India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'దక్షిణ టిబెట్' అని అంటోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

తూర్పు లద్దాఖ్‌లో భారత, చైనా సరిహద్దుల దగ్గర వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలపై రెండు రోజుల కిందట రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ఎల్ఏసీ దగ్గర సైనిక ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతి భద్రతలు నెలకొల్పేందుకు రెండు దేశాల మధ్య జరిగిన 13వ సీనియర్ సైనిక కమాండర్ స్థాయి చర్చలు ఈ వాదోపవాదాలతో ముగిశాయి.

తాజాగా బుధవారం, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాలను పెంచే చర్యలను భారతదేశం చేపట్టకూడదని వ్యాఖ్యానించింది.

చైనా అభ్యంతరాలను భారత విదేశాంగ శాఖ తక్షణమే తిరస్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, మిగతా రాష్ట్రాల్లో పర్యటించినట్లే భారత నేతలు అక్కడా పర్యటిస్తారని దీటుగా జవాబిచ్చింది. చైనా అభ్యంతరాలు భారత ప్రజల తర్కానికి, అవగాహనకు అందనివని వ్యాఖ్యానించింది.

అంతకుముందు, 2019లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2020లో అమిత్ షా ఆ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు కూడా ఇలాగే వ్యతిరేకత చూపించింది.

ప్రతీసారి చైనా అభ్యంతరాలను భారతదేశం తిరస్కరిస్తూ వచ్చింది.

అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది.

వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరాల గురించి పలువురు నిపుణులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

"చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ టిబెట్‌ను సందర్శించినప్పుడు భారత ఎలాంటి అభ్యంతరాలూ చెప్పలేదు. భారత సరిహద్దుల నుంచి కేవల 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్థావరంలో షీ జిన్‌పింగ్ ఒక రాత్రి బస చేశారు. యుద్ధ సన్నాహాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు కూడా. అయినప్పటికీ, భారత్ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇప్పుడు వెంకయ్యనాయుడు పర్యటనపై నిరసనలు తెలియజేయడానికి చైనా ధైర్యం చేసిందంటే ఆశ్చర్యం లేదు" అంటూ జియోస్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెలానీ ట్వీట్ చేశారు.

"భారతదేశంతో సంబంధాలను చైనా చాలా పేలవంగా నిర్వహిస్తోంది. ఇది, చైనా విదేశాంగ విధానంలో వైఫల్యం కావచ్చు" అంటూ చైనా చరిత్రపై పుస్తకం రాసిన మైఖేల్ షూమాన్ వ్యాఖ్యానించారు.

"చైనా విదేశాంగ శాఖ ప్రకటన సవాలు చేస్తున్నట్లు ఉంది. మనం చాలా ఔదార్యంతో స్పందించాం. వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు తగిన కారణాలు ఉండవచ్చు. అందుకే, మన భాష బెదిరిస్తున్నట్లు లేదు. కానీ, ఇంతకన్నా గట్టిగా జవాబివ్వొచ్చు" అని కన్వల్ సిబల్ అభిప్రాయపడ్డారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో సిబల్ విదేశాంగ కార్యదర్శిగా వ్యవహరించారు.

దక్షిణ టిబెట్

అరుణాచల్ ప్రదేశ్‌లో 90,000 చదరపు కిలోమీటర్ల భూమి తమదేనని చైనా చెబుతోంది.

పశ్చిమాన అక్సాయి చిన్ ప్రాంతంలో 38,000 చదరపు కిలోమీటర్లను చైనా అక్రమంగా ఆక్రమించుకుందని భారతదేశం చెబుతోంది.

1962లో చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగినప్పుడు చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లో సగానికి పైగా ఆక్రమించింది.

చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ ప్రకటించిన తర్వాత సైన్యం తిరిగి మెక్‌మోహన్ రేఖ నుంచి వెనక్కు వెళ్లిపోయింది.

అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదించిన చైనా, చివరికి 1962 యుద్ధం ముగిసిన తర్వాత, దాని నుంచి ఎందుకు వెనక్కు తగ్గిందనేది వ్యూహాత్మక అంశాల్లో నిపుణులకు కూడా అంతుపట్ట లేదు.

చైనా కావాలనుకుంటే, యుద్ధం తర్వాత సైన్యం ఆక్రమించిన ప్రాంతాన్నితమ దగ్గరే ఉంచుకోగలిగేది.

అయితే, అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని, దానిని తాము రాష్ట్రంగా గుర్తించేది లేదని చైనా ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది.

భారత, చైనాల మధ్య 3,500 కి.మీ (2,174 మైళ్లు) పొడవైన సరిహద్దు ఉంది.

2020లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు పెరిగాయి

చరిత్రలో ఏం జరిగింది?

1912 వరకు టిబెట్, భారత్‌ల మధ్య స్పష్టమైన సరిహద్దు రేఖలు లేవు.

ఈ ప్రాంతం మొఘల్ రాజులు లేదా ఆంగ్లేయుల నియంత్రణలో ఉండేది కాదు. టిబెట్, భారత్ ప్రజలకు సరిహద్దు రేఖ గురించి స్పష్టత ఉండేది కాదు. బ్రిటిష్ పాలకులు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.

తవాంగ్‌లో బౌద్ధ దేవాలయం బయటపడినప్పుడు సరిహద్దు రేఖ అంచనాలు ప్రారంభమయ్యాయి.

చివరికి 1914లో టిబెట్, చైనా, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులు సిమ్లాలో సమావేశమై సరిహద్దు రేఖను నిర్ణయించారు.

అయితే, టిబెట్‌ను స్వతంత్ర దేశంగా చైనా ఎప్పుడూ పరిగణించలేదు. 1914 సిమ్లా ఒప్పందంలో కూడా చైనా దీన్ని అంగీకరించలేదు.

1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది.

1949లో మావో జెడాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించారు.

1950 ఏప్రిల్ 1న భారతదేశం దాన్ని గుర్తించి దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. కమ్యూనిస్ట్ కాని దేశం చైనాతో సంబంధాలు ఏర్పరచుకోవడం అదే తొలిసారి.

1950లో చైనా, టిబెట్‌పై దాడి చేయడం ప్రారంభించింది. 1951లో చైనా టిబెట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. తవాంగ్ తమ భూభాగంలో ఉండాలని చైనా కోరుకుంది. ఎందుకంటే టిబెటన్లు భౌద్ధానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తారు.

దాంతో, ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.

1954లో టిబెట్‌పై చైనా సార్వభౌమత్వాన్ని భారతదేశం అంగీకరించింది. అంటే టిబెట్ చైనాలో భాగమని ఒప్పుకుంది. 'హిందీ-చీనీ భాయీ భాయీ' నినాదాలు కూడా వెల్లువెత్తాయి.

1914లో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం, మెక్‌మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణించడం ప్రారంభించారు. కానీ, 1954లో నెహ్రూ ఒక ఒప్పందానికి లోబడి టిబెట్‌ను చైనాలో భాగంగా అంగీకరించారు.

1954 జూన్, 1957 జనవరి మధ్య కాలంలో చైనా తొలి ప్రధాని చౌ ఎన్-లై నాలుగు సార్లు భారతదేశాన్ని సందర్శించారు. 1954 అక్టోబర్‌లో అప్పటి భారత ప్రధాని నెహ్రూ కూడా చైనా వెళ్లారు.

జిన్ పింగ్

భారత, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు

చైనా దాడికి ముందు, టిబెట్, చైనా కన్నా భారతదేశానికి దగ్గరగా ఉండేది.

1950వ సంవత్సరం మధ్యలో చైనా, భారతదేశంలోని ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడం ప్రారంభించింది.

1957లో చైనా, అక్సాయ్ చిన్ మార్గంలో పశ్చిమాన 179 కి.మీ. పొడవైన రహదారి నిర్మించింది.

తొలిసారిగా 1959 ఆగస్టు 25న, సరిహద్దుల వద్ద భారత, చైనా సైన్యాలు మధ్య ఘర్షణలు చెలరేగాయి. నెఫా ఫ్రాంటియర్‌లోని లాంగ్‌జుపై చైనా గస్తీ దళం దాడి చేసింది.

అదే సంవత్సరం లద్దాఖ్‌లోని కోంగ్కాలో కాల్పులు జరిగాయి. ఇందులో 17 మంది భారత సైనికులు మరణించారు.

అవి ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పులని చైనా సమర్థించుకుంది.

'తమ సైన్యంపై చైనా అకస్మాత్తుగా దాడి చేసిందని' భారత్ తెలిపింది.

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 2017 జూన్ 2న జరిగిన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫారం సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. "భారత, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న మాట వాస్తవమేగానీ గత 40 ఏళ్లల్లో రెండు దేశాల సరిహద్దులో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు" అని అన్నారు.

మోదీ చెప్పిన మాటలను చైనా వెంటనే అంగీకరించింది.

అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఇందులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చైనా సైనికులు చనిపోయారని సమాచారం.

దలైలామా

దలైలామా

చైనా దాడి తరువాతే టిబెటన్ల బౌద్ధ మత గురువు దలైలామా పారిపోవాల్సి వచ్చింది.

1959 మార్చి 31న ఆయన భారతదేశంలో అడుగుపెట్టారు. మార్చి 17న టిబెట్ రాజధాని లాసా నుంచి కాలినడకన బయలుదేరి, హిమాలయా పర్వతాలను దాటుకొని 15 రోజుల తరువాత భారత్‌లో ప్రవేశించారు.

2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ యాత్ర చేపట్టినప్పుడు కూడా చైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

దలైలామా పర్యటనకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చుండకూడదని, దానివల్ల భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని నిరసన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Why does China call Arunachal Pradesh 'Southern Tibet'?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X