వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి వయసు 21 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదనను కొందరు అమ్మాయిలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వధువు

భారత్‌లో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకు కనీసం 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండి ఉండాలి.

బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం అంతకంటే తక్కువ వయసులో వివాహాలు చేయడం చట్టవిరుద్ధం. అలా చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు.

ఇప్పుడు ప్రభుత్వం అమ్మాయిలకు కూడా వివాహ కనీస వయసును 21 ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది.

దీనిపై పార్లమెంటులో జయా జైట్లీ అధ్యక్షతన 10మంది సభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటుచేశారు. ఇది త్వరలో దీనిపై నీతి ఆయోగ్‌కు తమ సలహాలు ఇవ్వనుంది.

భారత్‌లోని పెద్ద నగరాల్లో చదువు, కెరీర్ గురించి అమ్మాయిల ఆలోచనలు మారుతుండడంతో వారికి సాధారణంగా 21 ఏళ్ల తర్వాత వివాహాలు జరుగుతున్నాయి.

అంటే, ఈ నిర్ణయంతో చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలపై ఎక్కువ ప్రభావం పడబోతోంది. ఇక్కడ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలను చదువుకు, వారితో ఉద్యోగాలు చేయించడానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ కుటుంబాల్లో అమ్మాయిలకు పోషకాహారం తక్కువ అందుతుంది. వారికి ఆరోగ్య సేవలు అందడం కూడా కష్టం. అందుకే, వారికి త్వరగా పెళ్లిళ్లు చేసేస్తుంటారు.

బాల్యవివాహాల కేసులు కూడా ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంటాయి. వివాహ కనీస వయసును పెంచడం వల్ల ఇలాంటి అమ్మాయిల జీవితాలు మెరుగుపడతాయా?

బాల్య వివాహం తప్పించుకున్న మమత

దీనిపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను, తమ అనుభవాలను టాస్క్ ఫోర్స్ తో పంచుకోడానికి కొన్ని సామాజిక సంస్థలన్నీ కలిసి 'యంగ్ వాయిసెస్ నేషనల్ వర్కింగ్ గ్రూప్‌’ ఏర్పాటు చేశాయి.

ఇందులో భాగంగా జులైలో మహిళలు, పిల్లల ఆరోగ్యం, విద్య లాంటి అంశాలపై 15 రాష్ట్రాల్లో పనిచేస్తున్న 96 సంస్థల సాయంతో, 12 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న 2500 మంది అబ్బాయిలు, అమ్మాయిల నుంచి దీనిపై అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకున్నారు.

వారిని నేరుగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చాలా తేడాగా వచ్చాయి. వారు ఒక అభిప్రాయం చెప్పలేదు. రకరకాల కారణాలు చూపిస్తూ అమ్మాయిలు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.

వీరిలో రాజస్థాన్ అజ్మీర్‌కు చెందిన మమతా జాంగిఢ్ ఒకరు. స్వయంగా బాల్య వివాహాన్ని తప్పించుకున్న ఆమెకు కనీస వివాహ వయసు పెంచే ప్రతిపాదన సరైనదిగా అనిపించడం లేదు.

ఎనిమిదేళ్ల వయసుకే వివాహం

మమతకు ఇప్పుడు 19 ఏళ్లు. కానీ ఆమెకు 11, ఆమె చెల్లెలికి 8 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని వారి కుటుంబం ఇద్దరిపైనా ఒత్తిడి తెచ్చింది.

రాజస్థాన్‌లో కొన్ని వర్గాల్లో ఆటా-సాటా(కుండమార్పిడి) అనే సంప్రదాయం ప్రబలంగా ఉంది. దీని ప్రకారం అబ్బాయి ఒక ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఆ ఇంట్లో వారు అబ్బాయి కుటుంబంలోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కుండమార్పిడి పద్ధతి ప్రకారం మమత, ఆమె చెల్లెలికి ఇద్దరికీ పెళ్లి చేసేయాలని ఒత్తిడి వచ్చింది.

కానీ ఆమె తల్లి వారికి అండగా నిలిచింది. ఎన్నో నిందలు, అవమానాలు ఎదుర్కున్నప్పటికీ ఆమె తన కూతుళ్ల జీవితాలు నాశనం కాకుండా కాపాడింది.

అమ్మాయిలకు 18 ఏళ్ల లోపు పెళ్లి చేయడం చట్టవిరుద్ధంగా ఉన్న సమయంలో ఇదంతా జరిగింది. వివాహ వయసును 21 ఏళ్లకు పెంచినా, పెద్దగా మార్పు ఏదీ ఉండదని మమత చెబుతున్నారు.

“అమ్మాయిని చదివించరు, సంపాదనా ఉండదు. అందుకే పెద్దవగానే ఇంట్లో అమ్మాయి ఉండడం అందరికీ కష్టమైపోతుంది. అలాంటప్పుడు, ఆమె తన పెళ్లి మాటలను ఎలా కాదంటుంది. తల్లిదండ్రులు మాకు 18 ఏళ్ల వరకే ఆగలేకపోతున్నారు, అలాంటికి 21 ఏళ్ల వరకూ వాళ్లెలా ఎదురు చూడగలరు” అన్నారు మమత.

అమ్మాయిలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడాన్ని సులభతరం చేయాలని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని మమత ప్రభుత్వాన్ని కోరున్నారు. అప్పుడే, ఆమె శక్తిని, సాధికారతను పొందగలదని చెబుతున్నారు.

అయినా, పెళ్లి అమ్మాయి ఇష్ట ప్రకారం జరగాలి. అది ఒక ప్రభుత్వ నిబంధన అమలు చేసినట్లు ఉండకూడదు.

అంటే, ఒక అమ్మాయి 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ఆ వయసులో ఆమెపై ఎలాంటి చట్టపరమైన ఆంక్షలూ ఉండకూడదు.

ఉంగరాలు మార్చుకోవడం

బాల్యవివాహాలు కాదు టీనేజ్ వివాహాలు

ప్రపంచంలోని చాలా దేశాల్లో అబ్బాయిలు, అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లే ఉంది.

భారత్‌లో 1929 శారద చట్టం ప్రకారం కనీస వివాహ వయసు అబ్బాయిలకు 18 ఏళ్లు, అమ్మాయిలకు 14 ఏళ్లుగా నిర్ణయించారు.

1978లో చట్ట సవరణ తర్వాత అబ్బాయిల కనీస వయసును 21 ఏళ్లకు, అమ్మాయిలకు 18 ఏళ్లకు పెంచారు.

2006లో బాల్య వివాహాల నిరోధక చట్టంలో అదే కనీస వివాహ వయసును కొనసాగిస్తూ కొన్ని మెరుగైన నిబంధనలను కూడా చేర్చారు.

యునిసెఫ్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాల కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత దశాబ్ద కాలంలో దక్షిణాసియాలో ఇవి చాలా వేగంగా తగ్గుతూ వచ్చాయి.

18 ఏళ్ల కంటే తక్కువ వయసులో జరిగే వివాహాలు ఎక్కువగా సబ్ సహారా ఆఫ్రికా(35 శాతం), దక్షిణాసియా(30 శాతం)లో జరుగుతున్నాయి.

18 ఏళ్లకంటే తక్కువ వయసులో వివాహం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని యునిసెఫ్ చెబుతోంది.

బాల్య వివాహాల వల్ల బాలికలు చదువు ఆగిపోవడం, గృహ హింసకు గురవడం, ప్రసవ సమయంలో చనిపోయే ముప్పు పెరగడం జరుగుతుంది.

అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ వారి విద్య, ఆరోగ్యం, ఉపాధిని దృష్టిలో ఉంచుకుని అమ్మాయిల వివాహ వయసు పెంచే నిర్ణయం తీసుకోవాలి.

పెళ్లి వయసు పెరిగితే ఈ సవాలును ఎదుర్కోవచ్చా

“తల్లి ఆరోగ్యం కేవలం గర్భదారణ వయసుపై మాత్రమే ఆధారపడదు. పేదరికం వల్ల, కుటుంబంలో మహిళకు తక్కువ స్థాయి ఇవ్వడం వల్ల కూడా వారికి తగినంత పోషకాహారం అందడం లేదు. ఆలస్యంగా గర్భం ధరించినా ఈ సవాలు అలాగే ఉంటుంది” అని యంగ్ వాయిసెస్ నేషనల్ వర్కింగ్ గ్రూప్‌ దివ్యా ముకుంద్ చెప్పారు.

కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు కాస్త గమ్మత్తుగా ఉన్నాయి.

భారత్‌లో 'ఏజ్ ఆఫ్ కన్సెంట్’ అంటే లైంగిక సంబంధాలకు సమ్మతించే వయసు 18 ఏళ్లు. ఇప్పుడు వివాహ కనీస వయసును పెంచితే 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఏర్పరుచుకునే లైంగిక సంబంధాలు 'ప్రీ మారిటల్ సెక్స్’ కేటగిరీలోకి వస్తాయి.

“అలాంటి సమయంలో మహిళలు గర్భ నిరోధకాలు, మిగతా ఆరోగ్య సంబంధిత సేవలను పొందడం తగ్గిపోతుంది. లేదంటే చాలా అవమానాలకు గురైన తర్వాతే వారు వాటిని పొందగలుగుతారు” అంటారు యంగ్ వాయిసెస్ నేషనల్ వర్కింగ్ గ్రూప్‌కు చెందిన కవితా రత్న.

దామిని

వయసు ప్రకారం పెళ్లిళ్లు జరగకూడదు

దేశవ్యాప్తంగా అమ్మాయిల నుంచి అభిప్రాయాలు సేకరించినపుడు చాలా మంది కనీస వయసు 21 ఏళ్లు పెంచడానికి అనుకూలంగానే మాట్లాడారు. ఎందుకంటే, ఆ చట్టం వల్ల పెళ్లిళ్లు చేయకుండా తాము తమ కుటుంబాలను అడ్డుకోగలమని వారంతా భావించారు.

అయితే, తమ జీవితంలో ఏ మార్పూ లేకపోతే, సాధికారత సాధించకపోతే బాల్య వివాహాలను కొత్త చట్టం అడ్డుకోలేదని, బదులుగా పెళ్లిళ్లు రహస్యంగా చేసేస్తారని చెబుతున్నారు.

దామిని సింగ్ ఉత్తరప్రదేశ్ హర్దోయీలో ఒక చిన్నగ్రామంలో ఉంటారు. సుమారు 70 కుటుంబాలున్న గ్రామంలో ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు.

“పెళ్లి ఆలస్యంగానే జరగాలి. కానీ, వయసును బట్టి కాదు. ఒక అమ్మాయి డబ్బు సంపాదింస్తుంటే, సాధికారత సాధిస్తే అప్పుడు ఆమెకు వయసు ఎంతైనా పెళ్లి చేసేయాలి” అని దామినీ చెబుతున్నారు.

ఆమె గ్రామంలో ఐదు కుటుంబాల్లో మాత్రమే మహిళలు బయట పనిచేస్తున్నారు. ఇద్దరు స్కూల్లో టీచర్లుగా, మరో ఇద్దరు ఆశా వర్కర్లుగా ఉంటే, ఒక మహిళ అంగన్‌వాడీలో పనిచేస్తున్నారు. అదే ఊళ్లో ఉన్న 20 కుటుంబాల్లో పురుషులు ఉద్యోగాలకు వెళ్తున్నారు.

“మా ఊరికి స్కూల్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లచ్చు, కానీ ఆ పైన వెళ్లడానికి అమ్మాయిల రవాణా ఖర్చులు భరించడానికి పేద కుటుంబాలు సిద్ధంగా లేవు. దాంతో వారి చదువు అటకెక్కుతోంది. అందుకే, అమ్మాయిలు ఎప్పుడూ తమ ఉనికి చాటుకోలేకపోతున్నారు” అంటారు దామిని.

“ప్రభుత్వం అమ్మాయిల కోసం శిక్షణ కేంద్రాలు తెరవాలి. అప్పుడే వారు తమ కాళ్లపై తాము నిలబడి, స్వయం నిర్ణయాలు తీసుకోగలరు. వాటి కోసం పోరాటం చేయాలన్నా, తమ గొంతు వినిపించగలరు” అని దామిని చెప్పారు.

ప్రియాంక

అమ్మాయిలు భారం అనే ఆలోచన

ఝార్ఖండ్ సరాయికేలాకు చెందిన ప్రియాంక ముర్మూ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దామిని, మమతలాగే తమకు మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు అవసరం అంటున్నారు.

“ఇక్కడ ప్రధాన సమస్య అమ్మాయిలను భారంగా అనుకోవడమే. ఆ భావన మారనంత వరకూ కనీస వయసు 18 అయినా 21 అయినా కుటుంబాలు తమకు నచ్చినట్లే చేస్తాయి” అంటారు ప్రియాంక.

కానీ అమ్మాయిలు సంపాదించడం మొదలుపెడితే, వారిపై పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి తగ్గిపోతుంది.

తమ ప్రాంతంలో ఇప్పటికీ చాలా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ప్రియాంక చెబుతున్నారు.

“అందరికీ ప్రస్తుత చట్టాల గురించి తెలుసు. కానీ ఎవరూ భయపడరు. ఏ కేసులో అయినా కఠిన చర్యలు తీసుకుంటే మార్పులు వస్తాయి. లేదంటే కనీస వయసు 21 ఏళ్లు చేసినా ఏ మార్పూ రాదు. ఎందుకంటే ఇంట్లో అమ్మాయిల గొంతు అణచివేసి ఉంటుంది” అంటున్నారు.

అమ్మాయిలకు, అబ్బాయిలకు సమాన హక్కులు లభించాలని ఆమె కోరుకుంటున్నారు. అప్పుడే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనేదానిపై తాము మెరుగైన నిర్ణయం తీసుకోగలమని అంటున్నారు.

సింబాలిక్

చట్టాన్ని దుర్వినియోగం చేస్తారనే భయం

వివాహ కనీస వయసు పెంచడానికి సంబంధించి ఇంకో భయం కూడా ఉంది. అమ్మాయిలకు వ్యతిరేకంగా అమ్మనాన్నలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటారనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

“18 ఏళ్ల అమ్మాయి కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి, తమకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు, అమ్మనాన్నలకు దానిని అడ్డుకునేందుకు ఈ చట్టం అండ లభిస్తుంది. ఫలితంగా ఇది అమ్మాయిలకు సాయం చేయడానికి బదులు, ఆమె ఇష్టాయిష్టాలనే అడ్డుకుంటుంది. అలా అమ్మాయిలు జైలుకెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది” అంటారు దివ్యా ముకుంద్.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి ముందు తమ అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చాలామంది అమ్మాయిలు గట్టిగానే చెప్పారు.

వివాహాలను తమ జీవితాల్లో ప్రధాన కేంద్రంగా మార్చడంతో తామంతా విసిగిపోయామని అమ్మాయిలు చెబుతున్నారు. మరిన్ని ప్రమాణాల ద్వారా తమ జీవిత దశ, దిశలను నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

“అమ్మాయిలు తాము కోరుకుంటున్నట్లు జీవించడానికి స్వేచ్ఛ, శక్తి కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం దానికి సాయం అందిస్తే వారికి చాలా మంచిది” అంటారు కవిత

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why do some girls oppose the proposal that the age of marriage should be 21 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X