వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్ ముస్లింలు మమతను వదిలి... ఒవైసీ వైపు నిలుస్తారా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కొన్ని గంటల ఆకస్మిక పర్యటన, ఇప్పటికే వాడీవేడిగా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకొచ్చింది.

ఒవైసీ ఆదివారం చాలా రహస్యంగా హఠాత్తుగా కోల్‌కతా చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా హుగ్లీ జిల్లాలోని శ్రీరాంపూర్‌లో ముస్లింల పవిత్ర సందర్శనా స్థలం ఫుర్‌ఫురా షరీఫ్ వెళ్లారు.

దానిని సందర్శించిన తర్వాత ఆయన పీర్జాదా అబ్బాస్ సిద్ధిఖీతో సమావేశం అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనతో కలిసి బరిలోకి దిగుతామని ప్రకటించారు.

ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత ఒవైసీ పశ్చిమ బెంగాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆయన ఈ ప్రకటన మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు తీసుకొచ్చింది.

పశ్చిమ బెంగాల్లోని దాదాపు 30 శాతం మైనారిటీలు టీఎంసీకి చాలా బలమైన ఓటు బ్యాంకుగా నిలిచారు. ఇప్పుడు ఒవైసీ ఎన్నికల మైదానంలో దిగడంతో ఆ ఓటు బ్యాంకుకు గండి పడే ప్రమాదం వచ్చింది.

https://twitter.com/imMoinAfridi/status/1345723370394984450

ఒవైసీ పార్టీ బీజేపీ 'బీ' టీమ్

అయితే, ఒవైసీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఆయన ఎంఐఎం పార్టీని బీజేపీ 'బీ' టీమ్‌గా వర్ణించింది.

మమత ఎన్నికల వ్యూహాలకు ఒవైసీ అడ్డంకి కాబోతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి.

ఒవైసీ ఫుర్‌ఫురాలో సిద్ధిఖీతో సమావేశమైన తర్వాత బెంగాల్లో ఊహాగానాలు జోరందుకున్నప్పటికీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పుడే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులను దించుతామని ఒవైసీ ప్రకటించారు.

కానీ తర్వాత కొన్ని రోజులకే ఎంఐఎం పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు అన్వర్ పాషాను తమవైపు తిప్పుకున్న టీఎంసీ, ఒవైసీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.

అదే సమయంలో ఒవైసీని విమర్శించిన పాషా, ఓట్లను పోలరైజ్ చేసి మమతను అధికారం నుంచి తప్పించాలని చూస్తున్న ఎంఐఎం, బీజేపీకి ప్రయోజనం కలిగేలా చూస్తోందని ఆరోపించారు.

ఫుర్‌ఫురా షరీఫ్ ప్రాధాన్యం

హుగ్లీ జిల్లాలోని ఫుర్‌ఫురా షరీఫ్ మైనారిటీల పవిత్ర సందర్శనీయ స్థలం. ఇక్కడ 1375లో ముక్లిష్ ఖాన్ ఒక మసీదును నిర్మించారు.

అది ప్రస్తుతం బెంగాలీ ముస్లింలకు విశ్వసనీయ స్థలంగా మారింది. ఇక్కడ ఉర్సులు, మేలాలు జరిగే సమయంలో దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారు

ఫుర్‌ఫురా షరీఫ్‌లో అబూ బకర్ సిద్ధిఖీ, ఆయన ఐదుగురు కొడుకుల సమాధులు ఉన్నాయి. అబూ బకర్ ఒక సంఘ సంస్కర్త. మతం పట్ల ఆయనకు చాలా విశ్వాసం ఉండేది.

ఆయన ఎన్నో స్వచ్ఛంద సంస్థలు స్థాపించారు. మహిళా విద్యను ప్రోత్సహించడానికి ఫుర్‌ఫురా షరీఫ్‌లో బాలికల కోసం స్కూల్ కూడా స్థాపించారు.

దానికి సిద్దిఖీ హైస్కూల్ అని పేరు పెట్టారు. అబూ బకర్‌ను ఫుర్‌ఫురా షరీఫ్ వ్యవస్థాపకుడుగా కూడా పరిగణిస్తారు..

ఎన్నికలు వచ్చినపుడు ఒక్కసారిగా దీని ప్రాధాన్యం పెరిగిపోతుంది. వామపక్షాల నుంచి టీఎంసీ, కాంగ్రెస్ వరకూ అన్ని పార్టీల నేతలూ దీవెనల కోసం ఇక్కడికి చేరుకోవడం మొదలుపెడతారు.

బెంగాల్‌లో మైనారిటీ సమాజం

బెంగాల్ మైనారిటీ సమాజాలు ప్రధానంగా రెండు మత సంస్థలను అనుసరిస్తాయి. వీటిలో ఒకటి దేవబంద్ సిద్ధాంతాలను పాటించే జమీయత్ ఉలేమా-ఎ-హింద్‌, ఇంకొకటి ఫుర్‌ఫురా షరీఫ్.

బలమైన మైనారిటీ ఓటు బ్యాంకు మద్దతుతో మమత దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్ మొత్తం జనాభాలో 27.01 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు ఈ గణాంకాలు 30 శాతానికి దగ్గరగా చేరుకున్నాయి.

బంగ్లాదేశ్ సరిహద్దు ఆనుకుని ఉన్న జిల్లాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్‌లో ముస్లింలు మొత్తం జనాభాలో సగం లేదా అంతకంటే ఎక్కువే ఉంటారు.

ముస్లిం ఓటు బ్యాంక్

బెంగాల్ ముస్లిం ఓటు బ్యాంకు

వీటితోపాటూ దక్షిణ, ఉత్తర 24 పరగణా జిల్లాల్లో ముస్లింల ప్రభావం గణనీయంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో 100 నుంచి 110 స్థానాల్లో ఈ వర్గం ఓట్లు నిర్ణయాత్మకం అవుతాయి.

2006 వరకూ రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు వామపక్షాల చేతుల్లో ఉండేది. కానీ, తర్వాత ఈ వర్గం ఓటర్లు మెల్లమెల్లగా తృణమూల్ కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. 2011, 2016లో ఇదే ఓటు బ్యాంకు సాయంతో మమత అధికారంలో ఉండగలిగారు.

కానీ, బీజేపీ నుంచి బలమైన సవాళ్లు ఎదురవుతున్న సమయంలో, ఇప్పుడు ఒవైసీ కూడా ఇక్కడ ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టడంతో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తప్పవని భావిస్తున్నారు.

"టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మా పార్టీపై ఆరోపణలు చేయడానికి బదులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 18 సీట్లు ఎలా గెలిచిందో చూడాలి" అని ఫుర్‌ఫురా షరీఫ్‌లో అబ్బాసీతో సమావేశమైన తర్వాత ఒవైసీ అన్నారు.

మమతా బెనర్జీకి వ్యతిరేకం

తమ పార్టీని బీజేపీ 'బీ' టీమ్‌ అని, తమ వల్ల బీజేపీ వ్యతిరేక పార్టీల ఓటు బ్యాంకుకు గండి పడుతుందనే ఆరోపణలు నిరాధారమని ఒవైసీ అన్నారు.

"మాది ఒక రాజకీయ పార్టీ. మేం బెంగాల్లో మా ఉనికిని నమోదు చేస్తాం. ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఇక్కడ మేం అబ్బాసీతో కలిశాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయనకు మా మద్దతు ఉంటుంది" అని ఒవైసీ అన్నారు.

"ఒవైసీ ఇక్కడకు సందర్శనార్థం వచ్చారు. కానీ రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగింది. ఆయన మమ్మల్ని ముందు ఉంచి, బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ పొత్తు ఎలా ఉంటుంది. మేం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. అనేది ముందు ముందు నిర్ణయిస్తాం" అని అబ్బాసీ కూడా విలేఖరులకు చెప్పారు.

పీర్జాదా అబ్బాసీ సిద్ధిఖీ ఇదే నెలలో తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. ఆయన ఇటీవలి వరకూ మమతా బెనర్జీకి బలమైన మద్దతుదారుడుగా ఉన్నారు. కానీ, గత కొన్ని నెలలుగా ఆయన టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

బెంగాల్ రాజకీయాలు

బీజేపీ దారి ఎలా ఉంటుంది

మమతా బెనర్జీ ప్రభుత్వం మైనారిటీలను నిర్లక్ష్యం చేసిందని సిద్ధిఖీ ఆరోపిస్తున్నారు. బెంగాల్‌లో దాదాపు 100 స్థానాలపై ఫుర్‌ఫురా షరీఫ్ ప్రబావం ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

మరోవైపు, ఒవైసీ పర్యటన.. ఆయన బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం వల్ల తమకు సవాలు ఎదురవుతుందని అంగీకరించడానికి టీఎంసీ సిద్ధంగా లేదు.

"బెంగాల్లో అధికారం సాధించాలంటే 147 స్థానాలు అవసరం. కానీ, ఒవైసీ దగ్గర అంతమంది అభ్యర్థులే లేరు. బీజేపీ మార్గం సుగమం చేసేందుకే ఆయన పార్టీ రాజకీయాల్లోకి దిగుతోంది" అని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ అన్నారు.

"ఒవైసీ రావడం వల్ల బెంగాల్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక్కడ ఉర్దూ మాట్లాడే ముస్లింల జనాభా చాలా తక్కువ. బీజేపీ కోసం ఒవైసీ వేరే పార్టీల ఓట్లు చీలుస్తున్నారనే నిజాన్ని జనం అర్థం చేసుకున్నారు" అని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ అన్నారు.

కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌధరితో ఫుర్‌ఫురా షరీఫ్‌ సందర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నాన్ కూడా "బెంగాల్ ముస్లింలు అంత మూర్ఖులు కాదు. ఇక్కడ మతం ఆధారంగా రాజకీయాలు సాగేలా ఉంటే, ముస్లిం లీగ్ ఉనికి అంతమయ్యేదే కాదు" అన్నారు.

బెంగాల్ రాజకీయాలు

ఫుర్‌ఫురా షరీఫ్‌లోనే ఉన్న త్వాహా సిద్ధిఖీ అనే మరో ఫిర్జాదా తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు.

"బెంగాల్ ముస్లింలు అవకాశవాద గుంటనక్కల కంటే ఎప్పుడూ పులితో కలిసి ఉండడానికే ఇష్టపడతారు. బెంగాల్ ముస్లింలు మతం, జాతి, కుల రాజకీయాలకు బదులు అభివృద్ధికి అండగా నిలుస్తారు" అన్నారు

మరోవైపు ఒవైసీ పర్యటన, ఎన్నికల్లో పోటీ చేస్తామనే ఆయన ప్రకటన టీఎంసీకి ఆందోళన కలిగించే అంశమే కానీ, మా పార్టీకి కాదు అని బీజేపీ అంటోంది.

"ముస్లింలను సొంత జాగీరుగా భావించేవారికి, మైనారిటీలను మెప్పించే రాజకీయాలు చేసేవారికి ఒవైసీ వల్ల ఇప్పుడు ప్రమాదం అనిపిస్తోంది. ఎంఐఎం-బీజేపీ దారులు వేరు వేరు. మాకు ఎవరి సాయం అవసరం లేదు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దానికి అతిపెద్ద సాక్ష్యం" " అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.

"ఒవైసీ బెంగాల్ రాజకీయాల్లో దిగడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది, ప్రస్తుతం చెప్పడం కష్టం. కానీ, ఆయన పర్యటన, ఎన్నికల్లో పోటీ చేస్తామనే ప్రకటన టీఎంసీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి" అని రాజకీయ విశ్లేషకులు సమీర్ కుమార్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
West Bengal Muslims might turn towards Owaisi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X