కరోనా తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు....ప్రచారం, ఎన్నికలు అంతా ఆన్ లైన్లోనే.. ?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించాక రాజకీయ కార్యకలాపాలు దాదాపుగా స్తంభించాయి. అక్కడక్కడా నిత్యావసరాల పంపిణీ పేరుతో నేతలు హల్ చల్ చేస్తున్నా స్దూలంగా చూస్తే నేతలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కనీసం అనుచరగణాన్ని కలిసే అవకాశం లేకపోవడంతో ఫోన్లలోనే మాట్లాడుకుంటున్నారు. అవసరమైతే వీడియో కాల్స్ చేస్తున్నారు. చూసేందుకు ఇదో తాత్కాలిక అవసరంలా కనిపిస్తున్నా.. తాజా పరిణామాలు చూస్తుంటే భవిష్యత్ రాజకీయాలకు ఇదే శాంపిల్ గానే అర్ధమవుతోంది.

రాజకీయం రంగు మారుతోంది...
ఒకప్పుడు రాజకీయాలంటే కొందరు నేతలు, వేలాది అనుచరులు.. ఎంత ఎక్కువ మందిని వెంటేసుకుని తిరిగితే అంత గొప్ప నేతగా చలామణీ కావడం. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న రాజకీయాల తీరు ఇదే. కానీ ఇక అదంతా గతమే అనుకునేలా పరిస్దితులు మారిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణతో కుటుంబ సంబంధాలే మృగ్యం అవుతున్న వేళ.. ఇక రాజకీయాలకూ అదే సామాజిక దూరం వర్తించే పరిస్దితి కనిపిస్తోంది. కరోనా ప్రభావం నేపథ్యంలో ఏపీలో వైసీపీ నేతలు రోడ్లపైకి వస్తుంటే ఎన్ని విమర్శలు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులోనూ ఇదే పరిస్ధితి తప్పదనే వాదన వినిపిస్తోంది.

కరోనా నేర్పిన రాజకీయం...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపుగా నేతలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. అలా అని రాజకీయాలు మానేశారా అంటే అదీ కాదు. తాత్కాలికంగా రాజకీయాలకు బ్రేక్ ఇచ్చే పరిస్దితి ఉందా అంటే అదీ లేదు. కానీ తమ అనుచరగణంతో నిత్యం ఫోన్, సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ లో ఉంటూ రాజకీయాలకు కొత్త అర్ధం చెబుతున్నారు. గతంలో ఇరుకైన ఫంక్షన్ హాళ్లలో వేలాది మంది మధ్య కూడా సౌకర్యంగా తిరిగిన వారు కూడా ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ సోషల్ కాల్స్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులోనూ ఇది తప్పకపోవచ్చు.

ప్రచార శైలిలోనూ మార్పులు..
గతంలో ప్రచారం కోసం సగటున 50 నుంచి 60 శాతం నేరుగా జనంలో ప్రచారం నిర్వహించే మిగిలిన 40 శాతం సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్ మెసేజ్ లు, వాట్సాప్ సందేశాల ద్వారా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్ధితి పూర్తిగా తారుమారయ్యేలా ఉంది. భవిష్యత్తులో ప్రచారం కోసం పాశ్చాత్య దేశాల తరహాలోనే బహిరంగ ప్రదేశాల్లో భారీ ఎత్తున స్ర్కీన్స్ ఏర్పాటు చేసి ఇంటి వద్ద నుంచే లైవ్ సందేశాలు, సోషల్ మీడియా, గూగుల్ యాప్ ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లు, జనంతో ప్రచారాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇక ఇంటింటికీ తిరగాల్సిన అవసరం లేకుండానే అంతా ఆన్ లైన్ కాబోతుందన్నమాట.

ఆన్ లైన్ తో అక్రమాలు, దాడులకు చెక్..
ఎప్పుడైతే జనంలోకి నేరుగా వెళ్లి ప్రచారం చేయకుండా ఆన్ లైన్ సందేశాల ద్వారా టీవీలు, సోషల్ మాధ్యమాలు, యాప్ ల ద్వారా ప్రచారం చేసుకోవడం మొదలవుతుందో అప్పుడే ఎన్నికల హింస, అక్రమాలకు దాదాపుగా చెక్ పడుతుంది. ఎన్నికల ప్రక్రియలోనూ పారదర్శకత వస్తుంది. రోడ్లపై పంచే డబ్బులు ఆన్ లైన్ లో ఓటర్లకు పంచినా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లిపోతుంది. ఇలాంటి భయాలెన్నో భవిష్యత్ రాజకీయాలను శాసించబోతున్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. కానీ ఇదే నిజం.
.

ఎన్నికల ప్రక్రియలోనూ మార్పులు...
ఇప్పటివరకూ కరోనా వైరస్ వంటి దారుణమైన మహమ్మారిని చూడని ప్రపంచం ఏదో రూపంలో పోలింగ్ బూత్ ల ద్వారా ఎన్నికల నిర్వహణ చేపడుతోంది. కానీ భవిష్యత్తులో సామాజిక దూరం పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేపట్టం అంత సులుపు కాదు. భారీగా జనం గుమికూడకుండా ఎన్నికల నిర్వహణ ఊహించలేం. కాబట్టి ఆన్ లైన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ జరిగినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే మన దేశంలో వేలాది కార్పోరేట్ సంస్దలతో పాటు సాధారణ కంపెనీలు సైతం తమ ఉద్యోగుల హాజరును జీపీఎస్ ఆథారిత గూగుల్ యాప్స్ లోనే తీసుకుంటున్నాయి. అలాగే ప్రభుత్వం రేషన్ కూడా బయోమెట్రిక్ ద్వారానే ఇస్తోంది. కాబట్టి ఆధార్, వేలి ముద్రల ఆధారంగా ఓటు వేసేలా ఎన్నికల సంఘం మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.