వైశాలిలో మహిళ సజీవ దహనం దాచిపెట్టి .. అమానవీయం .. సీఎం నితీష్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్
నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నితీష్ కుమార్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం బీహార్‌లోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైశాలి లో ఒక మహిళను సజీవ దహనం చేసిన సంఘటన ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చోటుచేసుకుందని పేర్కొన్న రాహుల్ గాంధీ, పదిహేను రోజుల పాటు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడి సదరు మహిళ మరణించినట్లుగా నివేదిక తెలిపిందన్నారు. ఈ విషయం బయటకు రాకుండా నితీష్ కుమార్ రహస్యంగా దాచి పెట్టారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ పిక్నిక్ ఎంజాయ్ చేశారు .. బీహార్ లో ఓటమికి కాంగ్రెస్ నే కారణమన్న ఆర్జేడీ

సజీవ దహన ఘటన బయటకు రాకుండా రహస్యంగా ఓట్ల కోసం నితీష్ రాజకీయం
ఎవరి నేరం అత్యంత ప్రమాదకరమైంది ? ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారు ఎవరు ? ఓట్ల రాజకీయం కోసం దీనిని దాచిపెట్టిన ఘనత, మంచి పాలన అందిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్న పాలకులది కాదా? అంటూ రాహుల్ గాంధీ మహిళ సజీవ దహనం ఘటనపై నిప్పులు చెరిగారు.
బీహార్‌లోని వైశాలి జిల్లా చంద్‌పురా ఓపి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఒక గ్రామంలో వేధింపులను ప్రతిఘటించినందుకు 20 ఏళ్ల మహిళను ముగ్గురు పురుషులు సజీవ దహనం చేశారు. ఈ సంఘటన 15 రోజుల క్రితం జరిగింది.

మహిళను సజీవదహనం చేసిన ముగ్గురు ..15 రోజుల పాటు ఆస్పత్రిలో .. ఆపై మృతి
నిందితులు ఆమెపై కిరోసిన్ పోసి , ఆపై ఆమెను సజీవ దహనం చేశారు. ప్రాణాలతో బయటపడిన ఆమెను బంధువులు పిఎంసిహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, దురదృష్టవశాత్తు, ఆ మహిళ 15 రోజుల చికిత్స తర్వాత మరణించింది .
ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలిక బంధువుల కథనం ప్రకారం, సతీష్ యాదవ్ అనే వ్యక్తి సదరు మహిళను వేధింపులకు గురి చేసేవాడని , ఒక రోజు సదరు మహిళ అతని ప్రవర్తన గురించి తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ తర్వాత అతను ఆమెపై కోపం పెంచుకుని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను వేధించాడని, ప్రతిఘటించినప్పుడు ఆమెను సజీవ దహనం చేసినట్లు వారు చెప్తున్నారు .

ఎఫ్ఐఆర్ దాఖలు చెయ్యకుండా తాత్సారం .. ఘటన బయటకు రాకుండా చేశారని రాహుల్ ఫైర్
ఈ సంఘటన జరిగిన 15 రోజుల తరువాత ఈ రోజు వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలుస్తోంది .
ఈ దారుణ సంఘటన గురించి పోలీసులకు వెంటనే తెలిసిందని, వారు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఆసుపత్రికి వెళ్లారు, కాని ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదని సమాచారం . అమ్మాయి స్టేట్మెంట్ యొక్క వీడియో వైరల్ అయిన సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత, పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు మహిళ మృతికి కారణమైన వారి అరెస్టులు జరగలేదు.

సీఎంగా నితీష్ బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే రాహుల్ గాంధీ ఆరోపణలు
దీంతో ఈ ఘటనపై రాహుల్ గాంధీ సీఎంగా ఏడో సారి బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే ఆయనపై మాటల దాడికి దిగారు. అమానవీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఇంతా జరిగినా తనపాలన చాలా బాగుందంటూ కితాబు ఇచ్చుకునేందుకే ఇంత దారుణ ఘటనను కప్పి పుచ్చారని , బయటకు రాకుండా ఇన్ని రోజులు ఆపారని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.