్తలు వస్తున్నాయి.

ఆ దుర్ఘటనలో ఆమె తీవ్ర గాయాల పాలవ్వడంతో, అది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆమె చనిపోయారు.

ఆ అత్యాచారానికి పాల్పడిన నేరస్థులను 2020 మార్చిలో ఉరి తీశారు.

లైంగిక నేరాలను అరికట్టడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత అవగాహన కలిగించినా కూడా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2018లో భారతదేశంలో 33,977 అత్యాచార కేసులను పోలీసులు నమోదు చేశారు. అంటే ప్రతీ 15 నిముషాలకు ఒక రేప్ జరిగినట్టు లెక్క.

అయితే, వాస్తవంలో జరిగే అత్యాచారాల సంఖ్య ఇంత కన్నా చాలా ఎక్కువగానే ఉండొచ్చని మానవ హక్కుల ఉద్యమకారులు అంటున్నారు. జరిగిన అన్ని అత్యాచారాలు పోలీసు స్టేషన్‌ వరకూ రాకపోవచ్చని, ఎంతోమంది నేరం చేసి తప్పించుకుంటున్నారని వారు అంటున్నారు.

అలా నేరం చేసి తప్పించుకున్న రేపిస్టుల గురించి తెలుసుకోవాలని తార భావించారు.

దేశవ్యాప్తంగా అలాంటి వ్యక్తులు తొమ్మిదిమందిని ఆమె కలిసారు. వారందరూ కూడా అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నవారే. కానీ, అధికారికంగా వారు చేసిన నేరాలపై ఎలాంటి దర్యాప్తూ జరగలేదు.

"వాళ్లున్న వాతావరణంలోనే నేను కొంత సమయం గడిపాను. వాళ్లను గమనిస్తూ, ఇంటర్వ్యూ చేస్తూ.. వాళ్ల కుటుంబాలను, స్నేహితులను దగ్గరగా గమనిస్తూ వాళ్ల మధ్యే గడిపాను" అని తార తన పుస్తకంలో రాశారు.

"నేను నా సొంత పేరుతో కాకుండా, రహస్యంగా వేరే పేరుతో, వేరే ఈమెయిల్, ఫేస్‌బుక్ ఐడీలతో వారిని పరిచయం చేసుకున్నాను" అని ఆమె తెలిపారు.

వాళ్లతో ఉన్నన్నాళ్లూ తార తన పచ్చబొట్లు కనిపించకుండా దాచేసి, కుర్తా, జీన్స్ వేసుకుని తిరిగారు.

తను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఎన్నారైనని, సాధారణ ప్రజల జీవితాలపై ఒక సినిమా తీస్తున్నానని తనను తాను వాళ్లకి పరిచయం చేసుకున్నారు. తనతో పాటూ ఒక అనువాదకుడిని వెంటబెట్టుకు వెళ్లారు. ఆయనను తన బాడీగార్డ్‌గా పరిచయం చేశారు.

"ఈ తొమ్మిది మంది ప్రవర్తన, నేను అడిగిన 250 ప్రశ్నలకు వాళ్లిచ్చిన సమాధానాలూ ఒక్కలాగే ఉన్నాయి. అయితే వాళ్లు రేపిస్టులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి, వాళ్ల ప్రవర్తనను నేను అధ్యయనం చేస్తున్నానన్న సంగతి బయటపడకుండా జాగ్రత్తపడ్డాను" అని తార తన పుస్తకంలోవివరించారు.

అత్యాచారం

'సమ్మతి అంటే ఏంటో తెలీదు’

తార అక్కడ వాళ్లతో ఉన్నప్పుడు.. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే తప్పించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లూ చేసుకున్నారు. తన జేబులో ఎప్పుడూ పెప్పర్ స్ప్రే బాటిల్ పెట్టుకునేవారు. అత్యవసర సమయాల్లో సహాయం చేయగలిగే వాళ్ల ఫోన్ నంబర్లు, వెంటనే తప్పించుకు పారిపోవడానికి మార్గాలు అందుబాటులో ఉంచుకున్నారు. వాట్సాప్‌లో తనకు సహాయం చేసే ఒక బృందంతో ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉంటూ లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ ఉండేవారు.

అయితే, తారకు అవాక్కయ్యే సంఘటనలు కొన్ని ఎదురయ్యాయి. తాను ఇంటర్వ్యూ చేస్తున్న వారిలో ముగ్గురు.. లైంగిక వాంఛల గురించి, శృంగారం గురించీ ప్రశ్నిస్తున్నప్పుడు ఏ మాత్రం మొహమాట పడకుండా వారి వారి అంగాలను తాకడంతో ఆమె ఆశ్చర్యపోయారు.

ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లినప్పుడు జరిగిన సంగతులను తార వివరించారు.

శీతాకాలంలో ఎండ కోసమని ఆ వ్యక్తి ఇంటి డాబా మీద కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చారు.

"అప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తి ఎన్నో రకాల లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తి. ఈ మాట తనే నాకు చెప్పాడు. వాళ్ల గ్రామంలో చాలా మంది మహిళలు ఆ వ్యక్తి లైంగిక వాంఛలకు బలైనవాళ్లే.

తనకు శిక్ష పడడం లేదా గ్రామం నుంచి బహిష్కరించడం లాంటివేమీ జరగలేదు. పైగా వాళ్ల కమ్యూనిటీలో తనో పెద్ద మనిషి. అంతేకాదు, నన్ను చూసి కూడా అతనికి లైంగిక కోరిక కలిగింది. ఏమాత్రం సిగ్గు పడకుండా నా ముందు తన అంగాన్ని తాకడానికి ఆయన వెనుకాడలేదు" అంటూ ఆమె రాశారు.

ఈ అనుభవాలన్నీ తార మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి.

"ఈ ఇంటర్వ్యూలన్నీ పూర్తి అయిన తరువాత, నా మానసిక పరిస్థితి అస్తవ్యస్తమైందన్న విషయం గ్రహించాను. నేను చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

చాలా డిప్రెషన్‌కు గురయ్యాను. ఒక్కోసారి నిద్రలో నా సహచరుడిని గట్టిగా కరిచేసేదాన్ని. నన్ను లైంగికంగా వేధించొద్దు అని నిద్రలోనే అరిచేదాన్ని” అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఈ పరిశోధన తరువాత తారకు ఒక విషయం స్పష్టంగా బోధపడింది. వీళ్లెవ్వరికీ కూడా సమ్మతి (కన్సెంట్) అంటే ఏమిటో తెలీదు. రేప్‌కు అర్థం తెలీదు.

అత్యాచారం

రేపిస్టులు వేరుగా ఉంటారా?

తార తన పరిశోధన మొదలు పెట్టినప్పుడు, లైంగిక హింస గురించి సోషల్ మీడియాలో అనేకమంది మహిళలతో మాట్లాడారు.

"ఆ సంభాషణల్లోంచే నేను ఇంటర్వ్యూ చేయడానికి ఇద్దరు వ్యక్తులను ఎన్నుకున్నాను.

మిగతా ఏడుగురిని ఎన్నుకోవడానికి కొంత కష్టపడవలసి వచ్చింది. స్థానిక పోలీసులను, మీడియా వ్యక్తులను, ప్రభుత్వేతర సంస్థలు, డిటెక్టివ్ ఏజెన్సీలను సంప్రదించవలసి వచ్చింది" అని ఆమె తెలిపారు.

తార ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు వాళ్లంతా కూడా రేప్‌లు చేశామని ఒప్పుకున్నారు.

ఆమె ఉద్దేశపూర్వకంగానే నేరస్థులుగా రుజువు చేయబడినవారిని కాకుండా, అధికారికంగా ఎటువంటి నేరారోపణ ఎదుర్కోనివారిని ఎంచుకున్నారు.

"రేప్ చేసి జైలుకు వెళ్లినవారిని ఇంటర్వ్యూ చేసి లాభం లేదు. మనుషులు ఒంటరిగా ఉండరు కదా. వాళ్ల చుట్టూ ఉన్న సమాజం, వాళ్లు పుట్టి, పెరిగిన పరిస్థితులను అధ్యయనం చేయకుండా ఒక నిర్థారణకు రాలేం" అని తార అభిప్రాయపడ్డారు.

అయితే, ఇందుకు భిన్నంగా డాక్టర్ మధుమిత పాండే తన పరిశోధనలో భాగంగా..నేరం చేసిపట్టుబడి, జైలుకు వెళ్లిన రేపిస్టులను ఇంటర్వ్యూ చేశారు. డాక్టర్ మధుమిత షీఫీల్డ్ హల్లం యూనివర్సిటీలో క్రిమినాలజీ (నేరవిచారణ శాస్త్రం) విభాగంలో అధ్యాపకులుగా ఉన్నారు.

2012లో దిల్లీ అత్యాచార సంఘటన తరువాత మధుమిత తన పరిశోధన ప్రారంభించారు.

"ఆ సంఘటనలో నేరస్థులుగా పట్టుబడ్డ వారిని క్రూరులుగా ముద్ర వేసిదేశం మొత్తం ద్వేషించింది. వారిని మనమంతా వేరుగా చూసాం. వాళ్లు మన సమాజంలో మనుషులు కానట్టు, మన సంస్కృతిలో భాగం కానట్టు వారిని వేరు చేసి చూసాం.

కానీ, నిజంగా వీళ్లు మనకన్నా భిన్నమైనవాళ్లా? స్త్రీల పట్ల వీరి ఆలోచనలు సమాజంలో ఉన్న ఆలోచనల కన్నా భిన్నమైనవా?" అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

రేపిస్టులు ఎక్కడో ఉండరు.. మన సమాజం నుంచే పుట్టుకొస్తారని, మన సమాజంలో స్త్రీల పట్ల ఉన్న సాంప్రదాయ భావాలు, వారి మీద ఉన్న ఆంక్షలు, వారిని అణచివేయడానికి పూనుకునే పద్ధతులు.. ఇవన్నీ కూడా ఇందులో భాగమని మధుమతి అంటున్నారు.

అత్యాచారం

రేపిస్టులు ఎలా ఉంటారు...

దిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న దాదాపు వంద మంది రేపిస్టులను మధుమిత ఇంటర్వ్యూ చేశారు.

వాళ్లందరూ వారి వారి కథనాలు వినిపించారు. గ్యాంగ్ రేప్‌లో పాలు పంచుకున్న ఒక వ్యక్తి, ఆ సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయానని చెప్పారు. ఐదేళ్ల చిన్నపిల్లని రేప్ చేసేలా తనను ప్రేరేపించారని ఆలయాన్ని శుభ్రం చేసే ఒక వ్యక్తి తెలిపారు. ఒక అమ్మాయి తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొందని, కానీ, ఆ విషయం వాళ్ల తల్లితండ్రులకు తెలిసిన తరువాత తనపై అత్యాచారం నింద మోపారని ఒక యువకుడు తెలిపాడు.

ఐదేళ్ల పాపను రేప్ చేసిన సంగతి విన్నాక, మధుమిత ఆ పాప కుటుంబాన్ని కలవాలని నిశ్చయించుకున్నారు.

"తన చిన్నారి పాపను రేప్ చేశారన్న నిజాన్ని తట్టుకోలేక ఆ పాప తండ్రి మానసిక పరిస్థితి దెబ్బ తిని, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ పాప తల్లి ధైర్యంగా నిలబడి రేప్ వివరాలన్నీ పోలీసులకు అందించారు. అయితే, వారికి న్యాయం జరుగుతుందని ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు" అని మధుమిత తెలిపారు.

ఈ రేపిస్టుల మనోభాలు ఎలా ఉంటాయి? వీరి ఉద్దేశాలేంటి? ఎందుకు అత్యాచారాలకు పాల్పడుతున్నారో తెలుసుకోవాలని మధుమిత భావించారు.

"అత్యాచారానికి పాల్పడ్డ సందర్భాలు వేరు వేరు.. అయినా వీళ్లందరిలోనూ ఒక భావన కామన్‌గా కనిపించింది...రేప్ చెయ్యొచ్చు, ఇందుకువారికి అర్హత ఉంది అని వాళ్లు నమ్ముతున్నారు. దీనికి కారణం మన సమాజంలో నిండి ఉన్న పురుషాధిక్య భావజాలమే" అని మధుమిత అన్నారు.

వీళ్లెవ్వరికీ కూడా సమ్మతికి అర్థం తెలీదు. ఒకరితో లైంగికంగా సంపర్కం ఉండాలంటే వారు దీనికి అంగీకరించాలన్న విషయం వీరికి తెలీదు. అలాంటి అంగీకారం ఏమీ అవసరం లేదని వీరు భావిస్తున్నారు. పైగా బాధితులపై తీవ్రమైన నిందలు వేస్తున్నారని మధుమిత తెలిపారు.

తార, మధుమిత కూడా రేపిస్టులు బయట నుంచి వస్తారని, తెలియని వాళ్లే లైంగిక దాడులకు పాల్పడతారనే సిద్ధాంతాన్ని తోసిపుచ్చారు.

బాగా తెలిసినవాళ్లే, చుట్టూ ఉన్నవాళ్లే లైంగిక హింసకు పాల్పడతారని వారి పరిశోధనల్లో తేలిందని చెప్పారు.

"చుట్టూ ఉన్న వాళ్లల్లో ఎవ్వరైనా రేపిస్టులుగా మారడానికి ఆస్కారం ఉంది. వీళ్లేం పైనుంచీ ఊడిపడరు. తెలిసినవాళ్లే ఎక్కువగా లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. వీళ్లెవరూ అసాధారణంగా, వింత చేష్టలతో కనిపించే వ్యక్తులు కారు. మన చుట్టూ తిరుగుతూ, మనలాగే ఉండే మామూలు మనుషులు" అని మధుమిత తెలిపారు.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో డేటా పరిశీలిస్తే రేప్ చేసినవాళ్లల్లో అత్యధికం తెలినవాళ్లే ఉంటారని తేలింది. 2015లో 95% బాగా తెలిసిన వ్యక్తులే లైంగిక దాడులకు పాల్పడ్డారని డేటా చెబుతోంది.

జరుగుతున్న అన్ని లైంగిక వేధింపులూ బయటకు రాకపోవడానికి కారణం కూడా ఇదేనని యాక్టివిస్టులు అభిప్రాయపడుతున్నారు.

"చాలా సందర్భాల్లో తమపై లైంగిక దాడి చేసినవారు బాగా తెలిసినవారు కావడం, బంధువులు, స్నేహితుల్లో ఒకరు కావడం లేదా వారి పేరు బయట పెట్టలేని పరిస్థితులు ఉండడంలాంటి కారణాల వలన జరుగుతున్న అన్ని లైంగిక దాడులూ నమోదు కావట్లేదు" అని డాక్టర్ అనూప్ సురేంద్రనాథ్ తెలిపారు. డా. సురేంద్రనాథ్, సామాజిక న్యాయం కోసం పోరాడే సంస్థ ప్రోజక్ట్ 39ఏలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

అత్యంత హేయమైన, అమానుషమైన దాడులే ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి.

అత్యాచారం

మరణ శిక్ష విధించడమే పరిష్కారమా?

రేప్‌ల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశం భారత్ మాత్రమే కాదు. కానీ ,ప్రధానంగా పితృస్వామ్య సమాజం కావడం, స్త్రీ, పురుషుల నిష్పత్తి సమానంగా లేకపోవడం పరిస్థితులను మరింత దిగజార్చుతోంది.

"ప్రధానంగా అధికారాన్ని చూపించుకోవడానికి, అణచివేయడానికి రేప్‌ను ఒక సాధనంగా వాడడం ఎక్కువవుతోంది" అని బీబీసీ ఇండియా కరస్పాండెంట్ సౌతిక్ బిశ్వాస్ అభిప్రాయపడ్డారు.

"రేప్‌లను నమోదు చేసే విషయంలో కొంత పురోగతి సాధించాం. కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు, చట్టాల్లో ఉన్న లొసుగుల వల్ల, రాజకీయ ఒత్తిడుల వల్ల అనేకమంది నేరగాళ్లు తప్పించుకుని తిరుగుతున్నారు" అని ఆయన అన్నారు.

2012 సంఘటన తరువాత లైంగిక హింసను తగ్గించే దిశలో భారత ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించింది. రేప్ చేసినవారికి మరణ శిక్షను విధించే చట్టాన్ని కూడా తీసుకు వచ్చింది.

అయితే, మరణ శిక్షలు దీర్ఘకాల పరిష్కారాన్ని చూపలేవని తార, మధుమిత అభిప్రాయపడుతున్నారు.

"సాంఘిక సంస్కరణలు, పునరుద్ధరణల ద్వారానే లైంగిక నేరాలను తగ్గించవచ్చని నేను భావిస్తున్నాను. స్త్రీ, పురుషుల అసమానతలను ఎత్తి చూపుతూ సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా కృషి చేయాలి" అని మధుమిత తెలిపారు.

"ఈ నేరాల్లో ప్రధానమైన విషయం పురుషాధిక్యత. దీన్ని ఎలా ఆపగలం? చిన్నప్పటినుంచే మగవారికి శిక్షణ ఇవ్వడం ద్వారా, సంస్కారం నేర్పించడం ద్వారా లైంగిక దాడులను నిలువరించవచ్చు" అని తార అభిప్రాయపడ్డారు.

తార ఇంటర్వ్యూ చేసినవారిలో ఎవరికీకూడా పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పలేదు.

"వీళ్లంతా రహస్యంగా తమలో తాము మాట్లడుకోవడం ద్వారా, లేదా పోర్న్ సినిమాలు, సెక్స్ వర్కర్ల ద్వారా సెక్స్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నారు.

వీళ్లల్లో చిన్నప్పటి నుంచీ హింసను చూస్తూ పెరిగినవారు కూడా ఉన్నారు. తల్లిని తండ్రి కొట్టడం, తండ్రి బిడ్డలను చేరదీయకపోవడం, ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలను కొట్టడంలాంటివన్నీ చూస్తూ పెరిగారు.

పురుషులకు, స్త్రీలపై అధికారం ఉంటుందని వీరంతా భావిస్తున్నారు" అని తార తన పుస్తకంలో రాశారు.

అత్యాచారం

ఇంతకీ మగవాళ్లు ఎందుకు అత్యాచారాలు చేస్తారు?

"దీనికి ఒక జవాబు అంటూ లేదు" అని మధుమిత తెలిపారు.

"ప్రతీ కథా ప్రత్యేకమైనదే. ఆ యా పరిస్థితులపై ఆధారపడినదే. రేపిస్టుల్లో అనేక రకాలు ఉన్నారు. కోపంతో అత్యాచారానికి పాల్పడేవాళ్లు, ఉన్మాదంతో రేప్ చేసేవాళ్లు ఉన్నారు, వరుస రేప్‌లకు పాల్పడినవాళ్లు ఉన్నారు.

అయితే, వీళ్లల్లో చాలావరకు తెలిసినవాళ్లే... భర్తే కావొచ్చు, సహోద్యోగులు, దగ్గర స్నేహితులు, బంధువులు, క్లాస్‌మేట్స్, కాలేజీలో ప్రొఫెసర్లు..ఇలా ఎవరైనా కావొచ్చు" అని ఆమె అన్నారు.

"జైల్లో ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్లినప్పుడు నేరస్థులంతా సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా ఉంటారని ఊహించాను. వీళ్లు నాతో అసభ్యంగా ప్రవర్తించవచ్చని కూడా అనుకున్నాను.

కానీ, అలా ఎవరూ లేరు. వాళ్ల కథలు వింటున్నకొద్దీ వాళ్లు కూడా మామూలు మనుషుల్లాగే, మన చుట్టూ ఉన్నవాళ్లల్లాగే, మనకు బాగా తెలిసిన వాళ్లల్లాగే అనిపించారు.

ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రేపిస్టులు వేరుగా ఉండరు" అని మధుమిత అన్నారు.

"మన చుట్టూ ఉన్న పురుషులే మనకు ప్రమాదకరంగా మారొచ్చు అనే భావన మనకు చాలా భయాన్ని కలిగిస్తుంది. కానీ ఇదేం కొత్త కాదు. మనం పితృస్వామ్య సమాజంలో నివసిస్తున్నాం. అందరూ రేప్ చేస్తారని కాదు. కానీ పురుష ఆధిక్యం అనేక రకాలుగా మనకు కనబడుతూ ఉంటుంది. సమాజం దాన్ని చాలా సాధారణ విషయంగా కూడా పరిగణిస్తూ ఉంటుంది.

ఆఫీసులో లైంగిక వేధింపులు, రోడ్డుమీద నడచి వెళ్తున్న అమ్మాయిలను ఏడిపించడం, కుటుంబంలో వేధింపులు....ఇవన్నీ సర్వ సాధారణం అన్నట్టు ఈ సమాజం చూస్తుంది.

పొట్టి బట్టలు వేసుకుంది కాబట్టి రేప్ చేయడానికి అర్హురాలు అని ఎవరైనా అంటే మనకి కోపం వస్తుంది. కానీ ఈ భావన ఎక్కడినుంచి వచ్చింది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి" అని మధుమిత అన్నారు.

"నేను రేపిస్టులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు వాడిన భాష, నేరాన్ని సమర్థించుకోడానికి చెప్పే కారణాలు, వారి ప్రవర్తన ఇదంతా మన చుట్టూ ఉన్న సమాజం నుంచే వస్తోంది. చిన్నప్పటి నుంచీ వారు పెరిగిన వాతావరణమే ఇందుకు కారణం" అని ఆమె అన్నారు.

అత్యాచారం

అయితే ఏం చెయ్యాలి? లైంగిక నేరాలు తగ్గించడానికి మార్గాలేంటి?

మధుమిత ఈ కింది పరిష్కార మార్గాలను సూచించారు.

  • జైల్లో ఉన్నవారి మీద మరింత పరిశోధన చేయాలి. నేరస్థులుగా గుర్తించిన వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలి.
  • బాధితులు బయటికొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోగలిగే పరిస్థితులు కల్పించాలి .
  • లైంగిక హింసకు పాల్పడినవారికి న్యాయం జరిగేలా చూసే దిశలో పోలీసులకి మరింత శిక్షణ ఇవ్వాలి.
  • సమాజంలో అవగాహన పెంపొందించాలి.
  • స్కూళ్లల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభించాలి.

మధుమిత ప్రస్తుతం లైంగిక హింసలకు పాల్పడినవారికి కౌన్సిలింగ్ ఇప్పించే ఒక రీహ్యాబిలిటేషన్ ప్రోగ్రాంపై పని చేస్తున్నారు.

"ఇండియాలో 'సెక్స్ అఫెండర్ రీహ్యాబిలిటేషన్ ట్రైనింగ్ (ఎస్ఓఆర్‌టీ)’ ప్రోగ్రాం ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా రేప్, కన్సెంట్ గురించి అవగాహన కల్పిస్తూ, స్త్రీల పట్ల వారి ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలి" అని మధుమిత తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How do the thought of Raping women come to men
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X