వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Chingari, Roposo: టిక్‌టాక్ స్థానాన్ని ఈ దేశీయ యాప్‌లు దక్కించుకుంటాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది

భారత్‌లో టిక్‌టాక్ యాప్ పెద్ద హిట్. దాదాపు ఇరవై కోట్లకుపైగా యాక్టివ్ యూజర్లు ఆ యాప్‌కు ఇక్కడే ఉన్నారు.

కానీ, టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌‌ను భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించింది.

ఈ నిషేధంతో టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ రూ.45 వేల కోట్ల వరకూ నష్టపోవాల్సి రావొచ్చని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ అంచనా వేసింది. భారత యాప్స్ మార్కెట్‌లో టిక్‌టాక్ స్థానం ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అందుకే, ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలని చింగారీ, రొపోసో లాంటి కొన్ని 'దేశీయ’ యాప్‌లు ప్రయత్నిస్తున్నాయి.

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు చైనా వ్యతిరేక సెంటిమెంట్ జనంలో విపరీతంగా ఉంది. ఈ 'దేశీయ’ యాప్‌లకు ఇంతకన్నా గొప్ప అవకాశం మళ్లీ దొరకదేమో?

చింగారీ యాప్

ఏంటీ చింగారీ…

టిక్‌టాక్ స్థానం కోసం నెలకొన్న పోటీలో చింగారీ వేగంగా దూసుకువెళ్తోంది.

టిక్‌టాక్‌ను తాను ఎప్పుడూ వాడలేదని, చింగారీ యాప్‌ను మాత్రం కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకున్నానని మూడు రోజుల క్రితం ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఆయన లాగే స్వదేశీ సెంటిమెంట్‌తో ఈ యాప్‌ను ఇప్పుడు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

గంటకు మూడు లక్షలకుపైగా మంది వినియోగదారులు కొత్తగా తమ యాప్‌లో చేరుతున్నారని ఆ యాప్ సహవ్యవస్థాపకుడు సమీత్ ఘోష్ ట్విటర్‌లో తెలిపారు.

2018 నవంబర్‌లో ఈ యాప్ తొలిసారి గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆ మరుసటి ఏడాది జనవరిలో యాపిల్ యాప్‌ స్టోర్‌లోనూ పెట్టారు.

ఇప్పటికే 80 లక్షలకు వినియోగదారులను చింగారీ సంపాదించుకుంది.

ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా టిక్‌టాక్ తరహాలోనే ఉంది.

పైకి స్వైప్ చేస్తూ పోతే కొత్త వీడియోలు వస్తాయి.

వాటిని లైక్ చేయాలన్నా, కామెంట్ చేయాలన్నా, సొంతంగా వీడియోలు పెట్టాలన్నా యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.

ఈ యాప్ వినియోగదారుల ఫోన్ కెమెరా, లొకేషన్, మైక్రోఫోన్ యాక్సెస్‌ కోరుతుంది.

చింగారీ యాప్‌లో వినియోగదారులు పెట్టిన పోస్ట్‌లకు వచ్చిన ఆదరణను బట్టి, వారికి యాప్‌‌లో కొన్ని పాయింట్లు వస్తాయి. వీటిని రెడీమ్ చేసుకోని వాళ్లు డబ్బుగా తీసుకోవచ్చు.

ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం, గుజరాతీ, మరాఠీ వంటి భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది.

రొపోసో, మిత్రోన్, షేర్ చాట్… చిట్టా పెద్దదే

ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌లో ప్రస్తుతం అత్యధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్ రొపోసోనే.

చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించకుముందు తమ యాప్ 6.5 కోట్ల సార్లు డౌన్‌లోడ్ అయ్యిందని రొపోసో తెలిపింది.

నిషేధం అమల్లోకి వచ్చాక , డౌన్‌లోడ్‌ల సంఖ్య పది కోట్లకు చేరువైందని పేర్కొంది.

ప్రతి గంటకూ ఆరు లక్షల మంది కొత్త వినియోగదారులు తమ యాప్‌లో చేరుతున్నట్లు వివరించింది.

ఈ యాప్ చాలా రోజులుగానే అందుబాటులో ఉంది.

రొపోసోతోపాటు టిక్‌టాక్ తరహాలో చిన్న వీడియోలు షేర్ చేసుకునే వేదికలు అనేకం వచ్చాయి.

మిత్రోన్, షేర్‌చాట్ అలాంటి యాప్‌లే.

చైనీస్ యాప్స్‌పై నిషేధానికి ముందే మిత్రోన్ కోటి డౌన్‌లోడ్లు దాటి, సంచలనంగా మారింది. అయితే, ఇది పాకిస్తాన్ డెవెలపర్ల నుంచి రూ.2500కు సోర్స్ కోడ్ కొని, క్లోన్ చేసి రూపొందించిన యాప్ అని కూడా వార్తలు వచ్చాయి.

షేర్ చాట్ చాలా రోజులుగా ఉన్న దేశీయ యాపే. గ్రామీణ ఇంటర్నెట్ యూజర్లలో దీనికి ఆదరణ ఎక్కువగానే ఉంది.

‘భారత్‌లో నిషేధం వల్ల టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్‌ రూ.45 వేల కోట్ల వరకూ నష్టపోవాల్సి రావొచ్చు’

అవకాశమే కాదు… సవాలు కూడా

ఒక్కసారిగా భారీ స్థాయిలో వినియోగదారులు రావడం ఈ యాప్‌లకు పెద్ద సవాలే.

విపరీతమైన ట్రాఫిక్‌ను తట్టుకోలేక, చింగారీ సర్వర్లు డౌన్ అవుతున్నట్లు ఆ సంస్థే తెలిపింది.

ప్లేస్టోర్, యాప్ స్టోర్‌ల్లోనూ చింగారీ, రొపోసోలకు ప్రతికూల రివ్యూలు వస్తున్నాయి.

కానీ, ఇలా జరుగుతూ పోతే వినియోగదారులు ఈ యాప్‌లపై ఆసక్తి కోల్పోతారు.

అందుకే, వీలైనంత వేగంగా వనరులను పెంచుకోవడంపైన ఈ యాప్‌లు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని టెక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ బీబీసీతో అన్నారు.

లేకపోతే ఈ యాప్‌లు ఎంత వేగంగా వినియోగదారులను సంపాదించుకున్నాయో, అంతే వేగంగా వారిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు.

''ఇవి చాలా చిన్న యాప్‌లు. పరిమిత వనరులతో నడిచేవి. ఒకే సారి పెద్ద మొత్తంలో వినియోగదారులు యాప్‌ను ఉపయోగిస్తే, తట్టుకునే సామర్థ్యం వీటికి ఉండదు. సర్వర్లు విఫలమవుతాయి. అందుకే, వేగంగా వనరులు పెంచుకోవాలి. పెట్టుబడులు సమీకరించుకోవాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి సంస్థలకు రుణ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది’’ అని శ్రీధర్ అభిప్రాయపడ్డారు.

టిక్‌టాక్ వీడియో షూటింగ్

భద్రతపై అనుమానాలు

ఈ కొత్త యాప్‌ల్లో సమాచార భద్రత ఉంటుందని కూడా భావించలేమని శ్రీధర్ వ్యాఖ్యానించారు.

''కోడింగ్ తెలిసిన ఓ ఇద్దరు, ముగ్గురు కలిసి ఇలాంటి యాప్‌లు తయారుచేసేయొచ్చు. సమాచార భద్రతపై వాళ్లు మరీ ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు చాలా తక్కువ’’ అని అన్నారు.

మరోవైపు చింగారీ యాప్‌లో సమాచార భద్రతపై ఎలియట్ ఆండర్సన్ పేరుతో ట్విటర్ చెలామణీ అవుతున్న ఓ హ్యాకర్ అనుమానం వ్యక్తం చేశారు.

చింగారీ యాప్‌ వెనుకున్న గ్లోబస్‌సాఫ్ట్ సంస్థ వెబ్‌సైట్‌లోని అన్ని పేజీల కోడ్‌లో మాల్‌వేర్ ఉందని, చింగారీ యాప్‌లోనూ భద్రత ఈ స్థాయిలోనే ఉండొచ్చేమోనని ఆండర్సన్ సందేహం వ్యక్తం చేశారు.

అయితే, దీనికి చింగారీ సహవ్యవస్థాపకుడు సుమీత్ ఘోష్ స్పందించారు. చింగారీ యాప్ గ్లోబస్‌సాఫ్ట్ నేతృత్వంలో ఊపిరిపోసుకుందని, యాప్‌ను నిర్మించింది తామేనని అన్నారు. చింగారీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో వినియోగదారుల సమాచార భద్రతకు ఎలాంటి ముప్పూ లేదని చెప్పారు.

''సమాచారమంతా ముంబయిలోని ఏడబ్ల్యూఎస్ సర్వర్లలో ఉంటుంది. చింగారీ, గ్లోబస్‌సాఫ్ట్ యాప్‌ల భద్రత, ఇంజినీరింగ్ కోసం పనిచేసే బృందాలు పూర్తిగా వేర్వేరు. త్వరలోనే చింగారీ స్వతంత్ర సంస్థగా మారుతుంది’’ అని వివరించారు.

టిక్ టాక్

టిక్‌టాక్ తిరిగివస్తే...

భారత్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు టిక్‌టాక్ ప్రయత్నాలు చేస్తోంది.

ప్రభుత్వ నిషేధాన్ని సవాలు చేసేందుకు న్యాయపరంగా ఉన్న మార్గాలనూ ఆ సంస్థ వెతుకుతోంది.

ఇదివరకు చైల్డ్ పోర్నగ్రఫీకి వేదికగా ఉంటుందోన్న కారణంతో టిక్‌టాక్‌పై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఆ తర్వాత, తిరిగి షరతుల మధ్య నిషేధాన్ని తొలగించింది.

ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సంతృప్తపరిచేలా టిక్‌టాక్ చర్యలు తీసుకుంటే, మరోసారి నిషేధం తొలిగే అవకాశాలు లేకపోలేదు.

అదే జరిగితే, టిక్‌టాక్‌ మళ్లీ భారత్‌లో జనాదరణ పొందగలదని శ్రీధర్ అంటున్నారు.

''ఇప్పుడు జనంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ ఉంది. టిక్‌టాక్‌ను వ్యతిరేకిస్తున్నారు. కానీ, ఇది తాత్కాలికమే. పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండదు. ఉద్రిక్తతలు తగ్గుతాయి. మళ్లీ, ఆ యాప్ భారత్‌లో మొదలైతే, ఆదరణ పొందుతుంది’’ అని చెప్పారు.

టిక్‌టాక్ తిరిగివస్తే... చింగారీ, రొపోసో లాంటి దేశీయ యాప్‌లు నిలదొక్కుకోవడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవికూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chinagri App replaces banned Tiktok app
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X