కంగనాకు వై కేటగిరీ సెక్యూరిటీ .. హత్రాస్ బాధిత కుటుంబానికి లేదా .. కేంద్రంపై శివసేన ఫైర్
హత్రాస్ సంఘటనపై శివసేన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. మొన్నటికి మొన్న రాష్ట్రంలోని అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేసినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో రామరాజ్యం లేదని, రాక్షస రాజ్యం , ఆటవిక రాజ్యం కొనసాగుతుందని నిప్పులు చెరిగిన శివసేన యూపీలో ఇంతా జరుగుతున్నా ఢిల్లీలోని పాలకులకు గాని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గానీ చీమ కుట్టినట్టు లేదని విమర్శించింది . అత్యాచారం జరగలేదని చెప్తున్న ప్రభుత్వ తీరుపై శివసేన మండిపడింది. ఇక తాజాగా మరోమారు శివసేన కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగింది .
కంగనా టార్గెట్ గా .. జయా బచ్చన్ వ్యాఖ్యలకు అండగా .. శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

కంగనా రనౌత్ కు వై కేటగిరీ సెక్యూరిటీ .. హత్రాస్ బాధిత కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వలేరా ?
అత్యాచారానికి గురైన హత్రాస్ బాధితురాలి కుటుంబానికి భద్రతా ఏర్పాట్లపై శివసేన మౌత్ పీస్ సామ్నా ప్రభుత్వంపై విరుచుకుపడింది. కంగనా రనౌత్ లాంటి నటికి వై కేటగిరీ సెక్యూరిటీ ఇస్తుండగా, హత్రాస్ హత్యాచార బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించలేకపోతుందని తన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని, సమాజంలోని వివిధ వర్గాలను వేర్వేరుగా ట్రీట్ చేస్తుందని శివసేన మండిపడింది . ఒక పేద కుటుంబానికి ప్రాణ హాని పొంచి ఉందని, బాధితురాలి కుటుంబానికి వై కేటగిరీ భద్రత కల్పిస్తే తప్పేమిటని ప్రశ్నించింది .

హత్రాస్ బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉందన్న శివసేన
హత్రాస్ బాధితురాలి కుటుంబం తమను తాము రక్షించుకోవడానికి భగవంతుడి మీద భారం వేస్తున్నారని ,కానీ కంగనా రనౌత్‌కు వై కేటగిరీ భద్రత ఇస్తున్నట్లు శివ సేన భగ్గుమంది . ఈ కేసుపై సిబిఐ దర్యాప్తును ఎవరూ కోరలేదని శివసేన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది . అత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబం జ్యుడిషియల్ దర్యాప్తు కోరిందని, అయితే ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు సిఫారసు చేస్తోందని శివసేన తెలిపింది.బాధితురాలి కుటుంబం న్యాయ విచారణ కోసం డిమాండ్ చేస్తుందని అప్పుడు కూడా ప్రభుత్వం కేసును సిబిఐకి బదిలీ చేసిందని పేర్కొన్న శివసేన ఈ కేసులో లోపాలను దాచడానికి ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే సీబీఐ దర్యాప్తు అని పేర్కొంది .

దళిత సమాజంపై ఇంత అన్యాయమా .. ఇలా అయితే తిరుగుబాటు ఖాయం
బాధితురాలి మృతదేహాన్ని అర్ధరాత్రి దహన సంస్కారాల తరువాత సిబిఐ దర్యాప్తును సిఫారసు చేయాలని యుపిలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. హత్రాస్ కుటుంబాన్ని సందర్శించే రాజకీయ నాయకులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్న శివసేన, ఇప్పటి వరకు, బాధితురాలి ఇంటిని సందర్శించే, వారిని పరామర్శించే రాజకీయ నాయకులు లాఠీ చార్జ్ చేయబడ్డారని , దళిత సమాజాన్ని ఇంత అన్యాయంగా చూస్తే వారు త్వరలోనే రోడ్లపైకి వచ్చి తిరుగుబాటు చేస్తారని శివసేన పేర్కొంది .