లాక్‌డౌన్ ఎఫెక్ట్: చిల్లిగవ్వ లేదు.. ఫోను అమ్మేశాడు... రేషన్ తెచ్చాడు..కానీ చివరికి ఇలా..!
గురుగ్రామ్ : కరోనావైరస్ దేశాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొన్ని ఫలాలు మాత్రం చాలా చోట్ల ముఖ్యంగా మారుమూల గ్రామీణప్రాంతాల్లో జీవించే ప్రజలకు అందడం లేదు. దీంతో వారు ఆ రోజు ఎలా గడుస్తుందా అనే దిగులుతో కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇలాంటి కథలు వెతికితే భారతావనిలో కోకొల్లొల్లు. తాజాగా బీహార్‌నుంచి వచ్చిన ఒక వలసకార్మికుడి వ్యథ వెలుగులోకి వచ్చింది.

ఆత్మహత్యకు పాల్పడ్డ వలసకార్మికుడు
బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చిన వలస కార్మికుడి కథ ఇది. కరోనామహమ్మారి ప్రత్యక్షంగా ప్రాణాలు తీయడంతో పాటు పరోక్షంగా కూడా ప్రాణాలు తీస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ విధించగా దీన్నుంచి కష్టాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా వలసకార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పొట్ట చేత పట్టుకుని పనులకోసం బీహార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురుగ్రామ్‌లోని సరస్వతికుంజ్ సెక్టార్ 3లో నివసిస్తున్న ఈ కార్మికుడు తన వద్ద ఒక్క పైసా లేకపోవడంతో బతకడం భారంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతికి ముందు సెల్‌ఫోన్ అమ్మి ఇంటికి రేషన్
లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేకపోవడంతో సంపాదన ఆగిపోయింది. తను బతకడమే కష్టమైన ఆ వలస కార్మికుడికి తన సంపాదనపై ఆధారపడ్డ వారు కూడా ఇబ్బందులు పడుతుండటం చూడలేకపోయాడు. పెయింటర్‌గా పనిచేస్తున్న మృతుడు... పని లేకపోవడంతో కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితి దుర్భంగా మారింది. అప్పుడప్పుడు పొరుగింటివారు ఏదైనా రేషన్ దానం చేసేవారని మృతుడి మామ చెప్పాడు. ఇక తన మృతికి కొన్ని గంటల ముందు ఇంట్లో ఏమీ లేకపోవడంతో తన సెల్‌ఫోన్‌ను రూ.2500కు అమ్మినట్లు మృతుడి మామ చెప్పాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో...
ఇంట్లో తినేందుకు గింజకూడా లేదని భార్య చెప్పడంతో సెల్‌ఫోన్‌ను అమ్మి వచ్చిన డబ్బుతో బియ్యం, మరియు కందిపప్పును కొన్నాడు. ఇక ఇంట్లోకి రూ.400తో సీలింగ్ ఫ్యాన్‌ను కూడా కొన్నట్లు మృతుడి మామ చెప్పాడు. ఇక మిగిలిన డబ్బును తీసుకొచ్చి భార్యకు ఇచ్చినట్లు చెప్పిన మృతుడి మామ... మృతుడి భార్య బిడ్డలు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందినట్లు చెప్పాడు. అయితే ఇక ఇంటి కిరాయి ఎలా కట్టాలో అన్నదానిపై చాలా ఆవేదన చెందినట్లు భార్య చెబుతోంది. నెలకు రూ.3వేలు అద్దె చెల్లిస్తూ ఆ చిన్న ఇంట్లో ఉంటున్నారు.

పోలీసులు ఏం చెబుతున్నారంటే..?
ఇదిలా ఉంటే ఆ వలసకార్మికుడు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో పొరిగింటి వారంతా విరాళాలు ఇవ్వడంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు మృతుడి భార్య చెప్పింది. అయితే పోలీసులు మాత్రం వారింట్లో సరిపడా రేషన్ ఉందని అయితే ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అనుమానంను వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో జిల్లా యంత్రాంగం మరియు పోలీసువారు ఆహారాన్ని అందజేస్తున్నారని చెప్పారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉండగా అందులో 5నెలల పసిబిడ్డ కూడా ఉంది.