రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోదావరి జిల్లాల్లో సర్ ఆర్థర్ కాటన్‌ని ఇప్పటికీ దేవుడిలా ఎందుకు పూజిస్తున్నారు? ఆయనకు తోడుగా నిలిచిన తెలుగు ఇంజనీర్ ఎవరు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం

'నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’

ఇదీ నేటికీ గోదావరి వాసులు నిత్యం స్మరించే శ్లోకం. అపర భగీరుథుడైన ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ కారణంగా తాము నిత్యం ఉదయాన్నే గోదావరి స్నానమాచరించే భాగ్యం కలిగిందన్నది దాని సారాంశం.

కేవలం గోదావరి స్నానమాచరించే అవకాశమే కాదు, తమ జీవితాల్లో సమూల మార్పులకు మూలం ఆర్థర్ కాటన్ ఆలోచనే అని గోదావరి తీర వాసులు నేటికీ విశ్వసిస్తారు. అందుకు అనుగుణంగా ఆయన్ని నిత్యం తమ పూజా మందిరంలో కొలిచేవాళ్లు, తమ ఇంటి ముందు విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆరాధించేవాళ్లు చాలామంది ఉంటారు.

చివరకు తమ పితృదేవుళ్లతో సమానంగా కాటన్‌కు సైతం పిండ ప్రదానాలు చేసే వాళ్లు కూడా కనిపిస్తారు. ఇంతటి ఘనకీర్తి ఆయనకు దక్కడానికి అసలు కారణం తెలియాలంటే 170 ఏళ్ల క్రితం నాటి చరిత్రలోకి వెళ్లాలి.

ధవళేశ్వరం ఆనకట్ట

గోదావరి తీరం కూడా ఒకనాటి కరువు ప్రాంతం

19వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలోని అనేక ప్రాంతాల్లో కరవు తీవ్రంగా ప్రభావం చూపింది. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారంగా పిలుచుకునే గోదావరి జిల్లాల్లో కూడా కరువు సమస్య ఏర్పడింది. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

విస్తారమైన భూభాగం ఉన్నప్పటికీ నాడు పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడిన సాగు అనావృష్టితో ముందుకు సాగలేదు. ఆ కారణంగా కరవు సమస్యతో అనేక మంది వలసలు పోవడం, కొందరు ఆకలిచావులకు కూడా గురయ్యారని చరిత్ర చెబుతోంది.

1833లో సంభవించిన నందన క్షామం వల్ల దాదాపు రెండు లక్షల మంది కరవు బారిన పడినట్టు నాటి ప్రభుత్వ లెక్కల్లో ఉంది. జనసాంద్రత అత్యల్పంగా ఉన్న ఆ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ప్రభావితులు కావడం గమనిస్తే కరవు తీవ్రత అర్థమవుతుంది.

ఆ కరవు నుంచి కోలుకున్న వెంటనే మరో ఉపద్రవం గోదావరి తీరాన్ని తల్లడిల్లేలా చేసింది. 1839లో భారీ తుపాన్లు, ఉప్పెన కారణంగా వరదలు పోటెత్తాయి. పంటలు, ఇళ్లు జల ప్రళయంలో చిక్కుకోవడంతో అనేక మంది బర్మా వంటి సుదీర్ఘ ప్రాంతాలకు కూడా వలసలు పోవాల్సి వచ్చింది.

అలాంటి సమస్య పరిష్కరానికి నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆలోచన చేసి గోదావరి నీటిని వినియోగించుకోవాలనే ప్రతిపాదన చేసింది. కానీ, దానికి తగిన ప్రణాళిక, ఆచరణకు అవసరమైన నిధుల కేటాయింపు లేకపోవడంతో కొంతకాలం పాటు ఈ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు.

ధవళేశ్వరం ఆనకట్ట

ధవళేశ్వరం ఆనకట్టతో దశ మారింది..

కరువు పీడిత ప్రాంతం గోదావరి డెల్టాగా రూపాంతరం చెందడంలో ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్ట ప్రధాన పాత్ర పోషించింది. అప్పటి జిల్లా అధికారిగా ఉన్న సర్ హెన్రి మౌంట్ పంపించిన నివేదిక ఆధారంగా ఆనకట్ట నిర్మాణం ఆలోచన తెరమీదకు వచ్చింది. ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరుకి ఆ ప్రతిపాదన అప్పగించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని బ్రిటీష్ ప్రభుత్వం అప్పగించడంతో ఆయన అందుకు అనువైన ప్రాంతం కోసం సుదీర్ఘ అన్వేషణ చేశారు.

తొలుత పాపికొండలకి ఎగువన ఉన్న కోయిదా ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ నీటి లభ్యత కారణంగా ఆయన శబరికి దిగువన పాపికొండలు ప్రాంతంలో కూడా ఆనకట్టి నిర్మాణం ప్రతిపాదించినట్టు రికార్డుల్లో ఉందని ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజనీర్ విప్పర్తి వేణుగోపాల్ బీబీసీతో చెప్పారు.

పాపికొండలు ప్రాంతంలో గోదావరి కేవలం 200మీ.ల వెడల్పున ఉండడంతో, చివరికి ధవళేశ్వరం, విజ్జేశ్వరము మధ్య నది వెడల్పుగా ఉండటం గమనించి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు తెలిపారు.

''సమీపంలో ఉన్న లంకలు, ఇసుక తిన్నెల మూలంగా ఆనకట్ట నిర్మాణం కోసం నీటిని మళ్లించడం సులువుగా ఉంటుందని కాటన్ భావించారు. ఈ మేరకు కాటన్ రూపొందించిన నివేదికను అప్పటి మద్రాసు గవర్నరు మార్కస్ ట్వేల్ డేల్ ఆమోదించారు. లండన్‌లోని బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆమోదానికి పంపించారు. ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించిన తర్వాత, 1846 ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్టని కాటన్ ఆధ్యర్యంలో నిర్మించేందుకు లండన్ నుంచి అనుమతి వచ్చింది’’ అని వివరించారు.

గోదావరి జిల్లాల్లో గోదారమ్మ పరవళ్లు, పచ్చని పంట పొలాలు

సకాలంలో ఆనకట్ట నిర్మాణం, ప్రారంభం

ధవళేశ్వరం వద్ద ప్రస్తుతమున్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్‌కి పూర్వరూపంగా ఆనకట్ట ఉండేది. అనేక వరదల తాకిడికి ఆనకట్ట దెబ్బతినడంతో చివరకు 1970వ దశకంలో కొత్తగా బ్యారేజ్ నిర్మాణం చేశారు.

1978లో ప్రస్తుతం అందరూ చూస్తున్న బ్యారేజ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటికీ బ్యారేజ్ సమీపంలో ఉన్న ఆనకట్ట ఆనవాళ్లు నాటి కట్టడాల నిర్మాణ నాణ్యతకు తార్కాణంగా చెప్పవచ్చు.

1847 ఏప్రిల్ నెలలో ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాటన్ పర్యవేక్షణలో ఈ ఆనకట్టను వేగంగా పూర్తి చేశారు. ఐదేళ్లలోనే నిర్మాణం జరగడంతో 1852 నాటికి అందుబాటులోకి వచ్చింది.

తొలుత 9 అడుగుల నిర్మాణం పూర్తయిన దశలో వచ్చిన వరదలతో కొంత నష్టం జరిగినా, మళ్లీ పట్టుదలతో సకాలంలో ఆనకట్టను రూపొందించడంలో కాటన్ కృషి ఎంతో ఉందని నీటి పారుదల రంగ నిపుణులు అంగీకరిస్తారు.

అప్పట్లో ప్రధాన రవాణా సాధణంగా పడవ ప్రయాణాలు ఉండేవి. వాటికి అనువుగా ఉండాలని, అదనంగా సాగునీటి అవసరాలు తీర్చవచ్చని 1862-67 మధ్య ఆనకట్ట ఎత్తు రెండు అడుగుల మేర పెంచినట్లు ధవళేశ్వరం ఆనకట్ట రికార్డులు చెబుతున్నాయి.

మళ్లీ 1897-99 లలో సిమెంటు కాంక్రీటు వినియోగించి మరో తొమ్మిది అంగుళాల ఎత్తు పెంచారు. 1936లో మూడు అడుగుల చొప్పున ఎత్తు ఉండే తలుపులు అమర్చి ,పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం ప్రారంభమయ్యింది.

గోదావరి బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం

తెలుగు ఇంజనీర్లు తోడుగా ఇసుక గట్టుతో మొదలెట్టి..

ధవళేశ్వరం వద్ద గోదావరి సుమారుగా 6 కి.మీ. వెడెల్పు ఉంటుంది. అందులో మూడోవంతు భాగం లంకలుంటాయి. వాటిని ఉపయోగించుకుని నీటిని మళ్ళించడానికి మొదట ఇసుకతో గట్లు నిర్మించారు.

ఆనకట్ట నిర్మాణంలో పది వేలమంది కూలీలతో పాటుగా ఐదు వందల మంది వడ్రంగులు, ఐదు వందల మంది కమ్మరులను వినియోగించారు. 1847 అగస్టు మూడో వారంలో రైల్వే వ్యాగన్ల ద్వారా ఉక్కు, రాయిని ధవళేశ్వరానికి తరలించారు. దాంతో యంత్రసామాగ్రితో నిర్మాణపు పనులు ముమ్మరమయ్యాయి.

నది ఒడ్డుకు చేర్చిన రాళ్లు, ఇతర సామగ్రిని పడవలద్వారా నదిలోని నిర్మాణ ప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వినియోగించినట్టు నరిశెట్టి ఇన్నయ్య తన పుస్తకంలో పేర్కొన్నారు. రోజుకు దాదాపు 150 టన్నుల రాయిని నదీగర్భంలో నిర్మాణస్థలానికి తీసుకెళ్లేవారని రాశారు.

నదిలో 1847 వరదల నాటికి ఇసుక గట్లన్నీ రాళ్లతో పటిష్టం చేయడంతో పనులు వేగవంతం అయ్యేందుకు దోహదపడిందని వివరించారు. నాటి కట్టడాలు కొంత మేరకు నేటికీ ధృఢంగా నిలవడం గమనిస్తే ఆనాటి పటిష్టత అర్థమవుతుంది.

ఆ ప్రక్రియలో కాటన్‌కి కూలీలతో పాటుగా ఇంజనీర్లయిన భారతీయులు కూడా కొందరు తోడుగా ఉన్నారు. అందులొ తొలి నాటి ఇంజనీర్లలో ఒకరిగా చెప్పుకున్న రాజ్ బహుదూర్ వీణం వీరన్న కూడా ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్‌లో సబ్ ఇంజనీర్‌గా ఆయన పనిచేశారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సహాయకుడిగా ఉన్నారు.

గోదావరి కాల్వ

కాలువల నిర్మాణం కాటన్ దూరదృష్టికి తార్కాణం

1803లో జన్మించిన ఆర్థర్ కాటన్ 15 ఏళ్ల వయసులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంజనీరింగు సర్వీసుల్లో చేరి శిక్షణ పొందారు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్‌గా నియమితుడైన ఆయన విధి నిర్వహణలో భాగంగా‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగిగా పనిచేశారు.

అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ తరుఫున దక్షిణ భారత చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో 1828-29 మధ్య కాలంలో కావేరీ నది వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేశారు.

1840లోనే కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఆయన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసిన తర్వాత 1852 గన్నవరం అక్విడక్టు పనులు కూడా కాటన్ ప్రారంభించారు.

అన్నింటికీ మించి గోదావరి జిల్లాలో కాలువల నిర్మాణం కోసం ఆయన చేసిన పరిశోధన, కార్యాచరణ నేడు ఆ ప్రాంతం సశ్యశ్యామలంగా మారేందుకు దోహదపడిందన్నది నీటి పారుదల రంగ నిపుణుల అభిప్రాయం.

''కాటన్ అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఆయన ప్రతిపాదనలకు పలు అభ్యంతరాలు వచ్చాయి. అయినా పట్టుదలగా ప్రయత్నించి, నాటి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. గోదావరి డెల్టాలో ప్రతీ మారుమూలకు సాగునీరు చేరేందుకు అనువుగా చేసిన కాలువల నిర్మాణంపై అతి పెద్ద విజయానికి కారణం. కాలువలు, వాటికి సమాంతరంగా మురుగు నీటి వ్యవస్థకు ఆయన రూపకల్పన చేశారు. ప్రధాన కాలువలు, వాటి నుంచి పిల్ల కాలువలు, పంట కాలువల వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దారు. అందుకే అతివృష్టి, అనావృష్టితో తల్లడిల్లిన ప్రాంతంలో స్థిరమైన వ్యవసాయక అభివృద్ధికి అవకాశం దక్కింది. అందుకు కాటన్ మహానీయుడికి గోదావరి గడ్డ రుణపడి ఉంటుంది’’ అని మాజీ ఎస్‌ఈ వేణుగోపాల్ బీబీసీతో అన్నారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్, గోదావరి

అర్థ శతాబ్దం పాటు భారత్‌లోనే విధులు

1818లో చిన్న వయసులోనే భారత్‌కు వచ్చిన ఆర్థర్ కాటన్ 1860లో పదవీ విరమణ చేసి స్వదేశానికి వెళ్లిపోయారు. అప్పుడే ఆయనకు బ్రిటీష్ ప్రభుత్వం సర్ బిరుదు కూడా ప్రదానం చేసింది.

1863లో మరోసారి భారత దేశానికి వచ్చి, సోన్ లోయలో పలు నీటిపారుదల ప్రాజెక్టులకు ఆయన సలహాలిచ్చారు. చివరకు 96 సం.ల వయసులో 1899 జూలై 24 నాడు ఆయన వృధ్యాప్యంతో మరణించారు.

ఆర్థర్ కాటన్ మరణించి 121 సంవత్సరాలు గడిచినా నేటికీ భారతీయుల్లో ఆయనకు గుర్తింపు తగ్గలేదంటే ఆయన ప్రణాళికలు, చేసిన శ్రమ, వాటి ఫలితాలు అర్థం చేసుకోవచ్చని అనేక మంది చెబుతుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో అనేక కొలమానాలను పరిశీలిస్తే అభివృద్ధి పరంగా గోదావరి, కృష్ణా తీరం ముందు ఉండడంలో కాటన్ శ్రమ ఉందని భావిస్తారు. తొలిదశలో వ్యవసాయక అభివృద్ధి, ఆ తర్వాత పారిశ్రామికంగా ముందడుగు, ప్రస్తుతం ఆక్వా జోన్ గా ఈ ప్రాంతం ముందంజలో ఉండడానికి నాటి ఆనకట్ట నిర్మాణమే మూలమలుపు అని దాదాపుగా అంతా అంగీకరిస్తారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్, గోదావరి

దేవుడితో సమానంగా కొలుస్తాం...

సర్ ఆర్థర్ కాటన్‌ని గోదావరి వాసులు ఎంతగా అభిమానిస్తారన్నదానికి 2009లో భారత పర్యటనకు వచ్చిన ఆయన మునిమనవడి పట్ల ఇక్కడివారు చూపిన ఆదరణ నిదర్శనంగా నిలిచింది.

రాబర్ట్ సి కాటన్ రాక సందర్భంగా రాజమహేంద్రవరంలో భారీ సభ కూడా నిర్వహించి ఆయనకు సన్మానం ఏర్పాటు చేయడం ద్వారా కాటన్ మీద ఉన్న తమ అభిమానాన్ని ఆయన కుటుంబ సభ్యుడిగా వారసుడి మీద చాటుకున్నారు.

''మా ప్రాంతం ఇంత పచ్చదనంతో ఉండడానికి ఆయనే కారణం. అందుకే ఆయన్ను మా కడుపు నింపిన మహానీయుడిగా కొలుస్తాం. దేవుడితో సమానంగా భావిస్తాం. మా ఇళ్లలో దేవుడి ఫోటోలతో సమానంగా కాటన్ ఫోటో ఉంటుంది. ఊరూరా విగ్రహాలు ఉంటాయి. ఏటా ఆయన జయంతి, వర్థంతి జరుపుతాం. నిత్యం ఆయన్ని తలచుకున్న తర్వాత ఏ కార్యక్రమం అయినా చేపడతాం. మా తాతముత్తాతల నుంచి ఇది వారసత్వంగా వస్తోంది. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి, పంటలు పండించుకునే అవకాశం కల్పించినందుకు ఆయన రుణపడి ఉంటాం’’ అని కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన రైతు సత్తి భాస్కర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్, గోదావరి

పిండ ప్రధానాల్లో కూడా కాటన్ నామస్మరణ

మరణించిన తర్వాత తమ కుటుంబీకులకు పిండ ప్రధానం నిర్వహించే సమయంలో కూడా పలువురు కాటన్ పేరు ప్రస్తావించడం విశేషంగానే చెప్పవచ్చు.

పుష్కరాలు, ఇతర ప్రధాన సమయాల్లో కూడా దేశ నాయకులతో పాటుగా కాటన్‌ని కూడా స్మరించుకుంటామని అర్చకులు చెబుతున్నారు. కొందరు తమ పూర్వీకులతో పాటుగా కాటన్ పేరు చెప్పి పిండాలు అర్పించే ఆచారం ఉందని రాజమహేంద్రవరానికి చెందిన పురోహితుడు సత్యన్నారాయణ శర్మ బీబీసీకి తెలిపారు

''పుష్కరాల సమయంలో ప్రతీ ఒక్కరూ కాటన్ పేరు చెప్పి పిండాలు అర్పిస్తారు. ఇతర రోజుల్లో కూడా కొందరు ప్రత్యేకంగా కాటన్‌ని గుర్తు చేసుకుంటారు. తమ పూర్వీకులతో పాటుగా కాటన్ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని కార్యక్రమాలు నిర్వహిస్తారు. తమ ఆచార సంప్రదాయాల్లో ఆయన్ని గుర్తు చేసుకోవడం ఇక్కడి ఆనవాయితీ. మన దేశ నేతలతో సమానంగా ఆయనకు గుర్తింపు ఉంది’’ అని ఆయన అన్నారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్, గోదావరి

కడియం నర్సరీలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే ఆయనే కారణం..

కాటన్ బ్యారేజ్ దిగువన కడియం సమీపంలో విస్తరించిన వేల ఎకరాల నర్సరీలు అంతర్జాతీయ కీర్తిని గడించాయి. ప్రపంచమంతటికీ మొక్కలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాయి.

1850వ దశకంలో ధవళేశ్వరం ఆనకట్ట అందుబాటులోకి వచ్చిన తర్వాత గోదావరి తీరం వివిధ రంగాల్లో అడుగుపెట్టింది. తణుకు, కాకినాడ తీర ప్రాంతం వంటివి పారిశ్రామిక పురోగతిని సాధించాయి.

20వ శతాబ్దం తొలినాళ్లలోనే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి ఛాయలు కనిపించాయంటే ప్రధాన కారణం ధవళేశ్వరం ఆనకట్టేనని చెప్పవచ్చు. విస్తారంగా పంటలు, తద్వారా రవాణా సదుపాయాలు కూడా గోదావరి జల ప్రవాహం ద్వారా లభించాయి.

కోనసీమ కొబ్బరి సాగుతో కళకళలాడడంలోనూ గోదావరి నదీ ప్రవాహం, దానిని పొలాలకు మళ్లించిన కాటన్ కృషి కీలకమైనవిగా చెప్పవచ్చు. అదే సమయంలో 1910 ప్రాంతంలో కడియంలో మొక్కల పెంపకం మొదలుకావడం ఆ తర్వాత అది వేగంగా విస్తరించడంతో ప్రస్తుతం సమీపంలోని మూడు నాలుగు మండలాల్లో నర్సరీ రంగం ప్రధానంగా మారింది.

''అప్పట్లో పంటలు పండించడానికే నీరు లేక వర్షాధారంగా ఉన్న నేల ఇది. ఇప్పుడు విస్తారంగా వివిధ వెరైటీల మొక్కలు పండించే స్థాయికి చేరింది. అందుకే కడియం నర్సరీలో కీర్తిలో కాటన్‌దే ముఖ్యపాత్ర, ఆయన రాకముందు కరువులో తిండి లేక ఒండ్రుమట్టితో కడుపు నింపుకున్న రోజులున్నాయని మా పూర్వీకులు చెప్పేవారు. కానీ ఇప్పుడు అందరికీ కడుపు నింపే ప్రాంతంగా మారింది. అందుకే మేము ఆయన్ని పూజిస్తాం. ఆరాధిస్తాం. ఫల, పుష్పాలతో నిత్యం కీర్తిస్తాం’’ అంటూ కడియపులంక కి చెందిన సత్యదేవ నర్సరీ యజమాని పుల్లా సత్యన్నారాయణ బీబీసీకి తెలిపారు.

ధవళేశ్వరం ఆనకట్ట, కాటన్, గోదావరి

కాటన్ స్మృతులు నేటికీ మ్యూజియంలో పదిలం...

ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణంలో కాటన్ వినియోగించిన సామాగ్రి నేటికీ మ్యూజియంలో పదిలంగా ఉంది. ఆయన ఆనవాళ్లు, వినియోగించిన వస్తువులను అందులో పొందుపరిచారు.

ప్రస్తుతం కరోనా కారణంగా మూతపడినప్పటికీ నిత్యం ఈ మ్యూజియంని వందల మంది సందర్శిస్తారు. దేశ విదేశాల నుంచి మ్యూజియం సందర్శనకు వస్తూ ఉంటారని ధవళేశ్వరం ఇరిగేషన్ ఈఈ బీబీసీతో చెప్పారు.

సమీపంలోని బొమ్మూరులో కాటన్ నివాస గృహం సైతం పదిలంగా ఉంది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 2010లో ఓసారి కాటన్ గృహాన్ని ఆధునీకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
sir Arthur Cotton worshipped as God in Godavari districts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X