• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో ఎందుకు విజయం సాధించలేకపోతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నెట్‌ఫ్లిక్స్ లోగో

నెట్‌ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ 2018 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో మాట్లాడుతూ, నెట్‌ఫ్లిక్స్‌కు తదుపరి 10 కోట్ల సబ్‌స్క్రైబర్లు "భారతదేశం నుంచే ఉంటారని", దానికి కారణం దేశంలో ఇంటర్నెట్ చౌక ధరలకు లభ్యమవుతూ, వేగంగా విస్తరించడమేనని అన్నారు.

అయితే, మూడు సంవత్సరాల తరువాత హేస్టింగ్స్‌లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ అనుకున్నంత విజయం సాధించలేదని గత వారం ఒక ఇన్వెస్టర్ కాల్‌లో హేస్టింగ్స్ వాపోయారు.

"అన్ని ప్రధాన మార్కెట్లలోనూ నెట్‌ఫ్లిక్స్ విజయం సాధించడం సంతోషకరం. కానీ, భారతదేశంలో సఫలీకృతం కాలేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మేం ఆ మార్కెట్‌వైపే మొగ్గు చూపుతున్నాం" అని ఆయన అన్నారు.

భారతదేశంలో సుమారు 10 కోట్ల సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా 2 బిలియన్ డాలర్ల స్ట్రీమింగ్ మార్కెట్ తయారైందని మీడియా పార్ట్నర్స్ ఆసియా తెలిపింది. అయితే, ఆరేళ్ల క్రితం భారతదేశంలో ప్రారంభమైన నెట్‌ఫ్లిక్స్ పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంది.

ఓటీటీ పరిశ్రమ అంచనాల ప్రకారం, భారతదేశంలో సుమారు 55 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్న నెట్‌ఫ్లిక్స్ దాని ప్రధాన ప్రత్యర్థులైన డిస్నీ+ హాట్‌స్టార్ (4.6 కోట్లు), అమెజాన్ ప్రైమ్ వీడియో (1.9 కోట్లు) కంటే వెనుకబడి ఉంది.

వీక్షకులను ఆకర్షించే ప్రయత్నాలు

2018లో 'సేక్రెడ్ గేమ్స్' వెబ్ సీరీస్‌తో భారతదేశంలో ప్రభంజనం సృష్టించింది నెట్‌ఫ్లిక్స్.

"హిందీ చలనచిత్ర ప్రతిభ, హాలీవుడ్ విలువలు, సిలికాన్ వ్యాలీ డబ్బులు ఒకచోట చేరితే భవిష్యత్తు ఉంటుందని" నెట్‌ఫ్లిక్స్ తొలి ఒరిజనల్ సీరీస్ నిరూపించిందంటూ ది ఎకానమిస్ట్ మ్యాగజీన్ ఆ సందర్భంలో పేర్కొంది.

కానీ, పరిస్థితులు ఆ దిశగా మారలేదు. భారతదేశంలో వినోద పరిశ్రమ చాలా పెద్దది. దేశంలో కొన్ని కోట్ల కుటుంబాలకు టీవీలు ఉన్నాయి. కేబుల్ కనక్షన్లు చాలా చౌకగా లభ్యమవుతాయి. సినిమాలు, క్రీడలు, వార్తలను ఎక్కువమంది చూస్తుంటారు.

ఇటీవల వెబ్ సీరీస్‌లు ఊపందుకున్నాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసిన 'స్కామ్ 1992' లాంటి సీరీస్‌లను ఆపకుండా చూస్తున్నారు.

హింస, అసభ్యతతో కూడుకున్న థ్రిల్లర్లకు కూడా క్రేజ్ పెరుగుతోంది. సాధారణంగా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండే భారతదేశంలో ఇలాంటి వాటిని టీవీల్లో చూడడానికి ఇష్టపడరు. కానీ, ఈమధ్య కాలంలో వీటిని కూడా ఆదరిస్తున్నారు.

"వినియోగదారులు తాము వెచ్చించే డబ్బుకు, సమయానికి తగిన విలువ పొందాలని కోరుకుంటారు" అని అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ విక్రమ్ మల్హోత్రా అన్నారు.

వినియోగదారులను ఆకర్షించడానికి నెట్‌ఫ్లిక్స్ చాలా ప్రయత్నాలు చేసింది. ధరలను 60 శాతానికి తగ్గించింది. మొబైల్ ఫోన్‌లో మాత్రమే వీక్షించే ప్లాన్ కావాలంటే నెలకు రూ. 149 చెల్లిస్తే చాలు.

భారతదేశంలో రూ. 3,010 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 50 కన్నా ఎక్కువ చిత్రాలు, సీరీస్‌లు ప్రొడ్యూస్ చేసింది. అందులో 30 కన్నా ఎక్కువ హిందీ సినిమాలూ, సీరీస్‌లే.

వాటిలో చాలా వరకు ఆశించిన స్థాయిలో లేవని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది అత్యధికంగా వీక్షించిన హిందీ షోలలో నెట్‌ఫ్లిక్స్ నుంచి 'కోటా ఫ్యాక్టరీ' మాత్రమే టాప్ 15లో ఉందని మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ వెల్లడించింది.

ఇండియన్ మ్యాచ్‌మేకింగ్, డికపుల్డ్ వంటి సీరీస్‌లు కొంత సంచలనం సృష్టించినప్పటికీ, ఎక్కువమంది నెట్‌ఫ్లిక్స్‌లో స్క్విడ్ గేమ్‌, మనీ హెయిస్ట్, నార్కోస్ లాంటి విదేశీ భాషా సీరీస్‌లవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

"నెట్‌ఫ్లిక్స్‌ను ఇప్పటికీ ఖరీదైన ఓటీటీ సర్వీస్ కిందే పరిగణిస్తున్నారు. దాన్నొక విదేశీ సర్వీస్‌గానే భావిస్తున్నారు" అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికలో కాలమిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ శుభ్రా గుప్తా అన్నారు.

అమెజాన్ ప్రైన్ వీడియోస్, డిస్నీ+ లతో పోలిస్తే భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ చాలా వెనుకబడి ఉంది

ప్రత్యర్థుల బలం ఎలా ఉంది?

నెట్‌ఫ్లిక్స్‌ ప్రత్యర్థులు తెలివైన వ్యూహాలతో అభివృద్ధి చెందుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డిస్నీ+ ప్రధానంగా స్పోర్ట్స్ మీద ఆధారపడి ముందుకు సాగుతోంది. ఐపీఎల్‌తో సహా పెద్ద పెద్ద టోర్నమెంటుల డిజిటల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో 10 భారతీయ భాషల్లో విస్తృతంగా సినిమాలు, సీరీస్‌లు అందిస్తోంది. గత ఏడాది విడుదలైన 'ఫ్యామిలీ మ్యాన్-2' సూపర్ హిట్ అయింది. 'మిర్జాపూర్' సీరీస్‌ను దేశవ్యాప్తంగా ఆదరించారు.

భారతీయ భాషల్లోని 40 శాతం బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రైమ్ వీడియోస్‌లో లభ్యమవుతున్నాయని ఓర్మాక్స్ మీడియా సీఈఓ శైలేష్ కపూర్ చెప్పారు.

ఈ సంవత్సరం ప్రారంభంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన క్రికెట్ మ్యాచులు ప్రసారం చేసింది. అమెజాన్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌తో అనుసంధానంగా ప్రైమ్ వీడియోస్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు.

అలాగే, ఎనిమిది చిన్న స్ట్రీమింగ్ సర్వీసులకు సొంత వేదికపై చోటిచ్చింది. అవన్నీ ప్రైమ్ హోంపేజీలోనే ఉంటాయి.

'ప్రాతీయంగా లోతులకు వెళ్లాలి'

నెట్‌ఫ్లిక్స్ కోట్ల డాలర్లు వెచ్చించి భారతదేశంలో కూడా తన "అంతర్జాతీయ ఇమేజ్"ను నిలుపుకునే ప్రయత్నం చేసిందని నిపుణులు అంటున్నారు. సినిమాలు, సీరీస్ కోసం ప్రముఖ బాలీవుడ్ స్టూడియోలు, నిర్మాతలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

"వీళ్లెవ్వరికీ స్ట్రీమింగ్ షోలు చేసిన అనుభవం లేదు. అందుకే వాటిల్లో చాలవరకూ ఫ్లాపులే అయ్యాయి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని పరిశ్రమలో అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్ ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

"భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ ప్రాతీయంగా లోతులకు వెళ్లాలి. అలాగే తాజా కంటెంట్‌ను సృష్టించగలగాలి" అని మీడియా పార్టనర్స్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ మిహిర్ షా అన్నారు.

2016లో భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించినప్పటి నుంచీ తాము నిర్మించిన చిత్రాల పట్ల "గర్వపడుతున్నామని" ఆ సంస్థ పేర్కొంది.

"డ్రామా నుంచి కామెడీ వరకు, థ్రిల్లర్స్ నుంచి రొమాన్స్ వరకు, ఫిక్షన్ నుంచి నాన్-ఫిక్షన్ వరకు ఉత్తమ శైలి కథనాలను అందిస్తూ మా ప్రేక్షకులను అలరించడంపైనే మేం దృష్టి సారించాం. అలాగే, వివిధ భాషలలో దేశం నలుమూలల నుంచి విభిన్న కథనాలను అందించేందుకు కృషి చేస్తున్నాం" అని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

కిందటి నెల విడుదలైన మలయాళ చిత్రం 'మిన్నల్ మురళి', మార్వల్ సూపర్ హీరోస్ కొత్త పాఠాలు నేర్పుతుందని ఒక విమర్శకుడు అభిప్రాయపడ్డారు.

భారతదేశ స్ట్రీమింగ్ మార్కెట్ 2026 నాటికి రెండింతలు పెరుగుతుందని అంచనా. వీక్షకులు పెరగాలంటే మాత్రం నెట్‌ఫ్లిక్స్ ప్రాతీయంగా మరింత లోతులకు వెళ్లాల్సి ఉంటుంది.

అదేమంత సులభం కాదు. భారతదేశంలో ఇప్పటికే 75 కంటే ఎక్కువ స్ట్రీమింగ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని విజయవంతమయ్యాయి. చాలావరకు వైఫల్యాలు ఉన్నాయి.

"గత ఏడాది 175 హిందీ షోలతో కలిపి మొత్తం 225 భారతీయ సీరీస్‌లు విడుదల అయ్యాయి. వాటిల్లో 15 నుంచి 20 మాత్రమే విజయం సాధించాయి. అందరూ చాలా రకాల చిత్రాలు, సీరీస్‌లు నిర్మిస్తున్నారు. కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, భారతదేశం ఒక క్లిష్టమైన మార్కెట్ అన్నది మాత్రం గుర్తుంచుకోండి" అని కపూర్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why Netflix is not succeeding in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X