వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా దినోత్సవం: పూర్తిగా మహిళా అధికారులే నడుపుతున్న ‘స్వర్ణకృష్ణ’ నౌక - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యం కలిగిన సముద్రయాన రంగంలో మూస పద్ధతులు, ఆలోచన ధోరణులను ఛేదించిన మహిళా లోకానికి జేజేలు పలికేందుకు కేంద్ర నౌకాయాన శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను చేపట్టిందని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

''షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)కు చెందిన 'ఎం.టి. స్వర్ణకృష్ణ’ అనే భారీ నౌక ఇందుకు వేదికైంది. కేంద్ర రేవులు, నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ జెండా ఊపి ఈ చరిత్రాత్మక యాత్రను ప్రారంభించారు. ప్రపంచ నౌకాయాన చరిత్రలో ఒక నౌకను పూర్తిగా మహిళా అధికారులే నడపడం ఇదే మొదటిసారి.

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వజ్రోత్సవాలతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యాత్రను కేంద్రం చేపట్టింది. ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టులోని లిక్విడ్‌ బెర్త్‌ జెట్టీ నుంచి స్వర్ణకృష్ణ బయలుదేరింది. మహిళా నావికా సిబ్బంది త్యాగాలు, సేవలను ఈ సందర్భంగా మంత్రి మాండవీయ కొనియాడారు.

స్వర్ణకృష్ణ.. పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్‌ నౌక. 2010లో దీన్ని నిర్మించారు. గరిష్ఠంగా 10.5 నాట్‌ (గంటకు దాదాపు 20 కిలోమీటర్లు)ల వేగంతో ప్రయాణిస్తుంది. 73 వేల టన్నుల బరువును ఇది మోసుకెళ్లగలద’’ని ఈ కథనంలో తెలిపారు.

నిత్యవసరాలు

నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి

నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి.. ప్రత్యేకించి నూనెలు, పప్పుల ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

''హైదరాబాద్‌లో గత ఏడాది మార్చిలో పామాయిల్‌ ధర లీటర్‌కు రూ.88 వరకు ఉండగా, ఇప్పుడు రూ.120 దాకా ఉంది. కందిపప్పు, మినప పప్పు, పెసర పప్పు, చింతపండు సహా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఏ వస్తువు కొనాలన్నా, ఏది తినాలన్నా ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లతో వాహనదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా.. వాటి ప్రభావం నిత్యా వసర వస్తువుల రేట్లపై పడుతోందని, ధరల పెరుగుదలకు కారణం ఇదేనని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి సరుకులను పంపుతున్న ఉత్పత్తిదారులు ఇంధన ధరలను కూడా సరుకులపై వేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏడాది వ్యవధిలో అన్ని రకాల నూనెల రేట్లూ 20 నుంచి 25 శాతం మేర పెరిగాయని చెబుతున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరుగుతుండడంతోనే పామాయిల్‌ రేటు ఇక్కడ కూడా పెరుగుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. కారణాలేవైనా.. ఆ ప్రభావం మాత్రం అంతిమంగా కొనుగోలుదారులపైనే పడుతోంది.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా మధ్య తరగతి ప్రజలు కొనుగోళ్లు తగ్గించుకుంటున్నారని రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు. నెలకు సరిపడా వారు పెట్టుకున్న బడ్జెట్‌లో వచ్చిన సరుకులనే తీసుకెళ్తున్నారని అంటున్నారు. దీంతో తమ వ్యాపారాలపై కూడా ప్రభావం పడుతోందని తెలిపార’’ని ఈ కథనంలో పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వినూత్న పథకాల వల్ల 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అత్యధికంగా పెరిగాయని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ పేర్కొన్నట్లు సాక్షి ఒక కథనంలో తెలిపింది.

''అమ్మ ఒడి, మన బడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో పాటు సంస్కరణల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 6,06,285 మంది విద్యార్థులు అదనంగా చేరారని వివరించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

'2020–21లో విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి ఒక్కసారిగా పెరిగింది. దీంతో కొద్ది మందికి పాఠ్య పుస్తకాలు అందించాల్సి ఉంది. వీరి కోసం రూ.7 కోట్లతో అదనంగా పాఠ్యపుస్తకాల ముద్రణ చేయిస్తున్నాం. వారికి 15 రోజుల్లో పుస్తకాలను అందిస్తాం.

2020–21 విద్యా సంవత్సరం కోసం.. 2019 సెప్టెంబర్ 30 నాటికి యూడైస్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య(38,97,156)కు 5 శాతాన్ని పెంచి.. 40,92,014 మంది కోసమని ఏప్రిల్‌ నాటికి పుస్తకాలు ముద్రణ చేయించాం. మే నాటికి వాటిని జిల్లాల డిపోలకు తరలించాం. ఇలా చేయగలగడం ఇదే మొదటిసారి.

2020 సెప్టెంబర్ 3 నాటికి విద్యార్థుల సంఖ్య 40,84,983గా ఉంది. దీని ప్రకారం ఇంకా 7,031 మందికి సరిపడా పుస్తకాలు మిగిలి ఉన్నాయి. కానీ 2020–21 విద్యా సంవత్సరం కోసం జగనన్న అమ్మ ఒడి పథకానికి విద్యార్థుల వివరాలను అప్‌డేట్‌ చేసినప్పుడు ఆ సంఖ్య 43,89,952కి పెరిగింది.

2021 మార్చి 6 నాటికి అది కాస్తా.. 45,03,441కు పెరిగిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే అత్యధికంగా చేరారు. వీరిలో పుస్తకాలు ఇంకా అందని వారికి త్వరలో అందిస్తాం’ అని రాజశేఖర్‌ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకం కోసం టెట్, డీఎస్సీ నిర్వహణకు కసరత్తు చేస్తున్నామని రాజశేఖర్‌ చెప్పారు. టెట్‌ను ఈ ఏడాదిలోనే నిర్వహిస్తామన్నార’’ని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఐపీఎల్‌ 2021 సీజన్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

ఐపీఎల్‌ 2021 సీజన్‌ మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం మధ్యాహ్నం ప్రకటించిందని ప్రజాశక్తి ఒక కథనాన్ని ప్రచురించింది.

''భారత్‌ వేదికగానే ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. ఏప్రిల్‌ 9న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.

ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియంలో మే 30న జరగనుండగా.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

ఐపీఎల్‌ 2021 సీజన్‌ లీగ్‌ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌ రూపంలో మొత్తం ఆరు సిటీలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్లేఆఫ్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ వేదికగా జరగనుండగా.. ఈ ఏడాది మొత్తం 11 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు ఉన్నాయి.

భారత కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకు ప్రారంభం కానుండగా.. రాత్రి మ్యాచ్‌లు 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు పదేసి మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. అహ్మదాబాద్‌, ఢిల్లీలో ఎనిమిదేసి మ్యాచ్‌లు జరగనున్నాయి.

వాస్తవానికి తొలుత హైదరాబాద్‌లోనూ ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఒక్కరు కూడా హైదరాబాద్‌కి చెందిన ఆటగాడు లేకపోవడంతో ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హెచ్చరించారు.

దానికి తోడు, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ అంతర్గత కుమ్ములాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుండటంతో హైదరాబాద్‌ స్థానంలో బీసీసీఐ దిల్లీని ఎంచుకుంద’’ని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Women's Day: 'Swarnakrishna' ship run entirely by women officers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X