• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలికల కనీస వివాహ వయసు పెంచితే బాల్య వివాహాలు ఆగుతాయా?

By BBC News తెలుగు
|

భారత్‌లో 18ఏళ్లలోపు అమ్మాయిలకు పెళ్లి చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి. అయితే ఈ వివాహ కనీస వయసును పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

దీనిపై లోతుగా అధ్యయనం చేసేందుకు సమతా పార్టీ మాజీ ఛైర్మన్ జయా జైట్లీ నేతృత్వంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మంత్రిత్వ శాఖతోపాటు నీతీఆయోగ్‌కు కూడా తమ నివేదిక సమర్పించింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ (41.6 శాతం), బిహార్ (40.8 శాతం), త్రిపుర (40.1 శాతం)ల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

అయితే, అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే.. ప్రస్తుతం చాలాచోట్ల బాల్య వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వేను చేపట్టారు.

బాల్య వివాహాలు భారత్‌కు పెద్ద సమస్యలా మారాయని జయ జైట్లీ కూడా తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు చట్టాలు అమలులో ఉన్నప్పటికీ ఈ వివాహాలు జరగడం ఆందోళనకరమని వివరించారు.

తగ్గుతున్నాయి.. కానీ

భారత్‌లో 1.5 కోట్ల మంది అమ్మాయిలకు 18ఏళ్లలోపే వివాహమైందని నివేదికలో జయ చెప్పారు. అయితే ఇదివరకు 46 శాతం(మొత్తం బాలికల్లో 46 శాతం మంది)గా ఉండే ఈ వివాహాలు ప్రస్తుతం 27 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు.

భారత్‌లో బాల్య వివాహాలకు ప్రధాన కారణం కుటుంబాలపై సామాజిక, ఆర్థికపరమైన ఒత్తిడేనని ఆమె వివరించారు. లింగ సమానత్వంతోపాటు స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడంలో కనీస వివాహ వయసు పెంపు ప్రధాన పాత్ర పోషించగలదని ఆమె చెప్పారు.

''పెళ్లి విషయంలో అమ్మాయిలు, అబ్బాయిల కనీస వయసు ఒకేలా ఉండాలి. దీనిలో తేడా పురుషాధిక్య సమాజానికి అద్దం పడుతోంది. అబ్బాయిల విషయంలో వయో పరిమితి 21 అనేది సరిగ్గానే ఉంది. అప్పటికల్లా వారి విద్యాభ్యాసం పూర్తవుతుంది. వారి ఆలోచనల్లోనూ పరిణితి వస్తుంది. కానీ అమ్మాయిలకు ఈ పరిమితి 18గా నిర్దేశించడం సరికాదు. అంటే, వారి ఆలోచనల్లో పరిణితి, విద్యాభ్యాసం గురించి పూర్తిగా పట్టించుకోనట్లే అవుతుంది. మన సమాజంలో అమ్మాయిలకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ ధోరణిలో మార్పు రావాలి. అమ్మాయిలకు పెళ్లి పూర్తయితే బాధ్యతలు తీరిపోయినట్టేనని ఆలోచించడం మారాలి’’అని ఆమె వివరించారు.

బాల్య వివాహాలు

అమ్మాయిలైనా అబ్బాయిలైనా.. అందరికీ హక్కులు ఒకేలా ఉండాలి. ఓటు వేయడానికి, మద్యం తీసుకోవడానికి ఇలా అన్నింటికీ అందరికీ ఒకేలా వయో పరిమితి ఉన్నప్పుడు వివాహాల్లో మాత్రం తేడా ఎందుకని ఆమె ప్రశ్నిస్తున్నారు?

''అమ్మాయిల పెళ్లి వయసు పెంచడం అనేది లింగ సమానత్వ పరిరక్షణకు కీలకంగా మారుతుంది. విద్యా, కెరియర్.. ఇలా అన్నిచోట్లా అమ్మాయిలు అబ్బాయిలకు సమానత్వం ఉండాలి’’అని డాక్టర్ కృతి భారత్ వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌లో తొలి బాల్య వివాహాన్ని రద్దుచేసిన మహిళగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆమె చోటు సంపాదించారు. సీబీఎస్‌ఈ పుస్తకాల్లోనూ ఆమె గురించి ఓ పాఠం ఉంది. ఇప్పటివరకు ఆమె దాదాపు 1400 బాల్య వివాహాలను అడ్డుకున్నారు.

''మీకు పట్టణాల్లో లింగ సమానత్వం కనిపిస్తుంది. కానీ గ్రామాల్లో ఇది అసలు కనిపించదు. అక్కడ జెండర్ అంటే పురుషులు మాత్రమే. ఇటీవల కాలంలో కొంత మంది గ్రామీణ యువతులు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. కానీ వారి శాతం చాలా తక్కువ’’అని ఆమె చెప్పారు.

ఉపయోగం ఉంటుందా?

అమ్మాయిల కనీస వివాహ వయసును పెంచితే.. బాల్య వివాహాలు ఆగుతాయా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

''ఇప్పుడు వయో పరిమితి 18ఏళ్లు ఉన్నప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీన్ని 21కి పెంచితే బాల్య వివాహాల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రజల్లో ధోరణి మారే వరకు ఈ వివాహాల సంఖ్య తగ్గదు’’అని కృతి చెప్పారు.

అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 117 దేశాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 192 దేశాల్లో బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చట్టాలను తీసుకొచ్చారు. కేవలం ఆరు దేశాల్లో మాత్రమే అమ్మాయిలకు కనీస వివాహ వయసు అంటూ లేదు. వీటిలో సోమాలియా, సౌత్ సూడాన్, యెమెన్, సౌదీ అరేబియా, గాంబియా, ఈక్వెటోరియల్ గినియా ఉన్నాయి.

సమస్యలు ఏమిటి?

కేవలం 38 దేశాల్లో కనీస వివాహ వయసు విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య తేడా ఉంది. వీటిలో చాలావరకు అమ్మాయిల కనీస వివాహ వయసు అబ్బాయిల కంటే తక్కువగా ఉంటోంది.

భారత్‌లానే బంగ్లాదేశ్‌లోనూ అమ్మాయిల కనీస వివాహ వయసు 18కాగా. అబ్బాయిలది 21.

బాల్య వివాహాలను అడ్డుకోవడమే లక్ష్యంగా 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టంను కేంద్రం తీసుకొచ్చింది.

2030నాటికి ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలకు బాధితులుగా మారిన బాలికల సంఖ్య ఒక బిలియన్‌కు మించిపోతుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనా వేసింది.

అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి చేయడంతో వారు చదువును మధ్యలోనే వదిలిపెట్టేయాల్సి వస్తోందని, గృహ హింసకు వారు బాధితులుగా మారుతున్నారని, మృతా శిశువుల్లో మరణ ముప్పు కూడా పెరుగుతోందని, కొన్ని ప్రాంతాల్లో అయితే ఎయిడ్స్ ముప్పుకూ ఈ బాల్య వివాహాలు కారణం అవుతున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.

అమ్మాయిల పెళ్లి వయసు పెంచడమనేది మహిళల ఆరోగ్య పరిరక్షణ దిశగా పడిన అడుగు అవుతుందని మ్యాక్స్ హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఎస్ఎన్ బసు చెప్పారు.

''భారత్‌లో చాలా మంది అమ్మాయిలు చిన్న వయసులోనే తల్లులు అవుతున్నారు. దీంతో పుట్టబోయే పిల్లలతోపాటు వారికి కూడా మరణ ముప్పు వెంటాడుతోంది’’అని ఆమె వివరించారు.

''18ఏళ్ల అమ్మాయి శారీరకంగా తల్లి అయ్యేందుకు సిద్ధంగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమెకు ఆ వయసులో అంత పరిణితి ఉండదు. 20 నుంచి 25ఏళ్ల మధ్య గర్భం దాల్చేవారిలో ప్రసవ సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి’’అని ఆమె చెప్పారు.

బాల్య వివాహాలు

కేవలం చట్టాల పరంగా బాలికల వివాహ వయసు పెంచితే ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా?

''18ఏళ్ల వయసు వారిని వయోజనులుగా పరిగణిస్తారు. వారికి అప్పుడు చట్టపరంగా చాలా హక్కులు వస్తాయి. ఆస్తుల నుంచి ఓటు హక్కు వరకు చాలా హక్కులు వారికి సంక్రమిస్తాయి. ఇక ఆలోచనల్లో పరిపక్వత అనేది పరిస్థితులను బట్టి మారుతుంటుంది’’అని న్యాయవాది, పార్ట్‌నర్స్ ఫర్ లా ఇన్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధు మెహ్రా వివరించారు.

''అమ్మాయిల కనీస వివాహ వయసు విషయానికి వస్తే.. బాల్య వివాహాలకు ప్రధాన కారణం పేదరికం. అమ్మాయిల పట్ల అభద్రతా భావం, నిరక్షరాస్యత కూడా చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేయడానికి కారణం అవుతుంటాయి. ప్రభుత్వం ముందు ఈ అంశాలపై దృష్టి సారించాలి’’అని ఆమె చెప్పారు.

''పేద, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటుచేయాలి. వారి కోసం ప్రత్యేక పాఠశాలలతోపాటు లైబ్రరీ, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. గ్రామ పంచాయతీలకూ అవగాహన కల్పించాలి. అమ్మాయిలకు పెళ్లి చేయడమే లక్ష్యంగా భావించే కుటుంబాల్లో మార్పు తీసుకురావాలి’’అని జయ జైట్లీ కూడా పేర్కొన్నారు.

కనీస వివాహ వయసుపై 1600 కాలేజీలు, యూనివర్సిటీలను జయ నేతృత్వంలోని కమిటీ సంప్రదించింది. ప్రశ్నావళి సాయంతో విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరించింది.

''వెబినార్‌లు కూడా మేం నిర్వహించాం. మతాలు, కులాలు, రాష్ట్రాలకు అతీతంగా అందరూ కనీస పెళ్లి వయసు 22 ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు’’అని ఆమె చెప్పారు.

బాలికల కనీస వివాహ వయసు పెంచడం ద్వారా ఆరోగ్య, విద్యా పరమైన అంశాల్లో సానుకూల పరిణామాలు వస్తాయని యునిసెఫ్‌లోని శిశు సంరక్షణ విభాగం అధిపతి సొలెడాడ్ హెరెరో చెప్పారు.

''అమ్మాయిల పెళ్లి వయసును 16 నుంచి 18 ఏళ్లకు పెంచినప్పుడు జనాభా నియంత్రణ విధానాలను దృష్టిలో పెట్టుకున్నారు. పెళ్లి ఆలస్యంగా చేస్తే.. పిల్లలు ఆలస్యంగా పుడతారు. ఫలితంగా జనాభా తగ్గుతుందని భావించారు. కానీ నేడు అందరి దృష్టి లింగ సమాన్వతంపై ఉంది. బేటీ బచావో, బేటీ పఢావో లాంటి నినాదాలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతోంది. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందడుగు వేస్తున్నారు. అయితే, కుటుంబంలోనూ అబ్బాయిలతో అమ్మాయిలను సమానంగా చూసే ధోరణి రావాలి’’అని జయ చెప్పారు.

''ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చట్టాల్లో మార్పులు చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే పెళ్లి అనేది కుటుంబ, వ్యక్తిగత అంశాల్లోకి వస్తుంది’’అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Minimum age for a girl to get married
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X