27 ఏళ్లపాటు అధికారానికి దూరం.. 200 ఎంపీలు, 11 మంది సీఎంల శ్రమ వృధా.. బీజేపీ ఎందుకు ఓడిందంటే..
ఏదైనా ఒక రాష్ట్రంలో గెలవాలనిగానీ బీజేపీగానీ కంకణం కట్టుకుంటే.. దాన్ని సాధించడానికి విపరీతంగా కష్టపడటం.. చాలా రాష్ట్రాల్లో మహామహా పార్టీలను మట్టికరిపించి గద్దెనెక్కడం తెలిసిందే. కానీ ఢిల్లీ అసెంబ్లీ విషయంలో మాత్రం కాషాయ పార్టీ దారుణ వైఫల్యాలను మూటగట్టుకుంటున్నది. మంగళవారం నాటి ఆప్ విజయంతో బీజేపీ ఏకంగా 27 ఏళ్లపాటు అధికారానికి దూరం కానుండటం ఖాయమైపోయింది. దేశమంతటా చక్రం తిప్పుతూ, ఢిల్లీ మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమైపోవడంపై బీజేపీలో అంతర్మథనం మొదలైంది.

సుదీర్ఘకాలం..
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండేది. తర్వాతికాలంలో అసెంబ్లీ రద్దుకావడంతో దశాబ్దాలపాటు అక్కడ ఎన్నికల ప్రస్తావనేలేదు. 1993లో అప్పటి కేంద్ర సర్కారు... ఢిల్లీ అసెంబ్లీని పునరుద్ధరించింది. 1993 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఐదేళ్లలో ముగ్గురు సీఎంలు పనిచేశారు. 1998లో మాత్రం షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తరువాత రెండు సార్లు(2003, 2008లోనూ) ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడింది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి బరిలోకి దిగింది. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ సీఎం అయ్యారు. 2015లో 67 సీట్లు, 2019లో 63 సీట్లతో ఆప్ ఘనవిజయం సాధించింది. వచ్చే ఐదేళ్లూ ఆమ్ ఆద్మీ పార్టీనే కొనసాగనుండటంతో బీజేపీ 27 ఏళ్లపాటు అధికారానికి దూరం కానుంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి దారితీసిన కారణాలేంటంటే..

చెత్త స్ట్రాటజీతో షాక్ తగిలింది..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన స్ట్రాటజీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించడానికి తమ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో బీజేపీ నేతలు విద్వేషాలను రెచ్చగొట్టడమే వ్యూహంగా పనిచేశారు. చిన్నా చితకా నేతల దగ్గర్నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీల దాకా సీఏఏ నిరసనల్ని, షాహీన్ బాగ్ ధర్నా కేంద్రాన్ని బూచిగా చూపించి ఓట్లు దండుకునేప్రయత్నం చేశారు. స్ట్రాటజీలన్నీ విఫలం కావడంతో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైపోయింది.

పూర్వాంచల్ ఫ్యాక్టర్
ఢిల్లీ జనాభాలో 35 శాతం పూర్వాంచల్ నుంచి వచ్చినవాళ్లదే కావడంతో అన్ని పార్టీలు ఆయా వర్గాలన్ని ఆకట్టుకునేపనిచేస్తాయి. ఈస్ట్ యూపీ, బీహార్ లోని కొంత ప్రాంతాలను కలిపి పూర్వాంచల్ గా పిలుస్తారు. పూర్వాంచల్ మూలాలున్న ఓటర్లను ఆకట్టుకోడానికే బీజేపీ.. అదే ప్రాంతానికి చెందిన గాయకుడు, నటుడు మనోజ్ తివారీని ఏకంగా పార్టీ ఢిల్లీ శాఖకు అధ్యక్షుడిగా నియమించింది. తానేమీ తక్కువ తినలేదన్నట్లు ఆప్ కూడా పూర్వాంచల్ ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఆ ప్రాంతనేతలకే టికెట్లిచ్చింది. యూపీ, బీహార్ నుంచి వలసవచ్చినవాల్లలో ఎక్కువమంది పేదలే కావడంతో ఆప్ పథకాలవైపు మొగ్గుచూపినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నరేలా, బురారి, బంద్లీ, సుల్తాన్ పుర్ మజ్రా, దెవోలి, అంబేద్కర్ నగర్, సంగం విహార్, రితాలా తదితర నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారు.

చెమటోడ్చినా దక్కని ఫలితం
బీజేపీ మాజీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో మొత్తం 52 రోడ్ షోలు నిర్వహించారు. సుమారు 200 మంది ఎంపీలు, 11 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు ఢిల్లీలో ప్రచారం నిర్వహించి చెమటోడ్చినా బీజేపీకి ఫలితం దక్కలేదు. నిజానికి ఢిల్లీ మున్సిపాలిటీపై గత 12 ఏళ్లుగా బీజేపీ పెత్తనమే సాగుతోంది. అయినాసరే కమలనాథులు పని గురించి మాట్లాడకపోవడం... ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఐదేళ్లలో చేసిన పని చూసి ఓటేయండని పిలుపునివ్వడం.. రెండు పార్టీల మధ్య తేడాలను ప్రస్పుటం చేశాయి. బీజేపీ వ్యూహరచన దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇక పార్టీలో ప్రక్షాళన తప్పదనే వాదన తెరపైకొచ్చింది.

కొంపముంచిన వర్గపోరు
ఎన్నికలకు ముందు నుంచే ఢిల్లీ బీజేపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. మోదీ చరిష్మాతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈజీగా గట్టెక్కుతామని భావించిన బీజేపీ నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థి మేమంటే మేమని కొట్లాడుకున్నారు. ప్రచారం ప్రారంభమయ్యేసమయానికి కూడా పార్టీలో ఐక్యత రాకపోవడంతో అమిత్ షా రంగంలోకి దిగాల్సివచ్చింది. వర్గ పోరు కారణంగానే ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికలకు వెళ్లినట్లు నేతలు అంటున్నారు.