
ఒక్కరోజైనా సీఎంగా ఉంటా-గాలి జనార్ధన్ రెడ్డి సంచలనం-ఎమ్మెల్యే,మంత్రిగా ఆశల్లేవ్
ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో సైతం కలకలం రేపిన కర్నాటకలోని బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్నాటకలో సంచలనంగా మారాయి.
మైనింగ్ అక్రమాలతో గతంలో కర్నాటక, ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపిన గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులపై తనకు ఆసక్తి లేదని, గట్టిగా తలచుకుంటే ఒక్కరోజైనా సీఎంగా ఉంటానని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బీజేపీ అగ్రనేత అయిన సుష్మాస్వరాజ్ తో పాటు పలువురు కాషాయ నేతలకు ఆప్తుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి.. తాజాగా కర్నాటకలో మారుతున్న రాజకీయాల నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

మరోవైపు గతంలో ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో తనపై సీబీఐ నమోదు చేసిన కేసులపైనా గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసుల వెనుక పలువురు పెద్దలు ఉన్నారని, వారి ఆదేశాల మేరకే తనపై కేసులు నమోదు చేశారన్నారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకే తనకు స్వయంగా చెప్పారని గాలి జనార్ధన్ రెడ్డి మరో బాంబు పేల్చారు. గతంలో బెయిల్ కోసం ఏకంగా సీబీఐ కోర్టు జడ్జికే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి దొరికిపోయిన గాలి జనార్ధన్ రెడ్డి ఏళ్ల తరబడి శిక్ష తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ తో ఊరట పొందారు. ఇప్పుడు తిరిగి ఆయన తన పునర్ వైభవాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డి బ్రదర్స్ (గాలి జనార్ధన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి)కీ, శ్రీరాములు( రెడ్డి బ్రదర్స్ కు ఆప్తుడైన నేత)కూ డబ్బులపై ఆశ లేదన్నారు.