సీఎం అయితే: తొలి మంత్రివర్గ సమావేశంలోనే 10 లక్షల ఉద్యోగాలు: తేజస్వి యాదవ్
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. తొలి విడత పోలింగ్ ఈ నెల 28వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగాల కల్పనపైనే పార్టీలు ఫోకస్ చేశాయి. నిరుద్యోగుల నుంచి ఓట్లు దండుకోవాలని ప్రణాళిక రచించాయి. అందులో భాగంగా హామీలు ఇస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇన్నీ లక్షలు అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మహాగడ్బందన్ అధికారంలోకి వస్తే వెంటనే యువతకు ఉద్యోగాల కల్పనపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేస్తున్నారు.

144 రోజులు ఇంట్లోనే..
బీహర్ సీఎం నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇవాళ నావడ జిల్లా ర్యాలీలో తేజస్వి పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల సీఎం 4 నెలలు ఇంట్లోనే ఉన్నారని దుయ్యబట్టారు. లాక్ డౌన్ వల్ల లక్షలాది మంది బీహరీలో సొంత రాష్ట్రానికి చేరుకున్న చీమకుట్టినట్లయినా లేదన్నారు. కానీ సీఎం మాత్రం 144 రోజులు కార్యాలయ నివాసంలోనే ఉన్నారని ఆరోపించారు. ఎందుకు బయటకు రాలేదు అని ప్రశ్నించారు.

రోడ్డునపడ్డ 32 లక్షల మంది
లాక్ డౌన్ వల్ల 32 లక్షల మంది వలసకూలీలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ఉపాధి కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. నైపుణ్యం కలుగజేసి.. ఉపాధి కల్పిస్తామనే హామీని మరచిపోయారని తేజస్వి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగిత 46.6 శాతానికి చేరిందని చెప్పారు. నితీశ్ 15 ఏళ్ల హయాంలో పేదరికం ఎందుకు తొలగిపోలేదని ప్రశ్నించారు.

సీఎం అయిన వెంటనే..
పనిలో పనిగా ప్రధాని మోడీపై కూడా విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ ర్యాలీలో ప్రసంగిస్తున్నారు.. కానీ బీహర్‌కు ప్రత్యేక హోదా ఏమయ్యిందని అడిగారు. ఎందుకు హోదా ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. 2017 నుంచి బీజేపీ-జేడీయూ బీహర్‌లో అధికారంలో ఉండి ఏం చేశాయని అడిగారు. కానీ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఉత్తర్వులు జారీచేస్తామని చెప్పారు.