• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బిగ్ ప్లాన్..? : రజనీకాంత్ ఎందుకలా చెప్పారు.. అంతా వ్యూహాత్మకమేనా..

|

తలైవా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా..? అన్న ప్రశ్న ఏళ్లుగా చర్చల్లో నానుతూనే ఉంది. ముఖ్యంగా కరుణానిధి,జయలలిత లాంటి దిగ్గజ నేతల నిష్క్రమణ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒకింత శూన్యత ఏర్పడిందన్న మాట వాస్తవం. ఆ స్థానాన్ని భర్తీ చేయబోయే నేత ఎవరు.. అన్న దానిపై అక్కడి రాజకీయాల్లో ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టు రజనీకాంత్ కూడా పలుమార్లు తన పొలిటికల్ ఎంట్రీపై లీకులు ఇవ్వడంతో.. భవిష్యత్తులో తలైవాను ముఖ్యమంత్రిగా చూడబోతున్నామా అని ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు దిగుతారని వారంతా ఎదురుచూస్తున్నారు. తాజా ప్రెస్‌మీట్‌లో దానికి సంబంధించిన అప్‌డేట్స్ ఏమైనా ఉంటాయా అని ఆతృతగా ఎదురుచూశారు. కానీ రజనీ వాళ్ల ఆశలపై మరోసారి నీళ్లు చల్లారు. అసలు పార్టీకి సంబంధించిన వివరాలేమీ వెల్లడించకుండానే.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం.. అలా చేస్తాం.. అని చెప్పుకుంటూ పోయారు.

స్థానికుడు కాదనే విమర్శ..

స్థానికుడు కాదనే విమర్శ..

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చకు వచ్చినప్పుడల్లా.. ఆయన స్థానికుడు కాదనే చర్చ కూడా మరోవైపు నుంచి జరుగుతూనే ఉంటుంది. శరత్ కుమార్ లాంటి నటులు తమిళనాడును తమిళులే పాలించాలని రజనీకి వ్యతిరేకంగా బాహాటంగానే ప్రకటనలు చేశారు. దీనిపై కొంతమంది రజనీ అభిమానులు మండిపడ్డా.. శరత్ కుమార్ వాదనకు మద్దతునిచ్చినవారు లేకపోలేదు. అదే సమయంలో తూత్తుకుడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై రజనీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆయనపై విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి. కొత్తగా పార్టీలు పెట్టేవారు సినిమాలు,రాజకీయాలు వేరు అన్న సంగతి గుర్తించేలోపే తమ మనుగడను ప్రశ్నార్థకం చేసుకునేలా వ్యవహరిస్తున్నారంటూ పరోక్షంగా పలువురు రజనీపై విమర్శలు గుప్పించారు.

వ్యూహాత్మకమేనా..

వ్యూహాత్మకమేనా..

రజనీకాంత్ తన తాజా ప్రెస్‌మీట్‌లో రాజకీయాల్లోకి రావడం పక్కా అన్న స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో తాను పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కొనసాగుతానని.. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా ఉండనని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తయారుచేసుకుంటామన్నారు. రజనీకాంత్ తాను ముఖ్యమంత్రిగా చేయనని చెప్పడంతో దాని వెనుక ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. లోకల్ కార్డును తెర పైకి తెచ్చి ప్రత్యర్థులు రాజకీయంగా తన పట్ల వ్యతిరేకత పెంచే అవకాశం ఉన్నందునే.. ముఖ్యమంత్రి పదవిపై తనకెలాంటి వ్యామోహం లేదని ప్రకటించారా అన్న సందేహం తలెత్తుతోంది. అదే సమయంలో అసలు పార్టీ పెట్టే విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేసిన రజనీ.. ఇప్పుడు కూడా దానికి సంబంధించిన వివరాలేవీ వెల్లడించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రజనీకి నిజంగా గట్స్ ఉంటే నాన్చుడు ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అదే మాటకు కట్టుబడి ఉంటారా..

అదే మాటకు కట్టుబడి ఉంటారా..

సినిమాలైనా.. రాజకీయాలైనా.. అంతా దేవుడి దయ అని రజనీ చెబుతుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా వేరే వ్యక్తి ఉంటారని ప్రకటించిన రజనీ.. ఒకవేళ భవిష్యత్తులో ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఇదే మాటకు కట్టుబడి ఉంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది. దేవుడి దయతో గెలిచామని.. అయితే అభిమానుల ఒత్తిడి కారణంగా తానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని రజనీ అనకపోరా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వేరే వ్యక్తిని ప్రకటిస్తే.. లోకల్ కార్డ్ వ్యతిరేకత పనిచేయదని.. పార్టీ గెలిచాక అది రజనీ చేతిలో నిర్ణయం కాబట్టి ఆయనే పగ్గాలు చేపట్టిన ఆశ్చర్యపోవక్కర్లేదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

ఇంకా నానుస్తారా.. బరిలో దిగుతారా..

ఇంకా నానుస్తారా.. బరిలో దిగుతారా..

రజనీ పార్టీ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నది వాస్తవం. రజనీ నాన్చుడు ధోరణిని ఇంకా సాగిస్తుండగానే.. ఆయన మిత్రుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ప్రజా సమస్యలపై పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రజనీ మాత్రం ఇంకా పార్టీ పేరు,తేదీని కూడా ప్రకటించ లేదు. కానీ అప్పుడే భవిష్యత్ రాజకీయం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇదంతా చూసి రజనీకి రాజకీయం సూట్ కాదని కొంతమంది అంటుంటే.. తలైవా లేటైనా లేటెస్ట్‌గా వస్తాడని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా రాజకీయాల్లోకి వస్తానని తేల్చేసిన రజనీ.. ఇంకా ఆలస్యం చేయకుండా తన పార్టీని,విధి విధానాలను ప్రకటించి జనంలోకి వెళ్తే.. సినిమాల్లో ఆయన సంపాదించుకున్న స్టార్ డమ్ రాజకీయాల్లో పనిచేస్తుందా లేదా అన్నది తేలిపోతుంది.

English summary
Actor Rajinikanth is expected to stick to his stand that he would lead his party in the 2021 assembly elections, but not be the chief minister candidate, multiple sources have told TOI. The actor is likely to spell this out when he meets reporters on Thursday after a meeting with Rajini Makkal Mandram district secretaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X