బహిర్భూమికి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం... పదునైన ఆయుధంతో కళ్లల్లో పొడిచాడు...
దేశంలో మహిళలపై ఆకృత్యాలకు తెరపడట్లేదు. నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అత్యాచార ఘటనలపై సమాజం నుంచి తీవ్ర ఆగ్రహం,నిరసన వ్యక్తమవుతున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా మహారాష్ట్రలోని హవారె గ్రామంలో ఓ మహిళపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో పదునైన ఆయుధంతో ఆమె కళ్లల్లో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అసలేం జరిగింది...
మహారాష్ట్ర పుణేలోని శిరూర్ తహశీల్ పరిధిలో ఉన్న హవారె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... బుధవారం(నవంబర్ 4) రాత్రి బహిర్భూమి కోసం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆమెను అమాంతం తన చేతుల్లో బంధించాడు. అత్యాచారానికి యత్నించగా... ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె తనకు సహకరించట్లేదన్న కోపంతో దుండగుడు తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమె కళ్లపై దాడికి పాల్పడ్డాడు.

కన్ను కోల్పోయిన బాధితురాలు
దుండగుడి దాడిలో ఆమె ఒక కన్ను కోల్పోయింది. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆ కనుగుడ్డు పూర్తిగా బయటకు వచ్చింది. మరో కన్నుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఇంతలో దుండగుడు అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం ఆమెను పుణేలోని ససూన్ ఆస్పత్రికి తరలించారు. పుణే రూరల్ ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ బృందం ఆస్పత్రిలో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసింది.

నిందితుడిని గుర్తించలేని స్థితిలో...
బాధితురాలు ఒక కన్ను కోల్పోవడం,రెండో కన్ను కూడా చాలావరకు దెబ్బతినడంతో ఆమె కంటిచూపు కోల్పోయింది. దీంతో నిందితుడిని గుర్తించడం కష్టంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు,బాధితురాలి కుటుంబం కోరుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గతంలో నిర్భయ,దిశ అత్యాచార ఘటనల్లోనూ దేశమంతా వాటిని తీవ్రంగా ఖండించింది. ఆ తర్వాత నిర్భయ చట్టం కూడా అమలులోకి వచ్చింది. దిశ హత్యాచార ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలుచేస్తున్నా అత్యాచార ఘటనలకు తెరపడకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.