సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగించాలన్న ప్రధాని మోదీ నిర్ణయంపై వివాదం ఎందుకు

సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు నిర్ణీత పరిమితిలోగా కేసుల దర్యాప్తును పూర్తి చేయాలని ఈ ఏడాది ఆగస్టు 25న ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు.
2013లో సీబీఐను 'పంజరంలో చిలక' అని వ్యాఖ్యానించింది. బొగ్గు గనుల కుంభకోణం విచారణ సందర్భంగా సీబీఐ తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్నారు.
కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల పనితీరు, విధివిధానాలపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన కొత్త వివాదం చర్చల్లో నిలిచింది.
- పెగాసస్ వివాదం: 'జాతీయ భద్రత అని కేంద్రం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- లఖీంపూర్ ఖేరీ: యూపీ ప్రభుత్వ తీరు బాగా లేదు, విచారణను వేరే ఏజెన్సీకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు
కొత్త ఆర్డినెన్స్‌ల అర్థం ఏంటి?
తాజా వివాదం సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలానికి సంబంధించినది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదివారం రెండు కొత్త ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చింది.
వీటి ప్రకారం, 'నిర్ణీత రెండేళ్ల పదవీకాలం' తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ల పదవీ కాలాన్ని మరో మూడేళ్లకు పొడిగించవచ్చు.
అంటే, డైరెక్టర్ల నియామకానికి 2+1+1+1 అనే ఫార్ములాను అనుసరిస్తారు. ఇందులో రెండేళ్లు తప్పనిసరిగా విధులు నిర్వర్తించిన తర్వాత... కమిటీల సమీక్ష, ఆమోదం అనంతరం ఒక్కో ఏడాది చొప్పున మూడుసార్లు పొడిగింపు ఇవ్వొచ్చు. ఇలా డైరెక్టర్ల పదవీకాలం మరో మూడేళ్లు పెరుగుతుంది.
దీని కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్, డిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) ఆర్డినెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈడీ డైరెక్టర్ నియామకం కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, విజిలెన్స్ కమిషనర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో ఒక కమిటీ ఏర్పాటై ఉంటుంది.
అదే విధంగా సీబీఐ డైరెక్టర్‌ను ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి నియమిస్తారు.
- కోవిడ్ 19 మృతుల కుటుంబాలకు దరఖాస్తు చేసుకున్న నెలలోగా రూ. 50,000 పరిహారాన్ని ఇవ్వాలన్న సుప్రీం కోర్టు
- 'ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పోలీసుల కుమ్మక్కు.. ఇదో కొత్త ట్రెండ్, దీన్ని ఆపాలి’ అని సీజేఐ జస్టిస్ రమణ ఎందుకు అన్నారు?
డైరెక్టర్ల నియామకంపై సుప్రీం కోర్టు గతంలో ఏం చెప్పింది?
2020లో ఈడీ చీఫ్ ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని పొడిగించారు. ఈ సంగతి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది.
ఈ కేసు విచారణ సందర్భంగా, రిటైర్మెంట్కు ముందు అధికారుల పదవీకాలాన్ని అరుదైన లేదా అసాధారణ పరిస్థితుల్లో, అదికూడా స్వల్ప కాలానికి మాత్రమే పొడిగించాలని సుప్రీం కోర్టు చెప్పింది.
1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన మిశ్రా, నవంబర్ 17న రిటైర్ కావాల్సి ఉంది. అతని రిటైర్మెంట్ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది.
కొత్త ఆర్డినెన్సుల ప్రకారం, ఈడీ డైరెక్టర్‌గా అతని పదవీకాలాన్ని పొడిగిస్తారో లేదో అనేది చూడాలి.
- 'తిరుమల శ్రీవారి పూజల విషయంలో తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు' - సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ : ప్రెస్ రివ్యూ
- భారత న్యాయవ్యవస్థలో 'ఉన్నత వర్గాలు, ఆధిపత్య కులాల పురుషులే’ ఎక్కువా?

కొత్త ఆర్డినెన్స్‌పై ఎవరేమంటున్నారు?
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వివాదం మొదలైంది.
''పార్లమెంట్ శీతాకాల సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అంతలోనే, ఇంతవేగంగా కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురావడం వెనుక ప్రభుత్వ ఆంతర్యం ఏంటి? ప్రభుత్వ నియంత ధోరణికి ఇది మరో ఉదాహరణ'' అని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీబీఐ డైరెక్టర్ నియామక ప్రక్రియలో అధీర్ రంజన్ చౌధరీ కూడా ఒక భాగం.
''సీబీఐ, ఈడీ సంస్థల స్వాతంత్ర్యానికి ముగింపు పలికే దిశగా ఇది మరో అడుగు అని'' ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు.
ఆర్డినెన్స్‌పై వివాదం ఎందుకు?
ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సమయం, పదవీకాలం పొడిగించాల్సిన అవసరంపై, పదవీకాలాన్ని పొడిగిస్తున్న తీరుపై వివాదం నడుస్తోంది.
సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు రెండేళ్ల పదవీకాలాన్ని నిర్దేశించారు. తద్వారా డైరెక్టర్లు తమ చట్టపరమైన విధులను స్వతంత్రంగా, పారదర్శకంగా, నిర్భయంగా నిర్వర్తించవచ్చు.
ఒకసారి డైరెక్టర్లను నియమించాక, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ సౌలభ్యం కోసం, ఇష్టానుసారం వారిని తొలిగించడానికి అనుమతి ఉండదు.
''ఈ ఆర్డినెన్స్‌ను అకస్మాత్తుగా తీసుకొచ్చారు. ఇలాంటి ఆర్డినెన్స్ కావాలంటూ ఎవరూ డిమాండ్ చేయలేదు. అందుకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి'' అని సీబీఐ మాజీ సంయుక్త డైరెక్టర్ ఎన్కే సింగ్ అన్నారు.
''రెండేళ్ల నిర్బంధ పదవీకాలం ప్రభుత్వానికి తక్కువ వ్యవధిగా అనిపిస్తోంది. అందుకే దాన్ని మూడేళ్లకు పొడిగించి ఉండొచ్చు. తద్వారా నిర్బంధ పదవీకాలం పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరుతుండొచ్చు. కానీ ఏడాది, ఏడాది పొడిగిస్తూ దాన్ని ఐదేళ్ల కాలానికి పెంచడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు.''
ఇలా పదవీకాలం ఒక్కో ఏడాది పొడిగించడాన్ని 'ఫిక్స్డ్ టర్మ్' విధానానికి వ్యతిరేకం అని ఎన్కే సింగ్ భావిస్తున్నారు. ''వారు చెప్పినట్లుగా ఏడాదికొకసారి పదవీకాలం పొడిగించాక, ఆ ఏడాదిలో డైరెక్టర్ల పనితీరు నచ్చకపోతే, ఇక తర్వాతి ఏడాది వారికి పొడిగింపు ఉండదన్నట్లే కదా.''
''ఈ ఏజెన్సీల డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించాలా? వద్దా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. దీనివల్ల సీబీఐ, ఈడీ సంస్థల స్వతంత్రతకు, పారదర్శకతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది'' అని ఆయన పేర్కొన్నారు.
''ఇది సరైన నిర్ణయమే. సీబీఐ, ఈడీ డైరెక్టర్లు ఐదేళ్ల పాటు పనిచేయడం సమంజసమే. ఈ చర్యను ఇంతకుముందే తీసుకొని ఉండాల్సింది'' అని ఎన్ఐఏ మాజీ హెడ్ నవనీత్ వాసన్ అన్నారు.
''ఏజెన్సీ పనితీరులో సమూల సంస్కరణలు తీసుకురావాలని భావించే ఏ డైరెక్టర్‌కైనా రెండేళ్ల కాల వ్యవధి అనేది చాలా తక్కువ సమయం'' అని నెదర్లాండ్స్ నుంచి ఫోన్లో మాట్లాడుతూ బీబీసీకి చెప్పారు.
- 75వ స్వాతంత్ర్య దినోత్సవం: 'పార్లమెంటు ప్రమాణాలు పడిపోతున్నాయి' - సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ
- ఆంధ్రప్రదేశ్: అమరావతి భూముల కుంభకోణం కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు

అయితే ఈ ఐదేళ్ల పదవీకాలాన్ని ఏకబిగిన ఇవ్వాలని, ఒక ఏడాది సమీక్షించి తర్వాత నిర్ణయం తీసుకోవడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. డైరెక్లర్ల ఎంపిక ప్రక్రియ కూడా అమెరికాలోని ఎఫ్‌బీఐ డైరెక్టర్ నియామకం తరహాలో మరింత పటిష్టంగా జరగాలని అన్నారు.
నిర్బంధ పదవీకాలం అనే పద్ధతిని ఎందుకు పెట్టారు?
వినీత్ నారాయణ్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు అనంతరం సీబీఐ డైరెక్టర్‌కు తప్పనిసరిగా రెండేళ్ల పదవీకాలం ఉండాలని నిర్ణయించారు. వినీత్ నారాయణ్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసునే జైన్ హవాలా కేసుగా కూడా పిలుస్తారు.
ఈ కొత్త ఆర్డినెన్స్ కచ్చితంగా ఒక రాజకీయ నిర్ణయమే అని హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై అన్నారు.
''సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు రెండేళ్ల నిర్బంధ పదవీకాలం విధించడం వెనకున్న ఆంతర్యమేంటంటే, ఈ పదవులను స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉంచడమే. కానీ రెండేళ్లు కాకముందే డైరెక్టర్లను తొలగించి ఈ లాజిక్‌ను ప్రభుత్వం ఎప్పుడో బలహీనపరిచింది. ఈ పోస్టుల పదవీకాలం అనేది ప్రభుత్వ అభీష్టం మీద ఆధారపడి ఉంటుందని ఇప్పుడు స్పష్టమైంది'' అని బీబీసీతో హిందీతో ఆయన చెప్పుకొచ్చారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ శర్మను ఉద్దేశించి పిళ్లై ఈ విధంగా వ్యాఖ్యానించారు. వివాదాల కారణంగా అలోక్ శర్మ రెండేళ్ల పదవీకాలం ముగియకముందే ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తొలగించింది.
''సీబీఐ, ఈడీ ఏజెన్సీల స్వాతంత్ర్యాన్ని, పారదర్శకతను బలహీనపరిచే దిశగా తాజా ఆర్డినెన్స్ మరో ముందడుగు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఏజెన్సీలకు డైరెక్టర్లు కావాలనుకుంటున్న కిందిస్థాయి అధికారులకు కూడా ఈ ఆర్డినెన్స్ ఎదురుదెబ్బగా మారుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మాజీ ఐపీఎస్, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
''ఈ ఆర్డినెన్స్ దురదృష్టకరం. భవిష్యత్‌లో డైరెక్టర్లు కావాలని ఆశపడే కింది స్థాయి అధికారుల ఉత్సాహాన్ని ఇది తగ్గిస్తుంది'' అని యశోవర్ధన్ అన్నారు.
''5 ఏళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగించేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్, సాంకేతికంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉల్లంఘించలేదు. కానీ ఏడాదికొకసారి ఆ పదవిపై సమీక్ష నిర్వహించడం వల్ల ఆ పదవి గౌరవాన్ని తగ్గిస్తుంది. అప్పడు డైరెక్టర్ పదవి ఎలా మారుతుందంటే రోజువారీ కూలీలాగా తయారవుతుంది.''
''29వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇది ఎంతో ముఖ్యమైన అంశం. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం పార్లమెంట్ సమావేశం అయ్యేవరకు వేచి చూడాల్సింది. ఎలాగైనా పార్లమెంట్లో వారికే ఎక్కువ బలం ఉంది. అమెరికా తరహా పద్ధతిని ఇక్కడ ప్రభుత్వం ఎందుకు పాటించట్లేదు?'' అని ఆయన వ్యాఖ్యానించారు.
- సుప్రీం కోర్టు: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టం ఇప్పటికీ అవసరమా?
- ఏపీ ఎన్నికల కమిషనర్ సుప్రీం కోర్టు తీర్పును అర్థం చేసుకోలేరా... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఆగ్రహం
కోర్టులో తేల్చుకోండి
ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సమయంపై తలెత్తుతున్న ప్రశ్నల్ని రాజ్యాంగ అంశాల నిపుణుడు సుభాష్ కశ్యప్ అంగీకరించడం లేదు.
''ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా కోర్టులో సవాలు చేయొచ్చు. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు, రాష్ట్రపతి సమ్మతితో ఆర్డినెన్సు తీసుకురావడం ప్రభుత్వానికి ఉన్న హక్కు. మరో 10 రోజుల్లో పార్లమెంట్ సమావేశం కానుంది.. మరో 2 నెలల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి కాబట్టి ఆర్డినెన్స్ తీసుకురావొద్దనే నియమాలు ఏవీ లేవు.''
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పౌరసమాజం కచ్చితంగా కోర్టులో సవాలు చేస్తుందని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ పేర్కొన్నారు.
ఈ అంశాన్ని కచ్చితంగా కోర్టు ముందుంచాలని మాజీ హోం సెక్రటరీ జీకే పిళ్లై అభిప్రాయపడ్డారు.
ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందు, ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన హోంవర్క్ చేస్తుందని సుభాష్ కశ్యప్ అన్నారు.
ఈ అంశం కోర్టుకు వెళ్లాక... ఇది కేవలం పదవీకాలం పొడిగింపు అంశమేనని, దానికి కమిటీల అమోదం అవసరమని తమకు అనుకూలంగా ప్రభుత్వం వాదిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- బ్రిట్నీ స్పియర్స్: ఈ పాప్ గాయని కన్న తండ్రిపైనే కోర్టులో పోరాడాల్సి వచ్చింది ఎందుకు?
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆడపిల్లలే ఎందుకు ఎక్కువగా ఉన్నారు
- 'పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
- వ్యాక్సీన్ వేయించుకోని వారికి లాక్డౌన్ - ఇల్లు వదిలి బయటకు రావొద్దన్న ప్రభుత్వం
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- డయాబెటిస్ రివర్స్ చేయడం సాధ్యమేనా?
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?
- చైనా: చరిత్రాత్మక తీర్మానంతో తన హోదాను సుస్థిరం చేసుకున్న షీ జిన్‌పింగ్
- తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- సింగపూర్ డ్రగ్స్ కేసు: షర్మిల సోదరుడిని ఉరిశిక్ష నుంచి తప్పించడం అసాధ్యమా... ఆమె ప్రార్ధనలు ఫలిస్తాయా ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)