మహిళా శక్తికి ప్రతీక ..16 వేల కిలోమీటర్లు సుదూర ప్రయాణం చేసి ఘనత సాధించిన మహిళా పైలట్లు
ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం చేసి చరిత్ర సృష్టించారు నలుగురు మహిళా పైలట్ లు. ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్ లు అరుదైన ఘనతను సాధించారు. అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసి విజయవంతంగా తిరిగొచ్చిన వారిగా వారు చరిత్రపుటల్లో కెక్కారు.

సుదూర ప్రయాణం చేసి సత్తా చాటిన మహిళా పైలట్లు .. ఒకరు తెలుగమ్మాయే
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి 16 వేల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి మహిళా పైలట్ లు తమ సత్తాను నిరూపించుకున్నారు. ఈ ఘనత సాధించినందుకు నలుగురు మహిళా పైలట్ లు సంతోషం వ్యక్తం చేశారు.
మహిళలు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరు అని సత్తా చాటే విధంగా అత్యంత సాహసోపేతంగా మహిళలు ఈ సుదూర ప్రయాణాన్ని పూర్తి చేయడం విశేషం . ఇక ఈ నలుగురు పైలట్ ల బృందంలో తెలుగమ్మాయి కూడా ఉన్నారు .

శాన్ ఫ్రాన్సిస్కో నుండి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి 17 గంటల్లో ప్రయాణం
నలుగురు మహిళా పైలెట్ లు , సిబ్బందితో సుదీర్ఘ ప్రయాణం చేసిన భారీ విమానం సోమవారం ఉదయం 3 గంటల 5 నిమిషాలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బెంగుళూరు విమానాశ్రయంలో మహిళా పైలెట్లకు ఘన స్వాగతం లభించింది. మహిళా పైలట్ లు నడిపిన ఎయిరిండియా విమానానికి ప్రధాన పైలెట్ గా కెప్టెన్ జోయా అగర్వాల్ అసిస్టెంట్ పైలెట్ గా తెలుగు అమ్మాయి కెప్టెన్ పాప గారి తన్మయి, కెప్టెన్ శివాని మనహాస్, కెప్టెన్ సోనావారే వ్యవహరించారు.

వీరు 17 గంటల్లో తమ ప్రయాణాన్ని పూర్తి చేశారు.
16 వేల కిలోమీటర్లు ప్రయాణించి మహిళా శక్తికి నిదర్శనంగా
విరామం లేకుండా 16 వేల కిలోమీటర్లు ప్రయాణించి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారు. అంతేకాదు ప్రపంచంలోనే రెండో పొడవాటి బోయింగ్ విమానాన్ని నడిపి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడమే కాకుండా అపార సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారు మాత్రమే దక్కించుకునే ఈ అవకాశాన్ని మహిళా పైలట్ లు సద్వినియోగం చేసుకున్నారు. తామేంటో ప్రూవ్ చేశారు ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించటం వల్ల పది టన్నుల ఇంధనాన్ని ఆదా చేయగలిగామని కెప్టెన్ జోయా అగర్వాల్ తెలిపారు.

హర్షం వ్యక్తం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి
16 గంటలపాటు విమానం నడిపిన మహిళా పైలెట్ బృందానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి అభినందనలు తెలియజేశారు. అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణం చేసి మహిళా పైలెట్లు తామేంటో నిరూపించుకున్నారని , ప్రపంచం నలు దిక్కులకు మహిళా శక్తిని చాటి చెప్పారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమానానికి చెందిన మహిళా శక్తిని ఆయన కొనియాడారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తన అభినందనలు తెలియజేశారు. మహిళా పైలెట్లు మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు