• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మైకేల్ జాక్సన్ 1996లో ముంబయిలో చేసిన షోకు శివసేన ప్రభుత్వం ఇప్పుడు పన్ను రాయితీ ఎందుకు ఇచ్చింది?

By BBC News తెలుగు
|

మైకేల్ జాక్సన్

1996లో మైకేల్ జాక్సన్ ముంబయిలో ఒక షో ఇచ్చాడు. కిక్కిరిసిన ప్రేక్షకులు మధ్య నిర్వహించిన ఇది మైకేల్ జాక్సన్ భారత్‌లో చేసిన ఏకైక షోగా నిలిచింది.

నవంబర్‌ 1న స్పోర్ట్స్ ఎరీనాలో జరిగిన ఈ పాప్ షోకు దాదాపు 35 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 1996 సెప్టెంబర్ నుంచి 1997 అక్టోబర్ మధ్య వరల్డ్ టూర్ చేసిన జాక్సన్ 83 దేశాల్లో షోస్ చేశాడు. వాటిలో ముంబయి ఒకటి.

ఆ సమయంలో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఉంది. అప్పటి శివసేన ప్రభుత్వం ఈ షోను చారిటీ కోసం నిర్వహించే కార్యక్రమంగా చెబుతూ, దీనికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది.

కానీ, తర్వాత ఈ షో చుట్టూ చట్టపరమైన వివాదాలు ముసురుకున్నాయి. అందులో ప్రభుత్వం, కన్సర్ట్ నిర్వాహకులు, కన్జూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యులు ఉన్నారు. ఇక్కడ జాక్సన్ పాప్ షోకు పన్ను మాఫీ చేయవచ్చా, జాక్సన్ సంగీతాన్ని ఎలాంటి కార్యక్రమంగా చెప్పవచ్చు అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

1996 నవంబర్‌లో ఈ వార్తను ప్రచురించిన ఇండియా టుడే "జాక్సన్ షో పన్ను మాఫీ చేయడానికి కారణం కొంతమందికే తెలుసు" అని హెడ్ లైన్ పెట్టింది.

"సూపర్ స్టార్ జాక్సన్ కన్సర్ట్ వల్ల వచ్చిన ఆదాయం పది లక్షల డాలర్లకు పైనే ఉంటుంది. దానిని శివసేన నడిపే ఒక యూత్ ప్రాజెక్టుకు ఇస్తామని మాట ఇచ్చారు" అని సుకేతు మెహతా తన 'మాగ్జిమం సిటీ' అనే పుస్తకంలో రాశారు.

కానీ, 'ముంబయి గ్రాహక్ పంచాయత్' అనే కన్జూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ ఈసారీ ఈ పన్ను మాఫీని బాంబే హైకోర్టులో సవాలు చేసింది.

మైకేల్ జాక్సన్

ఒక టికెట్ ధర 5 వేల రూపాయలు

"కన్సర్ట్ నిర్వహించడానికి కొన్ని రోజుల ముందు ప్రభుత్వం మందులపై అమ్మకపు పన్ను పెంచింది. మీరు మందులపై పన్ను పెంచుతూ, సంపన్నుల మ్యూజిక్ కన్సర్ట్‌కు ఎలా టాక్స్ ఫ్రీ చేస్తారని మేం అడుగుతున్నాం. ఆ సమయంలో కన్సర్ట్ ఒక టికెట్ ధర 5 వేల రూపాయలు పెట్టారు. అది చాలా ఎక్కువ" అని ముంబయి గ్రాహక్ పంచాయత్ చైర్మన్ శిరీష్ దేశ్‌పాండే బీబీసీతో అన్నారు.

భారత్‌లో కొన్ని ఎంపిక చేసిన సినిమాలు, వినోద కార్యక్రమాల టికెట్ ధరను తగ్గించే ఉద్దేశంతో పన్నుమినహాయింపు ఇస్తారు. జాక్సన్ ఈవెంట్‌ను ఒక విధంగా నిధులు సేకరించే ఈవెంట్‌గా మార్చేయడంతో, మాఫీ వల్ల లభించిన లబ్ధి ఆ కార్యక్రమం నిర్వహించే మేనేజ్‌మెంట్ కంపెనీ, శివసేన యూత్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాజెక్ట్‌కు చేకూరుతుందని రిపోర్టుల్లో ఉంది.

కన్జూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ పిటిషన్లను విచారించిన బాంబే హైకోర్టు కన్సర్ట్ టికెట్ల అమ్మకం ద్వారా లభించిన మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఫ్రీజ్ చేసింది. పన్ను మాఫీని పెండింగులో ఉంచింది. వినోద పన్ను మాఫీని మెరిట్ ఆధారంగా మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. అసలు ఒక పాప్ మ్యూజిక్ కన్సర్ట్‌కు పన్ను మాఫీ చేయచ్చా అనే చర్చ కూడా జోరుగా జరిగింది. అయితే, ఆ పాప్ షో జరిగిన 24 ఏళ్లకు, ఎన్నో సార్లు దీనిపై విచారణ జరిగిన తర్వాత, ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పన్ను మాఫీ నిర్ణయాన్ని సమర్థించింది. ఆ నిర్ణయం కూడా శివసేన సంకీర్ణ ప్రభుత్వమే తీసుకుంది అనేది యాదృచ్చికమే.

గత వారం మహారాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్ దీనిపై మాట్లాడారు.

"మైకేల్ జాక్సన్ 1996లో ఇచ్చిన కన్సర్ట్‌కు సంబంధించి దాదాపు 33 లక్షల రూపాయల వినోద పన్నును మాఫీ చేయాలని క్యాబినెట్ తీర్మానం పాస్ చేసింది. ఇప్పుడు ఈవెంట్ నిర్వాహకులు ప్రభుత్వం నుంచి ఈ డబ్బు క్లెయిమ్ చేసుకోవచ్చని మీడియాలో చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలోనే జమచేయాలని మేం భావిస్తున్నాం. ఎందుకంటే ఆ చారిటీ ఇప్పుడు లేదు. నిజానికి, 1996లో భారత సంగీత ప్రియుల కోసం జాక్సన్ షో నిర్వహించడం అనేది ఒక అరుదైన కార్యక్రమ కంటే తక్కువేం కాదు" అన్నారు.

మైకేల్ జాక్సన్

సూపర్ హిట్ కన్సెర్ట్

ముంబయికి చెందిన ఒక పెద్ద వ్యాపారి అప్పుడు మైకేల్ జాక్సన్ కోసం ఆయన కార్ డ్రైవ్ చేశాడు.

మైకేల్ జాక్సన్‌ను కనీసం ఒక్క క్షణమైనా చూడాలనుకున్న జనం, ముంబయిలోని ఒక అత్యంత లగ్జరీ హోటల్ బయట బారులు తీరారు.

మీడియా కథనాల ప్రకారం ఆ హోటల్లోని మైకేల్ జాక్సన్ గదిలో గోడ ఎత్తు ఒక అద్దం పెట్టారు. ఆయన వెళ్తున్నప్పుడు దానిపై ఆటోగ్రాఫ్ చేశారు. జాక్సన్ తన భారత పర్యటనలో బాల్ ఠాకరే ఇంటికి కూడా వెళ్లారు.

మైకేల్ జాక్సన్‌కు భారత్‌లో లెక్కలేనంతమంది అభిమానులు ఉన్నారు. ముంబయి ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం పలకడానికి వేలమంది గుమిగూడారు.

కన్సర్ట్ నిర్వాహకుల్లో ఒకరు అప్పుడు మీడియాతో "ఆయన తన ప్రైవేటు విమానంలో వచ్చారు. ఆయన టీంలోని మిగతావారు నాలుగు వేరు వేరు విమానాల్లో వచ్చారు. అధికారులు, ఎయిర్ క్రాఫ్ట్ క్రూ మెంబర్స్ అందరూ జాక్సన్‌ను విష్ చేయాలనుకోవడంతో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ఒక గంట వరకూ స్తంభించిపోయాయి" అని చెప్పారు.

మైకేల్ జాక్సన్

కన్సర్ట్‌కు దూరంగా ఉన్న బీజేపీ

కానీ, ఆ కార్యక్రమం గురించి వివాదం కూడా ఏర్పడింది.

శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న విపక్షాలు ఒక హిందుత్వ పార్టీ పాశ్చాత్య మూలాలు ఉన్న ఒక పాప్ కన్సర్ట్‌ను ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించాయి.

కొంతమంది శివసేన నేతలకు జాక్సన్ కన్సర్ట్‌లో అశ్లీలత మితిమీరి ఉంటుందేమో అనిపించింది. శివసేన అప్పటి మిత్రదళం బీజేపీ అయితే తమ నేతలను ఆ షోకు దూరంగా ఉండాలని చెప్పిందని ఇండియా టుడే రాసింది.

ఆ పత్రికతో మాట్లాడిన ఒక బీజేపీ నేత "మాతో సంబంధాల కంటే శివసేనకు మైకేల్ జాక్సనే ఎక్కువయ్యాడా" అని కూడా అన్నారు.

బాల్ ఠాక్రే

జాక్సన్‌ను సమర్థించిన బాల్ ఠాక్రే

సుకేతు మెహతా పుస్తకంలో వివరాల ప్రకారం అప్పుడు బాల్ ఠాక్రే జాక్సన్‌ను సమర్థిస్తూ మాట్లాడారు.

"జాక్సన్ ఒక గొప్ప కళాకారుడు. మనం ఆయన్ను ఒక కళాకారుడుగా అంగీకరించాలి. ఆయన మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. చాలామంది ఆయనలా మూవ్ కాలేరు. మనం అలా చేయాలనుకుంటే ఎముకలు విరగ్గొట్టుకుంటాం" అన్నారు.

తర్వాత ఆయన "ఇక సంస్కృతి విషయానికివస్తే ఆయన అమెరికా విలువలకు ప్రాతినిధ్యం వహిస్తారు. దానిని అంగీకరించడంలో భారత్‌కు ఏం సమస్య ఉంది. జాక్సన్ అమెరికా సంస్కృతికి ప్రతినిధి, కాబట్టే మేం ఆయన్ను అంగీకరించాలని అనుకుంటున్నాం" అని కూడా చెప్పారు.

మైకేల్ జాక్సన్ 50 ఏళ్ల వయసులో 2009 జూన్‌ 25న లాస్ ఏంజిల్స్‌లో చనిపోయారు. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ 1996లో ఆయన కన్సర్ట్ మాత్రం సూపర్ హిట్ అని నిరూపితమైంది.

"జాక్సన్ హెలికాప్టర్‌లో స్టేడియం చుట్టూ తిరిగారు. రాకెట్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు" అని అప్పుడు ఒక అభిమాని చెప్పాడు.

ఆ షో చూడ్డానికి లోపలికి వెళ్లలేకపోయినవారు బయట రోడ్లపై గుమిగూడారు. ఆ రోజుల్లో పెద్ద శబ్దాలపై ఈరోజుల్లో ఉన్నట్టు ఎలాంటి నిషేధం ఉండేది కాదు. దాంతో, మైకేల్ జాక్సన్ కన్సర్ట్ సంగీతం కిలోమీటర్ల వరకూ వినిపించింది. జనం వీధుల్లో అది వింటూ ఊగిపోయారు" అని ఆ ఈవెంట్‌ను కవర్ చేసిన ఒక జర్నలిస్ట్ 'కొండే నెస్ట్ ట్రావెలర్‌' మ్యాగజైన్‌కు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Shivsena govt gives tax relief to 1996 Michale Jackson show
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X