వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ ఆర్థిక స్వావలంబన కల నెరవేరుతుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మోదీ

కొన్ని దశాబ్దాల తరువాత తొలిసారి భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నివేదిక సూచిస్తోంది. ఇంతకాలం అంతా ఈ మాంద్యం గురించి అనుకుంటున్నా భారత్ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. కానీ, ఐఎంఎఫ్ ఇప్పుడు అదే చెప్పింది.

భారత ఆర్థిక వ్యవస్థ 2020లో - 4.5 రుణ వృద్ధి నమోదు చేస్తుందని బుధవారం(జూన్ 24న) విడుదల చేసిన నివేదికలో ఐఎంఎఫ్ పేర్కొంది. వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్ నివేదిక విడుదల సందర్భంగా ఆ సంస్థ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఈ విషయం వెల్లడించారు.

ఇంతకుముందు ఏప్రిల్‌లో ఐఎంఎఫ్ విడుదల చేసిన అంచనాల్లో భారత్ వృద్ధి రేటు సున్నా(0) శాతం ఉండొచ్చని చెప్పారు.

అయితే, అంచనాల సవరణకు కారణాలు చెబుతూ గీతా గోపీనాథ్.. ఇండియాలో సుదీర్ఘ కాలం లాక్ డౌన్ విధించారని.. ఇప్పటికీ కరోనా వైరస్ నుంచి బయటపడలేదని, ఇదంతా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోందని అన్నారు.

ఒక్క భారత్ విషయంలోనే కాదు అన్ని అగ్ర ఆర్థిక వ్యవస్థల(దేశాలు) వృద్ధీ రుణాత్మకంగానే ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి 4.9 శాతంగా ఉంటుందని.. చైనా వృద్ధి రేటు 1 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ చెప్పింది.అయితే, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2001లో భారత్ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందట. 2021లో భారత్ వృద్ధి రేటు 6 శాతం ఉంటుందని.. చైనా 8.2 శాతంతో అందరికంటే ముందు ఉంటుందని సూచించింది.

పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్న సమయంలో చేపట్టే చర్యలూ నిరాశాజనకంగానే ఉంటాయి. భారత్‌లో జూన్ 27 నాటికి వరుసగా 21వ రోజూ చమురు ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఖజానాలోకి డబ్బు రావాలంటే ఇదే సులభ మార్గం.. అందుకే ప్రభుత్వం చమురు ధరలు పెంచుకుంటూ పోతోంది.రాబడి భారీగా తగ్గిపోవడంతో ద్రవ్యలోటు పెరిగిపోకుండా ఆపేందుకు గాను చమురు ధరలు పెంచుతున్నారని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఈ పెంపు ఒక్క చమురు ధరలకే పరిమితం కాదని రానున్న రెండు మూడేళ్లలో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయ పన్ను, జీఎస్టీ కూడా పెంచే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

అదే కనుక జరిగితే వేతన జీవులు, మధ్యతరగతి ప్రజల్లో వ్యతిరేకత రావొచ్చు.భారత్ ద్రవ్య లోటు 2021 సంవత్సరానికి 3.8 శాతం ఉండొచ్చని అంచనాలున్నప్పటికీ అది 5 శాతానికి కూడా చేరొచ్చు.స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్(ఐఎండీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ స్థానాన్ని మార్చలేదు.

ఆ సంస్థ విశ్లేషణల ప్రకారం భారత్ స్థానం 43. ఇదే సమయంలో అమెరికా, చైనా వంటి అగ్ర ఆర్థిక వ్యవస్థల స్థానం వాటి మధ్య వాణిజ్య యుద్ధాల కారణంగా దిగజారింది.ఉద్యోగాల కల్పన, జీవన వ్యయం, ప్రభుత్వ వ్యయం వంటి అనేక అంశాల ప్రాతిపదికగా 63 దేశాల ఆర్థిక వ్యవస్థలను మదించి ఐఎండీ ర్యాంకింగ్స్ ఇస్తుంది.

కూరగాయులు అమ్ముకునే మహిళ

తలసరి ఆదాయం తగ్గుతోంది

ఆర్థికవేత్తలకు ఈ తాజా నివేదిక కేవలం ఆసక్తి కలిగించేదే కావొచ్చు కానీ మోదీ ప్రభుత్వానికి మాత్రం అది చాలా ముఖ్యమైనది.

ర్యాంకింగ్ మారకపోవడంతో ఆర్థికంగా అంతా బాగానే ఉందని సంతోషించాలా లేదంటే ఆర్థికంగా ఎక్కడవేసిని గొంగళి అక్కడే ఉందని బాధపడాలా?తాజా అంచనాలను చూసి ప్రభుత్వం కచ్చితంగా ఆందోళన చెందాల్సిన పరిస్థితే ఉంది.

ఉదాహరణకు జూన్ 8 నాటి ప్రపంచ బ్యాంకు అంచనాలను చూస్తే తలసరి ఆదాయంలో 3.6 శాతం పతనం కనిపిస్తోంది.. అంటే లక్షలాది మంది ప్రజలు ఈ ఏడాది తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సీలా పజార్‌బాసియోగ్లూ దీనిపై మాట్లాడుతూ.. ''ఈ సంక్షోభం ప్రపంచానికి పెను సవాళ్లు విసరొచ్చు.. దీర్ఘకాలికంగా సమస్యలను మిగల్చవచ్చు’’ అన్నారు.

రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గత నెలలో భారత్ రేటింగును తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఏప్రిల్ నెలలో భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ''2020-21కి జీడీపీ రుణాత్మకంగనే ఉంటుంద’’న్నారు.ఇక రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా ప్రకారమైతే రానున్న త్రైమాసికంలో భారత వృద్ధి రేటు - 16 నుంచి -20 మధ్య ఉండొచ్చు.

కార్మికుడు

స్వావలంబన‌తో మేలా? కీడా?

స్వావలంబన లక్ష్యంప్రపంచ బ్యాంక్, ఇతర రేటింగ్ ఏజెన్సీ అంచానాలన్నీ సరికాదని భారత ప్రభుత్వం వాదించొచ్చు.. దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నందున ఈ కరోనా సంక్షోభం నుంచి మెరుగ్గానే బయటపడతామని మోదీ దేశ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.

ఇందుకోసం మోదీ మే 12 నుంచి స్వావలంబనకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. స్వావలంబన అనేది మాటల గారడీ అని కానీ సరైన విధాన నిర్ణయమని కానీ నిర్దిష్టంగా చెప్పడం కష్టం.

ఇది ఏమైనప్పటికీ విదేశీ పెట్టుబడిదారుల్లో గందరగోళం పెంచడంతో పాటు దేశీయంగా పోటీ తత్వాన్నీ చంపేసే అవకాశంఉంది.

స్వావలంబనకు ప్రాధాన్యమివ్వడమనే ఈ కొత్త విధానం ఆందోళనకరమైనదని ఆర్థికవేత్త వివేక్ కౌల్ అభిప్రాయపడ్డారు.

పోటీతత్వం లేకపోతే దేశీయ పెట్టుబడిదారులు అంతర్జాతీయ వ్యవస్థలో రాణించలేరన్నారు.

జెనీవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో పొలిటికల్ స్టడీస్ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ అలెగ్జాండ్రీ లాంబర్ట్ బీబీసీతో మాట్లాడుతూ.. భారత్ స్వావలంబన సాధించాలంటే తన పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టాలని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రియ రంజన్ దాస్ మాట్లాడుతూ.. మోదీ చెబుతున్నట్లు దేశం ఆర్థిక స్వావలంబన సాధించాలంటే అందుకు మాటల గారడీకి బదులు పటిష్టమైన ఆర్థిక వ్యూహాలు ఉండాలన్నారు.

ఒకప్పుడు భారత్ బియ్య, గోధుమలు దిగుమతి చేసుకునేది.. కానీ, ఇప్పుడు ఎంతో మిగులు సాధించింది.. జనరిక్ మందుల విషయంలోనూ ఇలాగే ప్రగతి సాధించాం.

బహుశా ఇలాంటి ఉదాహరణలను చూసుకునే మోదీ ప్రభుత్వం స్వావలంబనపై నమ్మకం పెంచుకుంటున్నట్లుగా ఉంది.

ఆర్థిక అసమర్థతమార్కెట్ల గురువుగా అభివర్ణించే అజిత్ దయాల్... ''మోదీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవహారాల్లో అనుభవం లేదు.

ఈ విషయంలో అసమర్థత ఇప్పటికే రుజువైపోయింది. ఎన్నికల్లో గెలవడం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయడంలో వారికి నైపుణ్యం ఉంది కానీ ఆ నైపుణ్యం ప్రజల కడుపు నింపడానికి.. పేద, మధ్య తరగతి కలలు నెరవేర్చడానికి ఏమాత్రం పనికిరాదు’’ అన్నారు.

కార్మికుడు

లాక్‌డౌన్‌కు ముందు నుంచే తిరోగమనం

''మోదీ నిర్ణయాలు చాలా నిర్లక్ష్యంగా ఉంటాయి. 2016లో పెద్ద నోట్ల రద్దు కానీ.. మొన్నటిమొన్న ఆకస్మికంగా లాక్ డౌన్ ప్రకటించడం కానీ అన్నీ అంతే. ఈ నిర్ణయాలు పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

దేశంలో కేవలం 5 శాతం కంపెనీలకు మాత్రమే వ్యాపారం నడవకపోయినా ఆరు నెలల పాటు జీతాలు చెల్లించే సామర్థ్యం ఉంది. మిగతా 95 శాతం సంస్థలు అలాంటి పరిస్థితిని తట్టుకోలేవు. వచ్చే త్రైమాసికంలో లక్షలాది మంది నిరుద్యోగులుగా మారుతారు. గత కొంతకాలంగా తీవ్రమైన పేదరికం నుంచి బయటపడిన ఎంతోమంది మళ్లీ పేదరికంలో చిక్కుకోనున్నారు’’ అన్నారు దయాల్.

''మోదీ రావడానికి ముందు రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్న భారత్ 2016లో పెద్ద నోట్ల రద్దు, ఆ తరువాత జీఎస్టీ అమలు వంటివాటితో ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్తుండగా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మాంద్యం దిశగా పయనిస్తోంది’’ అన్నారు.

కార్మికుడు

5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ?

2024-25 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాన్ని ప్రస్తుత స్థితి సందేహాస్పదం చేసింది. 2005 - 2016 మధ్యకాలంలో 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడ్డారు. ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం 2011 - 15 మధ్యకాలంలో 9 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. వారందరి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.

అయితే... ప్రపంచ స్థాయి సంస్థలు భారత ఆర్థిక పరిస్థితిపై తాజాగా వేస్తున్న అంచనాలే కనుక నిజమైతే వీరంతా మళ్లీ పేదరికంలో చిక్కుకుంటారనడంలో సందేహం లేదు.

అత్యంత పేదలకు 6 నెలల పాటు నెలకు రూ. 10 వేల చొప్పున ఇచ్చేలా జీడీపీలో 4 శాతం(రూ .9 లక్షల కోట్లు) డబ్బును వెచ్చించాల్సిందని అజిత్ దయాళ్ అన్నారు.

ఈ మొత్తం 15 కోట్ల మందికి ప్రయోజనం కలిగించేదని... డిమాండ్, సప్లయ్ చైన్‌ను కదిలించానికి ఇది తోడ్పడి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఉపయోగపడేదని అభిప్రాయపడ్డారు.దేశంలోని పేదలందరి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తూ దేశం మరింత సుసంపన్నంగా మారాలంటే రానున్న కాలంలో 7 నుంచి 8 శాతం వృద్ధి రేటు నమోదవుతూ ఉండాలన్నది ఆర్థికవేత్తల లెక్క.

రానున్న నాలుగేళ్లలో 12 నుంచి 13 శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తేనే 2024-25 నాటికి మోదీ కలలు కంటున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ఆర్థిక నిపుణుడు రఘువీర్ ముఖర్జీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
International Monetary Fund (IMF) report indicates that for the first time in a few decades, the Indian economy will go into recession
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X